ఆడుజీవితం: గల్ఫ్ దేశాల్లో వలస కార్మికుల శ్రమ దోపిడీని కళ్ళకు కట్టించిన చిత్రం

ఫొటో సోర్స్, Aadujeevitham
- రచయిత, మెరిల్ సెబాస్టియన్
- హోదా, బీబీసీ న్యూస్, కొచ్చి
మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లిన పేద భారతీయుల కష్టాలే కథాంశంగా తెరకెక్కిన మలయాళ సినిమా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది.
2008లో రికార్డు స్థాయిలో అమ్ముడుపోయిన ఆడుజీవితం (గొర్రె జీవితం) అనే మలయాళ పుస్తకం ఆధారంగా ఈ సినిమా తీశారు. ఇందులో సౌదీ అరేబియాలో కిడ్నాప్‌కి గురై, బానిసలా ఎడారిలో గొర్రెల కాపరిగా పనిచేసిన భారత వలస కార్మికుడు నజీబ్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. 1990లలో కిడ్నాప్‌కి గురై, రెండేళ్ల దుర్భర జీవితం తర్వాత ఎలాగో తప్పించుకుని బయటపడిన వలస కార్మికుడు నజీబ్ నిజజీవితం ఆధారంగా ఈ కథ రూపొందింది.
ఈ పుస్తకం 250వ ఎడిషన్ ఈ ఏడాది విడుదలైంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ పాఠకులను కట్టిపడేసే ఈ పుస్తకం కేరళ సాంస్కృతిక జీవనానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇది గల్ఫ్ దేశాల్లో వలస బతుకుల కఠిన వాస్తవాలపై చర్చను రాజేసింది.
మూడు గంటల నిడివి కలిగిన ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. విడుదలైన మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా 870 మిలియన్ రూపాయలు(87 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. ఇది 'హృదయాలను ద్రవింపజేసే బతుకు పోరాటం', 'వలస కార్మికుల జీవన్మరణ పోరాటాన్ని చూపించిన సినీ దృశ్యరూపం' అని విమర్శకులు అంటున్నారు.
ఆడుజీవితం సినిమాలో, నజీబ్‌ను అతని యజమాని ఎడారిలో వదిలేస్తాడు. ఒంటరిగా, ప్రపంచానికి దూరంగా, నడి ఎడారిలో జంతువులతో కలిసి జీవితం గడుపుతాడు. సమీపంలో ఎక్కడా రోడ్డు కూడా కనిపించదు, ఫోన్ ఉండదు. ఎవరికైనా లెటర్ రాయడానికి పేపర్, పెన్ను కూడా ఉండవు. స్నేహితులు లేరు. జంతువుల కోసం ఏర్పాటు చేసిన తొట్టిలోని నీటినే తాగుతాడు.

ఫొటో సోర్స్, Aadujeevitham
''ప్లీజ్, నన్ను వదిలేయండి, వెళ్లిపోతాను'' అంటూ సాగే సన్నివేశం హృదయాలను కదిలిస్తుంది. ఉద్యోగం కోసం, ఇంటి దగ్గర అన్నింటినీ అమ్మేసి, కుటుంబాన్ని వదిలేసి వచ్చిన గత జ్జాపకాలు గుర్తుకు వచ్చి, అతని ముఖంపై కన్నీటి ధారలు కనిపిస్తాయి.
మలయాళంలో అతను వేడుకుంటున్న మాటలు అరబిక్ మాత్రమే వచ్చిన అతని యజమానికి మాత్రం అర్థం కావు.
విదేశాలకు వలస వెళ్లిన 21 లక్షల మంది కేరళ వాసుల్లో, దాదాపు 90 శాతం మంది గల్ఫ్ దేశాల్లోనే ఉంటున్నారు. గత ఐదు దశాబ్దాలుగా కేరళ నుంచి అరేబియా ద్వీపకల్పంలోని బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలకు ఈ వలసలు కొనసాగుతున్నాయి.
పేదకుటుంబాలకు చెందిన చాలా మంది కార్మికులు ఆయా దేశాల్లో కఫాలా వ్యవస్థ(గల్ఫ్ దేశాల్లో కాంట్రాక్ట్ లేబర్ వ్యవస్థ)లో ఎన్నోకష్టాలు పడ్డారు. వారు ఎక్కడ ఉండాలి, ఎక్కడికి వెళ్లాలనేవి కూడా యజమాని కనుసన్నల్లోనే జరుగుతాయి. ఇందులో వారు దుర్వినియోగానికి(ఒక పని అనిచెప్పి మరో పనికి వాడుకోవడం), దోపిడీకి గురయ్యే అవకాశం ఉంది.
అక్కడ కష్టపడి సంపాదించిన డబ్బును కార్మికులు తమ స్వస్థలాలకు పంపడం ద్వారా కేరళ ఆర్థిక వ్యవస్థ బలపడింది. భారత్‌లో అత్యంత తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రం కేరళగా ప్రభుత్వ గణాంకాలు సూచిస్తున్నాయి.
గల్ఫ్ దేశాల్లో అణచివేత, శ్రమ దోపిడీ గురించి ఈ పుస్తకంలో వివరంగా రాశారు.
''మీ పాస్‌పోర్ట్ లాగేసుకుంటారు, మీరు తిరిగిరాలేరు, నిత్యం చావుబతుకుల మధ్య పోరాటం సాగించాలి'' అని కార్మికుల వలసలపై పరిశోధన చేసిన మణిపాల్ సెంటర్ ఫర్ హ్యుమానిటీస్‌కు చెందిన మహ్మద్ షఫీక్ కరిన్‌కురయిల్ అన్నారు.
పుస్తకానికి, సినిమా కథకు ఆధారమైన నజీబ్, ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ కథలో చెప్పిన ప్రదేశాలకు ఇక ఎప్పటికీ వెళ్లనని అన్నారు.

