‘డీప్‌ఫేక్ ఆ దేశంలో అంటువ్యాధిలా మారింది’

మొబైల్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జీన్ మెకంజీ, నిక్ మార్ష్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

డిజిటల్ సెక్స్ నేరాలను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని దక్షిణ కొరియా ప్రెసిడెంట్ తమ దేశ అధికారులను ఆదేశించారు. డీప్‌ఫేక్ టెక్నాలజీతో యువతులను లక్ష్యంగా చేసుకున్న కేసులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

చాలా చాట్ గ్రూపులలో అసభ్యకరమైన డీప్‌ఫేక్ చిత్రాలు షేర్ అవుతున్నాయి. యువతులు, బాలికల చిత్రాలూ ఇందులో ఉంటున్నాయని అధికారులు, జర్నలిస్టులు, సోషల్ మీడియా యూజర్లు గుర్తించారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి ఈ డీప్‌ఫేక్‌ చిత్రాలను రూపొందిస్తారు, ఎవరో ఒకరి ముఖానికి ఫేక్ బాడీ కలిపి ఇలాంటి అశ్లీల చిత్రాలు తయారుచేస్తారు.

డీప్ ఫేక్ చిత్రాల సమస్య నేపథ్యంలో దక్షిణ కొరియా మీడియా రెగ్యులేటర్ అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్

మైనర్లే బాధితులు

డిజిటల్ లైంగిక నేరాలపై పూర్తిగా విచారణ జరిపి, వాటిని నిర్మూలించాలని దక్షిణ కొరియా ప్రెసిడెంట్ యూన్ సుక్ యోల్ మంగళవారం అధికారులను ఆదేశించారు.

"డీప్‌ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. చాలామంది దీనికి బాధితులవుతున్నారు" అని యూన్ మంత్రివర్గ సమావేశంలో అన్నారు.

‘’బాధితుల్లో చాలామంది మైనర్లు కాగా, నేరస్తుల్లో ఎక్కువ మంది యువకులే’’ అని ఆయన అన్నారు.

గత వారంలో సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్‌లో పెద్ద సంఖ్యలో చాట్ గ్రూపులను గుర్తించారు. ఈ గ్రూపులలో దేశవ్యాప్తంగా వివిధ పాఠశాలలు, విశ్వవిద్యాలయాలున్నాయి.

ఈ గ్రూపులలో ప్రధానంగా టీనేజ్ విద్యార్థులు తమకు తెలిసిన సహ విద్యార్థులు, ఉపాధ్యాయుల వంటివారి ఫోటోలను అప్‌లోడ్ చేస్తుంటారు. ఇతర యూజర్లు ఈ ఫోటోలను అశ్లీలమైన డీప్‌ఫేక్ చిత్రాలుగా మారుస్తున్నారు.

టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్‌ ఇటీవలె ఫ్రాన్స్‌లో అరెస్టయ్యారు. టెలిగ్రామ్‌‌ను నేర కార్యకలాపాలకు వినియోగించుకోవడాన్ని అరికట్టడంలో విఫలమైనట్లు దురోవ్‌పై ఆరోపణలున్నాయి.

టెలిగ్రామ్ యాప్‌ ద్వారా డ్రగ్స్ సరఫరా, చైల్డ్ సెక్సువల్ కంటెంట్, చీటింగ్‌ వంటి నేరాలకు సంబంధించిన ఆరోపణలు వచ్చినప్పుడు దర్యాప్తు సంస్థలకు సహకరించడంలో ఈ యాప్ విఫలమైందన్న అభియోగాలున్నాయి.

ఆన్‌లైన్ వేధింపులు

ఫొటో సోర్స్, PA Media

నేషనల్ ఎమర్జెన్సీ

దక్షిణ కొరియాలో డిజిటల్ లైంగిక నేరాలు గతంలోనూ వెలుగులోకి వచ్చాయి.

2019లో టెలిగ్రామ్ చాట్‌రూమ్‌ను ఉపయోగించి పెద్దసంఖ్యలో యువతులను లైంగిక చర్యలకు పాల్పడేలా పురుషులు బ్లాక్‌మెయిల్ చేస్తున్న ఒక స్కాండల్ బయటపడింది. ఇది ‘ఎన్త్ రూం’ గా ప్రాచుర్యం పొందింది.

