ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్: ఇజ్రాయెల్‌పై డ్రోన్స్, మిసైల్స్‌తో దాడి చేసిన ఈ ఇరాన్ దళం పవర్ ఏంటి?

ఇరాన్

ఫొటో సోర్స్, AFP

ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ) 1979లో ఏర్పాటైంది. ఇరాన్ ఇస్లామిక్ వ్యవస్థ రక్షణకు, సాధారణ ఆర్మీకి ప్రత్యామ్నాయంగా ఈ దళాన్ని ఏర్పాటు చేశారు.

ఇప్పుడు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఇరాన్‌లో సైనికపరంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఆధిపత్య శక్తిగా మారింది. రెవల్యూషనరీ గార్డ్ కోర్‌ను ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ, ఇతర సీనియర్ నాయకులకు సన్నిహితమైనదిగా పరిగణిస్తారు.

రెవల్యూషనరీ గార్డ్స్‌లో 1,90,000 మంది సైనికులు ఉన్నట్లు అంచనా. వారిని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌గా విభజించారు. మరీముఖ్యంగా ఇరాన్ అణ్వాయుధాలు రెవల్యూషనరీ గార్డ్స్ పరిధిలోకి వస్తాయి.

అలాగే, బసిజ్ రెసిస్టెన్స్ ఫోర్స్‌గా పిలిచే పారామిలిటరీ దళం కూడా రెవల్యూషనరీ గార్డ్స్ నియంత్రణలో ఉంటుంది. దేశంలో అంతర్గత నిరసనలను, ఇరాన్‌లోని స్వచ్ఛంద సంస్థల అణచివేతకు బసిజ్ రెసిస్టెన్స్ ఫోర్స్‌ను ఉపయోగిస్తారు. ఈ స్వచ్ఛంద సంస్థలు ఇరాన్ ఆర్థిక వ్యవస్థలో కీలకం.

రెవల్యూషనరీ గార్డ్స్ ఇరాన్‌లోనే కాకుండా గల్ఫ్ దేశాల్లో కూడా ప్రభావం చూపుతోంది. గల్ఫ్‌లోని మిత్ర దేశాలకు, సాయుధ సమూహాలకు డబ్బు, ఆయుధాలు, సాంకేతికతతో పాటు శిక్షణ కూడా ఇస్తోంది. నిజానికి, రెవల్యూషనరీ గార్డ్స్‌కి చెందిన ఖుద్స్ (జెరూసలేం) ఫోర్స్ విదేశాలలో ఈ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఖుద్స్ ఫోర్స్‌ను విదేశీ వ్యవహరాల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగంగా చెప్పవచ్చు.

ఖుద్స్ ఫోర్స్ ఉగ్రవాద సంస్థలకు మద్దతుగా నిలుస్తోందని, ఇరాక్‌తో సహా గల్ఫ్‌లోని అనేక ప్రాంతాల్లో దాడులకు ఖుద్స్ ఫోర్స్‌దే బాధ్యతని అమెరికా ఆరోపించింది. ఈ దాడుల్లో వందలాది మంది అమెరికా, దాని మిత్రదేశాల సైనికులు చనిపోయారు.

బదులుగా, 2020 జనవరి 3న బాగ్దాద్‌లో డ్రోన్‌తో దాడి చేసి ఖుద్స్ ఫోర్స్ కమాండర్, మేజర్ జనరల్ ఖాసిం సులేమానీని అమెరికా మట్టుబెట్టింది.

ఇరాక్‌లో రాకెట్ దాడి వెనుక సులేమానీ హస్తం ఉందని అమెరికా రక్షణ శాఖ తెలిపింది. ఈ దాడిలో అమెరికాకు చెందిన ఓ కాంట్రాక్టర్ చనిపోయారు.

ఆ, ఇరాక్, గల్ఫ్‌లోని అమెరికన్ ఎంబసీ అధికారులు, సైనికులపై దాడి చేసేందుకు సులేమానీ ప్రణాళికలు రచించారు. ఖాసిం సులేమానీని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అల్-ఖమేనీకి అత్యంత సన్నిహితుడిగా చెబుతారు.

అమెరికా సులేమానీని హతమార్చిన తర్వాత, సైనిక చర్య ద్వారా ప్రతీకారం తీర్చుకుంటానని అయతొల్లా ఖమేనీ అన్నారు.

