టీవీ చూస్తూ తింటున్నారా? అయితే ఓసారి ఇది చదవండి..

ఆహారం

ఫొటో సోర్స్, Getty Images

మనలో చాలా మంది బ్రేక్‌ఫాస్ట్ మొదలుకుని, డిన్నర్‌ దాకా అన్నీ టీవీ చూస్తూనే తింటుంటారు. ఇక పిల్లల సంగతి చెప్పాల్సిన పనిలేదు. టీవీ లేనిదే వాళ్లకు ముద్ద దిగదు.

అన్నం, కూరగాయాలు, ఇతర పోషకాహారం తినబోమని మారాం చేసే పిల్లలకు టీవీ చూపిస్తూ ఎలాగోలా తినిపిస్తుంటారు పెద్దలు. ఇలా చిన్నా, పెద్దా అందరికీ టీవీ చూస్తూ తినడమనేది ఒక అలవాటులాగో.. జీవితంలో భాగంలానో మారిపోయింది.

మరి, అలా తినడం మంచిదా కాదా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి? నిపుణులు ఏమంటున్నారు?

బీబీసీ న్యూస్ తెలుగు
ఆహారం

ఫొటో సోర్స్, Getty Images

టీవీ డిన్నర్ అంటే ఏంటి?

ఆరోగ్యపరంగా చూస్తే టీవీ డిన్నర్ అనేది అంత మంచిది కాదు. 20వ శతాబ్దం ప్రారంభంలో అమెరికాలో ఈ కాన్సెప్ట్ మొదలయింది. సరిపడా ఉప్పు, ఇతర రుచికర పదార్థాలు కలిసి ఉన్న ప్రాసెసెడ్ మీల్ ప్యాకెట్ల ఆహారాన్ని ఒళ్లో పెట్టుకుని టీవీ చూస్తూ తినడాన్నే టీవీ డిన్నర్‌ అంటారు.

మనం ఏం తింటున్నామనేది పక్కనపెడితే అది ఏదయినా సరే.. టీవీ చూస్తూ తినడం మనకో అలవాటులా మారడం ఆరోగ్యానికి మంచిది కాదన్నది పరిశోధనల్లో తేలింది.

ఆహారం

ఫొటో సోర్స్, Getty Images

పరధ్యానం, జ్ఞాపకశక్తి

మనం తీసుకునే ఆహారంపై మన చుట్టూ ఉండే వాతావరణం ప్రభావం చాలా ఉంటుందని శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో చెబుతున్నారు. అదే విధంగా టీవీ చూస్తూ ఆహారం తీసుకోవడానికి, ఊబకాయానికి సంబంధం ఉంది. ప్రతి రోజూ టీవీ చూస్తూ తినేవారు ఊబకాయం బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఒకేచోట కూర్చుని ఉండడం వల్ల వారికి సరైన వ్యాయామం కూడా లేకపోవడం మరో కారణం.

మనం ఎంత తింటామనేదానిపై కూడా టీవీ ప్రభావం ఉంటుంది. టీవీ చూడకుండా తినేదానితో పోలిస్తే టీవీ చూస్తూ తినేటప్పుడు మనం ఎక్కువ తింటాం. దీనికి కారణం మనం పరధ్యానంగా ఉండడమని ఆమ్‌స్టర్‌డామ్ యూనివర్శిటీ కమ్యూనికేషన్ సైన్స్ ప్రొఫెసర్ మోనిఖ్యూ అల్బ్లాస్ చెప్పారు.

మనకు బాగా ఇష్టమైనది తింటున్నప్పుడు మనం ఎంత తింటున్నామనేదాన్ని మనం పట్టించుకోం. కడుపు నిండింది, ఇక చాలు అని శరీరం మనకు ఇచ్చే సంకేతాలను గమనించం. దీనివల్ల మనం ఎక్కువగా తింటాం. టీవీ చూస్తున్నప్పుడు కూడా ఇలాగే జరుగుతుందని ఓ పరిశోధన తెలియజేసింది. టీవీ ముందు కూర్చుని తినేటప్పుడు మనం ఏం తింటున్నామన్న సంగతి మనకు గుర్తుండదు. అలాగే ఎంత తింటున్నామన్నది కూడా అంచనా వేయలేం. దీనివల్ల మనం చాలా ఎక్కువ తింటాం.

