ఏజెంట్ల చేతిలో మోసపోయి రష్యా దళాల తరఫున యుక్రెయిన్ మీద పోరాడిన ఇద్దరు భారతీయులు స్వదేశానికి ఎలా తిరిగి వచ్చారు, ఏమంటున్నారు?

యుక్రెయిన్‌లో భారతీయులు

ఫొటో సోర్స్, VIVEK R NAIR

    • రచయిత, అష్రాఫ్ పదన్న
    • హోదా, బీబీసీ రిపోర్టర్, కేరళ

హెచ్చరిక : ఈ వార్తా కథనంలోని కొన్ని అంశాలను మిమ్మల్ని కలచి వేయవచ్చు.

కేరళకు చెందిన డేవిడ్ ముత్తప్పన్ కిందటేడాది అక్టోబర్‌లో ఫేస్‌బుక్‌లో ఒక యాడ్ చూశారు. అది రష్యాలో సెక్యూరిటీ గార్డులు కావాలంటూ చేసిన ఉద్యోగ ప్రకటన. జీతం నెలకు భారత కరెన్సీలో సుమారు 2 లక్షల రూపాయలుగా ప్రకటించడంతో పాఠశాల చదువును మధ్యలోనే ఆపేసిన ముత్తప్పన్ వెంటనే దానికి దరఖాస్తు చేసుకున్నారు.

కొన్నివారాల తరువాత 23 ఏళ్ళ ముత్తప్పన్ రష్యా అధీనంలో ఉన్న తూర్పు యుక్రెయిన్ నగరంలో యుద్ధ రంగంలో కనిపించారు.

‘‘అక్కడంతా విధ్వంసం, చావులే’’ అని తన అనుభవాలను వివరించారు డేవిడ్ ముత్తప్పన్.

రష్యాలో ఉద్యోగాల పేరుతో ఏజెంట్ల చేతిలో మోసోయి, రష్యా, యుక్రెయన్ యుద్ధంలో రష్యా దళాల తరపున పనిచేస్తున్న అనేకమంది భారతీయులలో డేవిడ్‌తోపాటు మరొక వ్యక్తి కూడా ఉన్నారు.

కిందటివారం వీరిద్దరూ కేరళకు తిరిగి రాగలిగారు. మరికొంతమంది భారతీయులు కూడా స్వదేశానికి చేరుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. కానీ, ఇప్పటికీ చాలామంది రష్యాలోనే చిక్కుకుపోయారు. వీరిలో చాలామంది పేద కుటుంబాలకు చెందినవారు. వీరికి రష్యాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని, రష్యన్ సైన్యంలో సహాయకులుగా నియమిస్తామని స్థానిక ఏజెంట్లు ప్రలోభాలకు గురిచేశారు.

రష్యా యుక్రెయిన్ వార్

ఫొటో సోర్స్, VIVEK R NAIR

ఫొటో క్యాప్షన్, ఏజెంట్ల చేతిలో మోసపోయి, రష్యన్ దళాల తరపున పోరాడుతున్న అనేక మంది భారతీయులలో ముత్తప్పన్ ఒకరు

ఇప్పటిదాకా కనీసం ఇద్దరు భారతీయులు ఈయుద్ధంలో చనిపోయారు.ప్రలోభాలకు గురై, రష్యా తరపున యుద్ధంలో పాల్గొంటున్న భారతీయ పౌరులను వెనక్కి తెప్పించేందుకు రష్యన్ అధికార వర్గంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్టు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ చెబుతోంది.

‘‘ఈ విషయం భారత్‌కు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని’’ కిందటివారం విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ చెప్పారు.

దీనిపై వ్యాఖ్యానించాల్సిందిగా బీబీసీ ఇండియాలోని రష్యన్ ఎంబసీకి ఈమెయిల్ పంపింది.

కేరళలోని మత్స్యకార గ్రామమైన పొజియూర్‌ ముత్తప్పన్ సొంత ఊరు. తన సొంత గ్రామానికి చేరుకున్నందుకు ఆయన ఉపశమనంగానే కనిపిస్తున్నారు కానీ యుద్ధంలో తాను చూసిన దృశ్యాలను మరిచిపోలేకపోతున్నానని చెప్పారు.

‘‘అక్కడ మనుషుల శరీరాలు నేల మీద ముక్కలుగా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఆ దృశ్యాలను చూసి మనస్తాపానికి గురయ్యాను. వెంటనే వాంతులు చేసుకుని స్పృహ తప్పి పడిపోయాను. మమ్మల్ని కమాండ్ చేస్తున్న రష్యన్ అధికారులు వెంటనే నన్ను శిబిరానికి తీసుకువెళ్ళాల్సిందిగా ఆదేశించారు. శిబిరానికి వచ్చాకా కూడా కోలుకోవడానికి నాకు కొన్ని గంటలు పట్టింది’’ అని ముత్తప్పన్ గుర్తు చేసుకున్నారు.

