వరల్డ్ టీబీ డే: టీబీ సోకితే ఏమవుతుంది? రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

క్షయ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, డాక్టర్ ప్రతిభా లక్ష్మి
    • హోదా, బీబీసీ కోసం

మార్చ్ 24వ తేదీని ప్రపంచ టీబీ దినంగా పాటిస్తారు. ఈ సంవత్సరం స్లోగన్- "అవును.. మనం క్షయను అంతం చేయగలం." ( Yes, We can End TB.)

ఈ సందర్భంగా, నాకు ఎదురైన ఒక అనుభవాన్ని పంచుకుంటూ, టీబీ గురించి కొన్ని విషయాలను మీకు వివరించేందుకు ప్రయత్నిస్తాను.

"నమస్తే మేడం. ఈమె మా బాబాయ్ కూతురు. తన ఆరోగ్యం బాగుండటం లేదని ఇంట్లోవాళ్లు ఏవో మందులు వాడారు. అయినా ఆరోగ్యం మెరుగుపడలేదు. తాయత్తులు, మంత్రాలు, పూజలు కూడా చేయించారు.. కానీ ఫలితం లేదు. మీరైతే సరైన వైద్యం చేస్తారని ఇక్కడికి తీసుకు వచ్చాను" అని నమ్మకంగా చెప్పాడు ఒక తెలిసిన వ్యక్తి.

సమస్య గురించి, అడిగి తెలుసుకొని, తనను పరీక్ష చేసి, పాత చిట్టీలు అన్నీ పరిశీలించాను. ఆ అమ్మాయికి 20 ఏళ్లు ఉంటాయి. నాలుగు నెలల క్రితం వరకు అంతా బాగుండేది. అప్పటి నుంచి క్రమంగా తినడం తగ్గించింది, బరువు తగ్గుతోంది. సాయంత్రం అయ్యే సరికి నీరసం, జ్వరం అని పడుకుంటుంది. చూడడానికి నీరసంగా ఉంది. ఇన్ని రోజులుగా, వెళ్లిన దగ్గరకు మళ్ళీ వెళ్లకుండా వైద్యులను మారుస్తున్నారు.

అంతా చూశాక "ఇది టీబీ అయ్యి ఉండవచ్చు" అని చెప్పాను.

ఒక్కసారిగా వారి తల్లిదండ్రుల మొహాల్లో నిరాశ, చిరాకు కనిపించాయి. ఒకరి మొహం ఒకరు చూసుకొని.. "అదేంటి మేడం, మీరు కూడా అదే అంటారు. అమ్మాయికి దగ్గు లేదు, ఆయాసం లేదు, జ్వరం లేదు, కనీసం ఎక్కడ గడ్డలు కూడా లేవు. టీబీ ఎలా అవుతుంది!?" అని వారు ప్రశ్నించారు.

"మీరు కూడా.." అనడంలో, ఇంతకు ముందు కూడా ఇతరులు చెప్పారు అని అర్థం అయింది. వైద్యులను నమ్మక పోవడం వల్ల చికిత్స ప్రారంభించలేదు అని అర్థం చేసుకొని, వారికి క్షయ వ్యాధి గురించి వివరించాను. నిర్ధరణ పరీక్షలు జరిపి, చికిత్స ప్రారంభించాను.

క్షయ

ఫొటో సోర్స్, AFP

క్షయ గురించి ఏం తెలుసుకోవాలి?

వయసు, జెండర్, ఆర్థిక స్థితి లాంటి తేడాలు లేకుండా లక్షల మంది క్షయ బారిన పడుతున్నారు.

ప్రపంచంలోనే ఎక్కువ మంది క్షయ బాధితులు భారత దేశంలో ఉన్నారు.

క్షయ వ్యాధి సాధారణంగా ఊపిరితిత్తులకు (pulmonary TB) సోకుతుంది. కానీ ఇది గోరు, జుట్టు తప్ప శరీరంలోని ఏ అవయవానికైనా సోకే అవకాశం ఉంది (extra pulmonary TB).

