ఇజ్రాయెల్- ఇరాన్: ఇస్ఫహాన్ వైమానిక స్థావరంలో జరిగిన నష్టాన్ని చూపుతున్న ఉపగ్రహ చిత్రాలు..

ఫొటో సోర్స్, Umbra Space
- రచయిత, పాల్ బ్రౌన్, డేనియెల్ పాలుంబో
- హోదా, బీబీసీ వెరిఫై
ఇజ్రాయెల్ ఏప్రిల్ 19న చేసిన దాడుల్లో ఇరాన్ వైమానిక స్థావరానికి నష్టం వాటిల్లినట్లుగా చూపించే ఆధారాలను తాజాగా విడుదలైన ఉపగ్రహ ఛాయాచిత్రాలు వెల్లడించాయి.
ఇస్ఫహాన్ వైమానిక స్థావరంలోని ఒక ఎయిర్-డిఫెన్స్ సిస్టమ్ కొంతభాగం ధ్వంసమైనట్లుగా కనిపిస్తోన్న రెండు ఫోటోలను బీబీసీ వెరిఫై బృందం విశ్లేషించింది.
ఇజ్రాయెల్ క్షిపణి దాడి చేసిందని అమెరికా అధికారులు చెబుతున్నప్పటికీ, దీని గురించి ఇజ్రాయెల్ వైపు నుంచి ఎలాంటి ధ్రువీకరణ రాలేదు.
కొన్ని వారాలుగా ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.
ఈ నెల ఆరంభంలో సిరియాలోని ఇరాన్ కాన్సులేట్‌పై ఇజ్రాయెల్ దాడి చేసినట్లుగా అనుమానిస్తూ, ఏప్రిల్ 13న ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేసింది.
ఇస్ఫహాన్‌లో శుక్రవారం నాటి ఇజ్రాయెల్ దాడి వార్తలు బయటకు వచ్చినప్పటి నుంచి, ఈ దాడి వల్ల కలిగే నష్టం తీవ్రత, ఇజ్రాయెల్ గురి పెట్టిన లక్ష్యాల గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌కు ఇస్ఫహాన్ కేంద్రం.
డ్రోన్లతో దాడి చేశారని, అయితే వాటిని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ద్వారా అడ్డుకున్నామని, తమ భూభాగంలో ఎలాంటి నష్టం జరగలేదని ఇరాన్ చెప్పింది.

ఇజ్రాయెల్ ఏ ఆయుధాలతో దాడి చేసిందనేది ఇప్పటికీ అస్పష్టంగానే ఉన్నప్పటికీ, వైమానిక స్థావరంలో జరిగిన నష్టానికి సంబంధించిన సాక్ష్యాలను ఉపగ్రహ చాయాచిత్రాలు గుర్తించాయి.
ఇస్ఫహాన్‌లో శుక్రవారం తీసిన ఆప్టికల్, సింథటిక్ అపెర్చర్ రాడార్ (ఎస్‌ఏఆర్) శాటిలైట్ ఫోటోల విశ్లేషణ ద్వారా బీబీసీ వెరిఫై దీన్ని అంచనా వేసింది.
గూగుల్ ఎర్త్ వంటి టూల్స్‌ను వాడే వారికి ఆప్టికల్ ఇమేజరీ గురించి తెలిసి ఉంటుంది.
రేడియో తరంగాలను ఉపయోగించి ఎస్‌ఏఆర్ టెక్నాలజీ, భూ ఉపరితలం మీది ఫోటోలను తీస్తుంది. సంప్రదాయక ఉపగ్రహ సాంకేతికత కంటే ఎస్‌ఏఆర్ టెక్నాలజీలో ఉన్న అదనపు సామర్థ్యం ఏంటంటే ఇది చీకట్లోనూ, మేఘాలు ఆవరించి ఉన్నప్పటికీ ఫోటోలను తీయగలుగుతుంది.
ఎస్‌ఏఆర్ టెక్నాలజీని ఉపయోగించి తీసిన చిత్రాలు బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటాయి. కానీ, ఇవి హై రిజల్యూషన్‌తో ఉన్నాయి.
ఈ ఫోటోల్లో నేల మీద రంగుల్ని, మంటల్ని గుర్తించలేం. కానీ, నేల మీద నిర్మాణాలకు, వాహనాలకు జరిగిన నష్టాన్ని ఇవి చక్కగా చూపిస్తాయి.

ఏప్రిల్ 15న అంబ్రా స్పేస్ ఉపగ్రహం తీసిన అలాంటి ఒక ఫోటోను బీబీసీ వెరిఫై విశ్లేషించింది. ఆ ఫోటోలో షికారి వైమానిక స్థావరానికి వాయువ్యాన ఒక ఎస్-300 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఉన్నట్లుగా కనిపిస్తుంది.
ఈ వ్యవస్థలో రాడార్లు, మిసైల్ లాంచర్లు, ఇతర పరికరాలతో అమర్చిన పలు వాహనాలు ఉన్నాయి.
శుక్రవారం నాటి దాడి తర్వాత అంబ్రా స్పేస్ తీసిన ఫోటోలో ఒక వస్తువు (బహుశా రాడార్ అయ్యుండొచ్చు) చుట్టూ శిథిలాలు ఉండటం, అది కాస్త ఒక పక్కకు జరిగి ఉన్నట్లుగా చూపిస్తుంది.
ఆ ప్రాంతంలోని ఇతర వాహనాల్ని కూడా కాస్త దూరం తరలించారు.
ఎస్‌ఏఆర్ టెక్నాలజీలో వెల్లడైన అంశాలను మేం ఒక ఆప్టికల్ శాటిలైట్ ఇమేజ్ సహాయంతో ధ్రువీకరించాం. ఆప్టికల్ ఉపగ్రహ చిత్రంలోనూ అదే ఏరియాలో స్కార్చ్ మార్క్ (ఉపరితలం కాలిపోయిన గుర్తులు) ఉన్నట్లుగా గుర్తించాం. ఏప్రిల్ 11, 15 తేదీల్లో తీసిన ఫోటోల్లో ఇలాంటి కాలిన గుర్తులేమీ లేవు.
ఇరాన్ అణుకేంద్రాలకు ఎలాంటి నష్టం జరుగలేదని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చెప్పింది.
ఇవి కూడా చదవండి:
- ఇరాన్ ఎందుకు ఇజ్రాయెల్‌పై దాడులు చేసింది? ఆరు ప్రశ్నలు, సమాధానాలు..
- వెయ్యేళ్ల నాటి ఈ అస్థిపంజరం కోసం నాజీలు, సోవియట్లు ఎందుకు పోరాడారు?
- గాజా యుద్ధం: ఇజ్రాయెల్‌కు ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: వైసీపీకి చిక్కవు, టీడీపీకి దొరకవు
- 'ఇంట్లో చొరబడి చంపేస్తాం' అన్న మోదీ వ్యాఖ్యలపై అమెరికా ఏమందంటే..
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