టీవీ చూస్తూ తినేటప్పుడు మనం చాలా ఎక్కువసేపు తింటామని అల్బ్లాస్ చెప్పారు.

ఈ పరిశోధన కోసం ఆమె నెదర్లాండ్స్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సోషల్ రీసెర్చ్ సేకరించిన సమాచారాన్ని ఉపయోగించుకున్నారు. ఈ పరిశోధన కోసం ఓ వారం పాటు చేసే పనులన్నింటినీ డైరీలో నమోదు చేయాలని నిర్వాహకులు కోరారు. తినడం, టీవీ చూడడంతో పాటు టీవీలో ఎలాంటి కార్యక్రమాలు చూస్తున్నారనేది కూడా నమోదుచేయాలని సూచించారు.

టీవీ చూస్తూ ఆహారం తీసుకునేవాళ్లు చాలా ఎక్కువ సేపు తింటున్నారని ఈ సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా అల్బ్లాస్ గుర్తించారు.

ఆహారం

ఫొటో సోర్స్, Alamy

టీవీ చూస్తూ ఎక్కువ తినేస్తున్నాం..

టీవీ చూడకుండా తినేటప్పటితో పోలిస్తే టీవీ చూస్తూ తినే రోజుల్లో వాళ్లు తినడానికి కేటాయిస్తున్న సమయం చాలా ఎక్కువగా ఉంటోందని గుర్తించారు. టీవీ చూస్తూ పరధ్యానంతో తింటుండడం వల్ల ఎంత తింటున్నామన్న సంగతి కూడా వారికి తెలియడం లేదని ఆమె అన్నారు.

పరిశోధనలో భాగస్వాములుగా ఉన్నవారు ఎక్కువగా తింటున్నారా... అవసరమైనంత మేరే తింటున్నారా అన్నది తేలలేదు. వారు కచ్చితంగా ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారన్నదానిపైనా అవగాహన లేదు. అయితే తినడానికి ఎంత సమయం వెచ్చిస్తున్నారన్నదే పరిశీలించారు. ఈ ఫలితాలన్నీ ప్రజలు సొంతంగా చెప్పినవే. టీవీలో ఏదయినా మంచి కార్యక్రమం చూసేటప్పుడు.. తమను తాము ఎలా మర్చిపోతారో తామెంతసేపటి నుంచి తింటున్నామన్న విషయాన్ని కూడా అలాగే మర్చిపోతారు.

అయితే, మనమెంత సమయం తింటున్నామనేదానికి, ఎక్కువ క్యాలరీల ఆహారం తీసుకోవడానికి సంబంధం ఉందని అల్బ్లాస్ చెప్పారు.

‘‘మీకు రుచికరమైన ఆహారం లభించకపోతే చాలా తొందరగా భోజనాన్ని ముగిస్తారు’’ అని ఫ్లోర్ వాన్ మీర్ చెప్పారు.

ల్యాబ్ ద్వారా నిర్వహించిన పరిశోధనల్లో కూడా ఇదే తేలింది. పరధ్యానంతో తింటున్నప్పుడు ఎక్కువ ఆహారం తీసుకుంటాం. టీవీ చూస్తూ తినేటప్పుడు ఎక్కువ పరధ్యానంతో ఉంటామని అన్ని పరిశోధనల్లో తేలింది.

మనం ఆహారం మీద శ్రద్ధపెట్టి తింటున్నప్పుడు ఉన్న రుచి, మనం టీవీ చూస్తూ తినేటప్పుడు ఉన్న రుచి ఒకేలా ఉండదు. అందుకే మనం టీవీ చూసేటప్పుడు ఎక్కువ తింటాం. మనం పరధ్యానంతో తిన్నప్పుడు అందుకే మనకు మంచి ఆహారం తిన్నామన్న సంతృప్తి కలగదని నెదర్లాండ్స్‌లో డేటా సైన్స్ పరిశోధకులు ఫ్లోర్ వాన్ చెప్పారు. పరధ్యానంతో ఉన్నప్పుడు తీసుకునే ఆహారంపై నెదర్లాండ్స్‌లోని లైడెన్ యూనివర్శిటీలో ఫ్లోర్ వాన్ పరిశోధనలు చేశారు.

