ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అలా మాట్లాడిన వెంటనే హిజ్బుల్లాపై భారీ దాడి, పశ్చిమ దేశాల మాటను ఆయన పట్టించుకోవట్లేదా?

ఫొటో సోర్స్, EPA
- రచయిత, జెరెమీ బోవెన్
- హోదా, ఇంటర్నేషనల్ ఎడిటర్, బీబీసీ న్యూస్
హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా తమ వైమానిక దాడిలో చనిపోయారని ఇజ్రాయెల్ సైన్యం శనివారం ప్రకటించింది. ఆయన మరణాన్ని హిజ్బుల్లా కూడా ధ్రువీకరించింది.
లెబనాన్ రాజధాని బేరూత్‌లోని హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై తాము చేసిన దాడిలో నస్రల్లా చనిపోయారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) తెలిపింది.
ఆ పేలుళ్ల తీవ్రత చాలా ఎక్కువగా ఉందని బేరూత్‌లోని ప్రజలు చెప్పారు. తాను ఇప్పటివరకు చూసిన వాటిలో ఇదే అత్యంత భారీ పేలుడని ఈ నగరంలో ఉండే నా స్నేహితురాలు ఒకరు చెప్పారు.
ఈ దాడిలో హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లాతో పాటు, ఆ సంస్థకు చెందిన మరికొందరు కమాండర్లు కూడా చనిపోయారని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. దీనిని హిజ్బుల్లా కూడా ధ్రువీకరించింది.
హిజ్బుల్లాపై దాడులు కొనసాగనున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
అంతకుముందు, ఇజ్రాయెల్ ముఖ్య మిత్ర దేశాలైన అమెరికా, ఫ్రాన్స్ సూచించిన 21-రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనపై చర్చించేందుకు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సిద్ధపడ్డారని చాలామంది అనుకున్నారు.
అయితే, ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలనుకునే శత్రువులతో పోరాడటం తప్ప, తమకు మరో మార్గం లేదని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో నెతన్యాహు వ్యాఖ్యానించారు. ఆయన అక్కడ దౌత్యం గురించి మాట్లాడలేదు. హిజ్బుల్లా ఓడిపోతుందని, గాజాలో హమాస్‌పై పూర్తి విజయం సాధిస్తామని, బందీలను వెనక్కి తీసుకొస్తామనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ గెలుస్తోందని కూడా అన్నారు.


ఫొటో సోర్స్, Israel Prime Minister's Office
నెతన్యాహు ప్రసంగం తర్వాత బేరూత్‌లో జరిగిన భారీ దాడి, కాల్పుల విరమణ గురించి ఇజ్రాయెల్ ఆలోచించడం లేదన్న విషయాన్ని స్పష్టం చేసింది.
ఇజ్రాయెల్ తన శత్రువులను ఎక్కడైనా కొడుతుందని నెతన్యాహు చేసిన హెచ్చరికను నిరూపించేందుకే ఈ దాడి జరిగినట్లు అనిపించింది.
దాడి గురించి తమకు ముందస్తు సమాచారం లేదని అమెరికా పెంటగాన్ తెలిపింది. కమ్యూనికేషన్ పరికరాల వద్ద నెతన్యాహు ఉన్న ఒక ఫొటోను జెరూసలేంలోని ఆయన కార్యాలయం విడుదల చేసింది.
అయితే, ఆ ప్రాంతం న్యూయార్క్‌లో నెతన్యాహు ఉన్న హోటల్ మాదిరిగా కనిపించింది. హిజ్బుల్లాపై దాడికి ఆయన అనుమతి ఇచ్చిన క్షణాన్ని చూపుతున్నట్లు ఆ చిత్రం శీర్షిక ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా ఎందుకు వ్యతిరేకించడం లేదు?
నెలల తరబడి తాను చేస్తున్న చర్చల ప్రయత్నాలను అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సమర్థించుకున్నారు. చర్చలకు ఇంకా అవకాశం ఉందన్నారు.
అయితే, తాజా పరిస్థితులు చూస్తే అలాంటి అవకాశం ఉన్నట్లు అనిపించడం లేదు. ఈ విషయంలో అమెరికా ముందు పరిమిత ఆప్షన్లు ఉన్నాయి. ఎందుకంటే వారు హిజ్బుల్లా, హమాస్‌లను ‘విదేశీ ఉగ్రవాద సంస్థలు’గా గుర్తించినందున చట్టబద్ధంగా మాట్లాడలేరు. త్వరలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో ఇజ్రాయెల్‌పై అమెరికా ఒత్తిడి చేసే అవకాశం కూడా తక్కువే.
2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడుల తర్వాత ఇజ్రాయెల్ సైన్యం, ప్రభుత్వంలోని శక్తిమంతమైన వ్యక్తులు హిజ్బుల్లాపై దాడి చేయాలని భావించారు. అయితే, అమెరికా దీన్ని వ్యతిరేకించింది, వద్దని ఒప్పించింది కూడా. అలా దాడి చేస్తే మరిన్ని సమస్యలు వస్తాయని హెచ్చరించింది.
అయితే, కొంతకాలంగా ఇజ్రాయెల్ సైనిక చర్యలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడి సూచనలను నెతన్యాహు ఎక్కువగా పట్టించుకోవడం లేదు. అమెరికా సరఫరా చేసిన విమానాలు, బాంబులను బేరూత్‌లో దాడికి ఇజ్రాయెల్ వాడినప్పటికీ, బైడెన్ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించింది.

