గాజా యుద్ధం: ఇజ్రాయెల్‌కు ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?

ఫొటో సోర్స్, AFP
- రచయిత, డేవిడ్ గ్రిటెన్
- హోదా, బీబీసీ న్యూస్
ఇజ్రాయెల్‌కు ఆయుధాల విక్రయాలను నిలిపేయాలంటూ పశ్చిమ దేశాల ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతోంది. గాజా స్ట్రిప్‌లో హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోన్న తీరు కారణంగా ఈ ఒత్తిళ్లు వస్తున్నాయి.
ఇజ్రాయెల్ ఆయుధాల ప్రధాన ఎగుమతిదారు. కానీ, ఇజ్రాయెల్ సైన్యం మెరుపు వైమానిక దాడులను నిర్వహించడానికి దిగుమతి చేసుకున్న విమానాలు, గైడెడ్ బాంబులు, క్షిపణుల మీద ఎక్కువగా ఆధారపడింది.
ఇటీవలి చరిత్రలో అత్యంత తీవ్ర, విధ్వంసక వైమానిక దాడుల్లో ఒకటిగా ఇజ్రాయెల్ దాడుల్ని నిపుణులు అభివర్ణించారు.
ఇజ్రాయెల్ పశ్చిమ మిత్రదేశాల్లోని కొందరు రాజకీయ నాయకులు, ప్రచార గ్రూపులు ఇజ్రాయెల్‌కు ఆయుధాల ఎగుమతిని నిలిపేయాలని అంటున్నారు.
సాధారణ పౌరుల ప్రాణ రక్షణలో, తగు మానవతా సహాయాన్ని అందించడంలో ఇజ్రాయెల్ విఫలమైందని వారు ఆరోపిస్తున్నారు.
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి శుక్రవారం ఆయుధాల నిషేధానికి మద్దతు ఇచ్చింది. దీనిపై జరిగిన ఓటింగ్‌లో 28 దేశాలు నిషేధానికి మద్దతుగా, ఆరు దేశాలు వ్యతిరేకంగా ఓటు వేయగా, 13 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు.
ఇజ్రాయెల్ ఆయుధాల దిగుమతుల్లో అధిక వాటా ఉన్న అమెరికా, జర్మనీ దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. తీర్మానంలో హమాస్‌ను స్పష్టంగా ఖండించనందున తాము వ్యతిరేకంగా ఓటు వేసినట్లు జర్మనీ చెప్పింది.
అక్టోబర్ 7న ఇజ్రాయెల్ మీద హమాస్ చేసిన దాడితో ఈ యుద్ధం మొదలైంది. హమాస్ దాడిలో దాదాపు 1,200 మంది చనిపోయారు. వీరంతా సాధారణ పౌరులేనని ఇజ్రాయెల్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే, గాజాలో 33,000 కంటే ఎక్కువ మందిని చంపేశారని, వారిలో 70 శాతం మంది పిల్లలు, మహిళలేనని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
పౌరుల ప్రాణనష్టాన్ని నివారించడానికి తమ బలగాలు కృషి చేస్తున్నాయని ఇజ్రాయెల్ నొక్కి చెబుతోంది.
హమాస్ ఉద్దేశపూర్వకంగా పౌరులను ప్రమాదంలోకి నెడుతోందని ఆరోపించింది. మానవతా సహాయం పంపిణీపై ఎలాంటి ఆంక్షలు లేవని చెప్పింది.

అమెరికా
ఇజ్రాయెల్‌కు అతిపెద్ద ఆయుధ సరఫరాదారు అమెరికా. ప్రపంచంలోనే అత్యంత సాంకేతికంగా అత్యాధునికమైన మిలిటరీని ఇజ్రాయెల్ రూపొందించుకోవడంలో అమెరికా సహాయపడింది.
2019-2023 మధ్య కాలంలో ఇజ్రాయెల్ ప్రధాన సంప్రదాయక ఆయుధాల దిగుమతుల్లో 69 శాతం వాటా అమెరికాదే అని స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎస్‌ఐపీఆర్‌ఐ) గణాంకాలు చెబుతున్నాయి.
పదేళ్ల ఒప్పందం కింద అమెరికా 3.8 బిలియన్ డాలర్ల వార్షిక సైనిక సహకారాన్ని ఇజ్రాయెల్‌కు అందిస్తుంది.
ఇజ్రాయెల్ ఈ గ్రాంట్‌ను ఎఫ్-35 జాయింట్ స్ట్రైక్ ఫైటర్ విమానాలను ఆర్డర్ చేయడం కోసం ఉపయోగించింది. ఎఫ్-35ను ఇప్పటివరకు తయారుచేసిన వాటిలో అత్యంత అధునాతనమైనవిగా పరిగణిస్తారు.
