శ్రీకాంత్ బొల్లా బయోపిక్: కళ్లులేని ఈ వ్యక్తి వందల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి ఎలా అయ్యారంటే...

ఫొటో సోర్స్, FB/SRIKANTH BOLLA
- రచయిత, అరుంధతీనాథ్
- హోదా, బీబీసీ కోసం
''ఒకవేళ నన్ను ఐఐటీ కోరుకోకపోతే, నాకు కూడా ఐఐటీ అక్కర్లేదు..''
ఈ మాటలు చెప్పింది ఎవరో తెలుసా.. చూపులేకుండా వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగా మారి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన శ్రీకాంత్ బొల్లా.
విద్యా వ్యవస్థపై పోరాడి గెలిచిన ‘రియల్ హీరో’ ఈయన.
ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నానికి చెందిన శ్రీకాంత్ బొల్లా జీవితంపై బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ‘శ్రీకాంత్’ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది.
ఈ ట్రైలర్‌కు యూట్యూబ్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది.
2024 మే 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తుషార్ హీరానందని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
అంధుడైన శ్రీకాంత్ బొల్లా పాత్రలో రాజ్‌కుమార్ రావు నటిస్తున్నారు.
శ్రీకాంత్ తన జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డారో ఈ సినిమా కళ్లకు కడుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, @TSeries
ట్రైలర్‌లో చూపించిన ఒక సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.
‘‘ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక కారు ఆగుతుంది. ఆ సమయంలో ఒక అంధుడు కారు డ్రైవర్ దగ్గరికి వచ్చి డబ్బులు అడుగుతారు. శరద్ కేల్కర్ క్యారెక్టర్ ఆ అంధుడికి డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు. కానీ, శ్రీకాంత్ పాత్రలో నటించిన రాజ్‌కుమార్ రావు.. ‘డబ్బులు ఇస్తున్నావా?’ అని అడుగుతాడు. ఆ డబ్బులు నాకు ఇవ్వు. నేను వారికి జాబ్ ఇస్తాను’’ అని చెబుతాడు రాజ్‌కుమార్ రావు.
అంధుడైన శ్రీకాంత్ బొల్లా చిన్నప్పటి నుంచి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని, దాదాపు రూ.500 కోట్ల విలువైన కంపెనీని సృష్టించారు. దివ్యాంగులకు తన కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వాలని శ్రీకాంత్ నిర్ణయించారు.
శ్రీకాంత్ బొల్లా జీవితంపై ప్రత్యేక కథనాన్ని బీబీసీ 2022లోనే పబ్లిష్ చేసింది. సినిమా ట్రైలర్ విడుదలైన సందర్భంగా ఆయన జీవిత గాథను మరోసారి అందిస్తున్నాం.

ఫొటో సోర్స్, FB/SRIKANTHBOLLAOFFICIAL
నిరుపేద కుటుంబంలో పుట్టిన శ్రీకాంత్‌కు అనేక ఇబ్బందులు
ఆరేళ్ల వయసులో శ్రీకాంత్ రోజూ కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ స్కూలుకు వెళ్లేవారు. ఆయన సోదరులు, క్లాస్‌మేట్లు ఆయన్ను చేయిపట్టుకుని స్కూలుకు తీసుకెళ్లేవారు.
స్కూలుకు వెళ్లే దారంతా చెత్తా చెదారం, చెట్లు చేమలతో నిండి ఉండేది. వర్షాకాలం వస్తే ఇబ్బందులు రెట్టింపయ్యేవి.
''నేను అంధుడిని కావడంతో నాతో ఎవరూ ఎక్కువగా మాట్లాడేవారు కాదు'' అని శ్రీకాంత్ చెప్పారు.
నిరుపేద కుటుంబంలో పుట్టిన శ్రీకాంత్ సమాజం నుంచి అనేకసార్లు తిరస్కారాలు ఎదుర్కొన్నారు.
''కుక్క ఇంట్లోకి వెళ్లిందని కూడా తెలుసుకోలేని నేను ఇంటి కాపలాకు కూడా ఉపయోగపడనని కొందరు మా అమ్మా నాన్నలకు చెప్పేవారు. ముఖం మీద దిండుతో నొక్కి చంపేయండని చాలామంది నా తల్లిదండ్రులకు సలహా ఇచ్చేవారు’’ అని అప్పట్లో తన చేదు అనుభవాలను గుర్తుకు చేసుకున్నారు శ్రీకాంత్ .
అయితే, సమాజంలో అనేకమంది అనేక రకాల మాటలన్నా, శ్రీకాంత్ తల్లిదండ్రులు వాటిని పట్టించుకోలేదు. ఆయనకు అండగా నిలిచారు.
8 ఏళ్ల వయసులో ఆయనకో శుభవార్త వినిపించింది. అంధ విద్యార్ధులు చదువుకునే బోర్డింగ్ స్కూలులో శ్రీకాంత్‌కు సీటు వచ్చింది. దీంతో తన సొంత ఊరికి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్‌కు చేరుకున్నారు.
తల్లిదండ్రులకు దూరమైనా, స్కూల్లో చాలా ఉత్సాహంగా గడిపేవారు శ్రీకాంత్. ఈత కొట్టడం, చెస్, క్రికెట్ లాంటి ఆటలన్నీ నేర్చుకున్నారు. శబ్ధం చేసే బంతితో ఆయన క్రికెట్ ఆడగలిగేవారు.
బోర్డింగ్ స్కూల్లో శ్రీకాంత్ తన హాబీలను ఆస్వాదించారు. అదే సమయంలో భవిష్యత్తు గురించి కూడా ఆలోచించడం ప్రారంభించారు. ఇంజినీర్ కావాలన్నది ఆయన కల. అది నెరవేరాలంటే సైన్స్, మ్యాథ్స్ చదవాలని ఆయనకు తెలుసు.

