దళిత యువకులకు శిరోముండనం: తోట త్రిమూర్తులు దోషిగా తేలిన వెంకటాయపాలెం కేసులో అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, Facebook/Thota Thrimurthulu
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడు తోట త్రిమూర్తులుకు కోర్టు జైలు శిక్ష విధించింది.
28 ఏళ్ల కిందట దళిత యువకులకు శిరోముండనం చేయించిన కేసులో ఆయన్ను దోషిగా తేలుస్తూ విశాఖలోని ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక ప్రత్యేక కోర్టు మంగళవారం (2024 ఏప్రిల్ 16న) తీర్పు ఇచ్చింది. అనంతరం తోట త్రిమూర్తులుకు బెయిల్ వచ్చింది.
అసలు 1996 డిసెంబర్ 29న ఏం జరిగింది? ఈ కేసులో విచారణ ఇన్నేళ్లు ఎందుకు సాగింది? అన్నది చూద్దాం.

ఫొటో సోర్స్, UGC
అసలేం జరిగింది?
తోట త్రిమూర్తులు రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1994లో తొలిసారి గెలిచారు.
1996 డిసెంబర్ 29న ఆయన స్వగ్రామం, రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే ఉన్న వెంకటాయపాలెంలో ఐదుగురు దళిత యువకులపై దాడి జరిగింది. తోట త్రిమూర్తులు కుటుంబానికి చెందిన వారు ఈ దాడిలో పాల్గొన్నారంటూ అప్పట్లో కేసు నమోదైంది.
ఐదుగురు దళిత యువకులను హింసించి, వారిలో ఇద్దరికి శిరోముండనం కూడా చేయడంతో ఈ వ్యవహారం అప్పట్లో పెను దుమారం రేపింది.
ఎమ్మెల్యేగా ఉన్న తోట త్రిమూర్తులు ప్రోద్బలంతోనే వారికి శిరోముండనం చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. దాంతో చివరకు తోట త్రిమూర్తులతో పాటుగా మొత్తం 9 మందిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంతో పాటుగా ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది.
ఈ ఘటనపై అప్పటి తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఆదిత్య త్రిపాఠి స్వయంగా విచారణ చేసిన తర్వాత 4/1/1997లో క్రైమ్ నెం. 1/1997గా ద్రాక్షారామం పీఎస్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఈ కేసులో బాధితులుగా ఉన్న కోటి చిన రాజు, దడాల వెంకటరత్నం అనే వారికి శిరోముండనం చేయగా, చల్లపూడి పట్టాభిరామయ్య, పువ్వుల వెంకట రమణ, కనికెళ్ల గణపతి అనే మరో ముగ్గురిని తీవ్రంగా హింసించినట్టు పోలీసులు నిర్ధరించారు.
ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుతో పాటుగా నిందితులందరినీ అరెస్ట్ చేయాలంటూ అప్పట్లో జిల్లా వ్యాప్తంగానూ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి.
దీంతో చివరకు త్రిమూర్తులను కూడా అరెస్ట్ చేసి 87 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధించారు. ఆ తర్వాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.

ఫొటో సోర్స్, Facebook/Thota Thrimurthulu
ఎందుకు అలా చేశారు?
ఈ కేసులో బాధితులుగా ఉన్న యువకులు 1994 ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం చేశారు.
తన సొంత గ్రామంలోని వ్యక్తులు తనకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం సాగించడం తోట త్రిమూర్తులకు సహించలేదనే ఆరోపణ వినిపించింది. దానికి ప్రతీకారంగానే తమపై దాడి జరిగిందంటూ బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే, గ్రామంలో కాపు కులానికి చెందిన యువతులను వేధించడంతోనే వారిని పిలిచి మందలించామని, తాము ఎవరినీ హింసించలేదని నిందితులు వాదించారు.
ఈ కేసులో మొత్తం 24 మంది సాక్షులను విచారించారు. వారిలో ఇప్పటికే బాధితుడు పువ్వల వెంకట రమణ సహా 10 మంది సాక్షులు మరణించారు. ముద్దాయిల్లో కూడా తలాటం మురళీ కృష్ణ అనే వ్యక్తి చనిపోయారు.