ఇరాన్

ఫొటో సోర్స్, EPA

ఇస్లామిక్ వ్యవస్థ సంరక్షకులు

1979 ఇరాన్‌ ఇస్లామిక్ విప్లవానికి ముందు, షా ముహమ్మద్ రెజా పహ్లావి తన అధికారాన్ని నిలుపుకోవడం కోసం, జాతీయ భద్రత రీత్యా సైనిక బలగాలపై ఆధారపడ్డారు. కానీ, అయతొల్లా రుహోల్లా ఖమేనీ నాయకత్వంలో ఇస్లామిక్ స్థాపన జరిగిన తర్వాత అధికారాన్ని కొనసాగించడానికి, ఆ భావజాలాన్ని బలోపేతం చేసేందుకు శక్తిమంతమైన సైన్యం అవసరమని గ్రహించారు.

ఇస్లామిక్ విప్లవ మార్గదర్శకులు కొత్త రాజ్యాంగ వ్యవస్థను అమలు చేశారు.

ఈ ఏర్పాటు ప్రకారం, ఇరాన్ సాధారణ సైన్యాన్ని ఆర్టేష్ అని పిలుస్తారు. ఇరాన్ సరిహద్దుల రక్షణ, అంతర్గత భద్రతకు ఆర్టేష్ బాధ్యత వహిస్తుంది. ఇస్లామిక్ వ్యవస్థ రక్షణకు సీపెహ్-ఎ-పసాదరన్ అనే ప్రత్యేక గార్డు కోర్ ఏర్పాటు చేశారు.

క్లుప్తంగా చెప్పాలంటే, ఇస్లామిక్ వ్యవస్థ రక్షణ కోసం రెవల్యూషనరీ గార్డ్స్‌ ఏర్పాటైంది.

మొదట్లో ఇదో చిన్న సమూహం. దాని ప్రభావం కూడా పరిమితమే. కానీ, నేడు రెవల్యూషనరీ గార్డ్స్ చాలా పెద్ద సంస్థగా అవతరించింది. ఇప్పుడు దాదాపు అన్ని రంగాలపై దాని ప్రభావం ఉంది. ఇరాన్ ప్రభుత్వంలోనూ ఆ సంస్థ అధికారులు కీలకపాత్ర పోషిస్తున్నారు.

అన్నింట్లోనూ రెవల్యూషనరీ గార్డ్స్ జోక్యం ఉంటోంది. అంతర్గత శాంతిభద్రతల నిర్వహణలో తరచూ సాయం చేస్తుంది. అలాగే సొంతంగా సాయుధ బలగాలు, నావికా, వైమానిక దళాల అభివృద్ధిపై కూడా పనిచేస్తుంది.

ఇరాన్ సాధారణ ఆర్మీ కంటే దాదాపు 2,30,000 మంది తక్కువ మంది సైనికులు ఉన్నప్పటికీ, ఇరాన్‌లో రెవల్యూషనరీ గార్డ్స్‌ను అత్యంత ప్రభావవంతమైన శక్తిగా పరిగణిస్తున్నారు. ఇరాన్ ప్రధాన ఆర్మీ కార్యకలాపాల వెనక కూడా రెవల్యూషనరీ గార్డ్స్ ప్రమేయం ఉంటుంది.

మేజర్ జనరల్ హుస్సేన్ సలామీ ప్రస్తుతం రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్‌గా ఉన్నారు. ఆయనతో పాటు మరికొందరు సీనియర్ అధికారులు ఖమేనీకి సలహాదారులుగా ఉన్నారు.

రెవల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన నేవీ విభాగం వ్యూహాత్మకంగా కీలక ప్రాంతమైన హార్ముజ్ జలసంధిలో పెట్రోలింగ్ బాధ్యతలు నిర్వహిస్తుంది. ఈ హార్ముజ్ జలసంధి గల్ఫ్‌ను, హిందూ మహాసముద్రంతో అనుసంధానం చేస్తుంది. ప్రపంచంలోని ముడి చమురులో 20 శాతం ఈ జలసంధి మీదుగానే రవాణా అవుతోంది. సహజంగానే, ఈ ప్రాంతం ఇరాన్‌తో సహా అమెరికా, దాని మిత్రదేశాలకు చాలా కీలకం.

