ఇరాన్ ఎందుకు ఇజ్రాయెల్‌పై దాడులు చేసింది? ఆరు ప్రశ్నలు, సమాధానాలు..

ఫొటో సోర్స్, REUTERS
- రచయిత, రఫీ బెర్గ్, టామ్ స్పెండర్, జోనాథన్ బీలే
- హోదా, బీబీసీ న్యూస్
ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్ భూభాగంపై దాడికి దిగడంతో మధ్యప్రాచ్యంలో ఈ పాత శత్రుదేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి.
కొన్ని రోజుల కిందట సిరియా రాజధాని దమాస్కస్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయంలోని కాన్సులేట్‌పై జరిగిన వైమానిక దాడి కారణంగా ఇద్దరు సైనిక జనరళ్లు సహా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన మొత్తం ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పిన ఇరాన్, చెప్పినట్టుగానే డ్రోన్లు, మిస్సైల్స్‌తో ఇజ్రాయెల్ భూభాగంపై దాడులు చేసింది.
అయితే, ఇరాన్ రాయబార కార్యాలయంపై దాడులకు కారణం తామేనని ఇజ్రాయెల్ ఎన్నడూ ప్రకటించలేదు. కానీ, ఆ దాడుల వెనుక ఆ దేశం ఉందని ఇరాన్ నమ్ముతోంది.
అంతకుముందు ఏళ్ళతరబడి ఇజ్రాయెల్, ఇరాన్ పరోక్ష యుద్ధం కొనసాగించాయి. ఇరుదేశాలు పరస్పర లక్ష్యాలపై దాడులు చేసుకున్నాయి కానీ ఏ దేశమూ ఈ దాడులకు బాధ్యత వహించలేదు.

ఫొటో సోర్స్, REUTERS
ఎందుకు శత్రువులయ్యాయి?
ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు 1979లో ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవ కాలం వరకు మిత్రదేశాలుగానే ఉన్నాయి. అయితే ఇస్లామిక్ విప్లవం ఇజ్రాయెల్ వ్యతిరేకతను కీలకంగా కలిగిన పాలనను అధికారంలోకి తెచ్చింది.
ఇజ్రాయెల్ అస్తిత్వాన్ని ఇరాన్ గుర్తించలేదు. దానిని పూర్తిగా నిర్మూలించాలని భావించింది.
ఇరాన్ అగ్రనేత అయతొల్లా ఖొమైనీ ఇజ్రాయెల్‌ను కేన్సర్ గడ్డగా అభివర్ణించి, ఎటువంటి సందేహాలకు తావు లేకుండా దానిని పూర్తిగా నిర్మూలించాలని గతంలో చెప్పారు.
తన అస్తిత్వానికి ఇరాన్ ముప్పుగా కనిపిస్తోందని ఇజ్రాయెల్ నమ్ముతోంది. ఇందుకు తెహ్రాన్ చేసే ప్రకటనలు, ఇజ్రాయెల్ విధ్వంసానికి కట్టుబడిన దళాలను ఏర్పాటు చేయడం, హమాస్ సహా పాలస్తీనా గ్రూపులకు, లెబనాన్‌లోని షియా మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లాకు నిధులు, ఆయుధాలు సమకూర్చుతోందని, అణుబాంబు తయారీ పనిలో ఉందని ఇజ్రాయెల్ విశ్వసిస్తోంది. కానీ ఇరాన్ ఈ ఆరోపణలను ఖండిస్తోంది.
దమాస్కస్‌లో చనిపోయింది ఎవరు?
ఏప్రిల్ 1న సిరియా రాజధాని దమాస్కస్‌లో ఇరాన్ కాన్సులేట్‌పై జరిగిన వైమానిక దాడికి సమాధానంగానే దాడులు చేశామని ఇరాన్ చెబుతోంది.
కాన్సులేట్‌పై దాడులకు ఇజ్రాయెలే కారణమని ఇరాన్ నిందించింది. తన సార్వభౌమత్వానికి భంగం కలిగినట్టుగా భావిస్తున్నామని ప్రకటించింది. ఈ దాడులు తాము చేయలేదని ఇజ్రాయెల్ చెప్పలేదు. కానీ ఈ విషయాన్ని అంతర్జాతీయ సమాజం తేలికగా తీసుకుంది.