రోగులు దగ్గినప్పుడు, లేదా తుమ్మినప్పుడు తుంపర్లలోని వ్యాధి కారక బ్యాక్టీరియా, గాలి ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందుతుంది. తరవాత తన శరీరంలోని ఇతర అవయవాలకు సోకుతుంది.

క్షయ

ఫొటో సోర్స్, TTHINKSTOCK

లక్షణాలు ఏమిటి?

  • రెండు వారాలకు మించి ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, సాయంత్రం జ్వరం రావడం, చమటలు పట్టడం వంటివి ఉంటాయి.
  • కొన్ని లక్షణాలు క్షయ సోకిన అవయవాన్ని బట్టి ఉంటాయి.
  • ఊపిరితిత్తులకు సోకితే, దగ్గు, ఆయాసం, తెమడలో రక్తం పడడం కనిపిస్తుంది.
  • పేగులకు సోకితే పొట్ట ఉబ్బుతుంది.
  • మెడ భాగంలో, లేక ఇంకెక్కడైనా, శోషరస కణుపులకు (lymph nodes) సోకితే, వాటి వాపు, నొప్పి కలుగవచ్చు.
  • దీర్ఘ కాలిక జ్వరంతో, స్పృహ తగ్గిపోతే మెదడులో క్షయ సోకి ఉండవచ్చు.
  • ఫెల్లోపియన్ గొట్టాలకు క్షయ సోకడం వల్ల సంతాన లేమి సమస్య వచ్చే అవకాశం ఉంది.
క్షయ

ఫొటో సోర్స్, Reuters

ముప్పు ఎవరికి ఎక్కువ?

  • క్షయ వ్యాధి సోకే ప్రమాదం రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారికి ఎక్కువగా ఉంటుంది. అంటే..
  • హెచ్ఐవీ బాధితులకు క్షయ సోకే అవకాశం చాలా ఎక్కువ. (28% అధికంగా సంభవించే అవకాశం)
  • మధుమేహం వంటి దీర్ఘ కాలిక జబ్బుల వల్ల రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వారికి
  • పొగాకు (సిగరెట్టు, లేక బీడీ) తాగడం, లేక నమలడం (తంబాకు, జర్దా, గుట్కా) అలవాటు ఉన్న వారికి
  • మద్యపానం లేక మాదక ద్రవ్యాల అలవాటు ఉన్న వారికి
  • పేదరికంలో, అనారోగ్యకర పరిస్థితుల్లో, గుంపులుగా ఉంటున్న వారికి
  • గర్భిణులు, లేదా బాలింతలకు కూడా ఈ ముప్పు ఎక్కువ
క్షయ

ఫొటో సోర్స్, Getty Images

నివారణకు ఏం చేయాలి?

పుట్టిన పిల్లలకు బీసీజీ టీకా ఇప్పించాలి. ఈ టీకా తీసుకున్న పిల్లలకు పూర్తిగా క్షయ వ్యాధి సోకదు అని చెప్పలేం. కానీ, తీవ్రమైన వ్యాధి కలగకుండా ఉంటుంది.

పోషక ఆహారం తీసుకుంటూ, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండాలి.

పొగాకు ఏ రకంగా అయినా వాడకుండా ఉండడం, అలాగే వాయు కాలుష్యాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.

క్షయ వ్యాధి ఇతరులకు వ్యాప్తి చెందకుండా మాస్క్ వాడడం, దగ్గినా, తుమ్మినా చెయ్యి అడ్డు పెట్టుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

రెండు వారాలకు మించి ఏవైనా లక్షణాలు ఉంటే, వెంటనే పరీక్ష చేసుకోవాలి.

వీడియో క్యాప్షన్, కృత్రిమ అవయవాలతో స్పర్శ ఎలా కలుగుతుంది?

చికిత్స ఏమిటి?

మొదటి సారి క్షయ వ్యాధి బారిన పడ్డప్పుడు, కేటగిరీ 1 పేరిట, చికిత్స మాత్రల రూపంలో ఉంటుంది.

