ఇజ్రాయెల్ ఒక చిన్న ఆపరేషన్‌తో ఇరాన్‌కు బలమైన హెచ్చరిక పంపిందా?

ఫొటో సోర్స్, EPA
- రచయిత, లైస్ డౌసెట్
- హోదా, బీబీసీ ప్రధాన అంతర్జాతీయ కరస్పాండెంట్
ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాయి.
శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్‌లో తామే దాడి చేశామని ఇజ్రాయెల్ ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు.
అటు, ఇరాన్ మిలిటరీ, రాజకీయ నాయకులు ఈ దాడిని తక్కువ చేసి చూపిస్తున్నారు.
ఆ దాడిలో ఎలాంటి ఆయుధాలు ప్రయోగించారు? ఎంత నష్టం జరిగింది? అనే లెక్కలు ఇప్పటికీ విరుద్ధంగా, అసంపూర్తిగానే ఉన్నాయి.
క్షిపణి దాడి జరిగిందని అమెరికన్ అధికారులు చెబుతున్నారు. ఇరాన్ అధికారులు మాత్రం డ్రోన్‌ల కారణంగా సెంట్రల్ ప్రావిన్స్ ఇస్ఫహాన్, వాయువ్య తబ్రిజ్‌లో చిన్నపాటి పేలుళ్లు జరిగాయని అంటున్నారు.
"డ్రోన్ల కారణంగా ఎలాంటి నష్టం జరగలేదు. ఎవరూ చనిపోలేదు" అని ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్-అబ్డోల్లాహియాన్ చెప్పినట్లు స్థానిక తస్నిమ్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.
దాడికి వచ్చాయని ఇరాన్ చెబుతున్న క్వాడ్‌కాప్టర్‌లను గతంలో రహస్య కార్యకలాపాల కోసం ఇజ్రాయెల్ మొహరించేది.
ఈసారి వారి ప్రధాన లక్ష్యం ఇస్ఫహాన్ నగరం. అది భవంతుల మధ్య ఉన్న ప్రావిన్స్, అద్భుతమైన ఇస్లామిక్ వారసత్వంగా దాన్ని చూపిస్తుంటారు.
ఈ ప్రావిన్సులో ఇస్ఫహాన్ న్యూక్లియర్ టెక్నాలజీ సెంటర్ అయిన నటాన్జ్ అణు కేంద్రం, ఎయిర్ బేస్‌లు ఉన్నాయి.
బాలిస్టిక్ క్షిపణులను, గత ఆదివారం ఇజ్రాయెల్‌పై దాడికి వాడిన వందలాది డ్రోన్లను తయారు చేసిన ఫ్యాక్టరీలు కూడా ఇవే.

ఫొటో సోర్స్, Getty Images
ఇది హెచ్చరికేనా?
ఇరాన్ నడిబొడ్డున దాడి చేయడానికి అవసరమైన తెలివితేటలు, శక్తి తమకు ఉన్నాయని ఇజ్రాయెల్ ఒక చిన్న ఆపరేషన్‌తో బలమైన హెచ్చరికను పంపినట్లుగా ఈ ఘటనను విశ్లేషకులు చూస్తున్నారు.
ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ రాడార్ సిస్టమ్ వంటి ప్రాంతాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఈ వ్యవస్థే నటాన్జ్‌ను రక్షిస్తుంది.
ఈ దాడి ప్రారంభం మాత్రమే కావచ్చు. ప్రస్తుతానికి, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి ఇది ఊహించని 85వ పుట్టినరోజు బహుమతి.
ఇజ్రాయెల్ నిశ్శబ్దం ఇరాన్ అగ్ర నాయకులు ఆలోచించుకొనే సమయం కల్పించింది.
ఇరాన్ కొత్తగా రూల్ పెట్టుకోకపోవచ్చు, ఎందుకంటే తన ప్రధాన శత్రువు దాడి చేసినప్పుడల్లా టెహ్రాన్ బలమైన సమాధానం ఇస్తుంటుంది, ఇది తారాస్థాయికి చేరే ప్రమాదం కూడా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇరాన్ వ్యూహాత్మక ఎత్తుగడలు
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ శుక్రవారం తన ప్రసంగంలో ఈ ఇస్పహాన్ దాడి గురించి ప్రస్తావించలేదు.
ఇజ్రాయెల్‌పై ఆదివారం రాత్రి జరిగిన దాడిని 'ఆపరేషన్ ట్రూ ప్రామిస్' అని పిలుస్తున్నారు. ఇరాన్ దృఢ సంకల్పాన్ని ఇబ్రహీం కొనియాడారు.
కొన్నేళ్లుగా తన 'వ్యూహాత్మక సహనం' పట్ల ఇరాన్ గర్వంగా ఉంది, ఎంత రెచ్చగొట్టినా వెంటనే, నేరుగా ప్రతిస్పందించకుండా సుదీర్ఘ కాలం పాటు కొనసాగే విధానం అవలంభిస్తోంది.
తాజాగా వ్యూహాత్మక పరిష్కారం వైపు ఇరాన్ అడుగులేస్తోంది. ఏప్రిల్ 1న డమాస్కస్‌లోని తన దౌత్య భవనంపై దాడి తర్వాత ఈ కొత్త విధానాన్ని ప్రారంభించింది.
ఈ దాడిలో ఇరాన్ కాన్సులేట్ ధ్వంసమైంది. అత్యంత సీనియర్ కమాండర్‌తో సహా ఏడుగురు రివల్యూషనరీ గార్డ్‌లు మరణించారు.
గాజాపై యుద్ధంలో చివరి ఆరు నెలల్లో ఇజ్రాయెల్ తన లక్ష్యాలను పెంచుకోవడంతో నెతన్యాహును నియంత్రించాలని ఇరాన్ చూసింది.
అయితే, సిరియా, లెబనాన్‌లోని ఆయుధాల దుకాణాలు, భవనాలు, స్థావరాలు, సరఫరా మార్గాలతో సహా ఇరాన్ ఆస్తులపై దాడి చేయడమే కాకుండా, దాని ఉన్నత అధికారులను కూడా ఇజ్రాయెల్ మట్టుపెట్టింది.

