ట్రూంగ్ మై లాన్‌: రూ. 3.6 లక్షల కోట్ల మోసం, మహిళా బిలియనీర్‌కు మరణశిక్ష, అసలేం జరిగిందంటే..

ట్రూంగ్ మై లాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2011 నాటికి, ట్రూంగ్ మై లాన్ 'హో చి మిన్' సిటీలో ప్రసిద్ధ వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు.
    • రచయిత, జోనాథన్ హెడ్, థు బుయ్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

కమ్యూనిస్టుల పాలనలోని వియత్నాంలో అరుదైన ఘటన జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు మోసాలలో ఒకటి ఈ దేశంలో బయటపడటమే కాదు, ఈ కేసులో దోషిగా తేలిన బిలియనీర్‌కు మరణశిక్ష విధించారు.

గత 11 ఏళ్లుగా వియత్నాంలోని ప్రధాన బ్యాంకును లూటీ చేస్తూ వచ్చిన వ్యాపారవేత్త, ప్రాపర్టీ డెవలపర్‌ అయిన 67 ఏళ్ల ట్రూంగ్ మై లాన్‌‌కు అక్కడి హో చి మిన్ సిటీలోని కలోనియల్-ఎరా కోర్ట్‌హౌస్ గురువారం మరణశిక్ష విధించింది.

సైగాన్ కమర్షియల్ బ్యాంకు నుంచి ఆమె 44 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 3.68 లక్షల కోట్లు రుణం తీసుకున్నారు.

అందులో 27 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 2.25 లక్షల కోట్లు) రికవరీ కాకపోవచ్చని ప్రాసిక్యూటర్లు తెలిపారు.

వియత్నాంలో సాధారణంగా రహస్య విచారణకు మొగ్గుచూసే కమ్యూనిస్ట్ అధికారులు ఆశ్చర్యకరంగా ఈ కేసు గురించి చాలా సమాచారాన్ని మీడియాతో పంచుకున్నారు.

ఈ కేసు విచారణలో భాగంగా 2,700 మంది వాంగ్మూలాలు సేకరింరని, 10 మంది స్టేట్ ప్రాసిక్యూటర్లు, దాదాపు 200 మంది న్యాయవాదులు పాల్గొన్నారని అధికారులు చెప్పారు.

కేసు పత్రాల కోసం 104 పెట్టెలు అవసరమయ్యాయి. ట్రూంగ్ మై లాన్‌తో పాటు మరో 85 మంది నిందితులు ఈ కేసులో విచారణను ఎదుర్కొన్నారు. అయితే, అభియోగాలను వారు ఖండించారు.

"కమ్యూనిస్టుల కాలంలో ఇలాంటి విచారణ ఎప్పుడూ జరగలేదు. ఈ స్థాయిలో ఖచ్చితంగా లేదు" అని వియత్నాంలో సుదీర్ఘకాలం పనిచేసి రిటైర్ అయిన అమెరికా విదేశాంగ శాఖ అధికారి డేవిడ్ బ్రౌన్ తెలిపారు.

కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ జనరల్ న్గుయెన్ ఫు ట్రోంగ్ నేతృత్వంలో కొన్నేళ్లుగా "బ్లేజింగ్ ఫర్నేసెస్" అవినీతి వ్యతిరేక ప్రచారం కొనసాగుతోంది.

కమ్యూనిస్ట్ పార్టీ పాలనకు విచ్చలవిడి అవినీతి పెను ముప్పు అని ట్రోంగ్ భావించారు. 2016 తర్వాత ట్రోంగ్ ఈ ప్రచారాన్ని తీవ్రతరం చేశారు.

ఈ ప్రచారంతో ఇద్దరు అధ్యక్షులు, ఇద్దరు ఉప ప్రధానులు బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. వందల మంది అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకొని, జైల్లో వేశారు.

ఇప్పుడు వారి కోవలోకి దేశంలోని అత్యంత సంపన్న మహిళ ట్రూంగ్ మై లాన్ చేరారు.

న్గుయెన్ ఫు ట్రోంగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ-జనరల్ న్గుయెన్ ఫు ట్రోంగ్ నేతృత్వంలో గత కొన్నేళ్లుగా "బ్లేజింగ్ ఫర్నేసెస్" అవినీతి వ్యతిరేక ప్రచారం కొనసాగుతోంది.

ట్రూంగ్ మై లాన్ ఎలా ఎదిగారు?

ట్రూంగ్ మై లాన్, హో చి మిన్ సిటీలోని సైనో-వియత్నామీస్ కుటుంబం నుంచి వచ్చారు. మొదట ట్రూంగ్ తన తల్లితో కలిసి సౌందర్య సాధనాలను విక్రయించే ఒక మార్కెట్ స్టాల్‌తో కెరీర్ ప్రారంభించారు.

అయితే 1986లో కమ్యూనిస్ట్ పార్టీ 'డోయి మోయి' అనే ఆర్థిక సంస్కరణలు తీసుకురావడంతో ట్రూంగ్ భూములు, భవనాల కొనుగోళ్లు ప్రారంభించారు.

దీంతో 1990ల నాటికి ట్రూంగ్ భారీగా సంపాదించారు. హోటళ్లు, రెస్టారెంట్లు నెలకొల్పారు.