మనం పరధ్యానంతో తింటున్నప్పుడు మెదడు పనితీరు ఎలా ఉంటుందనేదానిపై న్యూరో సైంటిస్ట్ వాన్ మీర్ అనేక అధ్యయనాలు జరిపారు. తినేటప్పుడు ఒక చిన్న లేదా పొడవాటి నంబరు గుర్తుంచుకోవాలని ఓ అధ్యయనంలో పాల్గొన్నవారిని నిర్వాహకులు కోరారు. పొడవాటి నంబర్లు గుర్తుంచుకోవడానికి ప్రయత్నించినవాళ్లు తమ ఆహారం అంత రుచికరంగా లేదని తెలిపారు.

రుచి విషయంలో మెదడులోని కొన్ని భాగాలు అంత క్రియాశీలకంగా లేవని వాన్ మీర్ గుర్తించారు.

ఆహారం

ఫొటో సోర్స్, Getty Images

హెడోనిక్ గోల్ అంటే...

మనుషులెప్పుడూ హెడోనిక్ గోల్‌ను లక్ష్యంగా పెట్టుకుంటారనేది ఓ సిద్ధాంతం. ఒక రోజులో మనం చేసే కార్యకలాపాల నుంచి మనం కాస్త సంతోషం కోరుకుంటాం. అది మనకు లభించకపోతే...ఇంకో చోట నుంచి ఆ సంతోషాన్ని పొందే ప్రయత్నం చేస్తుంటాం. టీవీ కార్యక్రమం మన అంచనాలకు తగినట్టుగా లేకపోతే...దానికి బదులుగా మనం ఎక్కువ తింటం ద్వారా సంతోషం పొందుతాం. దీన్నే హెడోనిక్ గోల్ అంటారని వాన్ మీర్ తెలిపారు.

మన ఆహారపు అలవాట్లపై మన మానసిక స్థితి ప్రభావం కూడా ఉంటుంది. మనకు బాధ కలిగించే కార్యక్రమాలతో పోలిస్తే...మనకు సంతోషం కలిగిన కార్యక్రమాలు టీవీలో చూస్తున్నప్పుడు...చాక్లెట్, బటర్డ్ పాప్‌కార్న్ వంటి ఆనందం కలిగించే ఆహారాన్ని తక్కువగా తీసుకుంటామని ఓ పరిశోధనలో తేలింది.

టీవీ చూస్తున్నప్పుడు మనం ఏ రకమైన ఆహారం తింటున్నాం?

సాధారణంగా ఆహార ఉత్పత్తుల ప్రకటనలు చూస్తున్నప్పుడు మనం కొంచెం ఎక్కువ తింటామని పరిశోధనలో తేలింది. అయితే ఆహార ప్రకటనల వల్ల మనం అల్ట్రా ప్రాసెసెడ్ ఫుడ్ (తయారుచేసి ప్యాకెట్లలో ఉంచే ఆహారం) ఎక్కువగా తీసుకుంటున్నాం. పరిశోధనల్లోనూ ఈ విషయం తేలింది. దీనిపై పరిశోధకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అల్ట్రా ప్రాసెసెడ్ ఫుడ్ వల్ల ఊబకాయం, గుండె సంబంధిత రోగాలతో పాటు ఇతర అనేక రకాల వ్యాధుల బారిన పడే ప్రమాదముంది.

ఆహార ప్రకటనలు చాలా తక్కువగా చూసినప్పటికీ...పిల్లలు ఆ ప్రకటనల్లో చూసిన ఆహారం ఎంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారని అధ్యయనాల్లో తేలింది. ప్రకటనలు పునరావృతమవుతుండడం...వారిపై ప్రభావం చూపిస్తుందని...అదే రకం ఆహారం ఎంచుకునేలా చేస్తుందని బ్రెజిల్‌లోని సావో పాలో యూనివర్శిటీలో పోషకాహారం, ఆరోగ్యం విభాగంలో పరిశోధకురాలిగా ఉన్న ఫెర్నాండా రాబర్ తెలిపారు. టీవీ చూసేటప్పుడు పిల్లలు అల్ట్రా ప్రాసెసెడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారని ఆమె గుర్తించారు.

తినడానికి, టీవీ చూడడానికి మధ్య ఉన్న సంబంధం చాలా క్లిష్టమైనది. అలాగే అది పరధ్యానం కలిగించే ప్రభావం కూడా చాలా ఎక్కువే.