ఆ గ్రూపు లీడర్ చో జు-బిన్‌కు 42 సంవత్సరాల జైలు శిక్ష పడింది.

దేశంలో ఆన్‌లైన్ డీప్‌ఫేక్ సెక్స్ నేరాలు పెరిగాయని దక్షిణ కొరియా పోలీసులు వెల్లడించారు. ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లో ఇలాంటివి మొత్తం 297 కేసులు నమోదయ్యాయి. గత ఏడాది కేసుల సంఖ్య 180 . 2021లో 160 కేసులు నమోదయ్యాయి. గత మూడేళ్లలో జరిగిన నేరాల్లో నిందితులుగా 66 శాతానికి పైగా యువకులు ఉన్నారు.

ఈ తాజా సంఘటనలు 200 కంటే ఎక్కువ పాఠశాలలపై ప్రభావం చూపినట్లు కొరియన్ టీచర్స్ యూనియన్ చెప్తోంది. ఆ దేశ విద్యా మంత్రిత్వ శాఖ చెప్తున్న ప్రకారం గత రెండేళ్లలో ఉపాధ్యాయులను లక్ష్యంగా చేసుకునే డీప్‌ఫేక్‌ల సంఖ్య పెరిగింది.

దక్షిణ కొరియా డీప్‌ఫేక్ పోర్న్ సమస్య తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం "జాతీయ అత్యవసర పరిస్థితి" ప్రకటించాల్సిన అవసరం ఉందని ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ నాయకురాలు, మహిళా హక్కుల కార్యకర్త పార్క్ జి-హ్యూన్ సూచించారు.

"డీప్‌ఫేక్ లైంగిక వేధింపుల చిత్రాలను నిమిషంలో సృష్టించవచ్చు. ఎవరైనా ఎటువంటి ధ్రువీకరణ ప్రక్రియ లేకుండానే చాట్‌రూమ్‌లోకి ప్రవేశించవచ్చు" అని పార్క్ ఎక్స్‌లో తెలిపారు

"ఇటువంటి సంఘటనలు దేశవ్యాప్తంగా మిడిల్ స్కూల్స్, హై స్కూల్స్, యూనివర్సిటీలలో జరుగుతున్నాయి" అని తెలిపారు.

అధ్యక్షుడిపై విమర్శలు

"హెల్దీ మీడియా కల్చర్’’ సృష్టించేందుకు, యువకులకు మెరుగైన విద్య అవసరమని ప్రెసిడెంట్ యూన్ అభిప్రాయపడ్డారు.

డీప్‌ఫేక్ చిత్రాలపై ప్రెసిడెంట్ స్పందిస్తూ "కేవలం చిలిపితనంగా కనిపించినా, సాంకేతికతను ఉపయోగించి చేసే నేరం'' అని అన్నారు.

దక్షిణ కొరియా మీడియా రెగ్యులేటర్ ఈ కొత్త సంక్షోభంపై చర్చించడానికి సమావేశమవుతోంది. అయితే, ఈ సమస్యలను ప్రభుత్వం సమర్థంగా పరిష్కరించగలదా అని కొందరు విమర్శకులు అనుమానిస్తున్నారు.

లింగ వివక్షను వ్యక్తిగత వివాదాలుగా తగ్గించి చూసే ప్రభుత్వం ఈ సమస్యను సరిగ్గా పరిష్కరిస్తుందని అనుకోనని జస్టిస్ పార్టీ మాజీ సభ్యులు, మహిళా హక్కుల కార్యకర్త బే బోక్-జూ ఏఎఫ్‌పీ వార్తాసంస్థతో చెప్పారు.

దక్షిణ కొరియా మహిళలు "లింగ వివక్షను" ఎదుర్కోలేదని ప్రెసిడెంట్ కావడానికి ముందు యూన్ పేర్కొన్నారు.

దక్షిణ కొరియాలోని మహిళలు పురుషుల కంటే తక్కువ సంపాదిస్తున్నారు. సంపన్న దేశాలలో జెండర్ ఆధారంగా వేతన వ్యత్యాసం ఎక్కువగా ఉన్న దేశం దక్షిణ కొరియా.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)