సింగపూర్: విడిపోయిన భార్యకు మరణశిక్షపడేలా ప్లాన్‌చేసిన భర్త, చివరకు ఏమైందంటే..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జోయెల్ గింటో
- హోదా, బీబీసీ ప్రతినిధి
తన భార్యను మాదకద్రవ్యాల కేసులో ఇరికించి మరణశిక్ష పడేలా చేయాలని భావించిన ఓ వ్యక్తికి సింగపూర్‌లోని ఓ కోర్టు జైలు శిక్ష విధించింది.
37 ఏళ్ల టాన్ జియాంగ్‌లాంగ్, తన భార్య కారులో బ్యాక్ సీట్ మధ్య అరకిలో కంటే ఎక్కువ మొత్తంలో గంజాయిని దాచిపెట్టారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో తన భార్యకు మరణశిక్ష పడేలా చేయడానికి ఈ మొత్తం సరిపోతుందని ఆయన భావించారు.
సింగపూర్‌లో ప్రపంచంలోనే అత్యంత కఠినమైన మాదకద్రవ్యాల వ్యతిరేక చట్టాలు ఉన్నాయి. డ్రగ్స్ సంబంధిత నేరాల నివారణకు ఇలాంటి చట్టాలు అవసరమని ప్రభుత్వం చెబుతోంది.
జియాంగ్‌లాంగ్ తన భార్యను భయపెట్టడానికి, నేరంలో ఇరికించి, ఆమెను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారని కోర్టు పత్రాల్లో ఉంది.
"తన ప్లాన్ విజయవంతమైతే, భార్యను అరెస్టు చేస్తారని, ఆమెపై తీవ్ర నేరారోపణ చేస్తారని ఆయన భావించారు," అని కోర్టు పత్రాలలో పేర్కొన్నారు.
గంజాయి కలిగి ఉన్నందుకు జియాంగ్‌లాంగ్‌కు మూడు సంవత్సరాల, 10 నెలల జైలు శిక్ష విధించారు. ఈ కేసులో అక్రమ సాక్ష్యాలను సృష్టించే ప్రయత్నం చేశారన్న రెండో అభియోగాన్నీ కోర్టు పరిగణనలోకి తీసుకుంది.

జియాంగ్‌లాంగ్ ఇలా ఎందుకు చేశారు?
జియాంగ్‌లాంగ్, ఆయన భార్య 2021లో వివాహం చేసుకుని, ఒక సంవత్సరం తర్వాత విడిపోయారు. సింగపూర్‌లో పెళ్లయి కనీసం మూడేళ్లు అయిన జంటలకే విడాకులు మంజూరు చేస్తారు. దీంతో వీరిద్దరూ విడాకుల కోసం దరఖాస్తు చేసుకోలేకపోయారు.
తన భార్యకు క్రిమినల్ రికార్డ్ ఉంటే ఆ నియమాన్ని మినహాయిస్తారని జియాంగ్‌లాంగ్ భావించారు.
గత సంవత్సరం తన స్నేహితురాలితో టెలిగ్రామ్ చాట్‌లో, ఆయన తన భార్యను ఇరికించడానికి "పర్‌ఫెక్ట్ నేరాన్ని" ప్లాన్ చేశానని చెప్పారు.
అక్టోబరు 16న, ఆయన ఒక టెలిగ్రామ్ చాట్ గ్రూప్ నుంచి గంజాయిని కొని, దాని బరువు 500 గ్రాములకు మించి ఉందని నిర్థరించుకుని మరుసటి రోజు ఆమె కారులో దాచిపెట్టారు.
అయితే తన భార్య కారులో కెమెరా ఉందనే విషయాన్ని ఆయన పట్టించుకోలేదు.
కారులో గంజాయి పెడుతుండగా, కెమెరా నుంచి ఆమె ఫోన్‌కు నోటిఫికేషన్ అందింది.
ఆమె లైవ్ ఫుటేజీని తనిఖీ చేయగా, విడిపోయిన భర్త తన వాహనం చుట్టూ తిరగడం చూసి, ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విచారణలో భాగంగా పోలీసులు కారులో నిర్వహించిన తనిఖీల్లో, గంజాయి కనిపించడంతో తొలుత జియాంగ్‌లాంగ్ భార్యను అరెస్టు చేశారు.కానీ ఆమెకు వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాలు కనిపించకపోవడంతో, వారు జియాంగ్‌లాంగ్‌ను విచారించి, ఆయనను అరెస్ట్ చేశారు.

శిక్ష తగ్గింపు
నేరం చేసినప్పుడు జియాంగ్‌లాంగ్ డిప్రెషన్‌తో బాధపడుతున్నారని ఆయన న్యాయవాది వాదించడానికి ప్రయత్నించారు, అయితే వైద్యులు అలాంటి లక్షణాలు ఏమీ లేవని చెప్పడంతో కోర్టు ఆ వాదనను తిరస్కరించింది.
సింగపూర్‌లో పట్టుబడిన మాదకద్రవ్యాలు, వాటి పరిమాణం ఆధారంగా జైలు శిక్ష విధిస్తారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు మరణశిక్ష విధిస్తారు.
టాన్ జియాంగ్‌లాంగ్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉన్నా, ఆయన విచారణకు సహకరించి, ప్రారంభంలోనే నేరాన్ని అంగీకరించడంతో శిక్షను తగ్గించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