‘క్రిస్మస్ సమయంలో ఓ కుగ్రామంలో యుద్ధంలో పాల్గొన్నప్పుడు నా కాలు విరిగింది. ఆ సమయంలో నా పరిస్థితేంటో నా కుటుంబానికి తెలియదు’’ అని ముత్తప్పన్ చెప్పారు.

ముత్తప్పన్ పాక్షికంగా కోలుకోవడానికి ముందు లుహాన్స్క్, వోల్గోగ్రాడ్, రోస్తోవ్‌లోని వివిధ ఆసుప్రతులలో రెండున్నరల నెలలపాటు చికిత్స పొందారు.

మార్చిలో ఓ భారతీయ బృందం సహాయంతో ముత్తప్పన్ మాస్కోలోని భారత రాయబార కార్యాలయానికి చేరుకోగలిగారు. అక్కడి భారతీయ అధికారులు ఆయన స్వదేశానికి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేశారు.

రష్యా యుక్రెయిన్ వార్

ఫొటో సోర్స్, VIVEK R NAIR

ఫొటో క్యాప్షన్, యుద్ధంలో గాయపడిన తరువాత సెబాస్టియన్ ఇండియాకు వచ్చారు

సెబాస్టియన్‌దీ అదే కథ

కేరళలో మత్స్యకార గ్రామమైన అంజుతెంగుకు 61 కిలోమీటర్ల దూరంలో నివసించే ప్రిన్స్ సెబాస్టియన్ ది కూడా ఇలాంటి కథే.

ఈయన కూడా స్థానిక ఏజెంట్ చేతిలో మోసపోవడం వల్ల రష్యా ఆక్రమిత తూర్పు యుక్రెయిన్‌లోని 30 మంది రష్యన్ సైన్యంలో ఓ సభ్యుడిగా మారిపోయారు.

మూడు వారాల శిక్షణ తరువాత తన చేతికి అనేక ఆయుధాలు, బాంబులు ఇచ్చి యుద్ధంలో ముందువరుసలో నిలిపారని, వీటి బరువు వల్ల తాను యుద్ధంలో వేగంగా కదలలేకపోయానని సెబాస్టియన్ గుర్తు చేసుకున్నారు.

ముందు వరుసలో నిలిచిన పదిహేను నిమిషాలకే జరిగిన కాల్పుల్లో ఓ బుల్లెట్ ఎడమచెవిని తాకుతూ పోయింది. వెంటనే నేను కింద పడిపోయాను. కానీ నేను పడింది ఓ రష్యన్ సైనికుడి శవంపైనా అని తెలుసుకుని దిగ్భ్రాంతి చెందానని సెబాస్టియన్ తెలిపారు.

‘‘నేను దిగ్భ్రమ చెందాను. అక్కడి నుంచి కదల్లేకపోయాను. ఓ గంట తరువాత చీకటి పడింది. ఇంతలో అక్కడ మరో బాంబు పేలడంతో నా ఎడమ కాలు తీవ్రంగా దెబ్బతింది’’ అని చెప్పారు సెబాస్టియన్.

ఆ రాత్రంతా రక్తమోడుతున్న గాయంతో సెబాస్టియన్ బాధపడుతూనే ఉన్నారు. తెల్లవారిన తరువాత అక్కడి నుంచి ఆస్పత్రికి చేరుకున్నారు. ఇలా అనేక ఆస్పత్రులలో వారాలపాటు చికిత్స తీసుకున్నారు. తరువాత ఓ నెలరోజులు విశ్రాంతి తీసుకునేందుకు సెలవు దొరికింది. ఆ సమయంలోనే ఆయనకు ఓ మతబోధకుడు సహాయం చేశారు. ఆయన సహకారంతో సెబాస్టియన్ ఇండియన్ ఎంబసీ చేరుకోవడంతో, ఎంబసీ అధికారులు సెబాస్టియన్‌ను స్వదేశానికి పంపేందుకు ఓ తాత్కాలిక పాస్‌పోర్టు ఏర్పాటుచేశారు.

తనతోపాటు మరో ఇద్దరు మత్స్యకార స్నేహితులు కూడా రష్యాలో గల్లంతయ్యారని, వారి ఆచూకీ గురించిన సమాచారమేదీ కొన్నివారాలుగా తాను గానీ, ఆయన కుటుంబసభ్యలుగానీ వినలేదని చెప్పారు.

ఏజెంట్ల చేతిలో మోసపోయిన నలుగురి కుటుంబాల నుంచి ఫిర్యాదులు అందాయని కేరళ అధికారులు చెప్పారు. వీరిలో సెబాస్టియన్, ముత్తప్పన్‌తోపాటు మరో రెండు కుటుంబాలు కూడా ఉన్నాయి.

తాను, కొంతమంది స్నేహితులు కలిసి యూరప్‌లో ఏమైనా ఉద్యోగాలు దొరుకుతాయా అని ఓ స్థానిక ఏజెంట్‌ (ఇప్పుడీ ఏజెంట్ పరారీలో ఉన్నారు)ను సంప్రదించామని సెబాస్టియన్ చెప్పారు.