ఆహారం

ఫొటో సోర్స్, Getty Images

టీవీ చూసేటప్పుడు అల్ట్రా ప్రాసెసెడ్ ఆహారం తినడానికి వీలుగా ఉంటుంది. .ఆ ఆహారం ఎక్కువగా తినడానికి ఇది ఓ కారణమని ఫెర్నాండా రాబర్ తెలిపారు. అయితే ఈ రకమైన ఆహారానికి సంబంధించిన ప్రకటనలు ఎక్కువగా చూడడానికి, ఆ ఆహారం వినియోగం పెరగడానికి మధ్య సంబంధం ఉంది. మనం ప్రకటనల్లో చూసిన వాటిని ఎక్కువగా కొనుగోలు చేసి తింటుంటాం. ఇప్పటికే ఊబకాయం ఉన్న పిల్లలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే, బహుశా ఆహార ప్రకటనలకు ఎక్కువగా ఆకర్షితులయ్యే సున్నిత స్వభావం వారు కలిగి ఉండడం వల్ల కావొచ్చు.

మామూలుగా కుటుంబమంతా కలిసి తినేటప్పుడు పళ్లు, కూరగాయలు ఎక్కువగా తింటాం. అయితే పిల్లలు కుటుంబంతో కలిసి టీవీ చూస్తూ తినేటప్పుడు అల్ట్రా ప్రాసెసెడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారని రాబర్ గుర్తించారు.

‘‘కుటుంబమంతా కలిసి కూర్చుని తినడం వల్ల ప్రయోజనాలు ఉంటాయని ఇతర పరిశోధనల్లో తేలింది. అయితే ఇలా అందరూ కలిసి కూడా టీవీ చూస్తూ తినడం వల్ల ఆ ప్రయోజనాలేవీ నెరవేరవని అర్ధమవుతోంది’’ అని రాబర్ చెప్పారు. ఆహారపు అలవాట్లకు, చుట్టుపక్కల ఉన్న వాతావరణ ప్రభావాలు, ఇతర విషయాలకు మధ్య ఉన్న సంబంధాన్ని ఇది ప్రతిబింబిస్తోంది. ఈ విషయంపై మరింత పరిశోధన జరగాల్సిన అవసరాన్ని తెలియజేస్తోంది.

తినడానికి, టీవీ చూడడానికి మధ్య ఉన్న సంబంధం చాలా క్లిష్టమైనది. అలాగే అది పరధ్యానం కలిగించే ప్రభావం కూడా చాలా ఎక్కువే. పరధ్యానంగా ఉండడం వల్ల చాలా తక్కువ తినడం లేదా అసలేమీ తినకపోవడం వంటివి కూడా జరుగుతాయని పరిశోధనలో తేలిందని వాన్ మీర్ తెలిపారు.

ఉదాహరణకు నెదర్లాండ్స్‌లో కొన్ని ప్రాథమిక పాఠశాలలు స్కూల్ సమయాన్ని తగ్గించడంతో వాళ్లు తినేటప్పుడు కూడా క్లాసులు వినాల్సి వచ్చేది.

పిల్లలు లంచ్ చేసేటప్పుడు పాఠాలు చెప్పడం చాలా కష్టమైన విషయం. అందుకే వాళ్లు విద్యార్థులకు చదివి వినిపించడం, లేదంటే ఎడ్యుకేషన్ వీడియో ప్లే చేయడం వంటివి చేశారని వాన్ మీర్ చెప్పారు. కానీ చివరికేం జరిగిందంటే..స్కూల్ ముగిసి సాయంత్రం పిల్లలు ఇంటికొచ్చే సమయానికి లంచ్ బాక్సులు ఖాళీ అవ్వడం లేదన్న విషయాన్ని చాలా మంది తల్లిదండ్రులు గుర్తించారు. తినే విషయంలో పిల్లలు చాలా పరధ్యానంతో ఉన్నారని వాన్ మీర్ చెప్పారు.

ఆహారం

ఫొటో సోర్స్, Getty Images

టీవీ ప్రోగ్రాం నచ్చకపోతే...

పెద్దలపై చేసిన పరిశోధనలోనూ ఈ ప్రభావం కనిపించింది. ఓ అధ్యయనంలో పాల్గొన్నవారికి బాగా పాపులర్ అయిన అమెరికా టీవీ సిరీస్ ఫ్రెండ్స్ రెండు ఎపిసోడ్‌లు చూపించారు. వారిలో ఓ గ్రూప్‌లోని వాళ్లు ఒకే ఎపిసోడ్‌ను రెండు సార్లు చూశారు. మరో గ్రూప్‌లోని వాళ్లు రెండు వేర్వేరు ఎపిసోడ్‌లు చూశారు. రెండో ఎపిసోడ్ సమయంలో రెండు గ్రూపులకు వేర్వేరు స్నాక్స్ అందించారు.