విచారణలో జాప్యం ఎందుకు?
ఇండిపెండెంట్‌గా గెలిచిన తర్వాత తోట త్రిమూర్తులు టీడీపీ అనుబంధ సభ్యుడిగా వ్యవహరించారు. తదుపరి పరిణామాల్లో 1998లో అప్పటి టీడీపీ ప్రభుత్వం వెంకటాయపాలెం శిరోముండనం కేసు విచారణను నిలిపివేసింది. కేసును రద్దు చేస్తూ జీవో కూడా విడుదల చేసింది. దాంతో ఈ వ్యవహారం మీద బాధితులు, దళిత సంఘాలు, వివిధ రాజకీయ పక్షాలు ఉద్యమించాయి.
తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు 2000లో జస్టిస్ పుట్టు స్వామి కమిషన్ నియమించారు. ఆ కమిషన్ నివేదిక ఆధారంగా ఈ కేసు నుంచి కేవలం తోట త్రిమూర్తులు పేరు మాత్రమే తొలగిస్తూ ప్రభుత్వం మరో జీవో విడుదల చేసింది.
దానిని కూడా బాధితులు తప్పుబట్టారు. తోట త్రిమూర్తులు పాత్ర ఉందంటూ మరోసారి హైకోర్టులో పిటిషన్ వేశారు. దాంతో 2008లో మరోసారి ఈ కేసు రీ ఓపెన్ అయ్యింది.
ఆ క్రమంలోనే బాధితులు క్రిస్టియన్ మతంలోకి మారినందున వారికి ఎస్సీ హోదా వర్తించదంటూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వారికి ఎస్సీ సర్టిఫికెట్లు కూడా ఇచ్చేందుకు కొంతకాలం పాటు ఎమ్మార్వో కార్యాలయం నిరాకరించింది.
ఈ క్రమంలో శిరోముండనం కేసు కొత్త మలుపు తిరిగింది. బాధితులకు ఎస్సీ సర్టిఫికెట్ల కోసం పెద్ద స్థాయిలో ప్రయత్నం చేయాల్సి ఉంది. న్యాయపోరాటం తర్వాత వారికి సర్టిఫికెట్లు ఇచ్చారు.
విశాఖలో విచారణ..
దళితుల హక్కుల కోసం పోరాడిన బొజ్జా తారకం ఈ కేసులో కీలకంగా వ్యవహరించారు. ఆయన సుదీర్ఘకాలం పాటు వెంకటాయపాలెం శిరోముండనం కేసులో తన వాదనలు వినిపించారు. 2015లో మాండమస్ కింద రిట్ దాఖలు చేసి విశాఖ ప్రత్యేక కోర్టులో విచారణ జరిపేలా కృషి చేశారు.
బాధితులు కోటి చిన రాజు, డి వెంకట రత్నంకి సంబంధించిన ఎస్సీ సర్టిఫికెట్లు చెల్లవంటూ దిగువ కోర్టులో నిర్ణయం వెలువడడంతో అది కూడా హైకోర్టుకి చేరింది. దిగువ కోర్టు ఉత్తర్వులను హైకోర్టు కొట్టేయడంతో మరోసారి శిరోముండనం కేసు విచారణకు వచ్చింది.
2024 ఏప్రిల్ 16న తీర్పు వెలువడడానికి ముందు వందల దఫాలు కేసు వాయిదా పడింది. ఆ క్రమంలోనే ప్రధాన సాక్షితో పాటుగా బాధితుడు కూడా ఒకరు మరణించి తర్వాత తుది తీర్పు ఎలా ఉంటుందోననే ఉత్కంఠ రేగింది.
చివరకు తోట త్రిమూర్తులతో పాటుగా 8 మంది ముద్దాయిలను దోషులుగా కోర్టు నిర్ధారించింది. వారికి ఏడాదిన్నర చొప్పున జైలు శిక్ష విధించింది. మరో రూ. 2 లక్షల జరిమానా కూడా విధించింది.