ఇప్పటివరకు మొత్తం 75 ఎఫ్-35 విమానాలను ఆర్డర్ చేసిన ఇజ్రాయెల్ 30కి పైగా విమానాలను పొందింది. అమెరికా తర్వాత ఎఫ్-35 విమానాలను పొందిన, పోరాటాల్లో వీటిని వాడనున్న తొలి దేశం ఇజ్రాయెల్.
ఈ వార్షిక సహాయంలో కొంతభాగం అంటే ప్రతీ ఏటా 500 మిలియన్ డాలర్లను మిసైల్ డిఫెన్స్ ప్రోగ్రామ్స్ కోసం పక్కనపెడుతుంది. ఐరన్ డోమ్, యారో అండ్ డేవిడ్స్ స్లింగ్ సిస్టమ్స్ వంటి మిసైల్ డిఫెన్స్ ప్రోగ్రామ్‌ల కోసం ఈ నిధుల్ని కేటాయిస్తుంది.
గాజాలోని పాలస్తీనా సాయుధ గ్రూపులు, అలాగే లెబనాన్, సిరియా, ఇరాక్, యెమెన్‌లలో ఇరాన్ సహకారంతో నడిచే సాయుధ గ్రూపులు చేపట్టే రాకెట్, క్షిపణి, డ్రోన్ దాడులకు వ్యతిరేకంగా తనను తాను రక్షించుకునేందుకు ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ వాటిపై ఆధారపడుతుంది.
గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ దాడి తర్వాత, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్‌కు అదనపు సైన్య సహకారాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు.
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అత్యవసర ఆమోదం తర్వాత కేవలం రెండు మిలటరీ అమ్మకాలను మాత్రమే అమెరికా చేపట్టినట్లు బయటికి తెలిసింది.
వాటిలో ఒకటి 106 మిలియన్ డాలర్ల(రూ.886 కోట్ల) విలువైన 14 వేల రౌండ్ల ట్యాంకు మందుగుండు సామాగ్రి.
మరొకటి 155 ఎంఎం ఫిరంగి షెల్స్‌ను తయారు చేసేందుకు అవసరమైన 147 మిలియన్ డాలర్ల(రూ.1229 కోట్ల) కాంపోనెంట్లను అందించింది.
కానీ, అమెరికా మీడియా కథనాల ప్రకారం, జో బైడెన్ కార్యాలయం ఇజ్రాయెల్‌కు 100కి పైగా మిలటరీ అమ్మకాలను గుట్టుచప్పుడు కాకుండా చేపట్టినట్లు తెలిసింది.
ఈ డెలివరీలు చేపట్టినప్పటికీ, 2023లో అమెరికా నుంచి ఇజ్రాయెల్ దిగుమతి చేసుకున్న ఆయుధాల మొత్తం విలువ, 2022లో విలువకు దాదాపు సమానంగానే ఉన్నట్లు ఎస్‌ఐపీఆర్ఐ నివేదిక తెలిపింది.
మరో డీల్ పట్టాలపై ఉంది. 50 వరకు ఎప్-15 ఫైటర్ జెట్స్‌ను 18 బిలియన్ డాలర్లకు అమ్ముతున్నట్లు ఈ వారంలో వార్తలు వచ్చాయి. ఈ డీల్‌ను ఇంకా అమెరికా కాంగ్రెస్ ఆమోదించలేదు.
ఎఫ్-15 ఫైటర్ జెట్లను వెనువెంటనే డెలివరీ చేపట్టకపోతున్నప్పటికీ, ఈ డీల్ బైడెన్ డెమొక్రాటిక్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది.
కాంగ్రెస్‌లోని చాలామంది ప్రతినిధులు, బైడెన్ మద్దతుదారులు గాజాలో ఇజ్రాయెల్ చర్యలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ డీల్‌ను నిరోధించేందుకు తాను సిద్ధమవుతున్నట్లు సెనేటర్ ఎలిజబెత్ వారెన్ చెప్పారు. గాజాలో ఇజ్రాయెల్ విచక్షణారహితంగా బాంబుల దాడి జరుపుతుందని ఆరోపించారు.

ఫొటో సోర్స్, Reuters
జర్మనీ
ఇజ్రాయెల్‌కు ఆయుధాలను అందిస్తున్న మరో పెద్ద ఎగుమతిదారు జర్మనీ. ఎస్‌ఐపీఆర్ఐ నివేదిక ప్రకారం 2019 నుంచి 2023 మధ్య కాలంలో ఇజ్రాయెల్ ఆయుధాల దిగుమతుల్లో 30 శాతం వరకు జర్మనీ నుంచే వచ్చాయని తెలిసింది.
