టీ20 వరల్డ్ కప్-భారత జట్టు: ఎవరిని ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు?

రిషబ్ పంత్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, కారు ప్రమాదం తర్వాత కోలుకొని రిషబ్ పంత్ ఐపీఎల్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చాడు.
    • రచయిత, విమల్ కుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత క్రికెట్ జట్టులో కొందరు ఆటగాళ్లు వెలుగులోకి వస్తే, మరికొందరు ఇంకా నీడలోనే ఉన్నారు.

అవును.. జూన్‌లో జరగనున్న టీ-20 ప్రపంచకప్‌కు టీమిండియా ఎంపికను చూస్తే.. అదే విషయం అర్థమవుతుంది. సెలెక్టర్లు ప్రస్తుత ఐపీఎల్‌లో ప్రతిభను జట్టు ఎంపికకు ప్రమాణంగా చూడలేదన్నది నిజం.

లేకపోతే ఓపెనర్‌గా అభిషేక్ శర్మ, మిడిల్ ఆర్డర్‌లో రియాన్ పరాగ్, ఫాస్ట్ బౌలింగ్‌లో మయాంక్ యాదవ్ వంటి పేర్లు సోషల్‌ మీడియా హెడ్‌లైన్స్‌కే పరిమితం అయ్యేవి కావు.

కానీ, నాణేనికి మరో వైపుగా చూస్తే, ప్రస్తుత ఐపీఎల్‌లో స్థిరమైన ఆట వరల్డ్ కప్ కోసం ప్లేయర్స్ ఎంపికలో ముఖ్యమైన పాత్ర పోషించిందనీ కూడా చెప్పొచ్చు.

రింకూ సింగ్‌ను పరిగణించకపోవడం ఐపీఎల్‌లో అతను ఎక్కువగా రాణించకపోవడం కారణం కావచ్చు.

అంతర్జాతీయ టీ20లలో రింకూ దాదాపు 90 సగటుతో, 176 స్ట్రైక్ రేట్‌తో ఫినిషర్‌గా పరుగులు సాధించాడు.

శివం దూబే

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, శివం దూబే

దూబేకు కలిసొచ్చిన హిట్టింగ్, బౌలింగ్

ఐపీఎల్ ప్రారంభానికి ముందే, వరల్డ్ కప్ కోసం టీమిండియా 15 మంది సభ్యుల బృందంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన శివం దూబే ఉంటాడని అనుకున్నారందరు.

చెన్నై సూపర్ కింగ్స్‌కు స్పిన్ హిట్టర్‌గా రాణిస్తుండగా, ముంబై తరఫున రంజీ ట్రోఫీలో ఆల్ రౌండర్‌గా అతని ప్రదర్శన కూడా మెచ్చుకోదగ్గదే.

అవసరమైతే దూబే మీడియం పేస్‌తో కొన్ని ఓవర్లు కూడా బౌలింగ్ చేయగలడు కాబట్టి, సెలెక్టర్లు అతని పేరును పరిగణించారు.

వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రస్తుత ఐపీఎల్‌ మాదిరి బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ రాణించకపోతే అతని స్థానంలో ప్లేయింగ్ ఎలెవన్‌లో దూబేను తీసుకురావాలనే కారణమూ ఎంపికకు అవకాశమిచ్చి ఉండొచ్చు.

ఇక మరో వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ మాదిరిగానే సంజూ శాంసన్ కూడా ఐపీఎల్‌లో రాణించి, స్థానం దక్కించుకున్నాడు.

సంజూ శామ్సన్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, సంజూ శామ్సన్

శాంసన్ పట్టుదల

2021, 2022 టీ20 ప్రపంచ కప్ జట్టులో రిషబ్ పంత్ సభ్యుడు, కానీ, డిసెంబర్ 2022 నుంచి పంత్ ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు.

పంత్ ఈ ఐపీఎల్ ద్వారా క్రికెట్‌‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. కారు ప్రమాదం కారణంగా క్రికెట్‌కు దూరమైనప్పటికీ, అతని నైపుణ్యాలు, అభిరుచి ప్రభావితం కాలేదని బ్యాటింగ్, కీపింగ్‌లో నిరూపించాడు.

అదే సమయంలో సంజూ శాంసన్ మొదటిసారి ప్రపంచ కప్ జట్టులోకి ఎంపికయ్యాడు.

శాంసన్‌ను టీ20 వరల్డ్ కప్ సంవత్సరంలో వన్డేలకు బ్యాకప్ వికెట్ కీపర్‌గా, వన్డే వరల్డ్ కప్ ఏడాదిలో టీ20లకు బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఉంచుతున్నారనే వాదన బలంగా వినిపించింది.

ఇక, ఈసారి ఎలాగైనా టీ20 ప్రపంచకప్ వేదికకు టీమిండియా తరఫున టికెట్ సాధించాల్సిందేనని శాంసన్‌ పట్టుదలగా ఉన్నట్లు కనిపించింది.

తన జట్టు రాజస్థాన్ రాయల్స్‌ను ప్లే-ఆఫ్‌ ముంగిటకు తీసుకువచ్చాడు, అంతేకాదు వికెట్ కీపర్-బ్యాటర్‌గానూ రాణిస్తున్నాడు.