ఫొటో సోర్స్, SRIKANTH BOLLA
సైన్స్, మ్యాథ్స్‌లో చేర్చుకోలేం అన్నారు
కోరుకున్నట్లుగానే ఆయన మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులను ఎంచుకున్నారు. కానీ, ‘ఆ సబ్జెక్టులు తీసుకోవడానికి నీకు అర్హత లేదు’ అంటూ స్కూల్ యాజమాన్యం చెప్పింది. అయితే, ఇది చట్ట విరుద్ధమని శ్రీకాంత్ వాదించారు.
శ్రీకాంత్ చదివే స్కూల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా మండలి పరిధిలో ఉంటుంది.
ఈ మండలి నిబంధనల ప్రకారం, అంధులైన సీనియర్ విద్యార్థులు సైన్స్, మ్యాథ్స్ ఎంచుకోవడం వీలుకాదు. ఈ సబ్జెక్టులలో డయాగ్రామ్‌లు, గ్రాఫ్‌లు ఉంటాయి కాబట్టి, వీటిని అంధులైన విద్యార్ధులు చదవలేరంటూ వీటికి వారిని అనర్హులుగా పేర్కొంది.
దీనికి బదులుగా వారు, ఆర్ట్స్, లాంగ్వెజ్, లిటరేచర్, సోషల్ సైన్సెన్స్‌లను ఎంచుకోవచ్చని సూచించింది. ఈ ఘటనలు 2007లో జరిగాయి.

ఫొటో సోర్స్, SRIKANTH BOLLA
విద్యా మండలిపై న్యాయపోరాటం
అన్ని పాఠశాలలకు ఒకే నిబంధన లేని ఈ వ్యవస్థపై శ్రీకాంత్ ఆగ్రహించారు. ఆయనకు టీచర్‌గా వ్యవహరించిన తక్కెళ్లపాటి స్వర్ణలత కూడా శ్రీకాంత్‌కు ఈ సబ్జెక్టులు చదివే అవకాశం లేనందుకు తీవ్ర నిరాశ చెందారు. దీనిపై ఏదో ఒకటి చేయాలంటూ ఆమె శ్రీకాంత్‌ను ప్రోత్సహించారు.
వీరిద్దరు తమ వాదనను వినిపించడానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌కు వెళ్లారు. కానీ, నిబంధనలు అలా ఉన్నాయని, తామేమీ చేయలేమని అక్కడి అధికారులు చెప్పారు.
నిరాశ చెందని శ్రీకాంత్, స్వర్ణలత ఒక లాయర్‌ను సంప్రదించారు. అంధ విద్యార్థులను మ్యాథ్స్, సైన్స్ చదివేందుకు అనుమతిచ్చేలా విద్యా చట్టాన్ని మార్చాలని విజ్ఞప్తి చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు వేశారు.

ఫొటో సోర్స్, Srikanth Bolla
మ్యాథ్స్, సైన్స్ ఎలా చదివారు?
కేసు నడుస్తున్న కాలంలోనే, శ్రీకాంత్‌కు ఒక వార్త తెలిసింది. హైదరాబాద్‌లోని చిన్మయ విద్యాసంస్థ వేరే విద్యామండలి ఆధ్వర్యంలో నడుస్తోందని, అక్కడ అంధ విద్యార్ధులకు మ్యాథ్స్, సైన్సు బోధిస్తారని తెలిసింది. వెంటనే శ్రీకాంత్ అందులో చేరారు.
క్లాస్ మొత్తంలో తానొక్కరే అంధ విద్యార్ధి. ''కానీ వారంతా నన్ను ముక్తకంఠంతో స్వాగతించారు'' అని శ్రీకాంత్ వివరించారు.
''మా క్లాస్ టీచర్ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఆమె నాకు చేయగలిగిన సాయమంతా చేసేవారు. స్పర్శ సాయంతో డయాగ్రామ్‌లు ఎలా గీయాలో ఆమె నేర్పారు'' అని తెలిపారు శ్రీకాంత్.
ఒక్క రబ్బర్ మ్యాట్‌పై పెన్ను లేదా పెన్సిల్‌తో గట్టిగా గీసినప్పుడు ఆ లైన్ పేపరు మీద ఉబ్బెత్తుగా మారుతుంది. చేతితో తాకి ఆ లైన్‌ను తెలుసుకోవచ్చు.