ఇరాన్ ఎలైట్ రిపబ్లికన్ గార్డ్ (ఐఆర్‌సీజీ) విదేశీ శాఖ అయిన ఖుద్స్ ఫోర్స్ సీనియర్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ రెజా జహేదీ సహా 13మంది ఈ దాడిలో మరణించారు. లెబనాన్‌లోని షియా గ్రూపు హిజ్బొల్లా లో ఆయన కీలక వ్యక్తి.
ఖుద్స్ ఫోర్స్ సిరియా మీదుగా హిజ్బుల్లాకు అత్యంత కచ్చితమైన క్షిపణుల సహా పలు ఆయుధాలను చేరవేస్తోంది. ఈ ఆయుధాలు అందకుండా చూడటంతోపాటు సిరియాలో ఇరాన్ సైనిక ఉనికి బలోపేతం కాకుండా ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోంది. పలువురు ఐఆర్‌సీజీ కమాండర్లు ఇటీవల సిరియాలో వైమానిక దాడులలో మృతి చెందారు.

ఫొటో సోర్స్, REUTERS
ఇరాన్ మిత్రులెవరు?
మధ్య ప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోజనాలకు సవాల్ విసురుతూ ఇరాన్ ఓ ‘నిరోధక అక్షాన్ని’ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా తన మిత్రులలోనూ, మిలీషియా దళాలతోనూ ఓ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. ఇరాన్ వీటన్నింటికీ వివిధ స్థాయులలో మద్దతు ఇస్తుంటుంది.
లెబనాన్‌లోని హిజ్బుల్లా గ్రూపు ఇరాన్ మద్దతు ఉన్న అత్యంత శక్తిమంతమైన సాయుధ గ్రూపుల్లో ఒకటి . ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి , సరిహద్దుల వద్ద ఇజ్రాయెల్, హిజ్బుల్లా గ్రూపు మధ్య కూడా పరస్పర కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. దీనివల్ల సరిహద్దుల్లోని వేలాదిమంది పౌరులు తమ ఇళ్ళను బలవంతంగా ఖాళీ చేయాల్సి వచ్చింది.
ఇరాక్, సిరియా, జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై దాడులు చేసిన ఇరాక్‌లోని షియా మిలీషియా గ్రూపులకు ఇరాన్ వెన్నుదన్నుగా ఉంది. జోర్డాన్‌లోని మిలటరీ అవుట్ పోస్టుపై దాడిలో ముగ్గురు సైనికులను కోల్పోయిన తరువాత అమెరికా ప్రతీకార దాడులకు దిగింది.
యెమెన్‌లోని హౌతీ ఉద్యమానికి ఇరాన్ మద్దతు ఇస్తోంది. యెమెన్‌లోని అనేక ప్రాంతాలు ఈ సంస్థ నియంత్రణలో ఉన్నాయి.
గాజాలోని హమాస్‌కు తమ మద్దతు తెలిపేందుకు హౌతీలు ఇజ్రాయెల్‌పై మిస్సైల్స్, డ్రోన్లు ప్రయోగించారు. అలాగే తమ తీరప్రాంతంలోని వాణిజ్య నౌకలపై దాడులు చేశారు. ఒక నౌకను ముంచేశారు. దీనికి ప్రతిగా అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ హౌతీ లక్ష్యాలపై దాడులు చేశాయి.
గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై దాడికి దిగిన హమాస్ సహా పాలస్తీనాలోని అనేక సాయుధ గ్రూపులకు ఇరాన్ ఆయుధాలను, శిక్షణను అందిస్తోంది. ఇది గాజా యుద్ధం సహా, ఇరాన్, దాని ప్రతినిధి గ్రూపులు, ఇజ్రాయెల్ దాని మిత్ర రాజ్యాల మధ్య ఘర్షణలకు కారణమవుతోంది.
