పారిస్ ఒలింపిక్స్ 2024: మను భాకర్‌లో స్ఫూర్తి నింపిన ఆ టాటూ ఏంటో తెలుసా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సౌరభ్ దుగ్గల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత షూటర్ మను భాకర్ మెడ వెనుక భాగంలో ‘‘స్టిల్ ఐ రైజ్’’ అనే టాటూ ఉంటుంది.
ఎలాంటి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోకుండా, తనలో తాను స్ఫూర్తిని నింపుకునే ఉద్దేశంతో ఆమె ఈ టాటూను వేయించుకున్నారు.
2020 టోక్యో ఒలింపిక్స్ ఆమెకు చేదు జ్ఞాపకంగా మిగిలాయి. అప్పుడు దురదృష్టవశాత్తూ గన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆమె ఫైనల్‌కు కూడా చేరుకోలేకపోయారు.
ఇప్పుడు, పారిస్ ఒలింపిక్స్‌లో మను భాకర్ చరిత్ర లిఖించారు. మహిళల 10మీ. ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్యం గెలిచి భారత్‌కు తొలి పతకం అందించారు.
ఒలింపిక్ మెడల్ అందుకున్న భారత తొలి మహిళా షూటర్‌గా ఆమె రికార్డు నెలకొల్పారు.
‘‘స్టిల్ ఐ రైజ్’’ అనే కవితను పౌర హక్కుల కార్యకర్త, అమెరికా కవి మాయా ఆంజెలు రాశారు.
‘‘క్రీడాకారుల జీవితంలో విజయాలు, వైఫల్యాలు ఒక భాగం. కానీ, అపజయాలను ఏ విధంగా తీసుకుంటాం? వైఫల్యాల నుంచి తిరిగి ఎలా పుంజుకుంటామనేది చాలా ముఖ్యం’’ అని మను భాకర్ అన్నారు.
‘‘స్టిల్ ఐ రైజ్ అనేవి కేవలం పదాలు కావు. మీరు వైఫల్యాలను ఎదుర్కొంటున్నప్పటికీ మీ విలువను చాటే నినాదం ఇది. ఈ పదాలే నాకు గొప్ప ప్రేరణ, దృఢ సంకల్పాన్ని అందిస్తాయి. ఎన్నికష్టాలు, ఎలాంటి వైఫల్యాలు ఎదురైనా వాటన్నింటినీ దాటి నేను పైకి లేస్తాననే ఆత్మవిశ్వాసాన్ని నాకు కలిగిస్తాయి’’ అని ఛండీగఢ్‌లో ఆర్యన్ మాన్ ఫౌండేషన్‌కు సంబంధించిన ఒక కార్యక్రమంలో మను చెప్పారు.
2023లో చండీగఢ్‌లో జరిగిన ఈ ప్రైవేట్ కార్యక్రమంలో బీబీసీ పంజాబీ స్పోర్ట్స్ ప్రతినిధి సౌరభ్ దుగ్గల్, మను భాకర్‌తో మాట్లాడారు. అప్పుడే తన టాటూ గురించి, టోక్యో ఒలింపిక్స్‌లో ఎదురైన నిరాశ గురించి ముచ్చటించారు. ఈ టాటూ స్ఫూర్తిగా పారిస్‌లో కాంస్యం నెగ్గిన మను మరో రెండు పతకాలపై కన్నేశారు.
16 ఏళ్ల వయసులో కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం గెలిచిన అతిపిన్న భారత క్రీడాకారిణిగా మను భాకర్ రికార్డు నెలకొల్పారు. 2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో మను భాకర్ మహిళల 10మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో స్వర్ణాన్ని గెలిచారు.
టీనేజీ షూటింగ్ సంచలనంగా పేరు తెచ్చుకున్న ఈ హరియాణా షూటర్, టోక్యో ఒలింపిక్స్‌కు ముందు అన్ని వరల్డ్ కప్‌లలో కలిపి 9 స్వర్ణాలు, 2 రజతాలు కైవసం చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వరల్డ్ కప్‌లలో ఆమె ఫామ్‌ను చూసి టోక్యోలో మను కచ్చితంగా పతకం సాధిస్తుందని అందరూ భావించారు. కానీ, ఆ అంచనాలను ఆమె అందుకోలేకపోయారు.