తయారీ పరిశ్రమలో చైనాకు ప్రత్యామ్నాయ సప్లై చెయిన్‌‌గా వియత్నాం అంతర్జాతీయంగా గుర్తింపు పొందినప్పటికీ, దేశంలోనే అనేక మంది సంపన్నులు వారి డబ్బును వృద్ధి చేసుకోవడానికి ఆస్తులను కూడబెడుతూ వచ్చారు.

అయితే, దేశంలోని మొత్తం భూమి అధికారికంగా ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఆ భూములు పొందాలంటే అక్కడి అధికారులతో ఉండే సత్సంబంధాలపై ఆధారపడి ఉంటుంది. దీంతో దేశంలో ఆర్థిక వ్యవస్థ పెరిగే కొద్దీ అవినీతీ పెరిగింది.

వియత్నాం సైగాన్ కమర్షియల్ బ్యాంకు

ఫొటో సోర్స్, Getty Images

లక్షల కోట్ల మోసం ఎలా చేయగలిగారు?

2011 నాటికి, ట్రూంగ్ మై లాన్ 'హో చి మిన్' సిటీలో ప్రసిద్ధ వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు.

దేశంలో నగదు కొరత ఉన్న మూడు చిన్న బ్యాంకులను ఒక పెద్ద సంస్థగా విలీనం చేసుకోవడానికి ఆమెకు అనుమతి దక్కింది. అదే సైగాన్ కమర్షియల్ బ్యాంక్‌గా రూపాంతరం చెందింది.

అయితే, వ్యక్తులకు ఏ బ్యాంకులోనైనా 5 శాతం కంటే ఎక్కువ షేర్లు ఉండకుండా వియత్నా చట్టం నియంత్రిస్తుంది. ఈ నేపథ్యంలో సైగాన్ కమర్షియల్ బ్యాంకులో 90 శాతం షేర్లు దక్కించుకోవడానికి ట్రూంగ్ మై లాన్ వందలాది షెల్ కంపెనీలు, బినామీలను సృష్టించుకున్నారని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.

ఆమె తన సొంత మనుషులను మేనేజర్‌లుగా నియమించారని, అనంతరం సదరు షెల్ కంపెనీలకు రుణాలను ఆమోదించాలంటూ వారికి సూచించారని ఆరోపించారు. ఇలా బ్యాంక్ జారీ చేసిన మొత్తం రుణాలలో ట్రూంగ్ లాన్ ఏకంగా 93 శాతం తీసుకున్నారు.

2019 ఫిబ్రవరి నుంచి మూడేళ్ల పాటు తన డ్రైవర్‌‌తో ట్రూంగ్ మై లాన్ 4 బిలియన్ డాలర్ల (33 వేల కోట్ల)ను బ్యాంకు నుంచి విత్ డ్రా చేయించి, వాటిని నేలమాళిగలో భద్రపరచాలని ఆదేశించారని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. ఆ మొత్తంలో నగదు సుమారుగా రెండు టన్నుల బరువు ఉంటుంది.

వియత్నాం బ్యాంకులో మోసం

ఫొటో సోర్స్, Getty Images

ఇన్నేళ్లూ ఎలా తప్పించుకోగలిగారు?

అంతేకాదు ట్రూంగ్ మై లాన్ లంచం ఆరోపణలను ఎదుర్కొన్నారు, ఆమె తీసుకున్న రుణాలను ఎవరూ చెక్ చేయకుండా ఉండేందుకు లంచాలు అందజేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

సెంట్రల్ బ్యాంకు మాజీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ దాదాపు రూ.41.60 కోట్లు లంచం తీసుకున్నారని ఆరోపణలున్నాయి.

ఈ కేసులో మీడియా విస్తృతమైన కవరేజీ ఇచ్చింది. ట్రూంగ్ మై లాన్ మోసాన్ని తెలుసుకున్న ప్రజల్లో ఆగ్రహం మొదలైంది.

ఇంతటి భారీ మోసం చేసినా ఇన్నేళ్లు ఆమె దొరక్కుండా ఎలా తప్పించుకున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ట్రూంగ్ మై లాన్ రియల్ ఎస్టేట్ కొనుగోళ్లకు వ్యక్తిగత నిధుల వనరుగా సైగాన్ కమర్షియల్ బ్యాంక్‌ని వాడటంపై లే హాంగ్ హైప్ విస్మయం వ్యక్తం చేశారు.

సింగపూర్‌లోని ఐఎస్ఈఏఎస్-యూసోఫ్ ఇషాక్ ఇన్‌స్టిట్యూట్‌లో వియత్నాం స్టడీస్ ప్రోగ్రామ్‌కు 'లే హాంగ్ హైప్' నాయకత్వం వహిస్తున్నారు.

బ్యాంకింగ్ రంగంలోని ఇలాంటి కేసులు బహుశా చాలా ఉన్నాయని, ప్రభుత్వం దీనిని విస్మరించి ఉండవచ్చని లే హాంగ్ హైప్ అభిప్రాయపడ్డారు.

హో చి మిన్ సిటీలో వ్యాపారం, రాజకీయాలలో శక్తివంతమైన వ్యక్తులు ట్రూంగ్ మై లాన్‌ను రక్షించి ఉండొచ్చని డేవిడ్ బ్రౌన్ ఆరోపించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)