ఫొటో సోర్స్, Reuters
బైడెన్‌ను పట్టించుకోని నెతన్యాహు!
గత సంవత్సరం నుంచి బైడెన్ విధానం ఎలా ఉందంటే.. ఇజ్రాయెల్‌కు జీవితకాల మద్దతుదారుగా సంఘీభావం, మద్దతు ద్వారా నెతన్యాహును ప్రభావితం చేయడం, ఆయుధాలు సరఫరా చేయడం, దౌత్యపరమైన రక్షణను అందించడం.
యుద్ధంలో ఇజ్రాయెల్ పోరాడే విధానాన్ని మార్చడంతో పాటు, ఆ దేశం పక్కన స్వతంత్ర పాలస్తీనా రాజ్యాన్ని సృష్టించే అమెరికా ప్రణాళికకు నెతన్యాహును ఒప్పించగలనని బైడెన్ విశ్వసించారు. అయితే, నెతన్యాహు ఈ ఆలోచనను పూర్తిగా తోసిపుచ్చారు, బైడెన్ సలహాను వినలేదు.
తర్వాత ఏంటి?
హిజ్బుల్లా నుంచి ముఖ్యమైన నిర్ణయాలు రావాల్సి ఉంది. ఇజ్రాయెల్‌పై బలమైన దాడిని ప్రారంభించాలా? ఒకవేళ తన దగ్గర మిగిలి ఉన్న రాకెట్లు, క్షిపణులను ఉపయోగించకపోతే తర్వాత అవి ఇజ్రాయెల్ దాడుల్లో కోల్పోయే ప్రమాదం ఉందని హిజ్బుల్లా నేతలు ఆలోచిస్తారు.
ఇజ్రాయెల్ కూడా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. లెబనాన్‌లో గ్రౌండ్ ఆపరేషన్ గురించి ఇజ్రాయెల్ మాట్లాడింది. ఇంకా బలగాలను పూర్తిగా సమీకరించనప్పటికీ, దండయాత్రను ప్లాన్ చేస్తోంది. అదే సమయంలో భూతల దాడిలో ఇజ్రాయెల్‌ను కొన్ని విధాలుగానైనా హిజ్బుల్లా ఎదుర్కోగలదని లెబనాన్‌లోని కొంతమంది ప్రజలు నమ్ముతున్నారు.
ఇజ్రాయెల్ మిత్రపక్షాలతో సహా పశ్చిమ దేశాల దౌత్యవేత్తలు పరిస్థితిని శాంత పరచాలని, దౌత్య పరమైన పరిష్కారం కోసం నెతన్యాహును ఒప్పించాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఘటనలను అడ్డుకోలేని స్థితిలో వారు ఉన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














