విజయవాడ: 'మేమంతా బూడిద తిని, బూడిద తాగి టెన్షన్‌తో బతుకుతున్నాం'

విజయవాడ
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

విజయవాడ నగరం, చుట్టుపక్కల ప్రాంతాలను ప్రమాదకరమైన బూడిద కమ్మేస్తోందా?

ఆంధ్రప్రదేశ్ జెన్కో ఆధ్వర్యంలో నడుస్తున్న నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్(ఎన్‌టీపీఎస్) వ్యర్థాల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ప్రజలు ఆందోళనలు చేసినా, పవర్ ప్లాంట్ గేటు దగ్గర ధర్నాలు చేసినా బూడిద సమస్య తీరలేదు.

ఈ బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నాలుగు దశాబ్దాల క్రితం నుంచి నడుస్తున్నప్పటికీ ఇటీవల నిర్వహణ లోపాలు ఇబ్బందికరంగా మారాయని స్థానికులు బీబీసీతో చెప్పారు.

మైలవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉండే ఎన్‌టీటీపీఎస్ నుంచి వెలువడే బూడిద వల్ల కొండపల్లి, ఇబ్రహీంపట్నం ప్రాంతాలు కాలుష్యంలో మగ్గుతున్నాయి. పవర్ ప్లాంట్ నిర్వహణ లోపాలతో పెరుగుతున్న కాలుష్యం సమస్యాత్మకంగా మారిందని విజయవాడ, పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్, భద్రాచలం వైపు నుంచి విజయవాడ నగరంలోకి టూ వీలర్ మీద వచ్చే వారికి కళ్లల్లో బూడిద పడి, ప్రమాదాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. తీవ్రంగా ఉన్న ఈ కాలుష్య సమస్యపై హైకోర్టుని ఆశ్రయించేందుకు స్థానికులు సిద్ధమవుతున్నారు.

ఎన్‌టీపీఎస్‌నే విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్‌(వీటీపీఎస్)గానూ పిలుస్తారు.

విజయవాడ
ఫొటో క్యాప్షన్, విజయవాడ సమీపంలోని నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం

అంతా బూడిదమయమే..

ఎన్టీటీపీఎస్‌లో తొలి యూనిట్‌ను 1979లో ప్రారంభించారు. దాదాపు 45 ఏళ్లుగా ఈ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ప్లాంట్‌లో మొత్తం 8 యూనిట్లు ఉన్నాయి. ప్రస్తుతం 8వ యూనిట్ పనులు జరుగుతున్నాయి.

ప్రస్తుతం 210 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం కలిగిన ఆరు యూనిట్లు, 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ఒక యూనిట్ నడుస్తున్నాయి.

బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల నుంచి పెద్ద మొత్తంలో బూడిద వెలువడుతుంది. ఆ బూడిదను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాష్ పాండ్‌లోకి పంపిస్తారు.

ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి కోసం సుమారుగా అరటన్ను బొగ్గు అవసరమవుతుంది. నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ ప్రస్తుత సామర్థ్యం 1760 మెగావాట్లు. అంటే, సామర్థ్యం మేరకు అన్ని యూనిట్లు పనిచేస్తే సగటున 850 టన్నులకు పైగా బొగ్గును వాడతారు. విద్యుత్ ఉత్పత్తిలో భాగంగా వెలువడే బూడిద అందులో మూడోవంతు ఉంటుందని అంచనా. వీటినే బొగ్గు దహన అవశేషాలు (సీసీఆర్)గా పేర్కొంటారు.

విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించే బొగ్గు నాణ్యత సహా అనేక అంశాల మీద ఇది ఆధారపడి ఉంటుంది.

2022 నాటి కాగ్ రిపోర్ట్స్ ప్రకారం, గడచిన పదేళ్లుగా టన్ను బొగ్గు నుంచి సగటున 34 శాతం వరకూ బూడిద వస్తుంది. ఆ లెక్క ప్రకారం చూస్తే, విజయవాడలోని థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి దాదాపుగా 300 టన్నుల వరకూ బూడిద వస్తోంది.

విజయవాడ

నిధుల కొరత... నిర్వహణ లోపాలు?

పవర్ ప్లాంట్ నుంచి వచ్చే బూడిదను యాష్ పాండ్‌లోకి పంపించాలి. కానీ, ప్లాంట్ నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో ఆ బూడిదంతా గాలిలో కలిసి చుట్టుపక్కల ఉండే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంపు మీద ఉన్న శ్రద్ధ, నిర్వహణ మీద లేకపోవడమే స్థానికులకు సమస్యగా మారింది.

ఈ ప్లాంట్ ప్రారంభించే నాటికి కొండపల్లి, ఇబ్రహీంపట్నం ప్రాంతాలు చిన్న పల్లెలు. కానీ, ప్రస్తుతం అవి మునిసిపాలిటీ స్థాయికి చేరుతున్నాయి. ప్లాంట్‌లో పనిచేసే సిబ్బందితో పాటుగా అనుబంధ పరిశ్రమలు, ఇతర యూనిట్లు రావడంతో ఆ ప్రాంతం బాగా విస్తరించింది.

అలాగే, ప్లాంట్‌ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుదలతో పాటు కాలుష్యం కూడా పెరుగుతోంది.