రవి బిష్ణోయ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రవి బిష్ణోయ్ ప్రస్తుత ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉన్నాడు

స్థానమివ్వని ఐసీసీ ర్యాంకింగ్

సంజూ సహచరుడు యుజ్వేంద్ర చాహల్ కూడా ప్రస్తుత ఐపీఎల్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్‌తో చివరి క్షణాల్లో రవి బిష్ణోయ్‌ని వెనక్కి నెట్టి అమెరికా టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నాడు.

బిష్ణోయ్ గత రెండేళ్లుగా టీమిండియాలో ఆడుతున్నాడు. ప్రస్తుత ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉన్నాడు. కొన్ని నెలల క్రితం నంబర్ వన్‌గానూ నిలిచాడు.

అదే సమయంలో చాహల్ భారత క్రికెట్ టీ-20 చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్, ఐపీఎల్‌లోనూ కూడా అదే సత్తాను చాటుతున్నాడు.

శాంసన్ మాదిరే చాహల్‌ను కూడా ప్రపంచ కప్ సమయంలో తరచుగా విస్మరిస్తున్నారని చాలామంది మాజీ ఆటగాళ్లు, అభిమానుల అభిప్రాయం.

2023లో స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లోనూ చాహల్‌కు నిరాశే ఎదురైంది.

వరుణ్ చక్రవర్తి 2021లో ఐపీఎల్ ఆటతీరు ఆధారంగా టీ-20 ప్రపంచ కప్ జట్టులో సెలెక్టయ్యాడు. ఆ తర్వాత 2022లో ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపికైనా హరియాణాకు చెందిన ఈ బౌలర్‌కు ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు.

కుల్దీప్ యాదవ్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, కుల్దీప్ యాదవ్‌కు ఇది మొదటి టీ20 ప్రపంచ కప్.

స్పిన్నర్లకు పెద్దపీట

కుల్దీప్ యాదవ్‌కు కూడా 15 మంది బృందంలో చోటు దక్కింది. కాన్పూర్‌కు చెందిన చైనామాన్‌కి ఇది మొదటి టీ20 ప్రపంచ కప్.

ఈ టీంలో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్లుగా ఉన్నారు.

జడేజా లోయర్ ఆర్డర్ హిట్టర్ పాత్రను పోషిస్తుండగా, అక్షర్ మూడో స్థానంలోనూ బ్యాటింగ్ చేయగలడు. గాయం కారణంగా అక్షర్, స్వదేశంలో జరిగిన 2023 వన్డే ప్రపంచకప్‌కు దూరమైన సంగతి తెలిసిందే.

ప్లేయింగ్ ఎలెవన్‌లో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను జట్టులోకి తీసుకోవడం లాంఛనప్రాయమే, అలాగే టాపార్డర్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌లు ఉన్నారు.

బుమ్రా బౌలింగ్ భాగస్వామిగా ఎడమ చేతి పేసర్‌ అర్ష్‌దీప్ సింగ్ ఉన్నాడు, అయితే, గత రెండేళ్లుగా భారత టీ20 జట్టులోకి వస్తూ పోతున్నాడు.

ఇదే విషయం మొహమ్మద్ సిరాజ్‌కు వర్తిస్తుంది. ఐపీఎల్‌ 2024లో ఈ ఇద్దరు బౌలర్ల ఫామ్‌ను భారత సెలెక్టర్లు పట్టించుకోలేదు.

భారత జట్టు

ఫొటో సోర్స్, Getty Images

మారని 'బ్యాటర్ల ముఖచిత్రం'

మొత్తంమీద సెలెక్టర్లు, కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్‌లు నలుగురు పేసర్లను, నలుగురు స్పిన్నర్లను జట్టులోకి తీసుకున్నారు.

దూబే, జడేజా, హార్ధిక్, అక్షర్‌ల రూపంలో ఆల్ రౌండర్లు ఉండటంతో ప్లేయింగ్ ఎలెవెన్‌లో ముగ్గురు ఆల్‌రౌండర్‌లను ఆడించే అవకాశం కూడా జట్టుకు ఉంటుంది. ఇది ఏ కెప్టెన్‌కైనా వెసులుబాటు కల్పిస్తుందనడంలో సందేహం లేదు.

2021లో టాప్ సెవెన్ బ్యాటర్స్, 2024లో ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడే టాప్ సెవెన్ ప్లేయర్స్ ముఖచిత్రం ఒకేలా ఉంది. ఇందులో జైస్వాల్ మాత్రమే కేఎల్ రాహుల్ స్థానంలో వచ్చాడు. దీనిని యాదృచ్చికంగా చూడలేం.

2021లో రోహిత్, విరాట్, సూర్య, పంత్, హార్దిక్, జడేజాలు ఉన్న జట్టు కనీసం సెమీస్ కూడా చేరలేదు. మెరుగైన బౌలింగ్‌తో టీమిండియాకు ఇలాంటి దుస్థితి రాకూడదని ఆశిద్దాం.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)