తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక రాజధానిలో రాజకీయాలు ఎలా ఉన్నాయి?

- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
- హోదా, బీబీసీ కోసం
ఎన్నికల సమయంలో కొన్ని 'ప్రత్యేక నియోజకవర్గాల' గురించి చర్చ జరగడం సర్వసాధారణం. ఏదో ఒక స్పెషాలిటీ వాటిని దేశ రాజకీయాల్లో ప్రత్యేకంగా నిలుపుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి కూడా అలాంటిదే. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒకటైన తిరుపతి నియోజకవర్గం జిల్లా కేంద్రంగా మారిన తర్వాత తొలిసారి ఎన్నికలకు సిద్ధమవుతోంది.
ఇక్కడ ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను ప్రకటించడంతో ఎన్నికల ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.
వైసీపీ తరపున భూమన అభినయ్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. ప్రస్తుత ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తనయుడే అభినయ్.
ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో భాగంగా జనసేనకు ఈ సీటును కేటాయించారు. కూటమి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులను జనసేన పార్టీ ప్రకటించింది.
ఇంతకీ ఈ నియోజకవర్గం ప్రత్యేకత ఏమిటి? ఎందుకు ఈ నియోజవర్గానికి రాజకీయ నాయకుల్లో ఉన్న సెంటిమెంట్ ఏంటి?

‘ప్రత్యేకత ఇదీ’
తిరుమల గుడి, ఇతర పురాతన దేవాలయాలు తిరుపతిని ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక రాజధానిగా పిలుచుకుంటారు. అందువల్ల ఇది రాజకీయంగా కొందరికి సెంటిమెంట్ నియోజకవర్గంగా ఉంది.
2011 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ 2 లక్షల 87 వేల మంది ఉన్నారు.
తిరుపతి నియోజకవర్గానికి 73 ఏళ్లలో ఇప్పటివరకు 18 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇంతవరకు జరిగిన ఎన్నికల్లో రకరకాల పార్టీలు తిరుపతికి ప్రాతినిధ్యం వహించాయి. 1952 నుంచి 1983 అంటే టీడీపీ పుట్టుక వరకు ఒక్కసారి తప్ప మిగిలిన అన్ని సార్లూ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తూ వచ్చింది.
అయితే "వారసత్వ రాజకీయాలకు ఇక్కడ ఎక్కువగా తావులేదు. అదే తిరుపతి ప్రత్యేకత" అని స్థానిక రాజకీయాలను నిశితంగా పరిశీలించే ప్రొఫెసర్ జయచంద్రారెడ్డి అన్నారు.
జయచంద్రారెడ్డి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు, అంతర్జాతీయ రాజకీయ వ్యవహారాల నిపుణుడిగా ఆయనకు పేరుంది.

‘‘1952లో తిరుపతి నుంచి మొదటిసారి వరదాచారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. తిరుపతిలో వారసత్వ రాజకీయాలకు చోటు లేదు. ఇప్పటివరకు మబ్బురామిరెడ్డి ఒక్కరే వరసగా రెండుసార్లు గెలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటరమణ మరణించడంతో ఆయన భార్య ఉప ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచారు. ఆమె ఒక్కరే వారసత్వంగా తిరుపతి రాజకీయాల్లో గెలిచారు. ఈ 18 ఎన్నికల్లో 8 సార్లు కాంగ్రెస్, ఆరుసార్లు తెలుగుదేశం పార్టీలు గెలిచాయి. ఒకసారి స్వతంత్ర పార్టీ, ఒకసారి ప్రజారాజ్యం, రెండుసార్లు వైసీపీ విజయం సాధించాయి’’ అని జయచంద్రారెడ్డి తెలిపారు.
తాజాగా సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వారసునిగా ఆయన కొడుకు పోటీకి సిద్ధమవుతున్నారు.
‘‘తిరుపతి గొప్పతనం తిరుమల. శ్రీవారి ఆలయానికి ప్రపంచవ్యాప్తంగా వచ్చే నాయకులకు ప్రొటోకాల్ ప్రకారం స్థానిక మేయర్ లేదా ఎమ్మెల్యే లేదా ఎంపీ వారికి స్వాగతం పలకాలి. అందువల్ల వాళ్లకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించేది. పెద్దవాళ్లతో పరిచయాలు పెరుగుతాయి. ఆ పరిచయాలు పెంచుకొని జాతీయస్థాయిలో ఎదిగే వాళ్లు ఉంటారు. అందుకే తిరుపతికి అంత ప్రాధాన్యం ఉంది’’ అని తిరుపతి సీనియర్ జర్నలిస్ట్ రవికుమార్ అన్నారు.