ఫొటో సోర్స్, Getty Images
బహిరంగంగానే ఇరాన్-ఇజ్రాయెల్ శత్రుత్వం..
ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య దశాబ్దాల నాటి శత్రుత్వం షాడో యుద్ధాలు, రహస్య కార్యకలాపాల రూపంలోనే కనిపించేవి. కానీ, ఇప్పుడు బహిరంగ ఘర్షణగా మారింది.
ఒకవేళ అలాంటి దాడులు మళ్లీ జరిగితే, పరిణామాలూ తీవ్రంగా ఉంటాయి.
మిత్రదేశాల విజ్ఞప్తుల దృష్ట్యా ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలను తగ్గించినట్లు దాని తాజా చర్య సూచిస్తోంది.
యుద్ధాన్ని ఆపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఈ దేశాల మధ్య ఏ శాంతి చాలాకాలం కొనసాగదని అందరికీ తెలుసు.

ఫొటో సోర్స్, Reuters
సిద్ధంగా 'ఇరాన్ దళాలు'
ఇజ్రాయెల్ ఇంకా మండుతూనే ఉంది. గాజాలో యుద్ధం చేస్తోంది. పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు.
దాని మిత్రదేశాల ఒత్తిడితో ఇజ్రాయెల్ అవసరమైన వారికి అవసరమైన సహాయ సామగ్రి సరఫరాకు అవకాశం కల్పిస్తోంది, అయితే బాధిత ప్రాంతం ఇప్పటికీ కరువు అంచునే ఉంది.
ఇజ్రాయెల్ బందీలు ఇప్పటికీ ఇంటికి చేరలేదు, కాల్పుల విరమణ చర్చలు నిలిచిపోయాయి.
రఫాలో హమాస్ చివరి బలమైన కోటలో రాబోయే యుద్ధాల గురించి ఇజ్రాయెల్ హెచ్చరికలు పంపుతోంది.
ఆయా ప్రాంతాల్లో ఇరాన్ మద్దతుతో నడిచే సంస్థలను "యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్" గా పిలుచుకుంటారు. వీటిలో లెబనాన్‌లోని హిజ్బుల్లా, ఇరాక్, సిరియాలలోని ఇరాన్ మద్దతుగల మిలీషియాలు, యెమెన్‌లోని హౌతీలు ఉన్నారు. వాళ్లంతా సిద్ధంగానే ఉన్నారు, ప్రతీరోజూ దాడులు చేస్తూనే ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- కర్నాటక: ఎన్నికల సభలో ప్రధాని మోదీ ప్రస్తావించిన నేహా హత్య కేసు ఏమిటి?
- పరోటాలు రోజూ తింటే ఏమవుతుంది? మైదాపిండిపై ఉన్న అపోహలు, వాస్తవాలు
- వెయ్యేళ్ల నాటి ఈ అస్థిపంజరం కోసం నాజీలు, సోవియట్లు ఎందుకు పోరాడారు?
- ఇరాన్ ఎందుకు ఇజ్రాయెల్‌పై దాడులు చేసింది? ఆరు ప్రశ్నలు, సమాధానాలు..
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: వైసీపీకి చిక్కవు, టీడీపీకి దొరకవు
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














