కాఫీ తాగినప్పుడు మన శరీరంలో ఏం జరుగుతుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆండ్రీ బియెర్నాథ్, జొయావో ద మటా
- హోదా, బీబీసీ ప్రతినిధులు
మీరు ఈ కథనం చదివేలోపు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు 80 లక్షల కప్పుల కాఫీ తాగేసి ఉంటారు.
దాదాపు పదిహేను వందల ఏళ్లుగా కాఫీ వాడుకలో ఉంది. కాఫీ ప్రభావం చాలా గొప్పగా ఉంటుందని, ఇది జ్ఞానాన్ని ప్రేరేపించి, ప్రస్తుత ప్రపంచానికి ఆధారమైన గొప్ప ఆలోచనలకు కారణమైందని కొంతమంది చెబుతుంటారు.
కాఫీలో ఉండే కీలకమైన పదార్థం కెఫీన్, దీన్ని ప్రపంచంలోనే ఎక్కువగా ఉపయోగించే మానసిక ఔషధంగా పరిగణిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
కాఫీ ఎక్కడి నుంచి వచ్చింది?
ఇథియోపియన్ మొక్క అయిన కాఫీ అరబికాకు కాసే పండ్ల (బెర్రీల) నుంచి కాఫీ వస్తుంది.
కాఫీ బెర్రీలు తిన్న తర్వాత గొర్రెలు చురుగ్గా ఉండడం గమనించి, తొమ్మిదో శతాబ్దానికి చెందిన గొర్రెల కాపరి కల్ది తాను కూడా కాఫీ బెర్రీలు తిన్నారనే కథ ప్రాచుర్యంలో ఉంది.
ఇప్పుడు మనం తాగుతున్న కాఫీని తయారు చేసేందుకు యెమెన్‌కు చెందిన సూఫీలు కాఫీ బెర్రీ విత్తనాలను కాల్చినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.
యూరప్‌కు విస్తరించడానికంటే ముందు 15వ శతాబ్దంలో ఒట్టోమాన్ సామ్రాజ్యమంతటా కాఫీ హౌస్‌లు కనిపించేవి.
యూరప్‌లోని కాఫీ హౌస్‌లు వ్యాపారం, రాజకీయాలు, కొత్త ఆలోచనల గురించి చర్చించుకునే స్థలాలుగా మారాయి.

ఫొటో సోర్స్, Getty Images
కాఫీ లేకుండా మనకు జ్ఞానోదయం ఉండకపోవచ్చని కూడా విద్యావేత్త జుర్గెన్ హబెర్మయాస్ చెప్పారు.
కాంట్, వోల్టైర్ వంటి తత్వవేత్తలు రోజుకి 72 కప్పుల వరకూ కాఫీ తాగినట్లు చెబుతారు. వారు ప్రపంచానికి సంబంధించి క్యాథలిక్ చర్చి వాదనల్లోని గూడార్థాలను ప్రశ్నించడం మొదలుపెట్టారు.
చర్చి వాదనలకు బదులుగా వారు సైన్స్ వైపు మొగ్గు చూపారు. విశ్వంలోని ప్రతి ఒక్కదానికి హేతుబద్దమైన వివరణ ఉంటుందని విశ్వసించారు.
జ్ఞానోదయ యుగంగా పిలిచే ఆ కాలం ఈ ప్రపంచాన్ని సమూలంగా మార్చేసింది. అదే ఇప్పుడు కనిపిస్తున్న ప్రపంచం.
అది రాచరికాలకు ముగింపు, ప్రజాస్వామ్యం వంటి వాటితో పాటు అనేక శాస్త్రీయ ఆవిష్కరణలకు దారితీసింది.

కాఫీ వెనుక చీకటి చరిత్ర
బానిస వ్యాపారానికి కూడా కాఫీ కారణమైంది.
ఫ్రెంచ్ వారు ఆఫ్రికా నుంచి బానిసలను తెచ్చి హైతీలోని తోటల్లో పనిచేయించుకున్నారు. 1800ల ప్రాంతంలో ఆఫ్రికన్ బానిసలను ఉపయోగించి బ్రెజిల్ ప్రపంచంలోని కాఫీలో మూడో వంతు కాఫీని ఉత్పత్తి చేసింది.
పెట్టుబడిదారీ విధానానికి కూడా ఇది దోహదం చేసిందని ఇప్పటికీ కొందరు అంటారు.
కాఫీ పెట్టుబడిదారీ విధానానికి దారితీసిందా?
కంపెనీలు, తమ కార్మికులకు కాఫీ ఇవ్వడం ప్రారంభించాయి. చివరికది కాఫీ బ్రేక్‌లు ఇచ్చే వరకూ వచ్చింది.
ఇది పరోపకార చర్య మాత్రం కాదు.
వాళ్లు కార్మికుల ఉత్పాదకతను పెంచేందుకు ప్రయత్నించారు.
ప్రస్తుతానికి వస్తే, ప్రతిరోజూ 2 వందల కోట్ల కప్పుల కాఫీ తాగుతున్నారు.
ఇది ఏడాదికి 90 బిలియన్ డాలర్ల వ్యాపారం.
దానికంటే కూడా, కాఫీ ఇప్పుడు వందల కోట్ల మందికి తమ రోజువారీ జీవితంలో ఒక భాగంగా మారిపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
కాఫీ మన శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
కెఫీన్ జీర్ణవ్యవస్థలోకి ప్రవేశించి, పేగుల ద్వారా అది రక్తంలో కలుస్తుంది.
అయితే, ఈ కెఫీన్ నాడీ వ్యవస్థను తాకిన తర్వాత మాత్రమే దాని ప్రభావం ప్రారంభమవుతుంది.