రెడ్డి, బలిజలదే ఆధిపత్యం
రెడ్డి ఆధిపత్యం, బలిజ వర్గాల బలం ఉండే తిరుపతి నియోజకవర్గంలో ప్రస్తుతం జరగబోయేవి 19వ శాసనసభ ఎన్నికలు. అక్కడి బలిజ వర్గం మొదటి నుంచి బలంగా ఉంది.
గతంలో ఏ ఎన్నికలు చూసుకున్నా బయట వారు అయినా, స్థానిక అభ్యర్థులయినా బలిజ వర్గం సహకారంతో గెలిచిన వారే ఎక్కువ మంది ఉన్నారని రవి కుమార్ చెప్పారు.
‘‘బయట నుంచి వచ్చిన వాళ్లు అంటే రామారావు అని చెప్పుకోవాలి. ఆయన గెలిచి, వెంటనే రాజీనామా చేశారు. మళ్ళీ మూడు నెలలకు ఉప ఎన్నికలు జరిగాయి. అప్పుడు బలిజ వర్గానికి చెందిన కత్తుల శ్యామల గెలిచారు. ఇక ప్రజారాజ్యం తరఫున చిరంజీవి 2009లో అక్కడి నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత వైసీపీ తరపున భూమన కరుణాకర్ రెడ్డి గెలిచారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు బలిజ సామాజికవర్గం నుంచి అభ్యర్థులను నిలబెట్టడంతో, ఓట్లు చీలిపోయి కరుణాకర్ రెడ్డికి కలిసి వచ్చింది. 1985, 89 ఎన్నికల్లో మబ్బురామిరెడ్డి విజయానికి తిరుపతి చుట్టుపక్కల కమ్యూనిటీ బలంతో పాటు బలిజ సామాజిక వర్గంలో పెద్దల మద్దతు కలిసి వచ్చింది’’ అని తెలిపారు రవికుమార్.
యాదవ, ఇతర కమ్యూనిటీలతో కలిసి బలిజ సామాజిక వర్గం నిలబడినప్పుడు మరింత బలపడుతుందని అంటున్నారు.

తిరుపతి నియోజకవర్గంలో సామాజికంగా, రాజకీయంగా కూడా రెడ్డిల ఆధిపత్యం కనిపిస్తుంది. 18 సార్లు జరిగిన ఎన్నికల్లో ఏడుసార్లు రెడ్డి అభ్యర్థులు, ఆరుసార్లు బలిజ అభ్యర్థులు ఇక్కడ విజయం సాధించారు.
అయితే తిరుపతిలో గెలిచిన అభ్యర్థులకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కలేదని జయచంద్రారెడ్డి అంటున్నారు.
చివరికి ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఎన్టీఆర్ కూడా సీఎంగా ప్రమాణం చేయగానే తిరుపతి అభ్యర్థిత్వాన్ని వదులుకున్నారని ఆయన గుర్తు చేశారు.
‘‘కొత్తగా పార్టీ పెట్టిన ఎన్టీఆర్, తిరుపతి నుంచే తన ప్రచారం మొదలుపెట్టారు. అక్కడి నుంచే పోటీ చేశారు. తిరుపతి శాసనసభ్యులుగా గెలిచిన వారిలో ఒక్క అగరాల ఈశ్వర్ రెడ్డి మాత్రమే అసెంబ్లీ స్పీకర్ పదవి వరకూ వెళ్లారు’’ అని గుర్తుచేశారు జయచంద్రారెడ్డి.

ఫొటో సోర్స్, FACEBOOK/TDP.OFFICIAL
పార్టీ, ప్రచారానికి తొలి అడుగు తిరుపతిలోనే..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి కొత్తగా అడుగుపెట్టే ప్రతి పార్టీ తిరుపతి నుంచే ఎన్నికల శంఖారావం పూరించడం పరిపాటిగా మారింది.
నందమూరి తారక రామారావు టీడీపీ, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలకు తిరుపతితో అనుబంధం ఉంది.
1983 అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా తిరుపతిలో టీడీపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఎన్నికల ప్రచారానికి తొలి అడుగు ఆ సభనే అని జయచంద్రారెడ్డి తెలిపారు.

