టీ20 వరల్డ్ కప్: క్రికెట్‌ను పెద్దగా ఇష్టపడని అమెరికాలో ఈ టోర్నీ ఎందుకు నిర్వహిస్తున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జాహ్నవి మూలే
- హోదా, బీబీసీ ప్రతినిధి
క్రికెట్ గురించి ఎప్పుడైనా ఆలోచిస్తే, కనీసం ఎవరికీ కూడా అమెరికాగానీ, అమెరికా జట్టు పేరుగానీ గుర్తుకురాదు.
కానీ, ట్వంటీ20 వరల్డ్ కప్‌లో కొన్ని మ్యాచ్‌లు ప్రస్తుతం ఆ దేశంలో నిర్వహించనున్నారు. ఎందుకు, ఎలా ఈ నిర్ణయం తీసుకున్నారు?
‘‘క్రికెట్ అనేది ఒక క్రీడగా ఉనికిలో ఉందని ఇక్కడ కొంతమందికి తెలుసు. కానీ, వారికి అది తెలియడం కూడా చాలా ఎక్కువే. మా పొరిగింటి వారితో నేను మాట్లాడాను. అన్ని క్రికెట్ మ్యాచ్‌లు వైట్ యూనిఫామ్‌లో 5 రోజుల పాటు ఆడతారని వారు అనుకుంటున్నారు’’ అని న్యూయార్క్‌కు చెందిన ఫైనాన్స్ అనలిస్ట్ ఉత్కర్ష్ అన్నారు.
టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జరిగే వేదిక తన ఆఫీసుకు దగ్గర్లోనేఉన్నట్టు ఉత్కర్ష్ చెప్పారు. తాను ఉంటున్న దేశంలో వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరగడంపై ఉత్కర్ష్ సంతోషం వ్యక్తం చేశారు. తనకెంతో ఇష్టమైన మ్యాచ్‌లను ఇప్పుడు వేళకానీ వేళల్లో(భారత్ లేదా ఇతర దేశాల్లో జరిగినప్పుడు ) చూడాల్సిన పరిస్థితి ఉండదని అన్నారు.
ఉత్కర్ష్ ఒక్కరే కాదు. చాలా మంది భారత సంతతి అమెరికన్లు, అమెరికాలోని లక్షల మంది దక్షిణాసియా, కరేబియన్ ప్రజలు ఈ టోర్నమెంట్ కోసం ఎంతో వేచిచూస్తున్నారు.
అమెరికా, వెస్టిండీస్‌లు 2024 ట్వంటీ20 వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయని 2021లో ఐసీసీ ప్రకటించినప్పుడు, చాలా మంది ఆశ్చర్యపోయారు.
ఎందుకంటే, అమెరికాలో క్రికెట్ ఆడేందుకు అవసరమైన సదుపాయాలు లేవు. బలమైన ఫస్ట్ క్లాస్ క్రికెట్ కూడా లేదు. ఎప్పుడైనా క్రికెట్ ఆడితే, ఇతర చాలా దేశాలతో పోలిస్తే ఆ దేశంలో అది తక్కువ మందికే తెలుస్తుంది.
కానీ, అమెరికాలో ఈ ఆటను నిర్వహించే పాలక సంస్థ యూఎస్ఏ క్రికెట్ ఎందుకు దీనికి దరఖాస్తు చేసుకుంది? ఐసీసీ ఎలా దీన్ని అంగీకరించింది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అయితే, ఈ నిర్ణయానికి వెనుక ఉన్న కారణాన్ని ఐసీసీ వివరించలేదు. కానీ, దీని వెనుకాల మూడు కారణాలుండొచ్చని చాలా మంది భావిస్తున్నారు.
క్రికెట్‌ను కొత్త దేశాలకు తీసుకెళ్లడం, కొత్త మార్కెట్లను అన్వేషించడం, ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడం వంటివి ఈ నిర్ణయం వెనుక ఉద్దేశం కావచ్చని భావిస్తున్నారు.
ఈ కారణాల్లో ఒకదాన్ని ఐసీసీ ఈ నిర్ణయం ద్వారా నెరవేర్చుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
క్రికెట్, ఒలింపిక్, మార్కెటింగ్
లాస్ ఏంజెల్స్ లో జరగబోయే 2028 ఒలింపిక్స్‌లో టీ20 క్రికెట్‌ను చేర్చాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ముంబయిలో 2023 అక్టోబర్‌లో నిర్వహించిన సమావేశంలో నిర్ణయించింది.
