ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడి: ఎవరిది గెలుపు? ఎవరిది ఓటమి?

- రచయిత, మహమూద్ ఎల్నాగ్గర్
- హోదా, బీబీసీ న్యూస్ అరబిక్
“ఇరాన్‌కు సానుకూల పరిణామం” - ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ నేల మీదకు జరిగిన తొలి దాడిని విశ్లేషకులు ఇలాగే అభివర్ణించారు.
శనివారం రాత్రి ఇజ్రాయెల్ మీదకు ఇరాన్ 300కి పైగా డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించిందని ఇజ్రాయెల్ సైన్యం చెప్పింది.
సిరియాలోని డమాస్కస్‌లో ఉన్న తమ కాన్సులేట్ మీద జరిగిన దాడికి ప్రతిగా తాము జరిపిన దాడి అన్ని లక్ష్యాలను సాధించిందని ఇరాన్ సైన్యం ప్రకటించింది.
ఏప్రిల్ 1న సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్ కాన్సులేట్ ఆఫీస్ మీద ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసిందని ఇరాన్ ఆరోపించింది. ఈ దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన ఏడుగురు సిబ్బంది, ఆరుగురు సిరియన్లు మరణించారు. ఈ దాడిపై తమ స్పందన చాలా తీవ్రంగా ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది.
ఇరాన్ కాన్సులేట్ మీద దాడి చేసింది తాము కాదని ఇజ్రాయెల్ ఇప్పటి వరకు ప్రకటించలేదు. అయితే దాడి ఇజ్రాయెల్ పనే అయి ఉండవచ్చని అందరూ భావించారు.

లాభాలు, నష్టాలు
ఇజ్రాయెల్ మీద దాడి విజయవంతం అయిందని ఇరాన్ హర్షం ప్రకటించింది.
అయితే, ఈ దాడి వల్ల ఇరాన్‌కు ఎలాంటి లాభం లేదని లండన్‌లోని సెంటర్ ఫర్ అరబ్ ఇరానియన్ స్టడీస్ సంస్థకు చెందిన అలి నౌరీ జదేహ్ చెబుతున్నారు.
తాజా దాడితో ఇరాన్ పాలకుల బలహీనతలు బయటపడ్డాయని, ఇజ్రాయెల్‌లో ఒక్క లక్ష్యాన్ని కూడా ఇరాన్ చేధించలేకపోయిందని ఆయన తెలిపారు.
ఇరాన్‌లో కొంతమంది ప్రజలు ఈ దాడులను ఎగతాళి చేస్తున్నారు.
ఇరాన్ నేరుగా దాడులకు దిగకుండా, ఇజ్రాయెల్ మీద దాడి చేస్తాం అనే కోణంలో ఒత్తిడి పెంచినట్లయితే అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చే స్పందనతో ఇరాన్‌కు మరింత ప్రయోజనం ఉండేదని జదేహ్ నమ్ముతున్నారు.

మరోవైపు ఇజ్రాయెల్ దేశవ్యాప్తంగా అలర్ట్ ప్రకటించడం ద్వారా తన ప్రతిష్టను కోల్పోయిందని టెల్ అవీవ్ యూనివర్సిటీలో మిడిల్ ఈస్ట్ స్టడీస్ పరిశోధకుడు డాక్టర్ ఎరిక్ రుంటస్కీ చెప్పారు.
ఇజ్రాయెల్ చర్యలతో ఏర్పడిన ఉత్కంఠ వల్ల ఇలాంటి దాడులు మళ్లీ మళ్లీ జరుగుతాయోమోనని అనేకమంది ప్రజలు ఆందోళన చెందారని ఆయన తెలిపారు.
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ప్రస్తుతం మరింత శక్తిమంతంగా మారారనేది జదేహ్ అభిప్రాయం.
శనివారం ముందు వరకు గాజా విషయంలో పశ్చిమ దేశాలు, అమెరికా ఇజ్రాయెల్ తీరుని విమర్శిస్తున్నాయి. అయితే ఇరాన్ దాడి తర్వాత ఇజ్రాయెల్‌తో ఈ దేశాలకున్న సంబంధాలు మళ్లీ బలపడ్డాయి.
‘‘ఈ దాడుల వల్ల ఇజ్రాయెల్ కొన్ని విధాలుగా లాభపడి ఉండవచ్చు, అయితే అది వేరే మార్గాల్లో నష్టపోయింది’’ అని జదేహ్ చెప్పారు.
మధ్య ప్రాచ్య దేశాల శక్తియుక్తుల్ని గుర్తించడంలో ఇజ్రాయెల్ విఫలమైందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరాన్ తమ సరిహద్దుల్లోనే ఉండి ఇజ్రాయెల్‌పైకి దాడి చెయ్యకుండా నిరోధించడంలో టెల్ అవీవ్ నాయకత్వం విఫలమైందనేది ఆయన అన్నారు.

