పారిస్ ఒలింపిక్స్ 2024: భారత క్రీడాకారులు ఎవరెవరు పాల్గొంటున్నారు? వారి పోటీలు ఎప్పుడెప్పుడు?

ఫొటో సోర్స్, Getty Images
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు ఒలింపిక్స్ జరగనున్నాయి.
పారిస్‌తో పాటు ఫ్రాన్స్‌లోని మరో 16 నగరాల్లో ఈ క్రీడలను నిర్వహిస్తున్నారు.
సుమారు 10,500 అథ్లెట్లు ఈ క్రీడలలో పాల్గొంటుండగా, 32 క్రీడలకు సంబంధించిన 329 ఈవెంట్లు నిర్వహిస్తున్నారు.
భారత్‌కు చెందిన 100 మందికి పైగా అథ్లెట్లు వివిధ క్రీడాంశాలలో పతకాల కోసం పోటీ పడనున్నారు.
ప్రధానంగా జావెలిన్ త్రో, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, షూటింగ్, హాకీ, బాక్సింగ్ విభాగాల్లో భారత్ పతకాలపై ఆశలు పెట్టుకుంది.
భారత అథ్లెట్‌ల పోటీలు ఎప్పుడు జరుగుతాయంటే...


ఫొటో సోర్స్, Getty Images
జావెలిన్ త్రో
2020 టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించారు. టోక్యోలో నీరజ్ 87.58 మీటర్ల దూరం విసిరి ఈ పతకాన్ని సాధించారు.
అథ్లెటిక్స్‌లో భారత్‌కు అదే తొలి ఒలింపిక్ పతకం. అలాగే వ్యక్తిగత ఈవెంట్లలో భారత్‌కు అది రెండో బంగారు పతకం. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో అభినవ్ బింద్రా షూటింగ్‌లో భారత్‌కు తొలి వ్యక్తిగత స్వర్ణ పతకాన్ని అందించారు.
ఈసారీ నీరజ్ చోప్రాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది భారత్. ఆయనతో పాటు జెనా, అన్నూ రాణి జావెలిన్ త్రోలో పాల్గొంటున్నారు. పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫైయింగ్ రౌండ్ ఆగస్టు 6న జరగనుంది.
మహిళల జావెలిన్ త్రో క్వాలిఫైయింగ్ రౌండ్ ఆగస్టు 7న జరగనుంది.ఇందులో అన్నూ రాణి పాల్గొంటున్నారు.
పురుషుల జావెలిన్ త్రో పోటీల ఫైనల్ ఆగస్టు 8న జరగనుండగా, మహిళల జావెలిన్ త్రో ఫైనల్ ఆగస్టు 10న జరుగుతుంది.
నడక పోటీలు
మహిళల్లో ప్రియాంక గోస్వామి, పురుషుల్లో అక్షదీప్ సింగ్, వికాస్ సింగ్, పరంజిత్ బిష్త్, రామ్ బాబు 20 కిలోమీటర్ల నడక పోటీలలో పాల్గొంటున్నారు.
ఈ పోటీలు ఆగస్టు 1న ఉంటాయి.
రిలే రేసు
మహిళలు, పురుషుల 4 X 400 మీటర్ల రిలే రేసు క్వాలిఫైయింగ్ రౌండ్లు ఆగస్టు 9న జరుగుతాయి.
పురుషుల జట్టులో ముహమ్మద్ అనాస్, ముహమ్మద్ అజ్మల్, రాజీవ్ అరోకియా, అమోజ్ జాకబ్‌లు పాల్గొంటుండగా, మహిళల జట్టులో జ్యోతిక శ్రీ దండి, రూపల్ చౌధరి, శుభా వెంకటేశన్, ఎంఆర్ పూవమ్మ పాల్గొంటారు.
ఈ ఫైనల్స్ ఆగస్టు 10న జరుగుతాయి.

ఫొటో సోర్స్, Getty Images
వెయిట్ లిఫ్టింగ్
49 కేజీల వెయిట్ లిఫ్టింగ్‌లో పతకం కోసం మీరాబాయి చాను పోటీ పడుతున్నారు.
టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె 201 కిలోల బరువు ఎత్తి రజత పతకాన్ని సాధించారు.
ఈ మ్యాచ్ ఆగస్టు 7న ఉంటుంది.
బ్యాడ్మింటన్
బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత్ తరపున స్టార్ ప్లేయర్ పీవీ సింధు బరిలోకి దిగనున్నారు.
సింధు 2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించారు.
పురుషుల సింగిల్స్‌లో భారత్ తరఫున ఎస్‌ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్ బరిలోకి దిగనున్నారు.