కెఫీన్ మన శరీరంలో ఉత్పత్తయ్యే అడెనోసిన్ తరహా రసాయన నిర్మాణాన్ని కలిగివుంటుంది, కాబట్టి ఇలా జరుగుతుంది.
శరీరం ఉత్పత్తి చేసే అడోనోసిన్ రెసెప్టార్లు కెఫీన్‌ను పట్టుకుని ఉండడం వల్ల, అది నరాల కణాల ఉపరితలంపై ఉంటుంది.
ఇది తాళం తెరవడంలా పనిచేస్తుంది.
అడెనోసిన్ నాడీ వ్యవస్థ నెమ్మదించేలా చేస్తుంది. హృదయ స్పందనను తగ్గిస్తుంది, మగతగా అనిపిస్తుంది, విశ్రాంతి తీసుకోవాలనేలా చేస్తుంది.
ఈ రెసెప్టార్లకు అడ్డుకోవడం ద్వారా కెఫీన్ దానికి వ్యతిరేక ప్రభావాన్ని కలిగిస్తుంది.
ఉదాహరణకు, తరచూ కాఫీ తాగే అలవాటు లేకపోతే, మీ రక్తపోటు స్వల్పంగా పెరగవచ్చు.
మెదడు కార్యకలాపాలకు కూడా ఇది వర్తిస్తుంది. కెఫీన్ మెదడును ప్రేరేపిస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది. మీరు చురుగ్గా ఉండేలా, ఎక్కువ సేపు యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది.
కాఫీ మీ మానసిక స్థితిపై సానుకూల ప్రభావం చూపుతుంది, అలసటను దరిచేరనీయదు, శరీర పనితీరును మెరుగుపరుస్తుంది.
అందువల్ల చాలా మంది అథ్లెట్లు దీన్ని సప్లిమెంట్‌గా ఉపయోగిస్తారు.
ఈ ప్రభావం 15 నిమిషాల నుంచి 2 గంటల వరకూ ఉండవచ్చు.
5 నుంచి 10 గంటల తర్వాత శరీరం కెఫీన్‌ను విసర్జిస్తుంది. అయితే, కెఫీన్ అవశేషాల ప్రభావం మాత్రం ఇంకా ఎక్కువసేపు ఉంటుంది.
మీ శరీరంపై కెఫీన్ ప్రభావాన్ని తెలుసుకోవాలనుకుంటే మధ్యాహ్నం కెఫీన్‌కు దూరంగా ఉండాలని, దానివల్ల మరుసటి రోజు ఉదయం తీసుకునే కాఫీ మరింత ప్రభావం చూపుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
కాఫీ తాగేప్పుడు జాగ్రత్త..
ఆరోగ్యంగా ఉన్న పెద్దవాళ్లు రోజుకి గరిష్ఠంగా 400 మిల్లీగ్రాముల కెఫీన్ తీసుకోవచ్చు. అంటే, నాలుగైదు కప్పుల కాఫీ.
ఈ పరిమితి దాటితే నిద్రలేమి, ఆందోళన, కడుపులో అసౌకర్యం, వికారంగా ఉండడం, తలనొప్పి వంటి దుష్ప్రభావాలు కలగొచ్చు.
సుమారు వెయ్యి మిల్లీగ్రామలు కెఫీన్‌ను కనుక శరీరంలోకి వేగంగా తీసుకుంటే మూర్ఛల వంటి విషపూరిత ప్రభావాలు కూడా కనిపించవచ్చు. అది దాదాపు 12 కప్పుల కాఫీకి సమానం.
అయితే, ఈ పరిమితి ఒక్కో వ్యక్తిలో ఒక్కోలా ఉండే అవకాశం ఉంది. కొందరు వ్యక్తులకు జన్యుపరంగానే కెఫీన్ ఎక్కువగా పడదు.
కానీ, మితంగా తాగితే కాఫీ ఆరోగ్యానికి మంచిదే.
హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కి చెందిన డాక్టర్ మటియాస్ హెన్ ప్రకారం, కెఫీన్ వల్ల టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లు, పార్కిన్సన్ వంటి వ్యాధుల ప్రమాదం తక్కువ.
అయితే, ఇవి కేవలం కెఫీన్‌తోనే ముడిపడి ఉండవు.
కాఫీలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది అనేక రకాల వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
మొత్తమ్మీద, మీరు ఇంకోసారి కాఫీ కప్పు పట్టుకుంటే అంతకుముందులా దాన్ని చూడలేకపోవచ్చు.
ఇవి కూడా చదవండి:
- 'దేశ ప్రజలారా.. టీ తాగడం తగ్గించండి.. ఆర్థికవ్యవస్థను కాపాడండి' - ప్రభుత్వం విజ్ఞప్తి
- మీ టీలో ఉప్పుందా? బ్రిటన్, అమెరికా మధ్య దౌత్య జోక్యం వరకు వెళ్లిన ఈ తాజా వివాదం ఏమిటి
- హవానా సిండ్రోమ్: ఈ అంతుచిక్కని ఆరోగ్య సమస్యకూ రష్యా నిఘా వ్యవస్థకూ సంబంధం ఉందా?
- ఫ్యామిలీ స్టార్ రివ్యూ: విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురాంల 'గీతగోవిందం' మ్యాజిక్ రిపీటయిందా?
- రష్యా: సెక్స్ థీమ్ పార్టీలపై పోలీసులు ఎందుకు దాడి చేస్తున్నారు... అక్కడ అసలేం జరుగుతోంది?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