ఒలింపిక్స్‌లో క్రికెట్ ప్రవేశపెట్టడం అమెరికాలో క్రీడల అభివృద్ధికి ఒక సానుకూల అంశంగా నిర్వాహకులు భావిస్తున్నారు.
టీ 20 క్రికెట్‌కు చెందిన వేగవంతమైన ఫార్మాట్ ఎంత ఎక్కువగా ప్రాచుర్యం పొందిందో ఐఓసీ వివరించింది. యువతలో ఈ క్రీడకు బాగా క్రేజ్ ఉన్నట్టు తెలిపింది.
ప్రపంచంలో 250 కోట్ల మంది ఈ గేమ్‌ను చూస్తున్నారని లాస్ ఏంజెల్స్‌లోని ఒలింపిక్-పారాలింపిక్ గేమ్స్ స్పోర్ట్స్ డైరెక్టర్ నికోలో కాంప్రియాని చెప్పారు.
విరాట్ కోహ్లిని ఉదహరించిన ఆయన, సోషల్ మీడియాలో ఆయనకు పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్నారు.
‘‘సోషల్ మీడియాలో 34 కోట్ల మంది ఫాలోవర్లతో విరాట్ కోహ్లి ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది ఫాలో అయ్యే మూడో క్రీడాకారునిగా నిలిచాడు. లి బ్రాన్ జేమ్స్, టామ్ బ్రాడీ, టైగర్ వుడ్స్ ముగ్గురికంటే కూడా కూడా ఎక్కువ’’ అని కాంప్రియాని చెప్పారు.
సంప్రదాయంగా క్రికెట్ ఆడుతున్న దేశాలను మించి ఎదగడానికి ప్రపంచ వేదికపై క్రికెట్‌ను ప్రదర్శించడం ఎల్ఏ28, ఐఓసీ, క్రికెట్ కమ్యూనిటీల తుది విజయంగా అభివర్ణించారు.
క్రికెట్‌ను మంచి మార్కెటింగ్ అవకాశంగా స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్లు, కార్పొరేట్ కంపెనీలు, సోషల్ మీడియా అవుట్‌లెట్లు చూస్తున్నట్టు అమెరికాలో ఈ క్రీడతో అనుబంధం ఉన్నవారు చెప్పారు.
అమెరికాలో భారత్, దక్షిణాసియా ప్రజలు దీన్ని ఒక కీలకమైన విషయంగా చూస్తున్నారు.
2020-21లో అమెరికా జనాభా లెక్కల ప్రకారం, భారతీయ సంతతికి చెందిన అమెరికన్ల సంఖ్య 44 లక్షలను దాటేసింది.
అమెరికాలో దక్షిణాసియా సంతతికి చెందిన ప్రజల సంఖ్య పెరుగుతోంది. దీంతో, క్రికెట్‌పై ఆసక్తి కూడా ఎక్కువగా కనబడుతోంది.
ఇదే ఒలింపిక్ నిర్వాహకుల దృష్టిని ఆకర్షించేందుకు కారణమైంది. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చేందుకు ఐసీసీ గత కొన్నేళ్లుగా ఎన్నో రకాల చర్యలు తీసుకుంది.
చాలా దేశాలకు అసోసియేట్ మెంబర్‌షిప్‌ను ఐసీసీ ఇచ్చింది. అమెరికాలో క్రికెట్ మ్యాచ్‌ల సంఖ్యను పెంచింది.
ట్వంటీ20 వరల్డ్ కప్‌ను అమెరికాలో నిర్వహించే నిర్ణయం తీసుకోవడం కూడా దీనిలో భాగమేనని కొందరు నిపుణులు భావిస్తున్నారు.
అమెరికాను క్రికెట్‌కు కొత్త మార్కెట్‌గా ఐసీసీ చూస్తుందనేది కూడా కొట్టివేయలేం అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
క్రికెట్ వెస్టిండీస్, యూఎస్ఏ క్రికెట్ పాత్ర ఏమిటి?
ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన వెస్టిండీస్ టీమ్, దశాబ్దం కాలంగా ఎంత దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొంటుందో మనం గుర్తుంచుకోవాల్సి ఉంది.
అమెరికాలో క్రికెట్ పాపులారిటీ పెరిగితే, వెస్టిండీస్‌లో ఆటగాళ్లకు, అక్కడ క్రికెట్‌కు ప్రయోజనం చేకూరుతుందని చాలామంది కరేబియన్ క్రికెటర్లు భావిస్తున్నారు.