రెవల్యూషనరీ గార్డ్స్ నేవీకి చెందిన చిన్న బోట్లు ఇరాన్ సముద్ర సరిహద్దుల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన అమెరికా యుద్ధనౌకలను అనేకసార్లు అడ్డుకున్నాయి. అలాగే, కార్గో షిప్‌లను సీజ్ చేయడం లేదా దారి మళ్లించడం చేస్తుంటాయి. రెవల్యూషనరీ గార్డ్స్ వైమానిక దళం యుద్ధ విమానాలను నడపనప్పటికీ, ప్రస్తుతం ఇరాన్ క్షిపణులకు బాధ్యత వహిస్తోంది.

అమెరికా చెబుతున్న వివరాల ప్రకారం, ఇరాన్ వద్ద భారీగా బాలిస్టిక్ మిస్సైల్స్ నిల్వలున్నాయి. పది కంటే ఎక్కువ బాలిస్టిక్ మిస్సైల్ వ్యవస్థలు, వందలకొద్దీ మిస్సైల్స్‌ నిల్వ ఉన్నాయి.

2018లో ఉత్తర ఇరాక్‌లోని ఇరాన్ కుర్దిష్ తిరుగుబాటు గ్రూపులు, సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ స్థావరాలపై బాలిస్టిక్ మిస్సైల్స్‌ ప్రయోగించారు.

ఇరాన్

ఫొటో సోర్స్, AFP

విదేశాల్లో ఖుద్స్ ఆర్మీ కార్యకలాపాలు

కొద్దికాలంగా రెవల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన ఖుద్స్ ఫోర్స్ లేదా ఖుద్స్ ఆర్మీని అత్యంత ముఖ్యమైన యూనిట్‌గా చెబుతున్నారు. తన విదేశాంగ లక్ష్యాలను సాధించేందుకు ఇరాన్ ప్రభుత్వం ఈ ఖుద్స్ ఆర్మీని వినియోగిస్తుందని చెబుతారు.

సిరియా ఘర్షణల్లో ఖుద్స్ ఫోర్స్‌ను వినియోగించినట్లు ఇరాన్ అంగీకరించింది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ - అస్సాద్ దళాలతో పాటు ఆయనకు మద్దతుగా పోరాడిన వేలాది మంది షియా ముస్లిం ఫైటర్స్‌కు ఖుద్స్ ఫోర్స్ మార్గనిర్దేశం చేసింది. ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌ను ఓడించేందుకు షియా పారామిలటరీ దళాలకు ఖుద్స్ ఫోర్స్ సాయం చేసింది. ఈ కార్యకలాపాలతో రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మేజర్ జనరల్ సులేమానీకి ఇరాన్‌లో మంచి ఆదరణ లభించింది.

2003లో అమెరికా సద్దాం హుస్సేన్‌ను పదవీచ్యుతుడిని చేసి ఇరాక్‌ను ఆక్రమించింది. ఆ తర్వాత గల్ఫ్ దేశాల్లో ఖుద్స్ ఫోర్స్ కార్యకలాపాలు పెరిగాయి.

డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, అమెరికా, గల్ఫ్ దేశాలు టెర్రరిస్టు సంస్థలుగా గుర్తించిన సమూహాలకు ఇరాన్‌కు చెందిన ఖుద్స్ ఫోర్స్ మద్దతు ఇస్తోందని ట్రంప్ ప్రభుత్వం ఆరోపించింది.

లెబనాన్‌, పాలస్తీనాలోని ఇస్లామిక్ జిహాద్‌కు ఖుద్స్ ఫోర్స్ మద్దతిస్తోందని కూడా ఇరాన్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ సంస్థలు, గ్రూపులకు ఖుద్స్ ఫోర్స్ శిక్షణ ఇవ్వడంతో పాటు డబ్బు, ఆయుధాలు, సామగ్రిని సమకూరుస్తోందని ఆరోపించింది.

