మార్‌బర్గ్ వైరస్: తీవ్రంగా రక్తస్రావమై చనిపోతున్నారు - సోకినవారిలో 50 శాతం మంది మరణించారు, కోతుల నుంచీ వస్తుందంటున్న డబ్ల్యూహెచ్‌వో

ఫొటో సోర్స్, Getty Images
ఆఫ్రికా దేశం టాంజేనియాలో మార్‌బర్గ్ వైరస్ సోకి అయిదుగురు మరణించడంతో పొరుగు దేశాలు అప్రమత్తమయ్యాయి. పొరుగునే ఉన్న కెన్యా, యుగాండాలు టాంజేనియాతో తమకు ఉన్న సరిహద్దుల మీదుగా రాకపోకలపై నిఘా పెంచాయి.
టాంజేనియాతో సరిహద్దుల వద్ద యుగాండా ఆరోగ్య తనిఖీలు నిర్వహిస్తోంది. పెద్ద సంఖ్యలో ఆరోగ్య బృందాలను మోహరించి సరిహద్దుల మీదుగా యుగాండాలోకి వస్తున్నవారికి పరీక్షలు చేస్తోంది.
ప్రస్తుతం టాంజేనియాలోని కగెరా ప్రాంతంలో ఈ వైరస్ తీవ్రత అధికంగా ఉంది. వైరస్ సోకడం వల్ల చనిపోయినవారితో కాంటాక్ట్ అయిన 161 మందిని అధికారులు గుర్తించి వారిని పరీక్షిస్తున్నారు.
టాంజేనియాలో ఇప్పటివరకు 8 మందికి వైరస్ సోకగా వారిలో అయిదుగురు మరణించారు.
ఈక్వటోరియల్ గినియాలోనూ ఈ వైరస్ కేసులను గుర్తించారు.
ఎబోలా లాంటి ఈ మార్‌బర్గ్ వైరస్ లక్షణాలలో జ్వరం ప్రధానమైనది. అత్యంత తీవ్రంగా జ్వరం వస్తుంది. ఆ తరువాత రక్త స్రావమవుతుంది. అవయవాలు విఫలమై ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది.
ఈ వైరస్ సోకినవారిలో 50 శాతం మంది చనిపోతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెప్తోంది.
చెట్లపై పండ్లు తినే గబ్బిలాలు(ఫ్రూట్ బేట్స్) ద్వారా ఈ వైరస్ మనుషులకు సోకుతుంది. మనుషుల మధ్య కూడా శరీర స్రావాల ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.
ఈ వైరస్‌కు ఇంతవరకు వ్యాక్సీన్ కూడా లేదు.
ఆఫ్రికాలోని ఘనా, టాంజేనియా సహా పలు దేశాలలో ఈ వైరస్ బాధితులను గుర్తించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏమిటీ మార్‌బర్గ్ వైరస్?
ప్రాణాంతక ఎబోరా లైరస్ తరహాలోనిదే ఈ మార్‌బర్గ్ వైరస్.
ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తున్న వివరాల ప్రకారం 1967లో తొలిసారి జర్మనీలోని మార్‌బర్గ్, ఫ్రాంక్‌ఫర్ట్, సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌లో గుర్తించారు. ఈ పట్టణాలలో 31 మందికి వైరస్ సోకగా ఏడుగురు చనిపోయారు.
యుగాండా నుంచి తీసుకొచ్చిన గ్రీన్ మంకీస్ వల్ల ఈ వైరస్ వచ్చినట్లు గుర్తించారు. అయితే, ఇతర జంతువులూ ఈ వైరస్‌కు కారణమవుతున్నట్లు తరువాత కాలంలో బయటపడింది.
గుహల్లో తిరిగే మనుషులు, భూగర్భ గనులలో పనిచేసేవారికీ ఇది సోకే అవకాశం ఉంది. అలాంటి చోట ఉండే గబ్బిలాల నుంచి మనుషులకు ఈ వైరస్ వ్యాపించిన ఉదంతాలున్నాయి.
ఆఫ్రికాలో ఇటీవల కాలంలో ఘనా, టాంజేనియాలలో కేసులు వెలుగుచూడగా ఇంతకుముందు డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, కెన్యా, దక్షిణాఫ్రికా, యుగాండా, అంగోలా, జింబాబ్వేలలోనూ ఈ కేసులు బయటపడ్డాయి.
