ఇరాన్‌పై ఇజ్రాయెల్ అర్ధరాత్రి మిసైల్ దాడి చేసిందా? అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, EPA
- రచయిత, సీన్ సెడాన్
- హోదా, బీబీసీ న్యూస్
ఇజ్రాయెల్ శుక్రవారం రాత్రి ఇరాన్‌పై క్షిపణితో దాడి చేసిందని అమెరికా తెలిపింది. ఇరు దేశాల మధ్య గత కొన్నిరోజులుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఘటన ప్రతీకార దాడిగా కనిపిస్తోంది.
ఇస్ఫహాన్ ప్రాంతంపై దాడి స్థాయి, నష్టంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇరాన్ ప్రభుత్వ మీడియా ఈ దాడి ప్రాముఖ్యతను తగ్గించింది.
గతంలో సిరియాలోని ఇరాన్ గ్రూపుల స్థావరంపై దాడి జరిగింది. అనంతరం ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్ల దాడి చేసింది. తాజా ఇజ్రాయెల్ దాడి దానికి కొనసాగింపుగా చూస్తున్నారు.
సిరియా, ఇరాక్‌లలో ఇరాన్ మద్దతు గల సాయుధ గ్రూపులే లక్ష్యంగా తాను చేసే సైనిక చర్యలను ఇజ్రాయెల్ బయటకు చెప్పుకోదు.
అయితే, శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణి దాడి చేసిందని బీబీసీ భాగస్వామి వార్తాసంస్థ సీబీఎస్ న్యూస్‌తో అమెరికా అధికారులు ధ్రువీకరించారు.
ఇజ్రాయెల్ తన ప్రణాళికల గురించి అమెరికాకు ముందుగానే తెలియజేసే అవకాశముంది. అయితే, ఈ దాడికి ఏ రకమైన ఆయుధాలను ఉపయోగించారు? వాటిని ఎక్కడి నుంచి ప్రయోగించారో స్పష్టంగా తెలియలేదు.
ఈ దాడికి క్షిపణిని వాడారని అమెరికా చెబుతుండగా, చిన్న డ్రోన్లు మాత్రమే ఉన్నాయని ఇరాన్ పేర్కొంది.
ఇరాన్‌లోకి ప్రవేశాన్ని అక్కడి ప్రభుత్వం కఠినంగా నియంత్రిస్తుంటుంది. రాత్రిపూట దాడి జరిగినట్లుగా చెబుతున్న ఇస్ఫహాన్ సెంట్రల్ రీజియన్‌లోకి బీబీసీకి ప్రవేశం దక్కలేదు.

ఫొటో సోర్స్, IRIB
దాడి గురించి ఇరాన్ ఏం చెబుతోంది?
దాడికి ప్రయత్నించినట్లు ఇరాన్ అధికారులు, మీడియా ధృవీకరించాయి, కానీ దాడి ప్రాముఖ్యతను తగ్గించాయి. ప్రాణనష్టం గురించి ఎటువంటి రిపోర్టులూ లేవు.
ఆర్మీ బేస్ దగ్గర పేలుళ్లు వినిపించాయని, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ యాక్టివేట్ అయ్యాయని ఇరాన్ వార్తాసంస్థ ఫార్స్ తెలిపింది
ఇస్ఫహాన్ నగరంలో ఎటువంటి నష్టం వాటిల్లలేదని ఆర్మీ జనరల్‌ను ఉటంకిస్తూ ఇరాన్ మీడియా తెలిపింది.
‘‘ఇస్ఫహాన్ నగరంలో భారీ శబ్దాలు వినిపించాయి. అనుమానిత వస్తువులపై గగనతల రక్షణ వ్యవస్థ చేసిన కాల్పుల కారణంగా ఏర్పడినవే ఈ శబ్దాలు’’ అని వివరించాయి.
ఇస్ఫహాన్‌లోని అణు కేంద్రానికి సంబంధించిన వీడియోను తస్నిమ్ వార్తాసంస్థ పోస్టు చేసింది.
తస్నిమ్ ఇరాన్ శక్తివంతమైన ఇస్లామిక్ రివల్యూషన్ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) మిలటరీ విభాగంతో దగ్గరి సంబంధాలు గల వార్తాసంస్థ. అయితే, అణు కేంద్రానికి నష్టం జరిగినట్లుగా కనిపించే సంకేతాలు ఈ వీడియోలో లేవు.
మరోవైపు, ఇరాన్‌లోని అణు కేంద్రాలకు ఎలాంటి నష్టం జరగలేదని అంతర్జాతీయ అణుశక్తి (ఐఏఈ) సంస్థ కూడా ధృవీకరించింది.
"బయటి సరిహద్దుల నుంచి ఎటువంటి వైమానిక దాడి జరగలేదు" అని ఇరాన్ నేషనల్ సెంటర్ ఆఫ్ సైబర్‌స్పేస్ ప్రతినిధి హొస్సేన్ దాలిరియన్ ప్రకటించారు.
ఇజ్రాయెల్ క్వాడ్‌కాప్టర్లను (డ్రోన్‌లు) ఎగరేయడానికి విఫలయత్నం చేసింది, వాటిని కూల్చేశాం" అని ఆయన చెప్పారు.
దాడి జరిగిన వెంటనే వాణిజ్య విమానాలపై ఇరాన్ ఆంక్షలు విధించింది, అయితే ఇప్పుడు ఆ నిషేధం ఎత్తివేశారు.
ఇరాక్, సిరియాలో కూడా పేలుళ్లపై వార్తలొచ్చాయి, అక్కడ ఇరాన్ మద్దతు గల సాయుధ గ్రూపులు పనిచేస్తున్నాయి.
దక్షిణ సిరియాలోని వైమానిక రక్షణ స్థావరంపై శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ క్షిపణి దాడి చేసినట్లు సిరియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
అయితే, దాడి వెనుక ఇజ్రాయెల్ ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు చూపలేదు.