ఖుద్స్ ఫోర్స్ నేరుగా లేదా దాని అనుబంధ ఉగ్రవాద సంస్థల ద్వారా ఐదు ఖండాల్లో టెర్రరిస్టు దాడులకు పాల్పడుతోందని అమెరికా ఆరోపణలు చేసింది. 2011లో జార్జిటౌన్ బాంబు దాడిలో అమెరికాలోని సౌదీ రాయబారిని హతమార్చేందుకు ఖుద్స్ ఫోర్స్ కుట్ర చేసిందనే ఆరోపణలు కూడా వచ్చాయి. నిరుడు జర్మనీ-ఇజ్రాయెల్ గ్రూప్ మాజీ అధిపతి, ఆయన సహచరులపై ఖుద్స్ ఫోర్స్ గూఢచర్యం చేసినట్లు జర్మనీలోని కోర్టు ఆరోపించింది.

ఈ ఆరోపణల కారణంగా 2019 ఏప్రిల్‌లో రెవల్యూషనరీ గార్డ్స్‌ను 'ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్'గా అమెరికా ప్రకటించింది.

ఇరాన్

ఫొటో సోర్స్, AFP

ఒక దేశ అధికారిక సైనిక బృందాన్ని టెర్రరిస్ట్ సంస్థగా ప్రకటించడం ఇదే తొలిసారి. ఇరాన్‌పై ఆంక్షలను కూడా మరింత కఠినతరం చేసింది. చమురు ఎగుమతులపై విధించిన ఆంక్షలు ఇరాన్ ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచాయి.

దానికి బదులుగా, జూన్‌లో హార్ముజ్ జలసంధిలో అమెరికా సైనిక డ్రోన్‌ను రెవల్యూషనరీ గార్డ్స్ కూల్చివేసింది. ఆ తర్వాత నెలలో అదే ప్రాంతంలో ఇంగ్లండ్‌కు చెందిన ఆయిల్‌ ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకుంది. ఇది కాకుండా, గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో 6 చమురు ట్యాంకర్ల పేలుళ్ల వెనుక ఇరాన్ హస్తం ఉందని అమెరికా ఆరోపించింది.

సెప్టెంబర్‌లో సౌదీ అరేబియాలో జరిగిన డ్రోన్, క్రూయిజ్ మిస్సైల్ దాడి, ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరంపై రాకెట్ దాడి, అందులో అమెరికన్ కాంట్రాక్టర్ హత్య వంటి ఆరోపణలు ఇరాన్‌పై వచ్చాయి. అయితే, వాటితో తమకెలాంటి సంబంధం లేదని ఇరాన్ తోసిపుచ్చింది.

రాకెట్ దాడి తర్వాత అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఆ తర్వాత డిసెంబర్‌లో ఇరాక్, సిరియాలోని ఇరాన్ అనుకూల గ్రూపుల ఐదు స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు చేసింది.

ఐదు రోజుల తర్వాత, బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వస్తున్న కాన్వాయ్‌పై అమెరికా డ్రోన్‌తో దాడి చేసింది. అందులో మేజర్ జనరల్ సులేమానీ మరణించారు. ఆయనతో పాటు ఇతర అధికారులు కూడా చనిపోయారు.

2001 నుంచి 2006 మధ్య, బ్రిటిష్ విదేశాంగ కార్యదర్శి జాక్ స్ట్రా అనేక సార్లు ఇరాన్‌‌లో పర్యటించారు.

ఆయన అభిప్రాయం ప్రకారం, ఇరాన్‌లోని సాధారణ ఆర్మీ చీఫ్ కంటే రెవల్యూషనరీ గార్డ్స్ అధిపతికే ఎక్కువ ప్రాధాన్యం ( ఆ సమయంలో మేజర్ జనరల్ ఖాసిం సులేమానీ రెవల్యూషనరీ గార్డ్స్‌ కమాండర్‌). ఇరాన్ విదేశాంగ విధానంలో సులేమానీ పాత్ర కీలకమని స్ట్రా చెప్పారు.

ఇరాన్

ఫొటో సోర్స్, REUTERS

రెవల్యూషనరీ గార్డ్స్ ఆర్థిక సామర్థ్యం

రెవల్యూషనరీ గార్డ్స్ ఇరాన్‌లో కేవలం సైనికపరంగానే కాకుండా, పౌర సమాజంపై కూడా ప్రభావం చూపగలిగే స్థాయిలో ఉన్నారు.