రెండు వేర్వేరు ఎపిసోడ్‌లు చూసిన వారితో పోలిస్తే, ఒకే ఎపిసోడ్ రెండు సార్లు చూసిన వాళ్లు 211 క్యాలరీలు అదనంగా తిన్నారని తేలింది. వారు కాస్త తక్కువ పరధ్యానంతో ఉండడం దీనికి కారణం కావొచ్చని సిడ్నీ మాఖ్వారి యూనివర్శిటీలో సైకలాజికల్ సైన్సెస్ ఫ్రొఫెసర్‌గా ఉన్న డిక్ స్టీవెన్‌సన్ చెప్పారు.

మనం తినే విధానం, ఏ ప్రభావంతో మనం అలా తింటాము అనేవి క్లిష్టమైన విషయాలు

ఇంకోరకంగా చెప్పాలంటే, మనం టీవీలో చూస్తున్న కార్యక్రమం బాగా ఆసక్తిగా ఉంటే.. మన ముందున్న ఆహారం తినాలన్న సంగతి కూడా మనం మర్చిపోతాం. అదే టీవీ కార్యక్రమం మనకు బోర్ కొట్టిస్తే.. ఎప్పుడూ తినేదానికన్నా కాస్త ఎక్కువగా తింటాం.

మరో చిన్న అధ్యయనంలో టీవీలో ఆర్ట్‌పై ఓ బోరింగ్ లెక్చర్ చూస్తున్నవారు, ఆసక్తికరమైన టీవీ సిరీస్ చూస్తున్నవారు, అసలేమీ చూడని వారిపై పరిశోధన జరిపారు. వారందరికీ తక్కువ క్యాలరీలు ఉండే ద్రాక్ష, ఎక్కువ క్యాలరీలు ఉండే చాక్లెట్లు అందించారు. ఆసక్తికర కార్యక్రమం చూస్తున్నవాళ్లు, అసలేమీ చూడని వాళ్లతో పోలిస్తే... బోరింగ్ లెక్చర్ చూస్తున్నవాళ్లు ఎక్కువ ఆహారం తిన్నట్టు పరిశోధనలో తేలింది. ఎక్కువ బోర్ కొట్టించే కార్యక్రమం చూస్తున్నప్పుడు మరింత ఎక్కువగా తింటుంటాం. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే...ద్రాక్ష ఎన్ని తిన్నారో...దాదాపు చాక్లెట్లు కూడా అన్నే తిన్నారు.

ఆహారం

ఫొటో సోర్స్, Alamy

టీవీ చూస్తూ తినకూడదా?

టీవీ చూస్తూ తినేటప్పుడు మనం ఎందుకు ఎక్కువ ఆహారం తీసుకుంటామనేదానిపై అనేక సిద్ధాంతాలున్నాయి. అయితే నిజంగా ఇలాంటి పరిశోధనకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి.

సాధారణంగా ప్రజల ఆహారపు అలవాట్లు, వాళ్లు టీవీ చూసే విధానాలను పరిశోధులు పరిశీలిస్తున్నారు. అయితే, ఆరోగ్యానికి హాని కలిగించే ఆహారం తీసుకున్నవిషయాన్ని ప్రజలంతగా బయటకు చెప్పరని రాబర్ తెలిపారు.

అధ్యయనంలో పాల్గొన్నవారి నుంచి..వారి రోజువారీ జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని అల్బ్లాస్ తెలుసుకున్నారు. తినడం, టీవీ చూడడం వంటివాటి గురించి ప్రత్యేక సమాచారం ఏమీ సేకరించలేదు.

ప్రజలు తినడం, టీవీ చూడడంపై పరిశోధకులు ల్యాబ్‌లో అధ్యయనం చేస్తారు. అయితే సాధారణంగా మనం టీవీ చూస్తున్నామంటే ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నట్టు. ఇలాంటి పరిస్థితులను ల్యాబ్‌లో తిరిగి సృష్టించడం చాలా కష్టమైన విషయం.

