ఇజ్రాయెల్ దాడి చేసిందని చెబుతున్న ఇరాన్‌లోని ఇస్ఫహాన్ నగరం ఎందుకంత కీలకం?

ఇరాన్‌లోని ఇస్ఫహాన్ నగరం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఇస్ఫహాన్, దాని పరిసర ప్రాంతాలు డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణుల తయారీ కర్మాగారాలకు నిలయంగా ఉన్నాయి.
    • రచయిత, బరన్ అబ్బాసీ, టామ్ స్పెండర్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

ఇరాన్‌లోని ఇస్ఫహాన్ నగరం ప్యాలెస్‌లు, టైల్డ్ మసీదులు, మినార్‌లకు ప్రసిద్ధి. ఇది మిలటరీ ఇండస్ట్రీకి ప్రధాన కేంద్రం కూడా. గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ నగరంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.

ఇరాన్‌లో మూడో అతిపెద్ద నగరం ఇస్ఫహాన్. దీని మరో పేరు 'నెస్ఫ్-ఎ-జహాన్', అంటే సగం ప్రపంచం అని అర్థం. ఇది ఇరాన్ మధ్యలో జాగ్రోస్ పర్వతాలకు సమీపంలో ఉంది.

ఇస్ఫహాన్, దాని పరిసర ప్రాంతాలు డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణుల తయారీ కర్మాగారాలకు నిలయంగా ఉన్నాయి. నటాన్జ్ అణు కేంద్రం సమీపంలో ఉంది. ఇరాన్ అణు కార్యకలాపాలకు ఇది చాలా ముఖ్యమైన కేంద్రం.

ఇరాన్‌పై దాడి

ఫొటో సోర్స్, Getty Images

భిన్న కథనాలు

ఈ ప్రాంతంపై ఇజ్రాయెల్ దాడి చేసిందన్నది నిజమే అయితే, నెతన్యాహు ప్రభుత్వం ఇరాన్‌కు ఒక సందేశం పంపినట్లు అర్థం చేసుకోవాలి.

ఇస్ఫహాన్ ప్రాంతంలోనిసున్నితమైన లక్ష్యాలపై దాడి చేయగల సామర్థ్యం తమకు ఉందని, ఇరాన్‌‌ను ఇజ్రాయెల్ హెచ్చరించినట్లే.

ఇజ్రాయెల్ దాడి వార్తలు వచ్చిన తర్వాత, ఇస్ఫహాన్‌లోని అణు కేంద్రాలు పూర్తి సురక్షితంగా ఉన్నాయని ఇరాన్ అధికారులు తెలిపారు.

ఇరాన్ వద్ద అణ్వాయుధాలు లేవు. అయితే, అణ్వాయుధ దేశంగా అవతరించడానికి రహస్యంగా కార్యకలాపాలు కొనసాగిస్తుందనే ఆరోపణలను ఇరాన్ ఖండించింది.

ఇరాన్‌లో అసలేం జరిగిందనే దానిపై విరుద్ధ కథనాలు వస్తున్నాయి. ఇరాన్‌పై క్షిపణి దాడి జరిగిందని అమెరికా తెలిపింది. అయితే, తమ భూభాగంలోకి వచ్చేందుకు ప్రయత్నించిన డ్రోన్‌లను విజయవంతంగా కూల్చేశామని ఇరాన్ ఉన్నతాధికారి హుస్సేన్ డెలిరియన్ తెలిపారు. ఇజ్రాయెల్ క్షిపణితో దాడి చేసిందనే వార్తలను ఆయన తోసిపుచ్చారు.

ఇస్ఫహాన్ విమానాశ్రయం, మిలటరీ ఎయిర్‌బేస్ సమీపంలో మూడు పేలుళ్లు జరిగినట్లు కొన్ని ఇరాన్ మీడియా సంస్థలు రిపోర్టు చేశాయి. అయితే, ఈ దాడిలో ఇజ్రాయెల్ ప్రమేయాన్ని ఇరాన్ ధృవీకరించలేదు.

ఇరాన్‌పై దాడి

ఫొటో సోర్స్, Getty Images

ఇరాన్ ఏం చెప్పింది?

ఆకాశంలో కనిపించిన అనుమానిత వస్తువులపై 'ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ' చేసిన కాల్పుల కారణంగా ఏర్పడినవే ఈ పేలుళ్లని ఇరాన్ మిలిటరీ కమాండర్ ఇన్ చీఫ్ అబ్దుల్ రహీమ్ మౌసావి అన్నారు.

ఈ ఘటనలో మూడు డ్రోన్లు నేలకూలాయని ఇరాన్ మీడియా, అధికారులు తెలిపారు.

ఇస్ఫహాన్ విమానాశ్రయంలో ఇరాన్ వైమానిక స్థావరం ఉంది. అక్కడ పాత ఎఫ్-14 యుద్ధ విమానాలు ఉన్నాయి. రెజా షా హయాంలో 1970లలో ఇరాన్ మొదటిసారిగా అమెరికా నుంచి ఎఫ్-14 లను కొనుగోలు చేసింది.

అప్పటి నుంచి వాటిని నడుపుతున్నారు. ప్రపంచంలోనే ఇప్పటికీ టాప్ గన్ యుద్ధ విమానాలను వాడుతున్న ఏకైక దేశం ఇరాన్.

ఇరాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1970లలో ఇరాన్ మొదటిసారిగా అమెరికా నుంచి ఎఫ్-14 లను కొనుగోలు చేసింది.