అయితే అక్టోబర్ 7నాటి దాడులలో తన ప్రమేయాన్ని ఇరాన్ ఖండిస్తోంది.

ఫొటో సోర్స్, REUTERS
ఎవరి సామర్థ్యమెంత?
ఇరాన్ భౌగోళికంగా ఇజ్రాయెల్ కంటే పెద్దది. అలాగే 9 కోట్ల జనాభా ఉంది. ఇది ఇజ్రాయెల్ జనాభా కంటే పదింతలు ఎక్కువ. ఈ లెక్కలను బట్టి ఇరాన్ గొప్ప సైనిక శక్తి అనుకోలేం.
క్షిపణులు, డ్రోన్స్ పై ఇరాన్ భారీగా ఖర్చు చేస్తోంది. దానికి విస్తారమైన ఆయుధ సంపత్తి ఉంది. అలాగే యెమెన్‌లోని హౌతీలకు, లెబనాన్‌లోని హిజ్బుల్లా గ్రూపులకు కూడా చెప్పుకోదగ్గ స్థాయులో ఆయుధ సంపత్తిని సరఫరా చేస్తోంది.
అయితే ఆధునిక రక్షణ వ్యవస్థ, యుద్ధ విమానాలు ఇరాన్‌కు కొరతగానే మిగిలాయి.
యుక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు టెహ్రాన్ ఇచ్చిన మద్దతుకు బదులుగా ఇరాన్ తన ఆయుధసంపత్తిని ఆధునీకరించేందుకు రష్యా సహకరిస్తుందని నమ్ముతున్నారు. ఇరాన్ రష్యాకు షాహీద్ ద్రోన్లను అందించింది. ప్రస్తుతం రష్యా వీటిని సొంతంగా తయారుచేసుకుంటోంది.
అయితే ఇజ్రాయెల్ వద్ద ప్రపంచంలోనే అధునాతన వైమానిక దళం ఉంది. ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్ట్రాటిజిక్ స్టడీస్ (ఐఐఎస్ఎస్) నివేదిక ప్రకారం ఇజ్రాయెల్ వద్ద ఎఫ్-15, ఎఫ్-16 తోపాటు అధునాత ఎఫ్-35 స్టెల్త్ ఎయిర్‌క్రాఫ్ట్స్ సహా కనీసం 14 ఎయిర్‌క్రాఫ్ట్ స్వ్రాడ్రన్స్ ఉన్నాయి.
శత్రువుల భూభాగంలో దాడులు చేసిన అనుభవం కూడా ఇజ్రాయెల్‌కు ఉంది.

ఫొటో సోర్స్, Reuters
అణ్వాయుధాలు ఉన్నాయా?
ఇజ్రాయెల్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని భావిస్తున్నారు. కానీ అధికారిక విధానం మేరకు ఆ దేశం ఉద్దేశపూర్వక గోప్యతను పాటిస్తోంది.
ఇరాన్ వద్ద అణ్వాయుధాలు లేవు. కానీ వాటిని అభివృద్ధి చేయడానికి తమ పౌర అణ్వాయుధ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తోందనే వాదనను ఇరాన్ ఖండిస్తోంది.
ఇరాన్ భూగర్భంలో యురేనియం అణువులు 83.7 శాతం స్వచ్ఛతకు చేరుకున్నాయని, ఇవి ఆయుధాల తయారీకి కావాల్సిన నాణ్యతకు చాలా దగ్గరగా వచ్చాయని కిందటేడాది గ్లోబల్ న్యూక్లియర్ వాచ్‌డాగ్ తెలిపింది.
అయితే యురేనియం అణువుల సుసంపన్న స్థాయులో హెచ్చుతగ్గులు సంభవించి ఉండవచ్చని ఇరాన్ ప్రకటించింది.
2015 అణ్యాయుధ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇరాన్ బహిరంగంగానే గత రెండేళ్ళుగా యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ 60 శాతం స్వచ్ఛతను సాధించింది.