2023లో యూరోపియన్ దేశాల నుంచి ఇజ్రాయెల్‌కు జరిగిన ఆయుధాల అమ్మకాల విలువ 326.5 మిలియన్ యూరోలు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.2936 కోట్లు. 2022తో పోలిస్తే పదింతలు ఎక్కువగా ఈ అమ్మకాలు పెరిగాయి.
తమ అమ్మకాల్లో 306.4 మిలియన్ యూరోల(రూ.2727 కోట్ల) విలువైన మిలటరీ ఎక్విప్‌మెంట్, 20.1 మిలియన్ యూరోల యుద్ధ ఆయుధాలు ఉన్నట్లు జనవరిలో జర్మన్ ప్రభుత్వం చెప్పింది.
ఆయుధాల అభివృద్ధి, అసెంబ్లీ, నిర్వహణ, మరమ్మత్తుల కోసం అవసరమైన ల్యాండ్ వెహికిల్స్, టెక్నాలజీల కోసం అత్యధికంగా ఎగుమతుల లైసెన్స్‌లను ఆమోదించినట్లు డీపీఏ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

ఫొటో సోర్స్, Reuters
ఇటలీ
ఇజ్రాయెల్‌కు ఆయుధాలు సరఫరా చేస్తున్న మూడవ అతిపెద్ద దేశం ఇటలీ. కానీ, 2019 నుంచి 2023 మధ్య కాలంలో ఇజ్రాయెల్ దిగుమతులలో ఈ దేశ వాటా కేవలం 0.9 శాతమే. ఈ సరఫరాల్లో హెలికాప్టర్లు, నావల్ ఫిరంగులు ఉన్నాయి.
గత ఏడాది ఈ దేశం నుంచి ఇజ్రాయెల్‌కు చేపట్టిన ఆయుధాలు, మందుగుండు సామాగ్రి అమ్మకాలు 13.7 మిలియన్ యూరోలుగా(రూ.121 కోట్లుగా) ఉన్నట్లు నేషనల్ స్టాటిస్టిక్స్ బ్యూరో-ఐఎస్‌టీఏటీను ఉటంకిస్తూ ఆల్ట్రేకానమియా మేగజైన్ తెలిపింది.
మానవ హక్కులు ఉల్లంఘించే లేదా యుద్ధం చేసే దేశాలకు ఆయుధాల అమ్మకాలను నిషేధించే చట్టం కింద ఆయుధాల డీల్స్‌ను చేపట్టమని ప్రభుత్వం భరోసా ఇస్తున్నప్పటికీ, అక్టోబర్-డిసెంబర్ మధ్యలో 2.1 మిలియన్ యూరోల ఎగుమతులకు ఆమోదం తెలిపింది.
ఇతర దేశాలు
ఇజ్రాయెల్‌కు బ్రిటన్ చేసే మిలటరీ ఉత్పత్తుల ఎగుమతులు తక్కువగానే ఉన్నాయని యూకే ప్రభుత్వం చెప్పింది. 2022లో కేవలం 42 మిలియన్ పౌండ్ల(రూ.437 కోట్ల) విలువైన ఉత్పత్తులనే ఎగుమతి చేసినట్లు తెలిపింది.
అయితే, 2008 నుంచి మొత్తంగా ఇజ్రాయెల్‌కు 574 మిలియన్ పౌండ్ల విలువైన ఆయుధ ఎగుమతుల లైసెన్స్‌లకు బ్రిటన్ ఆమోదం తెలిపిందని ఆయుధ వ్యాపారానికి వ్యతిరేకంగా ప్రచారం చేపట్టే సీఏఏటీ తెలిపింది.
దానిలో ఎక్కువ భాగం ఇజ్రాయెల్‌కు వెళ్లే యుద్ధ విమానాల్లో వాడే కాంపోనెంట్లే ఉన్నాయి. ఈ ఎగుమతులను కూడా నిలిపివేయాలని బ్రిటన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.
బ్రిటన్‌లో అత్యంత పకడ్బందీ ఎక్స్‌పోర్ట్ లైసెన్స్ విధానం ఉందని ఆ దేశ ప్రధాన మంత్రి రిషి సునాక్ తెలిపారు.
అంతర్జాతీయ మానవతా చట్టానికి అనుగుణంగా ఇజ్రాయెల్ తప్పక నడుచుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.