ఫొటో సోర్స్, BOLLANT INDUSTRIES PVT LTD/FB
శ్రీకాంత్ పోరాటానికి దక్కిన విజయం
ఆరు నెలల తర్వాత కోర్టు నుంచి తీర్పు వచ్చింది. శ్రీకాంత్ తాను వేసిన కేసులో గెలిచారు. అంధ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని స్టేట్ బోర్డ్ స్కూల్స్‌లో సైన్స్, మ్యాథ్స్ చదవడానికి అర్హులని కోర్టు తీర్పు చెప్పింది.
‘‘నాకు చాలా సంతోషం వేసింది. నేను సాధించగలనని ఈ ప్రపంచానికి నిరూపించడానికి నాకు మొదటి అవకాశం వచ్చింది. నేటి యువతరం కేసులు దాఖలు చేయడం, కోర్టు ద్వారా పోరాడటంలో భయపడాల్సింది ఏమీ లేదు'' అని ఆయన ఒకప్పుడు బీబీసీకి చెప్పారు.
శ్రీకాంత్ వెంటనే స్టేట్ బోర్డ్ స్కూల్‌కి తిరిగి వచ్చారు. తనకిష్టమైన సైన్సు, మ్యాథ్స్‌లు చదువుకుని 98% మార్కులు సాధించారు.
ఐఐటీలో సీటు సంపాదించాలన్నది ఆయన లక్ష్యం. వీటిలో ప్రవేశానికి పోటీ తీవ్రంగా ఉంటుంది. ఐఐటీల్లో ప్రవేశం కోసం విద్యార్థులు కోచింగ్ తీసుకునేవారు. కానీ, శ్రీకాంత్ అంధుడు కావడంతో ఆయన్ను కోచింగ్ క్లాసుల్లో చేర్చుకోవడానికి ఎవరు ఇష్టపడలేదు.

ఫొటో సోర్స్, FB/SRIKANTH BOLLA
ఐఐటీలను వదిలేసి, అమెరికా విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు
''ఈ కోర్సు కోచింగ్ చాలా తీవ్రంగా ఉంటుందని, ఒక చిరు మొక్కపై పెను వర్షం కురిసినట్లుగా ఉంటుందని కొన్ని ఇన్‌స్టిట్యూట్లు నాకు చెప్పాయి. నేను అకడమిక్ స్టాండర్డ్‌ను అందుకోలేనని వారు భావించేవారు'' అని చెప్పారు శ్రీకాంత్.
''నేనేమీ బాధపడలేదు. నన్ను ఐఐటీ కోరుకోకపోతే, నాకు కూడా ఐఐటీ అక్కర్లేదు'' అని అనుకున్నట్లు శ్రీకాంత్ చెప్పారు.
అమెరికాలోని విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో ఐదు యూనివర్సిటీల నుంచి ఆయనకు ఆఫర్‌లు వచ్చాయి. మసాచుసెట్స్‌లోని ఎంఐటీ (మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)ని ఆయన ఎంచుకున్నారు.
అక్కడ సీటు పొందిన మొట్టమొదటి అంతర్జాతీయ అంధ విద్యార్థి అయ్యారు శ్రీకాంత్. 2009లో శ్రీకాంత్ అక్కడికి చేరుకున్నారు. ఆరంభంలో యూనివర్సిటీలో తనకు ఎదురైన అనుభవాలను వివరించారు.
''అక్కడున్నంత చలిని నేనెప్పుడూ అనుభవించ లేదు. తిండి కూడా భిన్నమైన వాసన, రుచి ఉండేది. మొదటి నెలంతా ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్ ఫింగర్స్ మాత్రమే తిన్నాను'' అని వివరించారు.
తర్వాత అక్కడి వాతావారణానికి, ఆహారానికి అలవాటు పడ్డట్లు శ్రీకాంత్ చెప్పారు.
‘‘ఎంఐటీలో ఉన్నప్పటి నా జీవితం అత్యంత అందమైన కాలం'' అన్నారు శ్రీకాంత్. అక్కడ అకడమిక్ లెవల్ చాలా కష్టంగా ఉండేది. కానీ, యూనివర్సిటీ తనకెంతో సాయం చేసింది’’ అని శ్రీకాంత్ బీబీసీకి చెప్పారు.