ఇజ్రాయెల్‌కు అండగా ముందుకొచ్చిన మిత్ర పక్షాలు
ఇరాన్ దాడి వల్ల ఇజ్రాయెల్ లాభపడింది.
ఇది రాజకీయంగా టర్నింగ్ పాయింట్‌గా భావించవచ్చని ఇజ్రాయెల్ పరిశోధకుడు ఎరిక్ రుండస్కీ అభిప్రాయం. ఎందుకంటే గాజాపై ఇజ్రాయెల్ దాడి తర్వాత ఆ దేశానికి దూరంగా జరుగుతున్న పశ్చిమ దేశాలు తిరిగి ఇజ్రాయెల్‌కు దగ్గరయ్యాయి.
పశ్చిమ దేశాలు తిరిగి ఇజ్రాయెల్‌కు సన్నిహితంగా మారాయని, ముఖ్యంగా అమెరికా- ఇజ్రాయెల్ సంబంధాల్లో ఏర్పడిన ఉద్రిక్తతలు తొలగిపోయాయి.
అయితే, దీనికి పూర్తి భిన్నంగా ఇరాన్ ఇంటా, బయటా రాజకీయంగా నష్టపోయిందనేది ఇరానియన్ పరిశోధకుడు అలి నౌరీ జదేహ్ అభిప్రాయం.
ఇరాన్ తన ఇరుగు పొరుగు దేశాల మద్దతు కోల్పోయిందని, ఆ దేశాలు ఏవీ ఇరాన్‌కు మద్దతు ఇవ్వలేదని ఆయన చెప్పారు. ఇరాన్‌ను నేరుగా అమెరికాతో యుద్ధం చేసేలా ముగ్గులోకి లాగేందుకు కొన్ని ప్రయత్నాలు జరిగాయని ఆయన గుర్తు చేశారు.
రెండు దేశాలకూ అంతర్గతంగా ఒత్తిళ్లు ఉన్నాయని రెండు దేశాలకు చెందిన పరిశోధకులు అంగీకరిస్తున్నారు.
గాజాలో హమాస్ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెలీలను విడిపించడంలో ఎలాంటి పురోగతి లేకపోవడం, రఫాఫై దాడి చేయాలంటూ ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీలు చేస్తున్న ఒత్తిడి లాంటివి ఇజ్రాయెల్ ప్రధానమంత్రికి ఇబ్బందికరంగా మారాయి.
అందుకే ఇరాన్‌పై దాడి విషయంలో ఇజ్రాయెల్ ఆచి తూచి అడుగేస్తుందని రుండస్కీ చెప్పారు.
ఇరాన్ అధినేత అయేతుల్లా ఖమేనీ కూడా తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. వీధుల్లోనే కాకుండా పాలనలోనూ ఆయన సాధించిన పురోగతిపైనా విమర్శలు వెల్లువెత్తున్నట్లు జదేహ్ చెబుతున్నారు.
“ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన అల్ కుడ్స్ బ్రిగేడ్స్‌కు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులను చంపిన తర్వాత కూడా తాము ఏమీ చేయలేకపోయామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఆగ్రహంతో ఉంది. ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని వారు ఖమేనీపై ఒత్తిడి తెస్తున్నారు.