ఫొటో సోర్స్, Aadujeevitham
"ఎన్నో కలలతో 1991లో కేరళ నుంచి వెళ్లా. అక్కడ నాకు ఎదురైన అనుభవాలు, దారుణమైన యజమాని, గొర్రెల మధ్య జీవితంతో నాపై నేను నియంత్రణ కోల్పోయాను, నాకేం జరుగుతుందో నాకే తెలియదు, మెదడు మొద్దబారిపోయింది" అని ఆయన చెప్పారు.
2008లో సినీ దర్శకుడు బ్లెస్సీ పుస్తకంపై హక్కులు దక్కించుకున్నారు. ఆ మరుసటి ఏడాది దర్శకుడు పుస్తకం కాపీని అందజేసేప్పటికే ఆ కథ తనకు తెలుసని సుకుమారన్ బీబీసీతో చెప్పారు.
''కథలోని అన్ని సంఘటనలూ తెలుసు. ఆ పుస్తకం గురించి, మరీముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో దీని గురించి చాలామంది మాట్లాడుకునేవాళ్లు. అంతేకాకుండా, అది నన్ను కదిలించింది.''
''ఈ కథలో ప్రత్యేకత ఏంటంటే, జంతువుల మధ్య ఉండడం వల్ల నెమ్మదిగా తాను మనిషిననే విషయం మర్చిపోయి, జంతువుల్లో ఒకడిగా మారడం. అలాంటిది గతంలో ఎప్పుడూ చదవలేదు నేను''
ఈ సినిమాలో నజీబ్ క్రమంగా మలయాళంలో మాట్లాడడం మర్చిపోతాడు. జంతువుల తరహాలో శబ్దాలు మాత్రమే చేస్తాడు. అప్పుడప్పుడు ఇంటి దగ్గరి నుంచి తెచ్చుకున్న మామిడికాయ పచ్చడి రుచిచూస్తుంటాడు.
16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, నిర్మాణ ఖర్చులు, కరోనా వంటి ఎన్నో ఇబ్బందులను అధిగమించి ఎట్టకేలకు ఈ సినిమా థియటర్లలో విడుదలైంది. ఈ సినిమా కోసం దర్శకుడు తాను దాచుకున్న డబ్బులను కూడా ఖర్చు చేశారు.
ఈ చిత్రం తన కలల ప్రాజెక్ట్ అని, కథలోని ఆ భావోద్వేగాన్ని సజీవంగా ఉంచేందుకు పుస్తకం నుంచి కేవలం 43 పేజీల సారాంశాన్ని మాత్రమే తీసుకున్నానని బ్లెస్సీ చెప్పారు.
సినిమా విడుదలైన వారం చివరిలో ప్రేక్షకులు ఈ సినిమా గురించి కానీ, లేదంటే ఈ సినిమా టికెట్లు బుక్ చేసుకోవడం గురించి కానీ మాట్లాడుకుంటూ కనిపించారు. ప్రేక్షకులు థియేటర్ల నుంచి కన్నీళ్లతో బయటికి వస్తున్న వీడియోలు యూట్యూబ్‌లో కనిపించాయి. ఇదో సినిమాలోని భావోద్వేగ సన్నివేశాలను వర్ణించలేమని చాలా మంది చెప్పారు.
''నాకు ఈ కథ తెలుసు, కానీ సినిమా చూడకూడదని అనుకున్నా, చాలా బాధాకరం'' అని ఒక మహిళ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- సైబర్ బానిసలు: ‘నా కళ్ళ ముందే ఆ ఇద్దరు అమ్మాయిలను 17మంది రేప్ చేశారు, నన్ను 16 రోజులు చిత్ర హింసలు పెట్టారు’
- జలియన్‌వాలా బాగ్: జనరల్ డయ్యర్ 105 ఏళ్ళ కిందట సృష్టించిన మారణహోమం
- హీట్ వేవ్ అంటే ఏంటి... దీనికీ ఎన్నికలకూ ఏమిటి సంబంధం?
- 'భారత గూఢచార సంస్థ' పాకిస్తాన్లో 20 మందిని చంపేసిందా, ది గార్డియన్ పత్రిక కథనంపై పాక్ ఏమంటోంది?
- గజల్ అలఘ్: ప్రెగ్నెన్సీపై ఈమె చేసిన పోస్ట్ పెద్ద చర్చకు దారితీసింది, విషయం ఏంటంటే..
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














