లెసొతో: ఈ చిన్న దేశంలో బతికే చాలామందిలో చచ్చిపోవాలనే కోరికలు ఎక్కువగా కనిపిస్తాయి, ఎందుకు?

మెయిన్ రోడ్డు నుంచి మత్లోహాంగ్ మొలొయ్ (79) తన ఇంటికి చేరుకోవాలంటే ఎత్తుగా ఏటవాలుగా ఉన్న పర్వతాల్లో నుంచి నడవాల్సి ఉంటుంది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన దేశాల్లో ఒకటిగా లెసొతో దేశానికి పేరు రావడానికి ఇలాంటి భౌగోళిక పరిస్థితులే కారణం.
పదిమంది పిల్లల తల్లి అయిన మొలోయ్ నన్ను తన ఇంట్లోకి ఆహ్వానించారు. ఆ ఇల్లు చాలా శుభ్రంగా సర్ది ఉంది. ఆమె కుటుంబానికి సంబంధించిన ఫోటోలను చూపించారు. ఆమె తొలి సంతానం తొహ్లాంగ్ గురించి మాట్లాడేందుకు నేను ఆ ఇంటికి వచ్చాను.
38 ఏళ్ల వయసులో తొహ్లాంగ్ ఆ దేశపు భయంకరమైన గణాంకాల్లో భాగంగా మారారు. లెసొతోకు ఆకాశంలో మహాసామ్రాజ్యం అనే మరో పేరు ఉంది. బహుశా ఎత్తైన ప్రాంతంలో ఉండటం వల్ల దానికి ఆ పేరు వచ్చి ఉండవచ్చు.
ఈ భౌగోళిక పరిణామంతోపాటు, ఆ చిన్న దేశం ప్రపంచంలో అత్యధిక ఆత్మహత్యల రేటు ఉన్న దేశం అనే పేరును కూడా సంపాదించుకుంది.
“తొహ్లాంగ్ చాలా మంచి పిల్లవాడు, తనకున్న మానసిక సమస్యల గురించి నాకు చెప్పాడు.” అని మొలాయ్ చెప్పారు.
“వాడు ఆత్మహత్య చేసుకున్న రోజు కూడా నా దగ్గరకు వచ్చాడు. అమ్మా, ఏదో ఒక రోజు నేను ఆత్మహత్య చేసుకున్నానే విషయం గురించి నువ్వు వింటావు అని అన్నాడు” అని ఆమె కన్నీరు పెట్టుకున్నారు.
“వాడి మరణం నన్ను కుంగదీసింది. వాడు తన సమస్యల గురించి నాతో మరింత వివరంగా మాట్లాడి ఉంటే బావుండేది. కానీ, అలా చెప్పుకుంటే తనను బలహీన మనస్కుడని అనుకుంటారని భావించాడు.” అని వెల్లడించారామె.
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం లెసొతోలో ప్రతీ ఏటా ప్రతి లక్ష మందిలో 88 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు.
పక్కనే ఉన్న గయానాతో పోల్చుకుంటే లెసొతోలో రెట్టింపు కంటే ఎక్కువ మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. గయానాలో ప్రతి లక్ష మందిలో 40 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు.
ఆత్మహత్యల రేటు ప్రపంచ సగటుతో పోలిస్తే లెసొతోలో పది రెట్లు ఎక్కువగా ఉంది . ఆత్మహత్యల విషయంలో ప్రపంచ సగటు లక్ష మందిలో 9 మాత్రమే.
లెసొతోలో యువకులకు మానసిక ఆరోగ్య నిర్వహణ నైపుణ్యాలను నేర్పుతున్న ఒక స్వచ్చంధ సంస్థ విడుదల చేసిన గణాంకాలివి.