టోక్యోలో పోటీపడిన మూడు షూటింగ్ ఈవెంట్‌లలోనూ కనీసం ఆమె ఫైనల్‌కు చేరుకోలేకపోయారు.
టోక్యో ఒలింపిక్స్‌లో నిరాశజనక ప్రదర్శన తర్వాత మను చాలా విమర్శల్ని ఎదుర్కొన్నారు. చివరకు షూటింగ్ 10మీ. ఎయిర్ పిస్టల్ జాతీయ జట్టులోనూ ఆమె స్థానం కోల్పోయారు.
టోక్యో ఒలింపిక్స్ తర్వాత ఆడిన వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో ఆమె ఓవరాల్‌గా మూడు పతకాలే గెలిచారు. అందులో ఒకటి వ్యక్తిగత ఈవెంట్‌లో రాగా, మిగతా రెండు టీమ్ కేటగిరీలో వచ్చాయి. టోక్యోకు ముందు వరల్డ్ కప్ టోర్నీల్లో ఆమె ఖాతాలో 11 పతకాలు ఉన్నాయి.
‘‘వైఫల్యం ఎదురయ్యాక, మళ్లీ గొప్ప విజయాన్ని అందుకోవడానికి చేసే శ్రమలో ఎక్కడా వెనక్కి తగ్గకూడదు, నిరంతరం కృషి చేస్తూనే ఉండాలి. విజయాల బాట పట్టడానికి ఇదొక్కటే మార్గం’’ అని తన క్రీడా కెరీర్‌లో ఎదురైన ఎత్తుపల్లాల గురించి వివరిస్తూ ఆమె అన్నారు.

పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యాన్ని అందుకున్నాక, ఇప్పుడామె 25మీ. పిస్టల్ ఈవెంట్, 10మీ. ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లోనూ పతకాలు సాధించడంపై దృష్టి పెట్టారు.
‘‘టోక్యో ఒలింపిక్స్ తర్వాత రోజులు భారంగా గడిచాయి. అక్కడ జరిగిన దాన్నుంచి బయటపడేందుకు చాలా కష్టపడ్డాను. కానీ, మళ్లీ నేను ఫామ్‌లోకి వస్తానని, తిరిగి పుంజుకుంటాననే సంగతి నాకు తెలుసు. ‘స్టిల్ ఐ రైజ్’’ అనే పదాల్లోని సారాంశాన్ని నా షూటింగ్ కెరీర్‌కు ఆపాదించాను. ఆ పదాలు నాకు గొప్ప ప్రేరణగా నిలిచాయి. అందుకే వాటిని టాటూగా వేసుకున్నా’’ అని మను చెప్పారు.

‘‘స్టిల్ ఐ రైజ్ అనే పదాలను టాటూగా వేసుకోవాలని నేను ఎప్పటినుంచో అనుకుంటున్నా. తాత్కాలికంగా కాకుండా ఎప్పటికి ఉండిపోయేలా టాటూ వేసుకోవాలి అనుకున్నా.
అందుకే బాగా ఆలోచించి, బయటకు ఎక్కువగా కనిపించే ప్రదేశంలో కాకుండా తక్కువగా కనిపించే ప్రదేశంలో టాటూ ఉండాలని నిర్ణయించుకున్నా.
ఎందుకంటే తరచుగా చూస్తుంటే దాని ప్రాముఖ్యత తగ్గిపోతుందనిపించింది. అందుకే మెడమీద వేసుకున్నా. 2022 డిసెంబర్‌లో ఈ టాటూను వేయించుకున్నా.
నేను చెప్పేదేంటంటే, టోక్యో అనేది గతం, దాన్నుంచి నేను పైకి ఎదుగుతాను’’ అని మను వివరించారు.
BBC ISWOTY ఎమర్జింగ్ వుమన్ ప్లేయర్ అవార్డు
2021లో బీబీసీ ప్రదానం చేసిన ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాల్లో మను భాకర్ ‘ఎమర్జింగ్ వుమన్ ప్లేయర్- 2020’ అవార్డును అందుకున్నారు.
దేశం కోసం మరిన్ని పతకాలు సాధించేందుకు బీబీసీ అవార్డు ప్రేరణ ఇస్తుందని అప్పుడు ఆమె అన్నారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















