పారిస్ ఒలింపిక్స్: 46 సెకన్లలోనే ఇటలీ బాక్సర్ బౌట్ నుంచి తప్పుకుని ఎందుకు ఏడ్చారు? అసలేమైంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కేటీ ఫాకింగ్‌హామ్
- హోదా, పారిస్ నుంచి బీబీసీ ప్రతినిధి
పారిస్ ఒలింపిక్స్‌లో ఇటలీకి చెందిన బాక్సర్ ఏంజెలా కరిని కేవలం 46 సెకన్లలోనే తన ప్రత్యర్థి అల్జీరియా బాక్సర్ ఇమేన్ ఖెలిఫ్‌తో పోటీ నుంచి నిష్క్రమించారు.
బౌట్‌ను వదిలేసిన ఏంజెలా, ‘‘నా ప్రాణాలను కాపాడుకోవాల్సి ఉంది’’ అని అన్నారు.
పారిస్‌లో మహిళల బాక్సింగ్‌లో పోటీ చేసేందుకు చోటు దక్కించుకున్న ఇద్దరు అథ్లెట్స్‌లో ఖెలిఫ్ ఒకరు. కానీ, గత ఏడాది జరిగిన మహిళల వరల్డ్ చాంపియన్‌షిప్‌లో అర్హతా ప్రమాణాలను అందుకోకపోవడంతో ఖెలిఫ్ అనర్హతకు గురయ్యారు.
ఖెలిఫ్‌లో టెస్టోస్టెరాన్ స్థాయిలు ఎక్కువగా ఉండటంతో భారత్‌లో జరిగిన పోటీల్లో అనర్హతకు గురయ్యారని ప్రస్తుతం పారిస్ 2024 ఒలింపిక్స్ నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) చెప్పింది.

46 సెకన్ల బౌట్‌లో అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, Getty Images
తొలి 30 సెకన్లలో ఏంజెలా కరిని తన ముఖంపై బలమైన పంచ్‌ను ఎదుర్కొన్నారు.
ఈ తర్వాత తన హెడ్‌గేర్‌ను సవరించుకునేందుకు కార్నర్‌లో ఉన్న కోచ్ వద్దకు వెళ్లారు.
ఆ తర్వాత పోటీ ప్రారంభించినప్పటికీ, తిరిగి మరోసారి కోచ్ వద్దకు వచ్చేసి, ఫైట్‌ను ఆపేశారు.
ఖెలిఫ్ గెలిచినట్లు రిఫరీ ఆమె చేతిని పైకి ఎత్తగానే, ‘‘ఇది సరైంది కాదు’’ అని కరిని అంటున్నట్లు కెమెరాలో కనిపించింది.
రింగ్‌లోనే కరిని కన్నీళ్లు పెట్టుకున్నారు. బౌట్ తర్వాత ఆమె మీడియా ముందుకు వచ్చారు.
‘‘నేను మ్యాచ్‌ను ముగించలేకపోయాను. నా ముక్కుకు గట్టి దెబ్బ తాకినట్లు నొప్పి వచ్చింది. దీన్ని భరించిన తర్వాత నాకు నేను చెప్పుకున్నా. ఓ పరిణతి చెందిన బాక్సర్‌గా పోటీని ఆపేయాలనుకున్నా. నా దేశం, మా నాన్న ఈ నిర్ణయాన్ని తప్పుగా భావించరని ఆశిస్తున్నాను. బౌట్‌ను ఆపేశా. నా కోసం నేను ఆగిపోయాను’’ అని బీబీసీ స్పోర్ట్‌కు తెలిపారు ఏంజెలా కెరినీ.
‘‘ఇది జీవితకాలపు మ్యాచ్ కావొచ్చు. కానీ, ఈ క్షణంలో నా ప్రాణాన్ని నేను కాపాడుకోవాల్సి ఉంది’’ అని అన్నారు.
‘‘నాకెలాంటి భయం లేదు. రింగ్‌లో నాకు భయం లేదు. దెబ్బలు తినేందుకు నేను భయపడను. కానీ, ప్రతిదానికి ఒక ముగింపు ఉంటుంది. ఈ మ్యాచ్‌ని కొనసాగించలేకపోయాను. అందుకే, ముగించాలనుకున్నా..’’ అని చెప్పారు.
‘‘నా దృష్టిలో ఇదసలు పోటీనే కాదు’’ అని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని అన్నారు.
‘‘ఆమె చివరి వరకు కొనసాగాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా’’ అని ఖెలిఫ్ గురించి కరిని రిపోర్టర్లతో అన్నారు. ఎవరినీ జడ్జి చేసేందుకు తానిక్కడికి రాలేదని, తాను జడ్జిమెంట్లు ఇవ్వడం లేదని కరిని చెప్పారు.
ఖెలిఫ్ తన కెరీర్‌లో 9 సార్లు మాత్రమే ఓడిపోయారు. ఆమె ఇప్పటివరకు 50 ఫైట్లలో తలపడ్డారు.
‘‘నేను బంగారు పతకం సాధించేందుకు ఇక్కడికి వచ్చాను. ప్రతి ఒక్కరితోనూ ఫైట్ చేస్తా’’ అని ఖెలిఫ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఖెలిఫ్‌పై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని అల్జీరియా ఒలింపిక్ కమిటీ వ్యాఖ్యానించింది.
గత ఏడాది వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో జెండర్ ఎలిజిబులిటీ టెస్ట్‌లో విఫలమై కాంస్య పతకాన్ని చేజార్చుకున్న తైవాన్‌కు చెందిన లిన్ యు-టింగ్ కూడా పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు.
పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న బాక్సర్లందరూ అర్హులేనని ఐఓసీ చెప్పింది.