ఇస్లామిక్ వాలంటీర్ సాయుధ సమూహమైన బసిజ్ రెసిస్టెన్స్ ఫోర్స్‌ కింద దాదాపు 1,00,000 మంది పురుషులు, మహిళలు రెవల్యూషనరీ గార్డ్స్ నియంత్రణలో ఉన్నారు.

బసిజ్ దళాలు ఇస్లామిక్ విప్లవానికి బలమైన మద్దతుదారులు. ఇరాన్‌లో ప్రభుత్వ విధానాలపై నిరసనలు, వ్యతిరేకత వచ్చినప్పుడు ఈ దళాలను రంగంలోకి దించుతారు.

2009లో అప్పటి అధ్యక్షుడు మహమూద్ అహ్మదీనెజాద్ వివాదాస్పద ఎన్నిక అనంతరం ఇరాన్‌లో భారీ నిరసనలు జరిగాయి. వాటిని నియంత్రించడంలో రెవల్యూషనరీ గార్డ్స్, బసిజ్ రెసిస్టెన్స్ ఫోర్స్ కీలకపాత్ర పోషించాయి. ఆ సమయంలో డజన్ల కొద్దీ నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది అరెస్టయ్యారు.

ఇరాన్‌లో రెవల్యూషనరీ గార్డ్స్‌కు ఉన్న ప్రజాదరణ, అయతొల్లా ఖమేనీ బలమైన మద్దతు రెవల్యూషనరీ గార్డ్స్‌ను ఇరాన్ రాజకీయాల్లో కీలకంగా మార్చాయి.

రెవల్యూషనరీ గార్డ్స్ మాజీ అధికారులు ప్రస్తుత ప్రభుత్వంతో పాటు పార్లమెంట్, ఇతర శాఖల్లో ముఖ్యమైన పదవుల్లో ఉన్నారు. వారిలో పార్లమెంట్ స్పీకర్ అలీ లారిజానీ, ఎక్స్‌పెడియన్సీ కౌన్సిల్ సెక్రటరీ మొహసన్ రిజాయ్ ఉన్నారు.

రెవల్యూషనరీ గార్డ్స్ అధికారులు కూడా తరచూ ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తుంటారు.

2015 అణుఒప్పందం సమయంలో, ప్రపంచ ఆధిపత్య శక్తులతో జరిగిన చర్చల్లో అప్పటి అధ్యక్షుడు, మృదుస్వభావి అయిన హసన్ రౌహానీ రాయితీలు ప్రకటించడాన్ని అప్పటి రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మేజర్ జనరల్ మహమ్మద్ అలీ జాఫారీ బహిరంగంగానే వ్యతిరేకించారు.

రెవల్యూషనరీ గార్డ్స్ ఇరాన్ ఆర్థిక వ్యవస్థలో మూడింట ఒక వంతు నియంత్రిస్తోందని చెబుతారు. అనేక ట్రస్టులు, సంస్థల రూపంలో ఇరాన్ ఆర్థిక వ్యవస్థను రెవల్యూషనరీ గార్డ్స్ నియంత్రిస్తోంది.

సైనిక పరిశ్రమలతో పాటు గృహనిర్మాణం, రహదారులు, ఆనకట్టల నిర్మాణం, చమురు - సహజ వాయువు ప్రాజెక్టులు, ఆహారం, రవాణా, విద్య, సాంస్కృతిక రంగాల్లో రెవల్యూషనరీ గార్డ్స్ చురుగ్గా ఉన్నారు.

రెవల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన ఇంజినీరింగ్ విభాగం ఖతం-ఓల్-అన్బియా అలియాస్ ఘోర్బ్‌లో వేలాది మంది ఉద్యోగులున్నారు. ఈ సంస్థ బిలియన్ డాలర్లు విలువ చేసే ఇంజనీరింగ్ కాంట్రాక్టులను పొందింది.

రెవల్యూషనరీ గార్డ్స్ వ్యాపార సామ్రాజ్య విస్తరణపై రౌహానీ తరచూ విమర్శలు చేస్తూనే ఉంటారు.

రౌహానీ ఒకప్పుడు రెవల్యూషనరీ గార్డ్స్‌ను ఉద్దేశించి 'సాయుధ ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో భయాందోళనలను కారణమవుతుంది' అన్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)