కోర్టు తీర్పు ప్రకారం తోట త్రిమూర్తులు సహా 8 మందికి జైలు శిక్ష ఖరారయ్యింది. వారిలో ఆరుగురు త్రిమూర్తులు బంధువులు. మరో ముగ్గురు వారికి సహాయకులు. అయితే, తర్వాత వారందరికీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
కోర్టు తీర్పు తర్వాత తోట త్రిమూర్తులు ఏమన్నారంటే..
న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుని గౌరవిస్తున్నానని తోట త్రిమూర్తులు అన్నారు.
‘‘నాలుగుసార్లు ఎమ్మెల్యే గెలిచాను. న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తాను.
అందుకే ఈ కోర్టులో బెయిల్ తెచ్చుకున్నాను. ఈ కేసు విషయంలో ప్రతిపక్ష నేతలు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. ఈ కేసు జరిగిన సమయంలో స్వాత్రంత అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచాను. అనంతరం టీడీపీలో చేరాను. ఈ కేసులో తీర్పును హైకోర్టులో సవాల్ చేసి, గెలిచి బయటకు వస్తాను’’ అని తోట త్రిమూర్తులు అన్నారు.

ఫొటో సోర్స్, Facebook/Thota Pruthviraj Ysrcp Mandapeta
వైఎస్సార్సీపీ ఏం చేస్తుంది?
విశాఖలోని ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రత్యేక కోర్టులో వెలువడిన తీర్పుతో ఇప్పుడు తోట త్రిమూర్తులు రాజకీయ భవితవ్యం మీద చర్చ మొదలయ్యింది.
తోట త్రిమూర్తులు ప్రస్తుతం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు.
ఆ తర్వాత వైఎస్సార్సీపీలో చేరి ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకున్నారు. దాంతో పాటుగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మండపేట నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ నెల 18 నుంచి రాష్ట్ర ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలవుతోంది. తాజా కేసు తీర్పు తర్వాత మండపేటలో వైఎస్సార్సీపీ ఏం చేస్తుందన్న చర్చ సాగుతోంది.
ఇప్పటికే త్రిమూర్తులు తనయుడు పృథ్వీరాజ్ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా ఉన్నారు. దాంతో ఆయనకు అవకాశం ఇస్తారా? లేక త్రిమూర్తులు పోటీ చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది.
ఎన్నికల నియమావళి ప్రకారం ఇలాంటి కేసుల్లో రెండేళ్ల శిక్ష పడితే పోటీకి అనర్హత వర్తిస్తుంది. అయితే, కింద కోర్టుల్లో శిక్ష పడినప్పుడు పైకోర్టులో అప్పీలు చేసుకోవడానికి మూడు నెలల సమయం ఉంటుంది.
అప్పటివరకు ఎన్నికలలో పోటీ చేసేందుకు అభ్యంతరం ఉండదు. దీంతో పాటుగా గెలిచిన తర్వాత కూడా సభ్యుడిగా కొనసాగడానికి వీలుంటుంది. కాబట్టి త్రిమూర్తుల వ్యవహారం ఎటు మళ్లుతుందన్న దాని చుట్టూ చర్చ సాగుతోంది.
ఇవి కూడా చదవండి:
- సైబర్ బానిసలు: ‘నా కళ్ళ ముందే ఆ ఇద్దరు అమ్మాయిలను 17మంది రేప్ చేశారు, నన్ను 16 రోజులు చిత్ర హింసలు పెట్టారు’
- జలియన్‌వాలా బాగ్: జనరల్ డయ్యర్ 105 ఏళ్ళ కిందట సృష్టించిన మారణహోమం
- హీట్ వేవ్ అంటే ఏంటి... దీనికీ ఎన్నికలకూ ఏమిటి సంబంధం?
- 'భారత గూఢచార సంస్థ' పాకిస్తాన్లో 20 మందిని చంపేసిందా, ది గార్డియన్ పత్రిక కథనంపై పాక్ ఏమంటోంది?
- గజల్ అలఘ్: ప్రెగ్నెన్సీపై ఈమె చేసిన పోస్ట్ పెద్ద చర్చకు దారితీసింది, విషయం ఏంటంటే..
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















