ఇజ్రాయెల్: ఐరన్ డోమ్ అంటే ఏంటి, ఇది క్షిపణులను ఎలా ఆకాశంలోనే పేల్చేస్తుంది?

ఫొటో సోర్స్, Reuters
ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. ఇరాన్ దాదాపు 180 క్షిపణులను ప్రయోగించిందని, వాటిలో చాలా మిసైళ్లను అడ్డుకున్నామని ఇజ్రాయెల్ తెలిపింది.
ఇలాంటి క్షిపణులు, రాకెట్ల దాడులను అడ్డుకోవడంలో ఇజ్రాయెల్‌కు ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ కీలకంగా ఉపయోగపడుతోంది.
ఇటీవల లెబనాన్ నుంచి హిజ్బుల్లా ప్రయోగించిన రాకెట్లను కూడా తమ ఐరన్ డోమ్ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుందని ఇజ్రాయెల్ తెలిపింది.
అంతకుముందు 2023 అక్టోబర్‌లో హమాస్ మెరుపు దాడుల తరువాత కూడా ఈ ఐరన్ డోమ్ వ్యవస్థ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
అసలు ఐరన్ డోమ్ అంటే ఏంటి? ఎలా పనిచేస్తుంది? దీనిని ఇజ్రాయెల్ ఎప్పటి నుంచి వినియోగిస్తోంది? వంటి వివరాలు చూద్దాం.


ఐరన్ డోమ్ ఎలా పనిచేస్తుంది?
ఐరన్ డోమ్ అనేది ఇజ్రాయెల్ వందల కోట్ల డాలర్లు వెచ్చించి ఏర్పాటు చేసుకున్న క్షిపణి నిరోధక వ్యవస్థలలో ఒకటి.
ఈ ఐరన్ డోమ్ వ్యవస్థకు ఉండే రాడార్లు తమ గగనతలంలోకి దూసుకొస్తున్న రాకెట్లను గుర్తిస్తాయి. అప్పుడు వెంటనే ఆ రాకెట్లను ధ్వంసం చేసేందుకు ఐరన్ డోమ్ రెండు క్షిపణులను ప్రయోగిస్తుంది.
ఈ ఐరన్ డోమ్ వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకుంటున్న రాకెట్లను, గురి తప్పిన రాకెట్ల మధ్య తేడాను పసిగడుతుంది. దాని ప్రకారం జనావాసాలు, ఇతర లక్ష్యాల వైపు వస్తున్న రాకెట్లనే ఇది నాశనం చేస్తుంది.
దీనివల్ల గతి తప్పిన రాకెట్ల కోసం అనవసరంగా క్షిపణులను వృథా చేయకుండా దీని రాడార్ వ్యవస్థ పనిచేస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
దీన్ని ఎలా అభివృద్ధి చేశారు?
దక్షిణ లెబనాన్ కేంద్రంగా పనిచేసిన హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూపుతో ఇజ్రాయెల్ యుద్ధం చేసిన 2006 ప్రాంతంలో ఈ ఐరన్ డోమ్‌ల తయారీకి బీజం పడింది.
హిజ్బుల్లా గ్రూప్ వేలాది రాకెట్లను ప్రయోగించడంతో ఇజ్రాయెలీలు పెద్ద సంఖ్యలో మరణించడంతో పాటు భవనాలు భారీగా ధ్వంసమయ్యాయి.
దీంతో అక్కడికి ఏడాది తరువాత ఇజ్రాయెల్ రక్షణ సంస్థ 'రఫేల్ అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ సిస్టమ్స్' ఒక కొత్త క్షిపణి నిరోధక వ్యవస్థను రూపొందించనుందని ఆ దేశం ప్రకటించింది.
ఈ ప్రాజెక్టుకు అమెరికా 20 కోట్ల డాలర్ల (అప్పట్లో సుమారు రూ. 14,650 కోట్లు) నిధులు సమకూర్చింది.
కొన్నేళ్ల పాటు అధ్యయనం, అభివృద్ధి చేసిన తరువాత 2011లో దాన్ని యుద్ధంలో పరీక్షించారు. ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలోని బీర్షెబా పట్టణం లక్ష్యంగా శత్రువులు ప్రయోగించిన మిసైల్‌ను ఇది విజయవంతంగా అడ్డుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇందులో లోపాలున్నాయా?
ఈ విధంగా చూస్తే ఐరన్ డోమ్ వ్యవస్థ వల్ల ఇజ్రాయెలీలకు రక్షణ లభించిందనే చెప్పాలి. అయినప్పటికీ ఇది క్షిపణి దాడుల నుంచి 100 శాతం రక్షణ ఇవ్వదు.
గతంలో గాజా నుంచి వచ్చిన రాకెట్లను ఈ ఐరన్ డోమ్ వ్యవస్థ 90 శాతం విజయవంతంగా అడ్డుకుంది. అయితే, ఇది వేరే శత్రువు నుంచి ఇలాంటి దాడులు జరిగితే ఇదే స్థాయిలో రక్షణనిస్తుందని చెప్పలేమని విమర్శకులు అంటున్నారు.
అదే హిజ్బుల్లా మిలిటెంట్లయితే హమాస్ కంటే తక్కువ సమయంలో ఎక్కువ రాకెట్లను ప్రయోగిస్తారని.. అలాంటి సందర్భంలో ఐరన్ డోమ్ సక్సెస్ రేటు ఇంతగా ఉండకపోవచ్చని 'ది జెరూసలెం పోస్ట్' ఇంటెలిజెన్స్ ఎడిటర్ యోనా జెరెమీ బాబ్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















