లోక్‌సభ ఎన్నికలు: ఒకనాడు 400కు పైగా స్థానాలలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 300 స్థానాలలో మాత్రమే ఎందుకు పోటీ చేస్తోంది?

ఫొటో సోర్స్, YEARS
- రచయిత, సల్మాన్ రావి
- హోదా, బీబీసీ ప్రతినిధి
2009 లోక్‌సభ ఎన్నికలు. కాంగ్రెస్ 200కుపైగా స్థానాలు గెలుచుకున్న చివరి ఎన్నికలు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 440 స్థానాలలో అభ్యర్థులను నిలబెట్టి, 209 స్థానాలలో గెలిచింది.
కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైనంత మేర మెజార్టీ సాధించకపోవడంతో ఐక్య ప్రగతిశీల కూటమి ( యునైటెడ్ ప్రోగ్రెస్సివ్ అలయన్స్- యూపీఏ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి 2004 లోక్‌సభ ఎన్నికలలో 145 స్థానాలు మాత్రమే దక్కాయి. ఆ ఎన్నికలలో 417 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ 1996 ఎన్నికలలో గరిష్ఠంగా 529 స్థానాలలో బరిలోకి దిగింది. 1984లో ఇందిరా గాంధీ హత్య అనంతరం ఆ పార్టీ 414 స్థానాలు గెలుచుకుంది.
తాజాగా 18వ లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి దశ పోలింగ్‌లో భాగంగా 102 స్థానాలలో ఎన్నికలు పూర్తయ్యాయి. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో భాగంగా ఉంది.
కాంగ్రెస్ ఇప్పటిదాకా 301 స్థానాలలో తన అభ్యర్థులను నిలిపింది. మొత్తం మీద చూసుకుంటే ఆ పార్టీ మహా అయితే 300 నుంచి 320 స్థానాలలో పోటీ చేసే అవకాశం ఉంది. ( ఇంకా చాలా రాష్ట్రాలలో నామినేషన్ల ప్రక్రియ సాగుతోంది)
1951 నుంచి చరిత్రలో మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ఇన్ని తక్కువ స్థానాలలో పోటీకి దిగడం విశేషం.
2014లో కాంగ్రెస్ 464 మంది అభ్యర్థులను రంగంలోకి దించింది. 2019 ఎన్నికలలో 421 సీట్లలో పోటీచేసింది. కానీ ఈ ఎన్నికలలో 421 స్థానాలకు గానూ కేవలం 52 స్థానాలే గెలుచుకుంది.

ఫొటో సోర్స్, @KHARGE/X
కాంగ్రెస్ పరిస్థితి ఏంటి?
తాజా ఎన్నికలలో తక్కువ స్థానాలలో పోటీ చేస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజకీయ వర్గాలలో ఓ జాతీయ పార్టీ ఇలా ఎందుకు చేసిందనే చర్చోపచర్చలు సాగుతున్నాయి.
గత పదేళ్ళలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కుదేలైందని, ఈ తక్కువ సీట్లలో పోటీచేయడమనేది దాని పర్యవసానమే అని అనుభవజ్ఞులు చెబుతున్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తన అస్తిత్వం కోసం పోరాడుతోందని కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపై దీర్ఘకాలంగా అనుభవం ఉన్న రచయిత, విశ్లేషకుడు రషీద్ కిద్వాయ్ అన్నారు.
‘‘ఈసారి ఎన్నికలలో బీజేపీపై ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కోవడానికి తన శక్తి చాలదని కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకుంది. అందుకే ప్రాంతీయ పార్టీలపై ఎక్కువగా ఆధారపడుతోంది. ఒకరకంగా చెప్పలంటే ఆ పార్టీ త్యాగ స్ఫూర్తితోనే ఇలా చేసిందని చెప్పొచ్చు’’ అని కిద్వాయ్ వివరించారు.
బీజేపీని లేదా ఎన్డీయేను ఎదుర్కోవాలంటే ప్రాంతీయ పార్టీల సాయం తీసుకోవడం తప్ప కాంగ్రెస్ పార్టీకి మరో దారి లేదు అంటారు కిద్వాయ్.
‘ఈసారి కాంగ్రెస్ పార్టీ తన గెలుపు లక్ష్యాన్ని తక్కువగా పెట్టుకుంది. తన లక్ష్యంలో సగం చేరుకున్నా కాంగ్రెస్ పార్టీకి అది అతిపెద్ద విజయమే అవుతుంది’’ అని చెప్పారు.
‘‘కాంగ్రెస్ పార్టీ కూటమిని ఏర్పాటు చేసింది. కానీ కూటమిలోని పార్టీలన్నింటికీ సొంత మానిఫెస్టోలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టోను ఆ పార్టీలు పూర్తిగా జీర్ణించుకోలేదు. అందుకే ఇండియా కూటమి ఏమేరకు సఫలం అయిందనేది ఎన్నికల ఫలితాలు మాత్రమే చెబుతాయి. కాంగ్రెస్ మానిఫెస్టో ఇండియా కూటమి మానిఫెస్టోగా ఉండాల్సింది. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఆ విషయాన్ని గమనించలేకపోయింది’’ అని రషీద్ కిద్వాయ్ వివరించారు.