టీ20 వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ప్రతిపాదనలు పంపిన వారిలో యూఎస్ఏ క్రికెట్‌కు చెందిన స్వతంత్ర డైరెక్టర్ పరాగ్ మరాఠే ఉన్నారు. ఆ సమయంలో యూఎస్ఏ క్రికెట్‌కు ఐసీసీ మాజీ సీఓఓ ఇయాన్ హిగ్గిన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఈ ఇద్దరూ ముఖ్యమైన పాత్ర పోషించారు.
అయితే, ఆ దేశంలో వరల్డ్ కప్ నిర్వహించడం ద్వారా ఈ క్రీడ వ్యాప్తి చెందుతుందనే గ్యారెంటీ లేదు. ఈ ప్రక్రియకు చాలాకాలం పడుతుందనే వాదనలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలో ఉన్న సవాళ్లేంటి?
బ్రిటీష్ కాలనీ ఉన్నప్పుడే అమెరికాలోకి క్రికెట్ ప్రవేశించింది. నేడు చాలా దేశాలు ఆడినట్లే అమెరికాలో కూడా ఈ గేమ్ ఆడారు.
కానీ, భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, దక్షిణాఫ్రికాలో మాదిరి అమెరికాలో ఈ క్రీడ అంతగా విస్తరించలేదు. ఈ దేశాలన్నీ ఒకప్పుడు బ్రిటీష్ ఆధీనంలోనే ఉండేవి.
ఈ క్రీడను ఎక్కువగా సంపన్న వర్గాల క్రీడగా మాత్రమే చూడటం ఒక కారణమైతే, అమెరికాలో సివిల్ వార్ సమయంలో బేస్‌బాల్ ఎక్కువగా ప్రాచుర్యం పొందడం మరో కారణమని చరిత్రకారులు చెప్పారు.
క్రికెట్‌ను అప్పట్లో ఐదు రోజులు ఆడేవారు. దీంతో, అమెరికాలో ఈ గేమ్ అంత ఎక్కువగా ప్రాచుర్యం పొందలేకపోయింది.
కానీ, గత రెండు దశాబ్దాలలో ట్వంటీ20 క్రికెట్ ఆగమనం నుంచి అమెరికాలో కూడా ఈ గేమ్‌కు ప్రాచుర్యం తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలకు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
2017లో అమెరికా క్రికెట్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఆ సమయంలో అమెరికా క్రికెట్ పాలక సంస్థ అయిన యూఎస్ఏసీఏలో పరిపాలనా లోపాలు తలెత్తడంతో ఐసీసీ దీన్ని రద్దు చేసింది. ఆ తర్వాత యూఎస్ఏ క్రికెట్ అనే మరో సంస్థ పుట్టింది.
కానీ, 2021లో మరోసారి ఈ సంస్థలో అంతర్గత వివాదాలు నెలకొన్నాయి. పరాగ్ మరాఠే, ఇయాన్ హిగ్గిన్స్ ఇద్దరూ రాజీనామా చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
పరిపాలనలో లోపాలకు మించి సమస్యలు దీనిలో ఉన్నాయి. అమెరికాలో క్రికెట్ ఆడేందుకు సరిపడా సదుపాయాలు లేవు. అబు దాబి, దుబాయిలలో కూడా క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి. కానీ, అమెరికాలో లేవు.
టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లకు టెక్సస్‌లోని గ్రాండ్ ప్రేరీ స్టేడియం, ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ పార్క్‌లు వేదిక కానున్నాయి.
ఒకవేళ మ్యాచ్‌లు నిర్వహించేందుకు సౌకర్యాలను అభివృద్ధి చేసినా, స్థానిక ప్రజల్లోకి క్రికెట్‌ను తీసుకెళ్లడం అతిపెద్ద సవాలే.
అమెరికా జట్టులో ప్రస్తుతం ఎక్కువగా దక్షిణాసియా ఆటగాళ్లు, కరేబియన్ సంతతి, వలసదారులు ఎక్కువగా ఉన్నారు.
ట్వంటీ20 వరల్డ్ కప్, నాలుగేళ్ల తర్వాత జరగనున్న ఒలింపిక్ క్రికెట్ టోర్నమెంట్ అమెరికాలో ఈ క్రీడ ముఖచిత్రాన్ని మార్చనున్నాయని ఆ దేశంలోని క్రీడాభిమానులు ఆశిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