ఫొటో సోర్స్, BOLLANT.COM
చదువుకునేటప్పుడే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు
చదువుకుంటున్న సమయంలోనే ‘సమన్వయి సెంటర్ ఫర్ చిల్డ్రన్ విత్ మల్టిపుల్ డిజబిలిటీస్’ అనే స్వచ్ఛంద సంస్థను హైదరాబాద్‌లో ప్రారంభించారు.
అంగవైకల్యం ఉన్న వారికి విద్యనందించడం, శిక్షణ ఇవ్వడం ఈ సంస్థ ప్రధాన ఆశయాలు. నిధులు సేకరించి బ్రెయిలీ లైబ్రరీని కూడా ఏర్పాటు చేశారాయన.
ఎంఐటీలో మేనేజ్‌మెంట్ సైన్స్‌లో ఆయన గ్రాడ్యుయేట్ అయ్యారు. జాబ్ కూడా సంపాదించారు. శ్రీకాంత్ జీవితం అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో, ఆయన తన జీవిత లక్ష్యం ఇది కాదని అనుకున్నారు.
అమెరికాలో ఉండకూడదని నిర్ణయించుకున్నారు. ఆయనకు తన స్కూల్ రోజులు గుర్తొచ్చాయి. తాను చేయవలసిన పని అసంపూర్తిగా ఉన్నట్లు శ్రీకాంత్ భావించారు.

ఫొటో సోర్స్, BOLLANT.COM
వికలాంగులకు ఉపాధి కల్పించే కంపెనీ స్థాపన
"జీవితంలో ప్రతిదానికీ నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. అందరూ నాలా పోరాడలేరు. లేదంటే నాకు దొరికిన గురువుల్లాంటి వారిని పొందలేరు'' అని బీబీసీకి చెప్పారాయన.
విశాల దృష్టితో చూస్తే వికలాంగులకు ఉద్యోగాలే లేనప్పుడు, వారికి చదువు కోసం పోరాటడం అర్ధం లేనిదని ఆయన భావించారు.
''నేనే సొంతంగా కంపెనీ ఎందుకు స్థాపించకూడదు, వికలాంగులకు ఎందుకు ఉపాధి కల్పించకూడదు'' అని శ్రీకాంత్ ఆలోచించారు.
2012లో హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన శ్రీకాంత్, బొల్లాంట్ ఇండస్ట్రీస్‌ను స్థాపించారు. ప్యాకేజింగ్ మెటీరియల్ తయారు చేసే ఈ కంపెనీ, తాటి ఆకులతో పర్యావరణ అనుకూల ఉత్పత్తులను తయారు చేస్తుంది. దీని విలువ రూ.483 కోట్లు ఉంటుందని అంచనా.
ఈ సంస్థ వీలైనంత ఎక్కువమంది వికలాంగులకు, మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఉద్యోగాలిచ్చింది. కరోనా మహమ్మారికి ముందు మొత్తం 500 మంది సిబ్బందిలో 36% మంది వికలాంగులు ఉండేవారు.
30 సంవత్సరాల వయసులోనే శ్రీకాంత్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ యంగ్ గ్లోబల్ లీడర్స్-2021 జాబితాలో చోటు దక్కించుకున్నారు.
ఈ సినిమాతో తనను మొదటిసారి కలిసిన వారు తక్కువ అంచనా వేయడం మానేస్తారని శ్రీకాంత్ ఆశిస్తున్నారు.
''మొదట్లో జనం పాపం అంధుడు అని బాధపడిపోతారు. కానీ, నేనేంటో తెలిసిన తర్వాత అన్నీ మారిపోతాయి’’ అన్నారు శ్రీకాంత్.
ఇవి కూడా చదవండి:
- విజయవాడ: 'మేమంతా బూడిద తిని, బూడిద తాగి టెన్షన్‌తో బతుకుతున్నాం'
- భారత్ ఉల్లిగడ్డలతో దౌత్యం నెరుపుతోందా?
- వారణాసిలో మోదీ మీద పోటీ చేస్తున్న అజయ్ రాయ్ ఎవరు... ఆర్ఎస్ఎస్-బీజేపీ చరిత్ర ఉన్న ఈ నాయకుడినే కాంగ్రెస్ ఎందుకు ఎంపిక చేసింది?
- గణిత ప్రపంచాన్ని మలుపు తిప్పిన సున్నాను భారతీయులు ఎలా కనిపెట్టారు?
- కరోనా బోరియాలిస్: ఈ ఖగోళ వ్యవస్థలో జరగబోయే పెను విస్ఫోటం మనకు ఎప్పుడు, ఎలా కనిపిస్తుంది?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














