వర్షంలో బైక్‌పై వెళ్తున్న యువతిని వేధించినందుకు 16 మంది అరెస్ట్, పోలీస్ ఔట్‌పోస్ట్ సిబ్బంది మొత్తం సస్పెండ్.. అసలేం జరిగింది?

ఉత్తరప్రదేశ్

ఫొటో సోర్స్, SOCIALMEDIA

ఫొటో క్యాప్షన్, సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో బైక్‌పై వెళ్తున్న యువకుడు, యువతిపై నీళ్లు చల్లుతూ అనుచితంగా ప్రవర్తిస్తున్న అల్లరిమూక
    • రచయిత, సయ్యద్ మోజిజ్ ఇమాం
    • హోదా, బీబీసీ ప్రతినిధి

లఖ్‌నవూలోని గోమతి నగర్ ప్రాంతంలో, భారీ వర్షం కారణంగా నిలిచిపోయిన వర్షపు నీటిలో బైక్‌పై వెళ్తున్న యువకుడితో పాటు వెనుక కూర్చుతో యువతితో అక్కడున్న కొందరు అనుచితంగా ప్రవర్తించారు. ఈ ఘటనలో ఇప్పటివరకూ 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

బైక్‌పై వెళ్తున్న వారితో అనుచితంగా ప్రవర్తిస్తున్న ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతల అంశంపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పోలీసులపై ప్రశ్నలు లేవనెత్తాయి.

ఈ ఘటనలో అరెస్టైన నిందితుల్లో ఇద్దరి పేర్లను మాత్రమే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రస్తావించడాన్ని ప్రతిపక్ష పార్టీ తప్పుబట్టింది. ఇందులో కూడా సీఎం రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించింది.

బీబీసీ న్యూస్ తెలుగు

అన్నివైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం డీసీపీ, ఏడీసీపీ, ఏసీపీలను బదిలీ చేసింది. ఎస్‌హెచ్‌వో, అవుట్‌పోస్ట్ ఇన్‌చార్జి సహా పలువురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసింది.

నేరస్తులపై ఎలాంటి కనికరమూ ఉండదని యోగి ప్రభుత్వం పేర్కొంది.

సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పవన్ యాదవ్, సునీల్ కుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు. అదనపు సమాచారం మేరకు అర్బాజ్, విరాజ్ సాహులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో సంబంధమున్న ఇతరుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అయితే, ఈ కేసులో బాధితులైన యువతీ, యువకులు ఇంతవరకూ ఫిర్యాదు చేసేందుకు ముందుకురాలేదు.

డింపుల్ యాదవ్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, నిందితులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఎంపీ డింపుల్ యాదవ్ డిమాండ్ చేశారు

అసలేం జరిగింది?

లఖ్‌నవూలో బుధవారం కొన్ని గంటల పాటు వర్షం కురవడంతో నగరంలోని చాలా ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయి.

తాజ్‌ హోటల్ సమీపంలోని బ్రిడ్జి దగ్గర భారీగా నిలిచిపోయిన వర్షపు నీటిలో డజను మందికి పైగా ఆకతాయిలు చేరారు. అదే సమయంలో, బైక్‌పై అటుగా వెళ్తున్న యువతీయువకులపై అక్కడున్న ఆకతాయిలు నీళ్లు చల్లుతూ, బైక్‌ని వెనక్కి లాగడంతో బైక్ నీళ్లలో పడిపోయింది. వెనక కూర్చున్న యువతి నీళ్లలో పడిపోయారు.

నిలిచిన వర్షపు నీటిని వారిపై చల్లుతూ, వేధింపులకు పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అదే రోజు రాత్రిలోపే అక్కడున్న వారిలో చాలా మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత ఆరాధన మిశ్రా మోనా అసెంబ్లీలో లేవనెత్తారు. దీనికి స్పందిస్తూ, నేరస్తులపై ఎలాంటి కనికరం చూపడం లేదని యోగి ప్రభుత్వం తెలిపింది.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో మాట్లాడుతూ, ''గోమతి నగర్‌ ఘటనకు బాధ్యత తీసుకుంటాం. వాళ్లలో మొదటి నిందితుడు పవన్ యాదవ్, రెండో నిందితుడు మహమ్మద్ అర్బాజ్. వాళ్లు చాలా మంచోళ్లు.. వాళ్ల కోసం మామూలు ట్రైన్ కాదు, బుల్లెట్ ట్రైన్ నడుస్తుంది. మేం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నాం. పోలీసు అవుట్‌పోస్టులోని సిబ్బంది మొత్తాన్ని సస్పెండ్ చేశాం. వాళ్లపై చర్యలు తీసుకుంటాం'' అన్నారు.