ఫొటో సోర్స్, CHIRNJEEVI FANS/FACEBOOK
ఇక 2008లో ప్రజారాజ్యం పార్టీని తిరుపతి సభలోనే చిరంజీవి ప్రకటించారు. 2009 ఎన్నికల్లో ఆయన ఇక్కడి నుంచి పోటీ చేసి, గెలిచారు.
ఎన్టీఆర్ సినీ రంగంలో ఉన్నప్పుడు కూడా తన కొత్త సినిమా ప్రారంభించాలన్నా కొండకు వచ్చేవారని, ఆ సెంటిమెంటునే రాజకీయాల్లో కూడా కొనసాగించారని సీనియర్ జర్నలిస్ట్ రవి కుమార్ గుర్తుచేస్తున్నారు.
‘‘1982లో ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు తిరుపతి త్యాగరాజ మండపంలో మూడు రోజుల పాటు మీటింగ్ జరిగింది. ఎన్టీఆర్ ఎప్పుడు ఎన్నికల ప్రచారం ప్రారంభించినా, ముగించినా ఇక్కడే చేసేవారు. 89లో కాంగ్రెస్ నుంచి విడిపోయిన నలుగురు నేతలు జానారెడ్డి, కేఈ కృష్ణమూర్తి, ముద్రగడ పద్మనాభం, వసంత నాగేశ్వరరావు ‘తెలుగు నాడు’ పార్టీ పెట్టింది కూడా తిరుపతిలోనే. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల కూటమి ప్రచారం తిరుపతిలోనే జరిగింది. అయితే, ఈసారి మాత్రం తిరుపతిలో ఆ ఆనవాయితీ కొనసాగించలేదు. అందరూ వేరే చోట ప్రచారం మొదలుపెట్టారు’’ అని ఆయన తెలిపారు.
అభ్యర్థి ఇమేజ్ పనిచేస్తుందా?
తిరుపతిలో ఒక వ్యక్తి రెండుసార్లు వరుసగా గెలిచిన సందర్భాలు తక్కువ.
‘‘తిరుపతి నుంచి ఒక్క మబ్బురామిరెడ్డి మాత్రమే 1985, 89లో రెండుసార్లు వరుసగా గెలుపొందారు. అగరాల ఈశ్వర్ రెడ్డి, భూమన కరుణాకర రెడ్డి లాంటి వారు రెండు సార్లు గెలిచినప్పటికీ, వరుసగా గెలవలేదు. ఇక తిరుపతి నియోజకవర్గానికి మూడుసార్లు, మూడు రకాల పరిస్థితుల్లో ఉప ఎన్నికలు జరిగాయి. ఒకసారి ఎన్టీఆర్ రాజీనామాతో జరిగింది. ఇక చిరంజీవి కేంద్రమంత్రి కావడంతో తిరుపతి శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ సమయంలో వైసీపీ తరఫున భూమన కరుణాకర రెడ్డి పోటీ చేసి తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక మూడోసారి టీడీపీ ఎమ్మెల్యే వెంకట రమణ మరణంతో ఉప ఎన్నిక జరిగింది’’ అని రవికుమార్ తెలిపారు.
తిరుపతిలో రాజకీయ పెత్తనం ఎప్పుడూ బయటి ప్రాంతాల నాయకులదే అంటున్నారు జయచంద్రారెడ్డి.
తిరుపతి ఎన్నికల్లో ఈసారీ అభ్యర్థి ఇమేజ్ ఎంతవరకూ పనిచేయనుందని జయచంద్రారెడ్డి అడగగా ఆయన స్పందిస్తూ.. ‘‘ఎమ్మెల్యే అంటే కొంత వరకూ వ్యక్తిగత ఇమేజ్ పనిచేస్తుంది. ఎంపీగా పోటీ చేసే అభ్యర్థి ఎవరనేది పెద్ద సమస్య కాదు. అది పార్టీ ఓరియెంటెడ్‌గా ఓట్లు పడతాయి. ఇప్పటివరకు చూస్తే ఎంపీ ఎన్నికల్లో అంత ప్రాధాన్యత ఉన్న వ్యక్తులు ఎవరూ గెలిచిన దాఖలాలు లేవు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక అభ్యర్థులుగా నిలిచిన వారు స్థానికులకు ఏ స్థాయిలో సేవలు అందించారు. వారు ఏ స్థాయిలో ప్రభావితం చేయగలరు అనేవి కొంతవరకూ పనిచేస్తాయి’’ అని అభిప్రాయపడ్డారు.
‘‘తిరుపతిలో కూటమి, అధికార పార్టీ ప్రధానంగా పోటీపడుతున్నాయి. కూటమి తరఫున బరిలో నిలిచే అభ్యర్థి స్థానికుడు కాదు. తిరుపతిలో బయట నుంచి ఒక అభ్యర్థి పోటీ చేయడం ఇది మూడోసారి. గతంలో దాదాపుగా ఏ పార్టీ తిరుపతిలో అయినా స్థానిక అభ్యర్థులనే ఎన్నికల బరిలో దించేది. బయటి వ్యక్తికి మూడు పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎంతవరకు సహరిస్తారు అనేది ఒక పెద్ద ప్రశ్న. అధికార పార్టీ అభ్యర్థిని చూస్తే అతను లోకల్, డిప్యూటీ మేయర్. ఇక ఆయన తండ్రికి అక్కడ ఇమేజ్ ఉంది’’ అని రవికుమార్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తత: యుద్ధభయం ఉన్నా ఇజ్రాయెల్ వెళ్లడానికి ఈ యూపీ యువకులు ఎందుకు సిద్ధమవుతున్నారు?
- బంగారం: ఈ విలువైన లోహం భూమి మీదకు ఎలా వచ్చింది, శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
- పాకిస్తాన్ క్రికెట్లో కొత్త డ్రామా, అమీర్ రీఎంట్రీకి కారణాలేంటి?
- కచ్చతీవుకు బదులుగా భారత్ తీసుకున్న 'వాడ్జ్ బ్యాంక్' ప్రాంతం అంత విలువైనదా?
- భారత్ ఉల్లిగడ్డలతో దౌత్యం నెరుపుతోందా?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