ఫొటో సోర్స్, VINESH PHOGAT@TWITTER
రెజ్లింగ్
రెజ్లింగ్‌లో భారత్ నుంచి మహిళల విభాగంలో అంతిమ్ పంఘల్ (53 కేజీలు), వినేశ్ ఫోగట్ (50 కేజీలు), అన్షు మాలిక్ (57 కేజీలు), రితికా హుడా (76 కేజీలు), నిషా దహియా (68 కేజీలు) పాల్గొంటారు.
పురుషుల విభాగంలో అమన్ సెహ్రావత్ 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో భారత్ తరఫున పాల్గొననున్నారు. ఈ మ్యాచ్‌లు ఆగస్టు 5 నుంచి 11 తేదీల మధ్య జరుగుతాయి.
హాకీ
భారత మహిళల హాకీ జట్టు ఒలింపిక్స్‌లో పాల్గొనడం లేదు. పురుషుల హాకీ జట్టు పూల్-బిలో ఉంది.
జులై 27న న్యూజీల్యాండ్‌తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది.
జులై 29న అర్జెంటీనా, జులై 30న ఐర్లాండ్, ఆగస్టు 1న బెల్జియం, ఆగస్టు 2న ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది.
ఆగస్టు 4న క్వార్టర్ ఫైనల్స్, ఆగస్టు 6న సెమీఫైనల్, 8న హాకీ ఫైనల్ మ్యాచ్ ఉంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
బాక్సింగ్
బాక్సింగ్ మహిళల విభాగంలో భారత్ నుంచి నిఖత్ జరీన్ (50 కేజీలు), ప్రీతి పవార్ (54 కేజీలు), జాస్మిన్ లంబోరియా (57 కేజీలు), లవ్లీనా బోర్గోహెయిన్ (75 కేజీలు) పాల్గొననున్నారు.
పురుషుల విభాగంలో నిశాంత్ దేవ్ (71 కేజీలు), అమిత్ పంఘల్ (51 కేజీలు) పాల్గొంటారు. ఈ మ్యాచ్‌లు జులై 27 నుంచి జరుగుతాయి.
గోల్ఫ్
గోల్ఫ్‌లో భారత మహిళల విభాగం నుంచి అదితి అశోక్, దీక్షా దాగర్ పాల్గొంటే, పురుషుల విభాగంలో శుభాంకర్ శర్మ, గగన్‌జీత్ భుల్లర్ పాల్గొంటారు.
ఆగస్టు 1 నుంచి పురుషుల విభాగం మ్యాచ్‌లు, ఆగస్టు 7 నుంచి మహిళల విభాగం మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఈ ఈవెంట్‌లో అదితి అశోక్‌పై భారత్ ఆశలు పెట్టుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఆర్చరీ
భారత పురుషుల సింగిల్స్ విభాగంలో ధీరజ్ బొమ్మదేవర, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్, మహిళల సింగిల్స్ విభాగంలో భజన్ కౌర్, దీపికా కుమారి, అంకితా భకత్ తమ సత్తా చాటనున్నారు.
ఈ మ్యాచ్‌లు జులై 25న జరగనున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
షూటింగ్
10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ పురుషుల విభాగంలో సందీప్ సింగ్, అర్జున్ బాబుటా, మహిళల విభాగంలో ఎలావెనిల్ వాలరివన్, రమితా జిందాల్ పాల్గొంటారు. ఈ మ్యాచ్‌లు జులై 27, 28, 29 తేదీల్లో జరగనున్నాయి.
పురుషుల ట్రాప్ షూటింగ్ విభాగంలో పృథ్వీరాజ్ తొండైమాన్, మహిళల విభాగంలో రాజేశ్వరి కుమారి, శ్రేయాసి సింగ్‌లు పాల్గొననున్నారు. ఈ మ్యాచ్‌లు జులై 29, 30, 31 తేదీల్లో జరగనున్నాయి.
జులై 27, 28, 29 తేదీల్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్‌లో భారత్‌కు చెందిన సరబ్‌జోత్ సింగ్, మను భాకర్, అర్జున్ సింగ్ చీమా, రిథమ్ సాంగ్వాన్ పాల్గొంటారు.
భారతదేశానికి చెందిన స్వప్నిల్ కుసాలే, ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్, సిఫ్ట్ కౌర్ సమ్రా, అంజుమ్ మౌద్గిల్ 50 మీటర్ల రైఫిల్ షూటింగ్‌లో పాల్గొంటారు. ఈ మ్యాచ్‌లు జులై 31, ఆగస్టు 1, ఆగస్టు 2 తేదీల్లో జరుగుతాయి.
25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ షూటింగ్ విభాగంలో భారత్‌కు చెందిన అనీష్ భన్‌వాలా, విజయ్‌వీర్ సిద్ధూ పాల్గొంటారు. ఈ మ్యాచ్‌లు ఆగస్టు 4, 5 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి జరగనున్నాయి.
25 మీటర్ల పిస్టల్‌లో భారత్ తరఫున ఇషా సింగ్ పాల్గొననున్నారు. ఈ మ్యాచ్‌లు ఆగస్టు 2, 3 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి జరగనున్నాయి.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














