గాజాలో మరో ఆరుగురు బందీల మృతదేహాలు లభ్యం.. తీవ్రంగా స్పందించిన అమెరికా, ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Hostages Families Forum
- రచయిత, జరోస్లావ్ లుకివ్ , ఆడమ్ డర్బిన్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
గాజాలో హమాస్ అధీనంలో ఉన్న ఆరు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. రఫాలో ఉన్న సొరంగంలో శనివారం ఆ మృతదేహాలను కనుగొన్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది.
ఇజ్రాయెల్ దళాలు రాకముందే హమాస్ వారిని హతమార్చినట్లు భావిస్తున్నామని ఐడీఎఫ్ ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి తెలిపారు.
అయితే, ఈ మరణాలకు ఇజ్రాయెల్ బాధ్యత వహించాలని, కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం పెట్టడానికి ఆ దేశం నిరాకరించిందని హమాస్ సీనియర్ అధికారి ఇజ్జత్ అల్-రిష్క్ ఆరోపించారు.
దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ.. హత్యలకు బాధ్యులైన వారిని న్యాయస్థానం ముందు ఉంచే వరకు ఆగేది లేదన్నారు.
దేశ భద్రతకు భరోసా కల్పిస్తూనే మిగిలిన బందీలను విడిపించేందుకు ఒప్పందం కుదుర్చుకోవడంపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని నెతన్యాహు ఒక ప్రకటనలో తెలిపారు.
‘‘బందీలను హత్య చేసేవారికి ఒప్పందం ఇష్టం లేదు'' అని ఆయన అన్నారు.


ఫొటో సోర్స్, Reuters
‘నెతన్యాహు బాధ్యత వహించాలి’
‘‘బందీలను అక్కడే వదిలేసినందుకు నెతన్యాహు బాధ్యత వహిస్తూ ప్రకటన చేయాలి’’ అని బందీల కుటుంబాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక బృందం డిమాండ్ చేసింది.
ఆరుగురు బందీలు హమాస్ చేతిలో దాదాపు 11 నెలల పాటు చిత్రహింసలకు గురయ్యారని, ఆకలితో బతికారని, చివరికి హత్యకు గురయ్యారని బందీల కుటుంబాల ఫోరం ఆరోపించింది.
ఒప్పందంపై సంతకం చేయడంలో జాప్యమే ఈ బందీలతో పాటు పలువురి మరణాలకు దారితీసిందని ఆ బృందం ఆరోపించింది.
ఇజ్రాయెల్‌లో కార్యకలాపాలు నిలిపివేయాలని, బందీల మార్పిడి ఒప్పందానికి మద్దతుగా జెరూసలేం, టెల్ అవీవ్, ఇతర ప్రదేశాలలో జరిగే నిరసనలో పాల్గొనాలని వారు దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
బందీల విడుదలకు ఒప్పందం కుదుర్చుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి సమ్మె చేయాలని ఇజ్రాయెల్ ప్రతిపక్ష నాయకుడు యైర్ లాపిడ్ అన్నారు.
ప్రాణాలను రక్షించడం కంటే తన సంకీర్ణాన్ని కాపాడుకోవడంపైనే నెతన్యాహు ఎక్కువగా శ్రద్ధ వహిస్తున్నారని లాపిడ్ ఆరోపించారు.
మిగిలిన బందీలను విడిపించేందుకు హమాస్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని ఇజ్రాయెల్‌ను కైద్ ఫర్హాన్ ఎల్కాడి కోరారు. ఆయనను గతవారం గాజాలో ఇజ్రాయెల్ దళాలు రక్షించాయి.
ఎల్కాడి బుధవారం దక్షిణ ఇజ్రాయెల్‌లోని తన గ్రామానికి చేరుకున్నారు.
క్షమాపణ కోరుతున్నా: ఇజ్రాయెల్ ప్రెసిడెంట్
మృతదేహాలను ఇజ్రాయెల్‌కు తీసుకొచ్చామని ఐడీఎఫ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ బందీలను 2023 అక్టోబర్ 7న హమాస్ బంధించి గాజా తీసుకెళ్లిందని, అక్కడ చంపేసిందని చెప్పారు. బందీల కుటుంబాలకు ఇప్పటికే సమాచారం అందించామని ఆ ప్రకటనలో తెలిపారు.
బందీల హత్య వార్తతో దేశ ప్రజల గుండె ముక్కలైందని ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఐజాక్ హెర్జోగ్ అన్నారు.
"వారిని సురక్షితంగా ఇంటికి తీసుకురావడంలో విఫలమైనందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం తరఫున క్షమాపణలు చెబుతున్నా" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కోపం వచ్చింది: జో బైడెన్
మృతుల్లో అమెరికన్ పౌరుడు గోల్డ్‌బెర్గ్-పోలిన్ కూడా ఉన్నారు. ఆయన మరణ వార్త విని చాలా బాధపడ్డానని, కోపం వచ్చిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.
అధ్యక్షుడు బైడెన్ ఒక ప్రకటనలో.. " ఇజ్రాయెల్‌లో శాంతి కోసం అక్టోబర్ 7న జరిగిన మ్యూజిక్ ఫెస్టివల్‌కు హాజరైన వారిలో హెర్ష్ కూడా ఉన్నారు. హమాస్ దాడి సమయంలో స్నేహితులు, అక్కడున్న వారికి సహాయం చేస్తున్న సమయంలోనే హెర్ష్ తన చేతిని కోల్పోయారు. హెర్ష్‌కి 23 ఏళ్లు వచ్చాయి. ప్రపంచాన్ని చుట్టే ఆలోచనలో ఆయన ఉన్నారు’’ అని తెలిపారు.

ఫొటో సోర్స్, REUTERS/ARAFAT BARBAKH
మధ్యవర్తులు ఎవరు?
2023 అక్టోబర్ 7న గాజా నుంచి ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించిన హమాస్ ఫైటర్లు దాదాపు 1,200 మందిని చంపి, 251 మందిని బందీలుగా తీసుకెళ్లారు.
ఆ దాడికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ "హమాస్‌ను నాశనం చేస్తానని" ప్రతిజ్ఞ చేసింది.
అనంతరం మొదలైన ఇజ్రాయెల్ దాడులలో గాజాలో ఇప్పటివరకు 40,738 మందికి పైగా మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
కాల్పుల విరమణ ఒప్పందం కోసం అమెరికా, ఈజిప్ట్, ఖతర్‌లకు చెందిన మధ్యవర్తులు ప్రయత్నిస్తున్నారు.
హమాస్ వద్ద బందీలుగా ఉన్న 97 మందికి బదులుగా ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాల్సి ఉంది. కాగా, హమాస్ చెరలో ఉన్న వారిలో కనీసం 33 మంది మరణించినట్లు భావిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