‘‘ఎన్నో ఏళ్లుగా ఈ అథ్లెట్లు పోటీ పడుతున్నారు. అకస్మాత్తుగా వీరు పోటీలకు రాలేదు. టోక్యో ఒలింపిక్స్‌లో కూడా పాల్గొన్నారు’’ అని ఐఓసీ అధికార ప్రతినిధి మార్క్ ఆడమ్స్ అన్నారు.
‘తగిన చర్యలు తీసుకున్నాం’ – ఐబీఏ చీఫ్
ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ (ఐబీఏ) నిర్వహించిన 2023 వరల్డ్ చాంపియన్‌షిప్స్ నుంచి ఖెలిఫ్, లిన్ అనర్హతకు గురయ్యారు.
అత్యంత పారదర్శకత, సమగ్రతకు కట్టుబడి వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొనకుండా ఈ ఇద్దరిపై అనర్హతా వేటు వేశామని ఐబీఏ చెప్పింది.
‘వారు టెస్టోస్టెరాన్ పరీక్షలు చేయించుకోలేదు. ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. కానీ అవన్నీ గోప్యంగా ఉన్నాయి’ అని ఐబీఏ పేర్కొంది.
‘‘ఈ పరీక్షల ఫలితాలు అర్హతా ప్రమాణాలకు తగినట్లు లేవు. ఇతర మహిళా పోటీదారులతో పోలిస్తే, వీరికి అదనపు అనుకూలతలు ఉన్నాయి’’ అని ఐబీఏ పేర్కొంది. అయితే, అర్హతా పరీక్షలు ఏంటన్నది బీబీసీ ఇంకా కనుగొనలేదు.
2022 ఇస్తాంబుల్‌లో, ఆ తర్వాత 2023లో వరల్డ్ చాంపియన్‌షిప్స్ కోసం ఈ ఇద్దరికి పరీక్షలు నిర్వహించారు.
లిన్ తనపై వేసిన అనర్హతపై క్రీడలకు చెందిన ఆర్బిట్రేషన్ కోర్టులో అప్పీల్ చేయలేదని, కానీ ఖెలిఫ్ అప్పీల్‌కు వెళ్లి, ఆ తర్వాత దాన్ని విత్‌డ్రా చేసుకున్నట్టు ఐబీఏ చెప్పింది.
తమ మెడికల్ కమిటీ ఎత్తిచూపిన అంశాలతో ఈ ఇద్దర్నీ నిషేధించామని ఐబీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్రిస్ రోబర్ట్స్ గురువారం బీబీసీ స్పోర్ట్‌తో చెప్పారు.
తమ బాక్సింగ్ కుటుంబం కోసం సరైన, తగిన చర్యలు తీసుకున్నామని చెప్పారు.
వారు మహిళలతో పోటీ పడేందుకు అర్హులు కాదని తేలిందన్నారు. ఇది ‘సెక్స్ టెస్ట్’తో సమానమా? అని అడిగినప్పుడు, ‘‘అవును..’’ అని రాబర్ట్స్ అన్నారు.
అర్హతా ప్రమాణాల పరీక్షల్లో ఒక బాక్సర్ మరొకరి కంటే ఎక్కువగా బలంగా ఉన్నట్లు స్పష్టంగా తెలిసినప్పుడు, వారిని అనుమతించకూడదని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఐబీఏ నిర్ణయంపై ఐఓసీ విమర్శలు
పారిస్ 2024 బాక్సింగ్ యూనిట్, ఐఓసీలు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏబీఏ నిర్ణయం ఏకపక్షంగా ఉందని, హఠాత్తుగా ఖెలిఫ్, లిన్‌లు బాధితులుగా మారిపోయారని ఐబీఏను విమర్శించాయి.
‘‘2023లో ఐబీఏ వరల్డ్ చాంపియన్‌షిప్స్ ముగింపుకు చేరుకుంటున్న సమయంలో, ఎలాంటి ముందస్తు ప్రక్రియ లేకుండానే వారిద్దరిపై హఠాత్తుగా వేటు వేసింది’’ అని ఐఓసీ పేర్కొంది.
ఈ ఇద్దరు అథ్లెట్లు ఎన్నో ఏళ్లుగా ఉన్నత స్థాయి పోటీల్లో పాల్గొంటున్నారని పేర్కొంది.
ఎలాంటి సరైన ప్రక్రియ లేకుండానే ఏకపక్ష నిర్ణయంతో ఈ ఇద్దరు అథ్లెట్లను పోటీలకు దూరం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
హంగేరి బాక్సర్‌తో తలపడనున్న ఖెలిఫ్
శనివారం రోజు 66 కేజీల క్వార్టర్ ఫైనల్స్‌లో హంగేరికి చెందిన అన్నా లుకా హమోరితో పోటీపడనున్న ఖెలిఫ్ మరో విజయం సాధిస్తే ఒలింపిక్ మెడల్ ఖాయం.
‘‘ఏం జరిగినా వెనక్కి తగ్గొద్దు, మధ్యలో వదిలేయకూడదనేది నా వ్యక్తిత్వం లేదా మనస్తత్వం’’ అని హంగేరి బాక్సర్ హమోరి అన్నారు.
‘‘ఏంజెలా కెరినీ వైదొలగడం అది ఆమె ఇష్టం. చివరి వరకు పోరాడతాను అని నేను వాగ్దానం చేస్తున్నా. ఏం జరుగుతుందో చూద్దాం’’ అని చెప్పారు. ‘‘నిజమేంటో నాకు తెలియదు. నాకవసరం లేదు. నేను కేవలం గెలవాలనుకుంటున్నా’’ అని హమోరి అన్నారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