రష్యాలో బంగారంలాంటి అవకాశాలు ఉన్నాయని, అక్కడ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తే నెలకు 2 లక్షల రూపాయల జీతం వస్తుందని ఏజెంట్ చెప్పడంతో, వెంటనే వారు ఒప్పేసుకున్నారు.

రష్యా యుక్రెయిన్ వార్

ఫొటో సోర్స్, VIVEK R NAIR

ఫొటో క్యాప్షన్, రష్యాలో గల్లంతైన తన స్నేహితుల కోసం వారి కుటుంబాలు ఎదురుచూస్తున్నాయని సెబాస్టియన్ చెప్పారు

ఒకొక్కరం 7లక్షలు చెల్లించాం

రష్యన్ వీసా కోసం సెబాస్టియన్ ఆయన స్నేహితులు ఒకొక్కరు ఏడు లక్షల రూపాయలు చెల్లించారు. జనవరి 4న వారు మాస్కోకు చేరుకున్నారు. అక్కడ మళయాళం మాట్లాడే అలెక్స్ అనే ఓ భారతీయ ఏజెంట్ వారికి స్వాగతం పలికారు.

ఆ రోజు రాత్రి వారంతా ఓ ఫ్లాట్‌లో ఉన్నారు. తరువాత రోజు ఉదయం ఆ ఏజెంట్ వీరిని మాస్కోకు 336 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోస్త్రోమా అనే నగరంలోని మిలటరీ అధికారి వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ వీరు రష్యన్ భాషలో ఉన్న ఓ ఒప్పంద పత్రంపై సంతకం చేశారు. ఆ కాంట్రాక్ట్ పత్రంలో ఉన్న భాషను తాము చదవలేకపోయామని సెబాస్టియన్ చెప్పారు.

శ్రీలంకకు చెందిన ముగ్గురు వ్యక్తులు కూడా వీరితోపాటు కలవడంతో మొత్తం ఆరుగురు అయ్యారు. తరువాత ఈ ఆరుగురుని యుక్రెయిన్ సరిహద్దులోని రోస్తోవ్ ప్రాంతంలోని మిలటరీ క్యాంప్‌కు తరలించారు. అధికారులు వీరి పాస్‌పోర్ట్, మొబైల్ ఫోన్లు తీసేసుకున్నారు.

జనవరి 10న వీరికి శిక్షణ మొదలైంది. యాంటి టాంక్ గ్రేనేడ్స్ ఎలా ఉపయోగించాలి, గాయపడితే ఏం చేయాలనే విషయాలను వారు నేర్చుకున్నారు.

తరువాత వీరిని అలబినో పాలీగాన్ అనే మరో శిబిరానికి తీసుకువెళ్ళి అక్కడ పదిరోజులపాటు రాత్రి పగలు శిక్షణ ఇచ్చారు.

‘‘అక్కడ అన్నిరకాల ఆయుధాలు మాకోసం ఎదురుచూస్తున్నాయి. నేను ఆ ఆయుధాలను బొమ్మల్లా అనుకుని సంబరపడటం మొదలుపెట్టాను’’ అని సెబాస్టియన్ చెప్పారు.

కానీ యుద్ధం ఎంత క్రూరంగా ఉంటుందనే నిజం, యుద్ధరంగంలో దెబ్బ తిన్నప్పుడు సెబాస్టియన్‌కు అర్థమైంది.

ఇప్పుడాయన తిరిగి తన చేపలు పట్టే వృత్తిని కొనసాగించాలనుకుంటున్నారు. ‘‘నేను అప్పు తీసుకున్న మొత్తాన్ని చెల్లించాలి. నా జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టాలి’’ అని చెప్పారు సెబాస్టియన్.

పొజియూర్‌లోని ముత్తప్పన్ కూడా ఇలాగే కొత్తజీవితం మొదలుపెట్టాలని ఆశిస్తున్నారు.

‘‘నేను రష్యాకు వెళ్ళకముందు ఓ అమ్మాయితో నిశ్చితార్థమైంది. నేను డబ్బుతో తిరిగొస్తానని, కొత్త ఇల్లు కట్టిస్తానని ఆ అమ్మాయికి చెప్పాను’’ అని ముత్తప్పన్ గుర్తు చేసుకున్నారు.

ఇప్పడీ జంట మరో రెండేళ్ళపాటు వేచి చూద్దామని నిర్ణయించుకున్నారు. తన జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టేందుకు ముత్తప్పన్ ప్రయత్నిస్తున్నారు.

యుద్ధంలో ఉన్నప్పుడు తాను ఎవరిని చంపలేదనే విషయమే తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని చెప్పారు.

‘‘ఒకసారి మాకు 200 మీటర్ల దూరంలో యుక్రెనియన్లు ఉన్నప్పుడు వారిపై కాల్పులు జరపమని మాకు చెప్పారు. కానీ నేను ఆ పని చేయలేదు. నేను ఎవరినీ చంపలేను’’ అని తెలిపారు ముత్తప్పన్.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ రూమ్ ప్రచురణ)

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)