‘‘అలాగే నేరుగా గమనించే విధానాలు కూడా ప్రవర్తనలో మార్పులు తెస్తాయి. మనల్ని ఎవరో గమనిస్తున్నారన్న విషయం తెలిసినప్పుడు అధ్యయనంలో పాల్గొనేవారు తమ ఆహారపు అలవాట్లను మార్చుకుంటారు.’’ అని రాబర్ చెప్పారు.

నిజంగా రోజువారీ జీవితంలో ఎలా ఉంటారనే విషయం తెలుసుకోవడానికి మరింత పరిశోధన జరగాల్సిన అవసరముంది. ఎందుకంటే, మన ఆహారపు అలవాట్లు, ఆహారం తీసుకునే విధానం, వాటిపై ప్రభావం చూపే పరిస్థితులు చాలా క్లిష్టమైనవన్నది అల్బ్లాస్ వాదన.

‘‘మనం తీసుకునే ఆహారాన్ని టీవీ ప్రభావితం చేస్తుందని మనకు కొన్ని విషయాల ద్వారా తెలుసు. ఈ విషయాన్ని మరింత బాగా అర్ధం చేసుకోవడానికి ఉన్న చాలా మార్గాలు మనకు తెలియకపోవచ్చు’’ అని ఆమె చెప్పారు.

ఆహారం

ఫొటో సోర్స్, Getty Images

మనం తీసుకునే ఆహారంపై టీవీ ప్రభావం ఎంత ఉంటుందనేది... మనం టీవీలో ఏం చూస్తున్నామనేదానితో పాటు అనేక విషయాలపై ఆధారపడి ఉంటుందని స్టీవెన్‌సన్ చెప్పారు. అది మన మూడ్‌ను మార్చివేయడంతో పాటు మనం ఏం చేస్తున్నామో గ్రహించలేనివిధంగా ప్రభావం చూపిస్తుంది. మనం టీవీ చూస్తున్నప్పుడు...స్క్రీన్ మీద ఎవరన్నా తింటూ కనిపిస్తే, మనం కూడా వారితో కలిసి తినాలన్న అభిప్రాయంలోకి వెళ్లిపోతాం. అలాగే టీవీలోని కార్యక్రమాల స్వభావం కూడా మనం తీసుకునే ఆహారంపై పడుతుంది. ఓ అధ్యయనం ప్రకారం టీవీలో మనం ఒక ఇంటర్వ్యూ చూస్తున్నప్పటితో పోలిస్తే, యాక్షన్ సినిమాలు చూస్తున్నప్పుడు ఎక్కువ ఆహారం తీసుకుంటాం.

అలాగే మన దగ్గర ఎలాంటి ఆహారం ఉంది? అదెంత రుచిగా ఉంది? ఆహారం విషయంలో మనమెంత ఆసక్తిగా ఉన్నాం? అన్నవి కూడా చాలా ముఖ్యం.

అలాగే పరధ్యానం కూడా చాలా క్లిష్టమైన అంశం. మనం తినేటప్పుడు చేసే ఇతర పనులతో పోలిస్తే...

టీవీ చూడడం మనకు అంత పరధ్యానం కలిగించకపోవచ్చు... దీనివల్ల మనం ఎక్కువ ఆహారం తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు. కొన్ని అధ్యయనాలపై జరిగిన విశ్లేషణ గమనిస్తే... చదివేటప్పుడు, వీడియో గేమ్స్ ఆడేటప్పుడు, స్నేహితులతో కలిసి తినేటప్పుడితో పోలిస్తే, టీవీ చూస్తున్నప్పుడు మనం ఎక్కువగా తింటామనడానికి అంతగా ఆధారాలు కనిపించలేదని తేలింది.

మన ఆహారపు అలవాట్లు చాలా క్లిష్టమైనవి.. వాటిని పూర్తిస్థాయిలో గమనించడం దాదాపు అసాధ్యమని పరిశోధనలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే..ప్రాసెస్ చేసిన, అధిక కొవ్వు, అధిక ఉప్పు ఉండే ఆహారం కన్నా ఇంకా ఎక్కువే టీవీ డిన్నర్‌లో ఉంటాయి. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని భావించి మీరు కూర్చున్నప్పుడు.. రిమోట్ కంట్రోల్ కోసం ఆ అభిప్రాయాన్ని పక్కనపెడుతున్నారా అన్న విషయాన్ని గమనించుకోవాలి.

(బీబీసీ కోసం కలెక్టివ్‌ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)