అయితే 2018లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై కఠిన ఆంక్షలను పునరుద్దరించడంతో ఈ అణు ఒప్పందం వీగిపోయే స్థాయికి చేరింది. అణుఒప్పందాన్ని ఇజ్రాయెల్ వ్యతిరేకించింది.

ఫొటో సోర్స్, REUTERS
దాడులతో ఇరాన్ ఏం చెప్పింది
‘‘మేం నిరోధిస్తాం, మేం అడ్డుకుంటాం. ఒకరితో ఒకరు కలిసి విజయం సాధిస్తాం’’అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు చెప్పారు.
‘‘ఇరాన్ దాడి, ఆ దేశ సామర్ధ్యం, దాని పరిధికి అతిపెద్ద దృష్టాంతం’’ అని టామ్ ఫ్లెచర్ విశ్లేషించారు. ఆయన అనేకమంది యూకే ప్రధానులకు విదేశాంగ విధాన సలహాదారుగా, లెబనాన్‌లో యూకే అంబాసిడర్‌గా పనిచేశారు.
‘‘ఇరాన్, ఇజ్రాయెల్ నేతలిద్దరూ అంతర్గత ఒత్తిడిని అంతర్జాతీయ విమర్శలను ఎదుర్కొంటున్నారు. నిప్పుతో చెలగాటమాడటానికి ఇద్దరూ ఇష్టపడుతున్నారు’’ అని ఆయన హెచ్చరించారు.
అయితే ఇరాన్ దాడిని జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉందని ఆయన బీబీసీకి చెప్పారు.
‘‘ఇరాన్ ఈ దాడులను ముందుగానే ఊహించేలా చేయగలిగింది. అందుకే, వాటిని తేలికగా నిరోధించగలిగారు. కేవలం ఇది తన సామర్థ్యాలను ప్రదర్శించడానికి చేసిందే. కానీ, వాటిని తీవ్ర తరం చేయడానికి కాదు’’ అని టామ్ ఫ్లెచర్ తాను లెబనాన్ రాయబారిగా ఉన్నప్పటి అనుభవంతో పోల్చి విశ్లేషించారు.
హిజ్బుల్లా ద్వారా కాకుండా ఇరాన్ నేరుగా ప్రతిస్పందించడం మంచి సంకేతమని ఆయన చెప్పారు.
లెబనాన్ సాయుధ గ్రూపులను సరిహద్దుల నుంచి తరిమికొట్టేందుకు ఇజ్రాయెల్ సైన్యం దాడులను విస్తరించాలని కొంతమంది ఇజ్రాయెలీలు పిలుపునిస్తున్నారు.
ఇరాన్ కోణంలో చూసినప్పుడు ఈ దాడి విజయంతమైందని, ఇజ్రాయెల్ మోసాన్ని టెహ్రాన్ బహిరంగం చేస్తోందని చాథమ్ టింక్ ట్యాంక్‌కు చెందిన సనమ్ వకీల్ చెప్పారు.
‘ఇరాన్, ఇజ్రాయెల్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడం ఇదే మొదటిసారి’’ అని ఆయన బీబీసికి చెప్పారు.
‘‘ఎక్కువ నష్టం వాటిల్లకుండా, ఎవరికీ గాయాలు కాకుండా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి’’ అని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్: ఇజ్రాయెల్‌పై డ్రోన్స్, మిసైల్స్‌తో దాడి చేసిన ఈ ఇరాన్ దళం పవర్ ఏంటి?
- ది రియల్ కేరళ స్టోరీ: రియాద్‌లో మరణశిక్ష పడిన రహీమ్ ప్రాణాలు కాపాడేందుకు హిందూ, ముస్లింలు ఏకమై రూ. 34 కోట్ల 'బ్లడ్ మనీ'ని ఎలా సేకరించారంటే...
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: వైసీపీకి చిక్కవు, టీడీపీకి దొరకవు
- అరబ్- ఇజ్రాయెల్ యుద్ధం 1967: అరబ్ నేలను నాశనం చేసిన ఆ ఆరు రోజుల్లో ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