క్షయ ఏ భాగానికి ఉంది అనే దాన్ని బట్టి, సాధారణంగా, చికిత్స ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు ఉంటుంది.

చికిత్స ప్రారంభించిన తరవాత రెండు నెలలకు మరొక సారి పరీక్ష చేసి, పూర్తి చికిత్స కాలాన్ని నిర్ధారిస్తారు.

క్షయ వ్యాధికి కారణమైన బ్యాక్టీరియా మీద, చికిత్సలో అందించే మందులలో ఒకటి లేక రెండు పని చేయని పరిస్థితుల్లో (drug resistant), కేటగిరీ 2 గా గుర్తించి, పన్నెండు నెలల పాటు మాత్రలతో పాటు ఇంజెక్షన్లు కూడా తీసుకునే అవసరం ఉంటుంది.

అలాగే కొన్ని రోజులు మందులు వాడిన తరవాత, పూర్తి చికిత్స తీసుకోకుండా మానేసినా, వారు కేటగిరీ 2 కిందికే వస్తారు. వారికి మాత్రలతో తగ్గే అవకాశం ఉండదు.

లేక, ఒకసారి క్షయ వ్యాధి వచ్చి తగ్గినవారికి, మళ్ళీ వ్యాధి సోకితే, వారిని కూడా కేటగిరీ 2 గా పరిగణిస్తారు.

చికిత్స తీసుకుంటున్న సమయంలో మాత్రలను క్రమం తప్పకుండా వాడుతూ, పౌష్టిక ఆహారం తీసుకుంటూ, ఆరోగ్య కరమైన జీవన శైలిని పాటించడం చాలా ముఖ్యం .

చికిత్సలో ఎదురయ్యే సమస్యలు

ప్రధాన సమస్య ఏమిటంటే, మాత్రలతో వాంతులు అవ్వడం. దీని వల్ల అనేక రోగులు పూర్తి చికిత్స తీసుకోకుండా చికిత్స మధ్యలో ఆపెసి, తమ ఆరోగ్యాన్ని మరింత దిగజార్చూకుంటారు. అయితే, కొన్ని రోజులు వాంతులు కాకుండా మాత్రలు వాడితే, అది తగ్గిపోతుంది.

కొందరు రోగులలో క్షయ చికిత్స కోసం ఇచ్చే మందుల వల్ల కొన్ని ఇబ్బందులు (complications) కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కాలేయం మీద ప్రభావం వల్ల పసరికలు (కల్లు పసుపు పచ్చగా అవడం), చేతులు కాళ్ల తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపించడం (సాధారణంగా వాటిని నివారించడానికి ఒక విటమిన్ మాత్రను కూడా చికిత్సలో భాగంగా ఇస్తారు.), కంటి చూపు పోవడం వంటివి జరగవచ్చు. అలాంటప్పుడు వెంటనే వైద్యులను సంప్రదిస్తే, మందులు మార్చి, వేరే చికిత్స అందించే అవకాశం ఉంటుంది.

రెండు వారాల చికిత్స తరవాత క్షయ వ్యాధి ఇతరులకు సోకే అవకాశం తక్కువ.

లక్షణాలు కూడా కొన్ని వారాలలో తగ్గిపోతాయి. కానీ పూర్తి చికిత్స తీసుకోకుండా మధ్యలో మానేస్తే, ఆ మందులు మళ్ళీ పనిచేయకుండా పోతాయి.

కాబట్టి, వైద్యుల సలహా మేరకు పూర్తి చికిత్స తీసుకోవడం చాలా కీలకం.

క్షయ వ్యాధిని మన దేశంలో "నోటిఫయబుల్ డిసీజ్"గా గుర్తించారు. అంటే ప్రభుత్వ, లేక ప్రైవేట్ వైద్యులు, ఎవరైనా ఒక క్షయ వ్యాధిగ్రస్థుడిని గుర్తిస్తే, వెంటనే "నిక్షయ" పోర్టల్‌లో ప్రభుత్వానికి తెలియచేయాలి.

(రచయిత వైద్యురాలు)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)