గ్రూప్ థెరపీ
లెసొతో రాజధాని మసెరు నుంచి రెండుగంటలు ప్రయాణిస్తే లొట్సే పట్టణం వస్తుంది. అక్కడ యువతుల కోసం సామాజిక కార్యకర్త లినియో రఫోకా థెరపీ క్లాసులు నిర్వహిస్తున్నారు. నేను అక్కడికి వెళ్లాను.
“ఏం జరుగుతుందో మేము కూడా దాస్తున్నాం. నా ముగ్గురు స్నేహితులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నేను కూడా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాను" అని అన్నారామె.
ఇక్కడున్న ప్రతీ ఒక్కరిలోనూ ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు ఉన్నాయి. లేదా వారికి తెలిసిన వాళ్లు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు.
35ఏళ్ల నిట్సోకి ఆ బృందంలో సభ్యులకు తన కథ చెప్పేటప్పుడు భావోద్వేగానికి లోనయ్యారు. హాస్పిటల్‌లో ఉన్నప్పుడు ఆమెపై అత్యాచారం జరిగింది.
“నేను చాలా అందంగా ఉన్నానని డాక్టర్ చెప్పారు. తర్వాత వెంటనే ఒక తుపాకీ తీసి నాతో గడపాలని అడిగాడు లేకపోతే చంపేస్తానని అన్నాడు” అని ఆమె వెల్లడించారు.
“నేను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను. నాకు అదొక్కటే మార్గంగా తోచింది. అయితే నేనా పని చెయ్యలేకపోయాను. ఆత్మహత్య చేసుకునేంత శక్తి లేదు నాకు. ఆ శక్తి లేకపోవడమే నన్ను బతికేలా చేసి ఉండవచ్చు లేదా నా సోదరుల మొహాలు గుర్తొచ్చి నేను ప్రాణం తీసుకోకపోయి ఉండొచ్చు. నేను చాలా శక్తివంతురాలినని వాళ్లు అనుకుంటున్నారు. కానీ, చాలా బలహీనురాలిని.” అని ఆమె చెప్పారు.
ఆమె తన అభిప్రాయాలను చెప్పిన తీరు చూసి ఆమె చాలా శక్తివంతురాలని ఆ బృందం కూడా భావించింది.
క్లాసు పూర్తి కాగానే, మహిళలందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. నవ్వుతున్నారు. తమ ఆలోచనలను షేర్ చేసుకోవడం ద్వారా హృదయంలో బరువు తగ్గి ఇప్పుడు రిలాక్స్డ్‌గా ఉన్నామని చెప్పారు.
కొంతమంది ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు చాలా సంక్లిష్టంగా కనిపిస్తాయి. వాటిలో ఏదో ఒక కారణాన్ని వేరు చేసి చూడటం చాలా కష్టం.

అర్థం చేసుకోవడానికి ఏం చేయాలి?
ఇదంతా పక్కన పెడితే, లెసొతోలో ఆత్మహత్యల రేటు అత్యధికంగా ఉండటానికి కారణాల గురించి లినియో రఫోకా నాతో మాట్లాడారు.
“అత్యాచారం, నిరుద్యోగం, ప్రేమించిన వాళ్లను కోల్పోవడం, డ్రగ్స్, ఆల్కహాల్ లాంటి అనేక అంశాల వల్ల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి.” అన్నారు.
2022 జనాభా సమీక్ష నివేదిక ప్రకారం, లెసొతోలో 86 శాతం మంది మహిళలు లైంగికపరమైన హింసను ఎదుర్కొన్నవారే.
లెసొతోలోని ప్రతీ ఐదుగురు యువకుల్లో ఇద్దరు నిరుద్యోగులు లేదా చదువుకోని వారేనని ప్రపంచబ్యాంక్ చెబుతోంది.
“వారికి కుటుంబాలు, స్నేహితులు, ఇతర బంధువుల నుంచి తగినంత మద్దతు లభించదు.” అని రఫొకా చెప్పారు.
లెసొతోలో తరచుగా మీకు ఒక విషయం వినిపిస్తుంది. అదేంటంటే అక్కడ నివసిస్తున్న ప్రజల్లో అనేక మంది తమ మానసిక పరిస్థితి గురించి మాట్లాడటాన్ని ఇబ్బందికరంగా భావిస్తారు. ఎందుకంటే అలా చెబితే అవతలి వ్యక్తులు తమ గురించి ఒక అంచనాకు వస్తారని అనుకుంటారు.
హోల్ట్‌సేలోని ఒక బార్‌లో ఒకరాత్రి టీవీలో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ కొంతమంది కస్టమర్లు బీర్ తాగుతూ ఉన్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న నేను మానసిక ఆరోగ్యం గురించి చర్చను లేవనెత్తాను.
“మేము దాని గురించి మాట్లాడతాం. మొదలు పెట్టండి.” అని ఖోసీ ఎంపితీ అనే వ్యక్తి నాతో అన్నారు.
అక్కడున్న వారిలో కొంతమంది తాము ఎక్కువ మాట్లాడితే తమ గురించి ఇతరులు పుకార్లు ప్రచారం చేస్తారేమో అని భయపడ్డారు. అయితే ఎంపితీ మాత్రం పరిస్థితులు మారుతున్నాయని అన్నారు.
“ఒక గ్రూప్‌గా మేము అందరం ఒకరికొకరు అండగా నిలుస్తాం. ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే, వారికి అందరూ సాయం చేస్తామని నేను మిగతావారితో చెప్పాను.” అన్నారు ఎంపితీ.
ఎవరికైనా నిపుణుల సాయం అవసరమైన వారు, ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.