అయితే, ఇజ్రాయెల్‌పై ఆయుధ ఆంక్షలు ఉండబోవని ప్రభుత్వ వర్గానికి చెందిన ఒక సీనియర్, బీబీసీకి చెప్పారు.
2022లో 21.3 మిలియన్ కెనడియన్ డాలర్ల(రూ.129 కోట్లు) ఆయుధ విక్రయాలను ఇజ్రాయెల్‌కు చేపట్టిన కెనడా ప్రభుత్వం, జనవరిలో కొత్త ఎక్జిట్ పర్మిట్స్ ను నిలిపివేస్తున్నట్లు తెలిపింది.
కెనడా చట్టానికి అనుగుణంగా నడుచుకునేంత వరకు ఇది కొనసాగుతుందని చెప్పింది. అంతకుముందు జరిపిన పర్మిట్స్ అలానే కొనసాగుతాయని పేర్కొంది.

ఫొటో సోర్స్, AFP
ఇజ్రాయెల్ రక్షణ పరిశ్రమ
అమెరికా సాయంతో ఇజ్రాయెల్ సొంతంగా రక్షణ పరిశ్రమను అభివృద్ధి చేసుకుంది. ప్రస్తుతం ప్రపంచంలో 9వ అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారు. హార్డ్‌వేర్‌పై కాకుండా అధునాతన సాంకేతిక ఉత్పత్తులపై ఇది దృష్టిసారిస్తోంది.
2019 నుంచి 2023 మధ్య కాలంలో ప్రపంచ ఆయుధ అమ్మకాల్లో దీని వాటా 2.3 శాతంగా ఉన్నట్లు సీఐపీఆర్ఐ డేటాలో తెలిసింది.
ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం 2022లో ఆయుధ అమ్మకాలు 12.5 బిలియన్ డాలర్లుగా(రూ.1,04,575 కోట్లుగా) ఉన్నట్లు తెలిసింది.
ఈ ఎగుమతుల్లో 25శాతం మానవ రహిత వైమానిక విమానాలు(యూఏవీలు), వాటి తర్వాత క్షిపణులు, రాకెట్లు, వైమానిక రక్షణ వ్యవస్థలు(19 శాతం), రాడార్, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలు(13 శాతం) ఉన్నాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
యుద్ధం ప్రారంభం కావడానికి ముందు, సెప్టెంబర్‌లో అధునాతన యారో 3 క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసేందుకు ఇజ్రాయెల్‌తో జర్మనీ 3.5 బిలియన్ డాలర్ల డీల్‌ను కుదుర్చుకుంది. లాంగ్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణులను ఇది అడ్డుకుంటుంది. ఇజ్రాయెల్ అతిపెద్ద డీల్ ఇది. అమెరికా కూడా దీనికి ఆమోదం తెలిపింది.

ఫొటో సోర్స్, EPA
ఇజ్రాయెల్‌లో అమెరికా మిలటరీ నిల్వలు
పెద్ద మొత్తంలో అమెరికా ఆయుధాల నిల్వకు ఇజ్రాయెల్ ఒక స్థావరంగా ఉంది. 1984 నుంచి ఈ నిల్వల కోసం ఒక డిపోను ఏర్పాటు చేసింది.
ఏదైనా ప్రాంతీయ సంక్షోభం ఏర్పడితే దళాలకు ముందస్తుగా సరఫరాలు చేపట్టేందుకు, అలాగే అత్యవసరంగా ఆయుధాల యాక్సెస్‌ను ఇజ్రాయెల్‌కు కల్పించేందుకు ఈ నిల్వలు చేపడుతుంది.
ఆయుధ డిపోలో ఉన్న మందుగుండు సామాగ్రి నిల్వలను గాజా యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇజ్రాయెల్‌కు సరఫరా చేసింది.
ఇవి కూడా చదవండి:
- ది రియల్ కేరళ స్టోరీ: రియాద్‌లో మరణశిక్ష పడిన రహీమ్ ప్రాణాలు కాపాడేందుకు హిందూ, ముస్లింలు ఏకమై రూ. 34 కోట్ల 'బ్లడ్ మనీ'ని ఎలా సేకరించారంటే..
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: వైసీపీకి చిక్కవు, టీడీపీకి దొరకవు
- రోజుకు ఎన్ని నీళ్లు తాగాలి? అతిగా తాగితే ఏమవుతుంది?
- ఇరాన్ ఎందుకు ఇజ్రాయెల్‌పై దాడులు చేసింది? ఆరు ప్రశ్నలు, సమాధానాలు..
- రెండు లక్షల 25 వేలు పలికిన ఆరు రూపాయల సాధారణ కోడి గుడ్డు, ఎందుకు?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