ఇస్ఫహాన్‌ను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు?
ఇస్ఫహాన్ ప్రావిన్స్ అనేది ఇరాన్ మధ్యలో ఉన్న ఒక పెద్ద ప్రాంతం. ఇది ముఖ్యమైన ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాలకు నిలయంగా ఉంది.
దీనిలో పెద్ద వైమానిక స్థావరం, మిసైల్ ప్రొడక్షన్ కాంప్లెక్స్, అనేక అణు సౌకర్యాలున్నాయి.
ఇరాన్ ఇజ్రాయెల్‌పై వందలాది క్షిపణులు, డ్రోన్‌లను ప్రయోగించిన వారంలోపే ఈ తాజా దాడి జరిగింది, ఇది ఉద్రిక్తతలను పెంచింది. ఇంతకుమందు ఇరాన్ దాడి అంతగా విజయవంతం కాలేదు.
అమెరికా, యూకే, ఇతర మిత్రదేశాల సహాయంతో ఇరాన్ డ్రోన్లను ఇజ్రాయెల్ కూల్చివేసింది.
ఏప్రిల్ 1న సిరియాలోని ఇరాన్ దౌత్య భవనంపై దాడికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ గడ్డపై ఆ దాడి జరిగింది.
అయితే, ఏప్రిల్ 1న దాడి చేసినట్లు ఇజ్రాయెల్ మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.

ఫొటో సోర్స్, EPA
తాజా దాడి ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతను పెంచుతుందా?
ఇజ్రాయెల్ చేసినట్లుగా చెబుతున్న ఈ దాడికి ఇరాన్ ఎలా ప్రతిస్పందిస్తుందో తెలియదు.
శుక్రవారం నాటి దాడి పరిమితమైనదని, దాదాపు ప్రతీకాత్మకమైనదని బీబీసీ సెక్యూరిటీ కరస్పాండెంట్ ఫ్రాంక్ గార్డనర్ అభివర్ణించారు.
ఇరాన్‌తో ఎలా వ్యవహరించాలనే విషయంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తన సైన్యం, రాజకీయ మిత్రుల నుంచి పరస్పర విరుద్ధమైన ఒత్తిళ్లను ఎదుర్కొనే అవకాశముందని బీబీసీ అంతర్జాతీయ ఎడిటర్ జెరెమీ బోవెన్ అభిప్రాయపడ్డారు.
రెండు మధ్యప్రాచ్య ప్రత్యర్థుల మధ్య దీర్ఘకాలిక యుద్ధంగా మారే ప్రమాదం ఉన్న ఎటువంటి చర్య తీసుకోవద్దని ఇజ్రాయెల్‌పై అమెరికా, ఇతర పశ్చిమ మిత్రదేశాల నుంచి ఇప్పటికే ఒత్తిడి ఉంది.
హమాస్‌ను తుదముట్టించడానికి గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది. అయితే, హమాస్‌కు ఇరాన్ పరోక్ష మద్దతు ఉంది. దీంతో ఇరు దేశాలలో ఈ శత్రుత్వాలు తలెత్తాయి.

ఫొటో సోర్స్, Reuters
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎలా స్పందించింది?
మధ్యప్రాచ్యంలో తీవ్రస్థాయి వివాదం చమురు సరఫరాకు అంతరాయం కలిగిస్తుందనే ఆందోళనలు ఉన్నాయి.
చమురు ధరలకు అంతర్జాతీయ బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్, దాడి తర్వాత బ్యారెల్‌కు 1.8 శాతం పెరిగి 88 డాలర్లకి చేరుకుంది.
చమురు ధరలు ప్రారంభంలో 3.5 శాతం వరకు పెరిగాయి, అయితే దాడి పరిమితమైందని తెలియగానే ధర స్థిరపడింది.
బంగారం ధర ఒక సమయంలో రికార్డు స్థాయికి చేరినా, తర్వాత ఔన్సు దాదాపు 2,400 డాలర్లకు పడిపోయింది.
ఇవి కూడా చదవండి:
- లా నినా: తెలుగు రాష్ట్రాల్లో ఈసారి ఎక్కువ వర్షాలు కురుస్తాయా?
- సైబర్ బానిసలు: ‘నా కళ్ళ ముందే ఆ ఇద్దరు అమ్మాయిలను 17మంది రేప్ చేశారు, నన్ను 16 రోజులు చిత్ర హింసలు పెట్టారు’
- జలియన్‌వాలా బాగ్: జనరల్ డయ్యర్ 105 ఏళ్ళ కిందట సృష్టించిన మారణహోమం
- హీట్ వేవ్ అంటే ఏంటి... దీనికీ ఎన్నికలకూ ఏమిటి సంబంధం?
- 'భారత గూఢచార సంస్థ' పాకిస్తాన్లో 20 మందిని చంపేసిందా, ది గార్డియన్ పత్రిక కథనంపై పాక్ ఏమంటోంది?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