బాంబు దాడులతో సందేశం ఇచ్చే ప్రయత్నం
ఈ దాడికి సంబంధించి ఆశ్చర్య పరిచే అంశం ఏంటంటే ఇది ఎవరినీ ఆశ్చర్యపరచలేదు అని మిడిల్ ఈస్ట్ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ ఇన్ బెరూత్ డైరెక్టర్ హిషమ్ జబేర్ తెలిపారు.
ఇరాన్ ఎంబసీ మీద దాడి తర్వాత రెండు వారాల పాటు “సైకలాజికల్ వార్‌ఫేర్” కొనసాగింది. ఈ సమయంలో ఇజ్రాయెల్ బాగా ఆందోళన చెందింది.
దీని వల్ల ఇజ్రాయెల్ సమాజం మానసికంగా, పారిశ్రామికంగా నష్టపోయింది. ఇరాన్ దాడి చేస్తుందనే ఆందోళనతో ఇజ్రాయెల్ దేశమంతా అలర్ట్ జారీ చేసింది.
కీలకమైన సంస్థలను మూసివేసింది. అనేక ఇజ్రాయెల్ కుటుంబాలు ఇళ్లను వదిలి వెళ్లాయి.
ఇరాన్ దాడి “ నిప్పుతో ఇచ్చిన సందేశం” అని జబేర్ అభివర్ణించారు. ఇజ్రాయెల్ భూభాగంలోకి తాము ఎంత దూరం వరకు దాడి చెయ్యగలం అనే దానితో పాటు ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల సామర్థ్యాన్ని పరీక్షించింది.
ఇరాన్ కొంత కాలంగా అమలు చేస్తున్న “వ్యూహాత్మక సహనం” అనే విధానం వల్ల ఆ దేశ ప్రతిష్ట రాజకీయంకా కొంత మసకబారింది. అయితే తాజా దాడితో ఇరాన్ దాన్ని పునరుద్దరించుకుందని ఆయన నమ్ముతున్నారు.
ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థలను అయోమయంలో పడేసేందుకే ఇరాన్ ఒకేసారి 300 డ్రోన్లతో దాడి చేసిందని లెబనీస్ సైనిక నిపుణుడు భావిస్తున్నారు.
ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఒక్కటే ఇరాన్ క్షిపణులను ఎదుర్కొనలేదని, మిడిల్‌ఈస్ట్‌లోని అమెరికా, బ్రిటన్ ఎయిర్ బేస్‌ల నుంచి దానికి సాయం అందిందని ఆయన చెబుతున్నారు.
“ఇజ్రాయెల్ కనుక సైనికపరంగా స్పందించాలని అనుకుని ఉంటే అది ఇరాన్ భూభాగం మీదకు మిస్సైళ్లతో దాడి చేసి ఉండేదని, అయితే ఇరాన్ ఇంకా తీవ్రంగా స్పందిస్తుందనే ఆలోచనతో అంత దూరం వెళ్లలేదని జబేర్ చెప్పారు.
“ఇజ్రాయెల్ విమానాలు ఇరాన్‌లో కచ్చితమైన లక్ష్యాలపై పక్కాగా దాడులు చెయ్యగలవు. అయితే అందుకు వాళ్లు అరబ్ దేశాల గగనతలంలో నుంచి ప్రయాణించాలి లేదా అమెరికన్ సైనిక స్థావరాల నుంచి దాడులు చెయ్యాలి. అయితే అందుకు అమెరికా అంగీకరించదు” అని ఆయన చెప్పారు.