ఈ విషయాన్ని ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ కూడా సీరియస్‌గా తీసుకుంది. ఆ పార్టీ అధికార ప్రతినిధి ఫక్రుల్ హసన్ బీబీసీతో మాట్లాడుతూ, ''నేరాన్ని నేరంగానే చూడాలి, అందులో మతం, కులం కోణం అవసరం లేదు. ముఖ్యమంత్రి ఇద్దరు నిందితుల పేర్లను మాత్రమే చెప్పారు, మిగిలిన వారి పేర్లు చెప్పలేదు. ఎవరైనా తప్పు చేసి ఉంటే, వారు ఏ వర్గానికి చెందినవారనే విషయంతో సంబంధం లేకుండా వారిపై చర్యలు తీసుకోవాలనేదే మా పార్టీ ఉద్దేశం.''

దీనిపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ భార్య, ఎంపీ డింపుల్ యాదవ్ కూడా స్పందించారు. ఆమె ఏఎన్‌ఐతో మాట్లాడుతూ, ''ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వీడియో రికార్డింగ్ కూడా ఉంది కాబట్టి నిందితులను గుర్తించడం కూడా సులభం'' అన్నారు.

ఉత్తరప్రదేశ్

ఫొటో సోర్స్, SOCIALMEDIA

ఫొటో క్యాప్షన్, అల్లరిమూక అనుచిత ప్రవర్తనతో బైక్‌పై వెళ్తున్న యువతి నీళ్లలో పడిపోయారు

ముందుకురాని బాధితురాలు

గోమతి నగర్ పోలీసులు గురువారం మధ్యాహ్నం వరకూ ప్రయత్నించినప్పటికీ బాధితుల వివరాలు తెలియలేదు. సీసీటీవీలో బైక్ నంబర్ రికార్డ్ కాకపోవడంతో వారి ఆచూకీ తెలియలేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో స్థానిక సబ్ ఇన్‌స్పెక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

బీబీసీ బృందం గోమతి నగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న సమయంలో అక్కడ కొందరు నిందితుల కుటుంబ సభ్యులు కలిశారు. తమ పిల్లలను ఇందులో ఇరికిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

అయితే, తాము అరెస్టు చేసిన వారు సీసీటీవీ ఫుటేజీలో ఉన్నారని, ఆ ఫుటేజీ ఆధారంగానే చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు చెప్పారు.

లఖ్‌నవూ పోలీస్ ప్రతినిధి, డీసీసీ రవీనా త్యాగి మీడియాతో మాట్లాడుతూ, ''సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇంకొంతమందిని గుర్తించాం. ఈ కేసులో మూడు పోలీస్ బృందాలు పనిచేస్తున్నాయి'' అని చెప్పారు.

సామాజిక కార్యకర్త రూప్‌రేఖ వర్మ మాట్లాడుతూ, ''లఖ్‌నవూలో గతంలో ఇలాంటి పరిస్థితి లేదు. కానీ, రౌడీలను కీర్తిస్తున్న తీరు మొత్తం వాతావరణాన్ని దెబ్బతీస్తోంది. పోలీసులు మొదట్లో హడావిడి చేస్తారు, ఆ తర్వాత ఏమీ ఉండదు. అందుకే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు'' అని అన్నారు.

''పోలీసులంటే భయం లేదని ఈ ఘటనతో అర్థమవుతోంది. ఈ బైక్ ఘటన అయినా.. కావడియాలు (కావడి యాత్ర చేసేవారు, ఉత్తరాదిన కన్వరియగా వ్యవహరిస్తారు) జనాన్ని, ఆఖరికి పోలీసులను కూడా కొట్టిన సంఘటన కావొచ్చు. అల్లరిమూకలకు భయం లేదనడానికి నిదర్శనం'' అని మరో సామాజిక కార్యకర్త, మాజీ పోలీసు అధికారి అయిన ఎస్ఆర్ దారాపురి అన్నారు.

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) డేటా ప్రకారం, 2022లో మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి దాదాపు 4 లక్షల 45 వేల కేసులు నమోదయ్యాయి. అంటే, గంటకు 51 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. 2021లో ఈ సంఖ్య 4,28,278. మొత్తం కేసుల్లో దాదాపు 19 శాతం వేధింపుల కేసులు కాగా, 7 శాతం రేప్ కేసులు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)