లెసొతో సైక్రియాటిక్ యూనిట్ మీద గతేడాది తీవ్ర విమర్శలు వచ్చయి. ప్రజల కోసం కృషి చేయాల్సిన ఈ సంస్థలో 2017 నుంచి సైక్రియాటిస్ట్ లేరు.
దేశంలో ఉన్న ఆత్మహత్యల సమస్యను పట్టించుకోవడానికి, పరిష్కరించడానికి ప్రభుత్వపరంగా ఎలాంటి విధానాలు లేవు. 2022లో ఎన్నికైన ప్రభుత్వం ఆత్మహత్యల్ని కట్టడి చేసేందుకు ఒక బిల్లును రూపొందిస్తున్నట్లు చెప్పింది.
“ప్రస్తుతం మానసిక ఆరోగ్యం అనేది మహమ్మారిలా మారింది” అని ఆరోగ్య సమస్యలను డీల్ చేస్తున్న కమిటీకి నాయకత్వం వహిస్తున్న పార్లమెంటేరియన్ మోఖోతు మఖ్హల్యానే చెప్పారు.
“ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి మేము ప్రచారం ప్రారంభించాం. ప్రస్తుతం ఇది యువతలో చర్చనీయాంశంగా ఉంది. ఫుట్‌బాల్ టోర్నమెంట్లు జరిగే చోట దీని గురించి ఎక్కువగా చర్చిస్తున్నాం. ఇందులో చికిత్సతో పాటు పునరావాసం కూడా ఉంటుంది.” అని ఆయన బీబీసీతో చెప్పారు.
లెసొతో హెచ్ఐవి/ ఎయిడ్స్ మీద పోరాడినట్లే అత్మహత్యలపైన పోరాడుతుందని ఆయన చెప్పారు.

బహిరంగంగా చర్చించండి
2016లో, టెస్ట్ అండ్ ట్రీట్ వ్యూహాన్ని ప్రవేశపెట్టిన మొదటి దేశంగా లెసోతో అవతరించింది. అంటే ఎవరికైనా హెచ్‌ఐవీ సోకిందని భావిస్తే రోగనిర్ధరణ చేసిన వెంటనే చికిత్స ప్రారంభించవచ్చు. వైరస్ సోకిన వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది.
"మా అనుభవం ఏమిటంటే, సమస్య గురించి బహిరంగంగా మాట్లాడటం వల్ల వైరస్ సోకిన వారి పట్ల సానుభూతితో ఆలోచించేలా పరిస్థితులు మారాయి." అని మంత్రి అన్నారు.
తిరిగి పర్వతాలలోకి వస్తే, త్లోహాంగ్ సమాధిని చేరుకోవడానికి మొలోయ్ కొద్ది దూరం నడిచారు.
తొహ్లాంగ్ ఆఖరి విశ్రాంతి స్థలం, ప్రకృతి పరంగా అద్భుతంగా ఉంది. అక్కడ సెలయేళ్లు, వృక్ష సంపద, చిన్న ఇల్లు ఉన్నాయి.
లెసొతోలో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని పోగొట్టుకుని బాధతో జీవిస్తున్న అనేక మంది వ్యక్తులలో మోలోయ్ ఒకరు.
తన కొడుకు లాంటి ఆలోచనలు ఉన్న వారి కోసం ఆమె దగ్గర మెసేజ్ ఉంది.
"ప్రాణాలు తీసుకోవడం ఎప్పటికీ పరిష్కారం కాదని నేను ప్రజలకు చెబుతాను. మీరు చేయాల్సిందల్లా మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మాట్లాడండి. వారు మీకు కచ్చితంగా సాయం చేస్తారు." అంటారామె.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














