ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్
హమాస్‌తో పోరాటంలో 'పూర్తి విజయం' సాధించే వరకూ అమెరికా ప్రజల తమకు సాయంగా ఉంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. ఇజ్రాయెల్ ప్రపంచ దేశాల మద్దతు కోల్పోయే ప్రమాదం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటన చేసిన తర్వాత నెతన్యాహు ఈ ప్రకటన చేశారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్

ఫొటో సోర్స్, ANI
జమ్ము కశ్మీర్‌లోనిముస్లిం కాన్ఫరెన్స్ జమ్ము అండ్ కశ్మీర్ (సుమ్జీ గ్రూపు), ముస్లిం కాన్ఫరెన్స్ జమ్ము అండ్ కశ్మీర్ (భట్ గ్రూపు)లపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది.
ఈ సమాచారాన్ని కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా తెలిపారు.
‘‘టెర్రరిస్ట్ నెట్‌వర్క్ పై కఠిన చర్యలు తీసుకోవడంలో భాగంగా ముస్లిం కాన్ఫరెన్స్ జమ్ము అండ్ కశ్మీర్ (సుమ్జీ గ్రూపు), ముస్లిం కాన్ఫరెన్స్ జమ్ము అండ్ కశ్మీర్ (భట్ గ్రూపు)లు చట్టవ్యతిరేకమైనవిగా ప్రభుత్వం ప్రకటిస్తోంది’’ అని రాశారు.
‘‘దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతను దెబ్బతీసే కార్యకలాపాల్లో ఈ రెండు సంస్థలకు భాగస్వామ్యం ఉంది. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. చట్టవ్యతిరేక కార్యకలాపాల్లొ పాల్గొనేవారెవరైనా సరే తీవ్ర పరిణామాలను ఎదుర్కోక తప్పదు’’ అని రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
హిమాచల్ ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో చిక్కుకుంది. సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖూ ప్రభుత్వానికి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
సుఖ్వీందర్ క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. శిమ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజీనామా ప్రకటన చేశారు.
విక్రమాదిత్య సింగ్ తల్లి ప్రతిభా సింగ్ హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నారు.
2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రతిభా సింగ్ సీఎం రేసులో ఉన్నారు. అయితే, కాంగ్రెస్ అధిష్టానం సుఖ్వీందర్ సింగ్ సుఖూకి సీఎంగా అవకాశం ఇచ్చింది.
మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడంతో కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్ రాజ్యసభ ఎంపీగా గెలుపొందారు.

ఫొటో సోర్స్, Reuters
ఆఫ్రికా దేశం మాలిలో బస్సు అదుపుతప్పి వంతెనపై నుంచి పడిపోవడంతో 31 మంది మరణించారు.
మాలీలోని కెనిబా పట్టణం నుంచి పొరుగున ఉన్న బుర్కినా ఫాసోకు వెళ్తుండగా, బాగో నది వంతెనను దాటే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో మరో పది మంది గాయాలపాలయ్యారు. వారిలో కొందరికి తీవ్రగాయాలయ్యాయి.
"వాహనాన్ని నియంత్రించడంలో డ్రైవర్ విఫలం కావడమే" ప్రమాదానికి కారణమని స్థానిక అధికారులు తెలిపారు.

ఫొటో సోర్స్, Magunta Sreenivasulu Reddy
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
ఈ మేరకు ఆయన బుధవారం ఉదయం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన నిర్ణయాన్ని ప్రకటించారు.
33 ఏళ్లుగా రాజకీయాలలో ఉన్నానని, మాగుంట కుటుంబం 11 సార్లు చట్టసభలకు పోటీ చేసిందన్నారు. అనివార్య కారణాల వల్ల వైసీపీని వీడుతున్నట్లు ఆయన చెప్పారు.
రానున్న లోక్‌సభ ఎన్నికలలో తన కుమారుడు మాగుంట రాఘవ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ఆయన ప్రకటించారు.
కాగా, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ దిల్లీ మద్యం కేసులో ఈడీ విచారణ ఎదుర్కొన్నారు.

ఫొటో సోర్స్, YEARS
హిమాచల్ ప్రదేశ్ కోటాలో ఒక రాజ్యసభ స్థానానికి జరిగిన ఓటింగ్‌లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడంతో ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది.
దీంతో అక్కడి పరిస్థితులను చక్కదిద్దే బాధ్యతలను హరియాణా మాజీ ముఖ్యమంత్రి, పార్టీ సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడా, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అప్పగించారు. వారిని సిమ్లాకు పంపించేందుకు నిర్ణయించారు.
క్రాస్ ఓటింగ్ చేసిన ఆరుగురు ఎమ్మెల్యేలతో మాట్లాడే బాధ్యతను పరిశీలకులుగా ఈ ఇద్దరు నేతలకు అప్పగించారు.
భూపిందర్ సింగ్ హుడా, డీకే శివకుమార్ బుధవారం ఉదయం సిమ్లా చేరుకుంటారని వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.
రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ తర్వాత ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు హరియాణాలో ఉన్నారు.
అసెంబ్లీ సమావేశాలకు ముందు గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసేందుకు బీజేపీ సిద్ధమవుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. జైరాం ఠాకూర్ నేతృత్వంలో బీజేపీ నేతలు గవర్నర్‌ను కలిసే అవకాశం ఉందని పీటీఐ పేర్కొంది.
కాంగ్రెస్ పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురు క్రాస్ ఓటింగ్ చేయడంతో కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీపై బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్ గెలుపొందారు.

ఫొటో సోర్స్, Getty Images
హమాస్‌తో పోరాటంలో 'పూర్తి విజయం' సాధించే వరకూ అమెరికా ప్రజల మద్దతు తమకు ఉంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు.
గాజాలో యుద్ధం విషయంలో 80 శాతం మంది అమెరికన్లు ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తున్నారని చెప్పిన ఆయన తన ప్రకటనలో ఓ సర్వేను ఉదహరించారు.
గాజాపై దాడి కారణంగా ఇజ్రాయెల్ ప్రపంచ దేశాల మద్దతు కోల్పోయే ప్రమాదం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటన చేసిన తర్వాత నెతన్యాహు ఈ ప్రకటన చేశారు.
''అంతర్జాతీయ ఒత్తిళ్లకు స్పందించాల్సిన పరిస్థితుల్లో, యుద్ధాన్ని త్వరగా ముగించేలా ఇజ్రాయెల్‌కు మద్దతు సమీకరించేందుకు'' ఈ ఘర్షణ ప్రారంభమైన నాటి నుంచే తాము ప్రయత్నిస్తున్నామని నెతన్యాహు చెప్పారు.
''అందులో మేం చెప్పుకోదగ్గ స్థాయిలోనే విజయాలు సాధించాం. ఇజ్రాయెల్‌కు 82 శాతం మంది అమెరికన్లు మద్దతు ఇస్తున్నట్లు సర్వే చెబుతోంది'' అంటూ ఇటీవల నిర్వహించిన హార్వర్డ్-హారిస్ సర్వేను నెతన్యాహు ఉదహరించారు.
మరోవైపు, కాల్పుల విరమణ ఒప్పందంపై కసరత్తు చేస్తున్నట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు.
హమాస్-ఇజ్రాయెల్ మధ్య 'వచ్చే సోమవారం నాటికి' కాల్పుల విరమణ ఒప్పందం ఓ కొలిక్కి రావొచ్చని గత సోమవారం అమెరికా పేర్కొంది.
తాజా వార్తలు, అప్డేట్లు అందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.