2005లో అంగోలాలో ఈ వైరస్ ప్రబలి 300 మందికిపైగా మరణించారు.
అయితే, గత 40 ఏళ్ల కాలంలో యూరప్‌లో ఈ వైరస్ కారణంగా చనిపోయింది ఒక్కరే. అమెరికాలో కూడా ఒకరు మరణించారు. యుగాండాలోని గుహలలోకి వెళ్లి తిరిగి అమెరికా వచ్చిన వ్యక్తి ఈ వైరస్‌తో మరణించారు.

ఫొటో సోర్స్, Getty Images
భారీగా ప్రబలిన సందర్భాలు
2017, యుగాండా: ముగ్గురికి సోకింది.. ముగ్గురూ మరణించారు.
2012, యుగాండా: 15 కేసులు, నలుగురు మరణించారు.
2005, అంగోలా: 374 కేసులు, 329 మరణాలు
1998-2000, డీఆర్ కాంగో: 154 కేసులు, 128 మరణాలు
1967, జర్మనీ: 29 కేసులు, 7 మరణాలు
(ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు)
ఈ వైరస్ సోకితే ఏమవుతుంది?
జ్వరం వస్తుంది
తీవ్రమైన తలనొప్పి
కండరాల నొప్పులు
ఇలా మూడు రోజులు తీవ్రమైన లక్షణాలు ఉన్న తరువాత నీళ్ల విరేచనాలు, కడుపు నొప్పి, వాంతులు మొదలవుతాయి.
ఇలాంటి పరిస్థితులలో రోగి కళ్లు లోపలికి పీక్కుపోయి ప్రేత కళ కనిపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. మనిషి నిస్సత్తువగా మారి చావు ముంగిట ఉన్నట్లుగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
సాధారణంగా ఇది సోకినవారిలో సగం మంది ప్రాణాలు కోల్పోతారని.. ఇందులో అత్యంత తీవ్రమైన వైరస్ స్ట్రెయిన్స్ సోకినవారిలో 88 శాతం మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎలా వ్యాపిస్తుంది?
ఈజిప్షియన్ రౌసెట్ ఫ్రూట్ బ్యాట్‌లు ఈ వైరస్‌లకు వాహకాలు. ఆఫ్రికా గ్రీన్ మంకీస్, పందులు కూడా ఈ వైరస్‌కు వాహకాలే.
మనుషుల్లో శరీర స్రావాల వల్ల వైరస్ వ్యాపిస్తుంది. ఈ వైరస్‌తో కలుషితమైన పరుపులపై పడుకున్నా సోకుతుంది.
ఈ వైరస్ సోకి నయమైన కొన్ని నెలల తరువాత కూడా వారి రక్తం, వీర్యం వల్ల ఇతరులకు వ్యాపిస్తుంది.
చికిత్స ఎలా
ఈ వైరస్‌కు నిర్దిష్టమైన చికిత్స కానీ, వ్యాక్సీన్ కానీ లేదు.
రక్త శుద్ధి మందులు, రోగనిరోధక చికిత్సల ద్వారా నయం చేసే ప్రయత్నం చేస్తారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది.
ఆసుపత్రిలో చేర్చినప్పుడు పుష్కలంగా ద్రవాలు అందివ్వడం, పాడైన రక్తం స్థానంలో కొత్త రక్తం ఎక్కించడం ద్వారా నయం చేసే ప్రయత్నం చేస్తారు.
ఇవి కూడా చదవండి:
- కత్తిపీటతో హత్య చేసేందుకు మా నాన్నే ప్రయత్నించారు – కులం, గౌరవం, ప్రేమ కథ
- ‘రంగమార్తాండ' రివ్యూ: గుండె లోతుల్లోని ఉద్వేగాన్ని బయటకు లాక్కొచ్చే సినిమా
- అదానీ గ్రూప్ బొగ్గు గనికి వ్యతిరేకంగా ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనులు ఏడాదిగా ఎందుకు నిరసనలు చేస్తున్నారు?
- ఉగాది: మనం ఉన్నది 2023లో కాదు.. 1945 లేదా 2080
- వడగళ్ల వానలు ఎందుకు పడతాయి? అవి వేసవిలోనే ఎందుకు ఎక్కువ?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