ఇస్ఫహాన్‌లో గతంలోనూ ఒక డ్రోన్ దాడి జరిగింది. 2023 జనవరిలో నగరం మధ్యలోని మందుగుండు సామగ్రి తయారీ కర్మాగారంపై జరిగిన ఈ దాడికి ఇజ్రాయెల్ కారణమని ఇరాన్ ఆరోపించింది.

నాలుగు ప్రొపెల్లర్‌లతో కూడిన ఒక చిన్న డ్రోన్ - క్వాడ్‌కాప్టర్‌తో ఈ దాడి జరిపారు. ఇటీవలి సంవత్సరాలలో ఇరాన్‌లోని ఇతర ప్రాంతాలలోనూ ఇలాంటి డ్రోన్ దాడులు జరిగాయనే వార్తలొచ్చాయి. అయితే, ఈ దాడుల్లో ఏ ఒక్కదానిలోనూ తన ప్రమేయాన్ని ఇజ్రాయెల్ ధ్రువీకరించలేదు.

ఇరాన్‌పై దాడి

ఫొటో సోర్స్, TASNIM NEWS AGENCY

ఫొటో క్యాప్షన్, ఇరాన్ దాని అణు కేంద్రాల వీడియోను విడుదల చేసింది.

ఇస్ఫహాన్‌‌నే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు?

ఇస్ఫహాన్‌ను లక్ష్యంగా చేసుకోవడం చాలా ముఖ్యమైనదని, ఎందుకంటే దాని చుట్టూ అనేక సైనిక స్థావరాలు ఉన్నాయని హమీష్ డి బ్రెట్టన్-గోర్డాన్ బీబీసీతో చెప్పారు.

హమీష్ కెమికల్ వెపన్స్ నిపుణులు, అంతేకాదు యూకే, నాటో అణు దళాల మాజీ అధిపతి.

ఇరాన్ అణ్వాయుధాల తయారీకి ప్రయత్నిస్తోందని భావిస్తున్న ప్రదేశానికి అతి సమీపంలోనే ఈ క్షిపణి దాడి జరిగిందనే వార్తలు వచ్చాయన్నారు హమీష్.

ఇజ్రాయెల్ దాడి దాని సామర్థ్యం, ఉద్దేశాలకు నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు.

గత వారాంతంలో ఇరాన్ ప్రయోగించిన 300 కంటే ఎక్కువ డ్రోన్లను ఇజ్రాయెల్ అడ్డుకుందని, అయితే, ఇజ్రాయెల్ ఒకటి లేదా రెండు క్షిపణులతోనే ఇరాన్‌కు నష్టం కలిగించిందని ఆయన అన్నారు.

ఇరాన్ అధికారులు దాడికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ఎందుకంటే వారి 'పాత వైమానిక రక్షణ వ్యవస్థ'లలో చొచ్చుకుపోవటంలో ఇజ్రాయెల్ సాధించిన విజయాన్ని ప్రచారం చేయడం వారికి ఇష్టం లేదని హమీష్ అభిప్రాయపడ్డారు.

సైనికపరంగా ఇరాన్ కంటే ఇజ్రాయెల్ చాలా ముందుందని, తాజా ఘటనలే నిదర్శనమని హమీష్ అన్నారు.

"ఇరాన్ ఇజ్రాయెల్‌తో ముఖాముఖి సంఘర్షణ కంటే దాని తీవ్రవాద గ్రూపులు, ప్రాక్సీలను ఉపయోగించి షాడో యుద్ధం చేయడానికి ఇష్టపడుతుంది, అక్కడ ఎదురుదెబ్బలు తగులుతాయని దానికి తెలుసు" అని అన్నారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రష్యా అధ్యక్షుడు పుతిన్

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్యలోకి రష్యా

ఇరాన్‌తో రష్యా సైనిక సహకారాన్ని పెంచుకుంటోంది. ఇజ్రాయెల్‌తో వివాదాన్ని మరింత పెంచాలని ఇరాన్ కోరుకోవడం లేదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ శుక్రవారం ఇజ్రాయెల్‌కు సూచించారు.

"రష్యా, ఇరాన్ లీడర్స్‌తో పాటు రష్యా, ఇజ్రాయెల్‌ అధికారుల మధ్య ఫోన్ సంప్రదింపులు జరిగాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచడానికి ఇరాన్ ఇష్ట పడటం లేదని ఇజ్రాయెల్‌లకు చెప్పాం" అని లావ్‌రోవ్ రష్యన్ రేడియోతో అన్నారు.

‘‘గత వారాంతం ఇజ్రాయెల్‌పై దాడి చేసి ఇరాన్ గర్వపడిందని, అయితే దానిని మరింత ముందుకు తీసుకెళ్లడం దానికి ఇష్టం లేదు’’ అని హమీష్ డి బ్రెట్టన్-గోర్డాన్ చెప్పారు.

ఏప్రిల్ 1న సిరియాలోని తన కాన్సులేట్‌పై ఇజ్రాయెల్ క్షిపణి దాడి చేసినట్లు అనుమానించిన తర్వాత ఇరాన్ ఈ డ్రోన్ల దాడి చేసింది.

"ఇజ్రాయెల్‌కు అమెరికా, ఇతర దేశాల మద్దతు కూడా ఉందని దానికి తెలుసు. యుక్రెయిన్‌కు బదులుగా మధ్యప్రాచ్యంలో ఉన్న రష్యా నుంచి లభించే చిన్నపాటి సాయంపై ఇరాన్ ఎక్కువగా ఆధారపడదు'' అని హమీష్ అభిప్రాయపడ్డారు.

వీడియో క్యాప్షన్, ఇజ్రాయెల్ దాడి చేసిందని చెబుతున్న ఇరాన్‌లోని ఇస్ఫహాన్ నగరం ఎందుకంత కీలకం?

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)