ఫొటో సోర్స్, @INCINDIA/X
ప్రాంతీయ పార్టీలు ఎన్నిసీట్లలో...?
ఎన్నికలు జరుగుతున్న 543 లోక్‌సభ స్థానాలలో భారతీయ జనతా పార్టీ దాదాపు 200 స్థానాలలో ప్రాంతీయ పార్టీలతో నేరుగా తలపడుతోంది. ఈ దృష్ట్యా చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రాంతీయ పార్టీలతో ఆధారపడటం తప్ప మరో ఉత్తమమైన మార్గం లేదు.
సీనియర్ జర్నలిస్ట్ ఎన్‌కే సింగ్ మాట్లాడుతూ గత ఐదేళ్ళలో చిన్నా, పెద్ద నేతలు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిపోవడంతో, సంస్థాగతంగా బలహీనపడిన కాంగ్రెస్ పార్టీకి ప్రాంతీయ పార్టీలతో పొత్తు తప్ప మరో అవకాశం లేదని చెప్పారు.
ప్రస్తుతం ఎన్‌కే సింగ్ పలు రాష్ట్రాలలో పర్యటిస్తున్నారు. ఆయన బగ్డోగ్రా విమానాశ్రయం నుంచి ఫోన్‌లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా అర్హత కలిగిన అభ్యర్థుల కొరతను ఎదుర్కొంటోందని చెప్పారు.
‘‘ప్రస్తుతం అన్ని సీట్లలో పోటీచేసేందుకు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరు. ఈ పరిస్థితులలో ఆ పార్టీ ప్రాంతీయ పార్టీలతో చేతులు కలిపి, వారి మద్దతు తీసుకుంటోంది’’ అని వివరించారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో భాగంగా ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, బిహార్, తమిళనాడులోని ప్రాంతీయ పార్టీలకు గరిష్ఠంగా సీట్లు వదులుకోవాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, బిహార్, తమిళనాడులో మాత్రమే 201 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ 20 సీట్లలో మాత్రమే పోటీకి పరిమితమైంది.
అదేవిధంగా మహారాష్ట్రలో 48 సీట్లలో కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలలో పోటీచేస్తుండగా ఉద్ధవ్ ఠాక్రే శివసేన 21 స్థానాలలోనూ, శరద్ పవర్ నేషనల్ కాంగ్రెస్ 10 స్థానాలలో పోటీచేస్తున్నాయి.

ఫొటో సోర్స్, @BJP4INDIA/X
కాంగ్రెస్ బీజేపీని అనుసరిస్తోందా?
కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అనుసరిస్తున్న మార్గం రాజకీయాలలో కొత్తేమీ కాదని రాజకీయ వ్యాఖ్యత విద్యా భూషణ్ రావత్ చెప్పారు. గతంలో బీజేపీ కూడా ఇదే పద్ధతిని అనుసరించిందన్నారు. వివిధ పార్టీల కూటమి అనేది భవిష్యత్తు రాజకీయాల నమూనా అని ఆయన చెప్పారు.
‘‘రాజకీయాలలో అనేక మార్పులు వచ్చాయి. ఇప్పుడు ప్రాంతీయతత్త్వం, ప్రాంతీయ ఆకాంక్షలు కూడా పెరిగాయి. ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని మార్చే అనేక అంశాలు జరుగుతున్నాయి. రాబోయే రోజులలో జాతీయ పార్టీల ఓటు శాతం కూడా తగ్గుతుంది. ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు ప్రాంతీయ పార్టీలతో కలిసి పటిష్ఠమైన కూటమిని ఏర్పాటు చేయడమే కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏకైక మార్గం. ఇప్పుడు ఆ పనే చేసింది. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ 200 స్థానాలకు పైగా త్యాగం చేయాల్సి వచ్చింది.’’ అని విద్యాభూషణ్ రావత్ వివరించారు.
ప్రస్తుత పరిస్థితులలో కాంగ్రెస్ కనిష్ఠ స్థానాలలో పోటీచేసి, బీజేపీ అభ్యర్థులను ఎదుర్కొనేవారికి మద్దతు తెలపడం కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు కూడా మంచిదని రాజకీయ అనుభవజ్ఞుల మాట.
ఇప్పుడు బీజేపీ ఏ రాజకీయాలు చేస్తోందో, గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా అదే తరహా రాజకీయం నడిపింది. సినిమా తారలను రంగంలోకి దించడం, ఇతర పార్టీ నేతలను చేర్చుకోవడమనేది గతంలో కాంగ్రెస్ చేసింది, ఇప్పుడు బీజేపీ చేస్తోందని రావత్ చెప్పారు.
ఇందుకు ఉదాహరణలు చూపుతూ ‘‘అప్పట్లో రాజకీయ పాతకాపులపై అమితాబ్ బచ్చన్, సునీల్ దత్, రాజేష్ ఖన్నా లాంటి పెద్ద పెద్ద సినిమా తారలను కాంగ్రెస్ రంగంలోకి దించింది. గతంలో సమాజంలోని ఉన్నత వర్గాలు, అధికారులు కాంగ్రెస్ పార్టీతో ఉండేవారు. ఇప్పుడీ స్థానాన్ని బీజేపీ ఆక్రమించింది. ఈ లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలతో కలిసి బీజేపీని ఎంతవరకు ఎదుర్కుంటుందో చూడాలి. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కూడా దీనిపైనే ఆధారపడి ఉంటుంది’’ అని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి:
- మెక్సికో: అజ్జెక్ ఆదిమ జాతి కట్టిన భారీ పుర్రెల బురుజు చెప్తున్న రహస్యాలేమిటి?
- ఇజ్రాయెల్ ఒక చిన్న ఆపరేషన్‌తో ఇరాన్‌కు బలమైన హెచ్చరిక పంపిందా?
- వెయ్యేళ్ల నాటి ఈ అస్థిపంజరం కోసం నాజీలు, సోవియట్లు ఎందుకు పోరాడారు?
- గాజా యుద్ధం: ఇజ్రాయెల్‌కు ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: వైసీపీకి చిక్కవు, టీడీపీకి దొరకవు
- 'ఇంట్లో చొరబడి చంపేస్తాం' అన్న మోదీ వ్యాఖ్యలపై అమెరికా ఏమందంటే..
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














