ఇరాన్ దాడులకు 'సరైన సమయం'లో బదులిస్తామన్న ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, హ్యుగో బచేగ
- హోదా, మిడిల్ ఈస్ట్ కరస్పాండెంట్
- నుంచి, జెరుసలెం
యుద్దం వద్దంటూ విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్న నేపథ్యలో ఇరాన్‌పై భారీగా ప్రతీకార దాడులు చేసే అవకాశాలను ఇజ్రాయెల్ బేరీజు వేసుకుంటోంది.
ఇజ్రాయెల్‌పై ఇరాన్ నేరుగా ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లన్నింటినీ ఇజ్రాయెల్, దాని మిత్రదేశాలు కూల్చివేశాయి.
ప్రాంతీయ ఉద్రిక్తతల పెరగకుండా చూసేందుకు ఇజ్రాయెల్ ప్రతీకారంలో తాము భాగస్వాములం కామని అమెరికా చెప్పింది.
సరైన సమయంలో ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకునేలా చేస్తామని ఇజ్రాయెలీ మంత్రి బెన్నీ గాంట్జ్ చెప్పారు.
ఏప్రిల్ 1వ తేదీన సిరియా రాజధాని దమాస్కస్‌లో ఇరాన్ రాయబార కార్యాలయంపై జరిగిన వైమానిక దాడి కారణంగా ఇద్దరు ఇరాన్ అగ్ర సైనికాధికారుల సహా పలువురు సైనిక సలహాదారులు చనిపోయారు.

ఫొటో సోర్స్, Ministry of Defense, Israel
ఈ దాడికి ఇజ్రాయెలే కారణమని ఇరాన్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో దాదాపు రెండు వారాల నుంచి ఇజ్రాయెల్ భూభాగంపై దాడిచేస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది.
ఇజ్రాయెల్ మిలటరీ ప్రతినిధి రేర్ అడ్మిరల్ డేనియల్ హగారీ ఇరాన్ 300 పేలుడు డ్రోన్లు, క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని తెలిపారు.
అమెరికా, బ్రిటన్, జోర్డాన్, ఇతర మిత్రదేశాల సహకారంతో డ్రోన్లు, క్షిపణులలో 99 శాతాన్ని ఇజ్రాయెల్ ధ్వంసం చేసిందని తెలిపారు.
అర్థరాత్రి 1గంట 45 నిమిషాలకు జెరుసలెంపైకి దూసుకొచ్చిన క్షిపణులను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకోవడంతో, వైమానిక దాడుల సైరన్లతో నగరం మారుమోగింది.
ఈ దాడుల కారణంగా దేశవ్యాప్తంగా ముప్పు ఎదుర్కొనే ప్రాంతాలు, క్షిపణులు తాకే అవకాశమున్న ప్రాంతాలను ఎర్రని చుక్కలతో గుర్తించిన ఓ మ్యాప్‌ను ఇజ్రాయెలీ మిలటరీ ప్రచురించింది. ఆయా ప్రాంతాలలోని ప్రజలు సురక్షిత ప్రాంతాలలో తల దాచుకోవాలని కోరింది.
మొత్తానికి ఈ దాడులు పరిమిత ప్రభావాన్నే చూపాయి. ఇజ్రాయెల్ దక్షిణ భాగంలోని సైనిక స్థావరం స్వలంగా దెబ్బతిన్నట్టు ఇజ్రాయెలీ మిలటరీ చెప్పింది.
ఓ మిస్సైల్ ను కూల్చివేసినప్పుడు, దాని ముక్కలు పడటం వల్ల ఓ ఏడేళ్ళ బాలిక తీవ్రంగా గాయపడినట్టు ఇజ్రాయెలీ సైన్యం తెలిపింది.

ఫొటో సోర్స్, Reuters
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ దాడిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడారు. ఇజ్రాయెల్ భద్రతకు ఉక్కుకవచంలా ఉంటామన్నారు. కానీ ఇజ్రాయెల్ ప్రతీకారానికి మద్దతు ఇవ్వమన్నారు.
ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకోవడం ద్వారా ఇప్పటికే ఇజ్రాయెల్ ఇరాన్ విజయం సాధించిందని ఓ సీనియర్ పాలనాధికారి చెప్పారు. తదుపరి ఇరాన్ ఏం చేయనుందనే విషయాన్ని ఇజ్రాయెల్ జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పారు.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దశాబ్దాలుగా ఉద్రిక్తతలు ఉన్నాయి. గాజా యుద్ధం మొదలైనప్పటి నుంచి లెబనాన్‌లో ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బొల్లా, యెమెన్‌లో హౌతీస్ ఇజ్రాయెల్ పైనా, దాని మిత్రదేశాలకు అనుబంధంగా ఉన్న లక్ష్యాలపై దాడులు చేస్తున్నాయి.
అయితే ఇరాన్ అర్థరాత్రి వేళ చేసిన దాడులు, ఇజ్రాయెల్ ప్రతిస్పందన కారణంగా ఈ రెండు పాత శత్రు దేశాలు ప్రత్యక్ష ఘర్షణకు దిగే వాతావరణం సృష్టించగా,ఉద్రిక్తతలు తగ్గించే లక్ష్యంతో అంతర్జాతీయ దౌత్య కార్యకలాపాలు కూడా ఊపందుకున్నాయి.
ఇరాన్ దాడిపై ఆదివారం రాత్రి ఐదుగురు సభ్యులతో కూడిన ఇజ్రాయెల్ యుద్ధ కాబినెట్ సమావేశమై తమ ప్రతిస్పందన ఎలా ఉండాలనేదానిపై చర్చించింది. కానీ ఏ సమయంలో ఏ స్థాయులో చర్యలు తీసుకోవాలనే విషయంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని రాయ్‌టర్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేస్తే తమ స్పందన ఆదివారం నాటి దాడులకన్నా మరింత పెద్ద ఎత్తున ఉంటుందని ఇరాన్ ఆర్మీచీఫ్ ఆప్ స్టాఫ్ మేజర్ జనరల్ మహమ్మద్ బఘేరి హెచ్చరించారు. అయితే ఉద్రిక్తతల పెంపుపై ఆసక్తి లేదని ఇరాన్ అధికారులు సంకేతాలిచ్చారు.
ఇక ఆదివారం నాడు ఇజ్రాయెల్‌లో సాధారణ పరిస్థితులు కనిపించాయి. వాయు మార్గాన్ని తిరిగి తెరవడంతో విమానాశ్రయ కార్యకలాపాలు యధావిధిగా ప్రారంభమయ్యాయి. ‘‘ఇలాంటి ముప్పును ఎదుర్కొనేందుకు మాకో రక్షణ కవచం ఉంది. అదే ఇజ్రాయెల్ బలం’’ అని జెరుసలెంలోని 54 ఏళ్ళ ఏరియల్ చెప్పారు.
‘‘ఈ దాడి ఊహించిందే. కానీ అది యుద్ధంగా మారకూడదని ఆశిస్తున్నా’’ అని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- బంగారం: ఈ విలువైన లోహం భూమి మీదకు ఎలా వచ్చింది, శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
- భారత్ త్వరలోనే అగ్రరాజ్యంగా అవతరిస్తుందా?
- మర్మాంగాల వద్ద దురద, మంట ఎందుకు వస్తాయి? చికిత్స ఏమిటి?
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: వైసీపీకి చిక్కవు, టీడీపీకి దొరకవు
- ఇరాన్ ఎలా క్షిపణులను వదిలింది, ఇజ్రాయెల్ ఎలా అడ్డుకుంది, మున్ముందు ఏం జరగబోతోంది?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