దిశ మార్చుకోవడం ద్వారా ఆత్మవిశ్వాస పునరుద్ధరణ
దాడుల వల్ల ఇరాన్‌తో పోలిస్తే ఇజ్రాయెల్ ఎక్కువగా లాభపడిందని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో అంతర్జాతీయ సంబంధాల ప్రొఫెసర్ ఫవాజ్ గర్జెస్ చెప్పారు.
ఇరాన్ దాడుల వల్ల ఇజ్రాయెల్‌లో చెప్పుకోదగిన ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ జరగలేదు.
పైగా పశ్చిమ దేశాలన్నీ ఇజ్రాయెల్‌కు బాసటగా నిలుస్తున్నాయి. ఆయుధాలు, నిఘా, సహకారం, ఆర్థికంగా, ఇతరత్రా అంశాలలో ఇజ్రాయెల్‌కు సాయం చేసేలా పశ్చిమ దేశాలను ఏకతాటిపైకి తీసుకు వచ్చేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని ఆయన చెప్పారు.
ఇజ్రాయెల్‌ను బాధిత దేశంగా చూపించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రయత్నిస్తున్నారు.
ఇజ్రాయెల్‌కు మద్దతు కూడగట్టేందుకు ఆయన అర్జంట్‌గా జీ7 దేశాల సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు.
“గాజాలో పౌరుల మీద జరుగుతున్న దాడులు, అకృత్యాల గురించి తాత్కాలికంగానైనా అంతర్జాతీయ సమాజం దృష్టి మళ్లించడంలో తమ దేశానికి మద్దతు కూడగట్టడంలో నెతన్యాహు రాజకీయంగా లాభపడ్డారు” అని ఆయన చెప్పారు.
గాజాలో ఇజ్రాయెల్ సైన్యం అకృత్యాలపై పశ్చిమ దేశాలు తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్న వేళ " తాజా దాడి వల్ల పశ్చిమ దేశాలతో ఇజ్రాయెల్ సంబంధాలు మెరుగు పడ్డాయి. ముఖ్యంగా జో బైడెన్‌తో సంబంధాల పునరుద్దరణలో నెతన్యాహు లాభపడ్డారు" అని ఆయన గుర్తు చేస్తున్నారు.

ఇజ్రాయెల్‌కు వ్యూహాత్మక నష్టం
దౌత్య పరమైన లాభాలను పక్కన పెడితే ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా నష్టపోయిందనేది గెర్జెస్ అభిప్రాయం. శత్రు దుర్బేధ్యమని భావిస్తున్న ఇజ్రాయెల్ దౌర్బల్యానికి తాజా దాడి ఒక ఉదాహరణగా నిలిచింది అని ఆయన చెప్పారు.
దాడి చేయడం ద్వారా ఇరాన్ ప్రభుత్వం స్వదేశంలో ప్రజలు, భాగస్వామ్య పక్షాలు, ఇజ్రాయెల్‌ను ద్వేషించే దేశాల మద్దతు ఇరాన్‌కు దక్కింది.
ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకోలేదని తాజా దాడి నిరూపించింది అని గెర్జెస్ చెప్పారు. ఎందుకంటే ఇరాన్ ప్రయోగించిన మిస్సైళ్లను అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జోర్డాన్‌కు చెందిన యాంటీ మిసైల్స్ సిస్టమ్స్‌తో కూల్చివేశారు.
ఇరాన్ మీద పదే పదే దాడులు చెయ్యడం ద్వారా ఆ దేశం బలహీనంగా ఉందని, ఎదురు దాడి చేసే సత్తా ఆ దేశానికి లేదని చెప్పాలనేది ఇజ్రాయెల్ లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే ఇరాన్ దాడి చెయ్యడం ద్వారా ఇజ్రాయెల్ ఆలోచనలను బద్దలు చేసిందని ఆయన చెప్పారు.
ఇజ్రాయెల్, ఇరాన్ దూకుడు ప్రదర్శిస్తూ ఉండటంతో “ప్రస్తుతం ఈ ప్రాంతం ఒక పెద్ద వరద ప్రవాహానికి ముఖద్వారంగా ఉంది” అని గెర్జెస్ చెప్పారు.
ఈ ప్రాంతం రాజకీయంగా, సైనికపరంగా, ఆర్థికంగా పేలడానికి సిద్ధంగా ఉన్న గ్రనేడ్‌లా ఉందని ఆయన హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి:
- ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్: ఇజ్రాయెల్‌పై డ్రోన్స్, మిసైల్స్‌తో దాడి చేసిన ఈ ఇరాన్ దళం పవర్ ఏంటి?
- ది రియల్ కేరళ స్టోరీ: రియాద్‌లో మరణశిక్ష పడిన రహీమ్ ప్రాణాలు కాపాడేందుకు హిందూ, ముస్లింలు ఏకమై రూ. 34 కోట్ల 'బ్లడ్ మనీ'ని ఎలా సేకరించారంటే...
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: వైసీపీకి చిక్కవు, టీడీపీకి దొరకవు
- అరబ్- ఇజ్రాయెల్ యుద్ధం 1967: అరబ్ నేలను నాశనం చేసిన ఆ ఆరు రోజుల్లో ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