"ఆ ప్లాంట్ విస్తరణకు అనుమతులిస్తూ 2015, 2019లో కేంద్ర ప్రభుత్వ పర్యావరణ పరిరక్షణ మంత్రిత్వ శాఖ కొన్ని నిబంధనలు కూడా పెట్టింది. విషవాయువుల నియంత్రణ కోసం 70 ఎకరాల్లో పచ్చదనం పెంచాల్సి ఉంది. కానీ, అది జరగలేదు. ఇప్పటికే ప్లాంట్ పరిసరాల్లో ఉపరితల, భూగర్భ జలవనరుల్లో పాదరసం, సీసం, కాడ్మియం, ఆర్సెనిక్, సల్ఫర్ వంటి విష పదార్థాలు పెరిగిపోయాయి. వాతావరణంలో సల్ఫర్, నైట్రోజన్ కాలుష్యం కూడా పెరిగిపోయింది. వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాల్సి ఉన్నప్పటికీ అది జరగడం లేదు" అని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ అన్నారు.

విజయవాడ

గత డిసెంబర్‌లో ఆయన ఈ పవర్ ప్లాంట్ పరిసరాల్లో పర్యటించారు. ప్రజలతో మాట్లాడారు. ఆ తర్వాత తన పరిశీలనలో గుర్తించిన విషయాలను ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ జెన్‌కో‌తో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థల దృష్టికి కూడా తీసుకెళ్లారు.

రాష్ట్ర ప్రభుత్వ సంస్థ నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యమే ప్రజలకు శాపంగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు.

గతంలో కాలుష్య సమస్యను కట్టడి చేసేందుకు ప్లాంట్‌కి ఏటా రూ.60 కోట్ల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేది. ఆ నిధులను యంత్రాల నిర్వహణకు ఉపయోగించేవారు. దానివల్ల బూడిద తక్కువగా గాలిలో కలిసేది. కానీ, ప్రస్తుతం నాలుగేళ్లుగా నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందంటూ పేరు వెల్లడించేందుకు అంగీకరించని అధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.

కొంతకాలంగా ఏపీ జెన్‌కో ద్వారా ప్రభుత్వానికి విన్నవించగా చివరకు రూ.20కోట్లు విడుదల చేశారని, అవి పూర్తిగా సరిపోవని ఆయన అన్నారు. కనీసంగా వంద కోట్లు కేటాయిస్తే ఆరేడు నెలల్లో ఈ సమస్య పరిష్కరించే అవకాశం ఉంటుందని చెప్పారు.

విజయవాడ

బూడిద మాఫియాగా రాజకీయ నేతలు

మైలవరం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించే ప్రజా ప్రతినిధులకు ఎన్‌టీ‌టీపీఎస్ నుంచి వెలువడే బూడిద పెద్ద ఆదాయమార్గంగా మారిందనే విమర్శలున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ బూడిద అమ్మకాల ద్వారానే వందల కోట్లు సంపాదించారంటూ విపక్ష నేతలు ఆందోళనలు కూడా చేపట్టారు.

పవర్ ప్లాంట్ నుంచి ద్రవ రూపంలో ఉన్న వ్యర్థాలను సమీపంలోని యాష్ పాండ్‌కి తరలిస్తున్నారు. అక్కడ అది గట్టి పడిన తర్వాత దానిని లారీలలో తరలిస్తున్నారు. ఇటుకల తయారీ, రోడ్ల నిర్మాణం, భవనాల నిర్మాణంలో ఈ బూడిద ఎక్కువగా వాడుతుంటారు. బూడిద అమ్మకాల్లో కొంతకాలంగా అధికార పార్టీ ప్రతినిధులే చక్రం తిప్పుతున్నారు. ప్రతి లారీ నుంచి కొంత మొత్తం వసూలు చేస్తున్నట్టు విమర్శలున్నాయి.

బూడిదను తరలించే లారీలు నిబంధనల ప్రకారం ట్రక్కుకు పూర్తిగా పట్ట కప్పాలి. ఎక్కడా బూడిద కిందపడకుండా, గాలిలో కలవకుండా చూడాలి. కానీ, చాలా వరకూ లారీల నిర్వాహకులు తూతుమంత్రంగా పట్టలు కప్పేసి బూడిదను తరలిస్తుంటారు. వారు నిబంధనలు పాటించకపోవడం వల్ల బూడిద గాలిలో కలుస్తోంది.

విజయవాడ

బూడిదతో ఇబ్బందులు

గడచిన కొన్నేళ్లుగా ఈ బూడిద సహా వ్యర్థాల ప్రభావం విస్తృతమయ్యింది. యాభై ఏళ్లుగా ఈ ప్లాంట్‌ని చూస్తున్న వాళ్లు కూడా ఇటీవల తమకు కాలుష్యం సమస్య తీవ్రమయ్యిందనే చెబుతున్నారు.

"నాయకులకు బాగా లాభం వస్తోంది. కానీ, మా ప్రాణాలు పోతున్నాయి. ఇంటి మీద బట్టలు ఆరేస్తే అరగంటలో వాటి నిండా బూడిద పడుతుంది. ఇంటి బయట నీళ్ల కుండ పెడితే, మూతలేకుంటే గంట తర్వాత అవి వాడుకోవడానికి కూడా ఉపయోగపడవు. ఇలాంటి సమస్య ఉందని ఎంత మొరపెట్టుకున్నా ఖాతరు చేయడం లేదు. తమ ప్రయోజనాల కోసం నాయకులంతా మా జీవితాలను పణంగా పెడుతున్నారు" అని కొండపల్లికి చెందిన ఎం.శాంతి అభిప్రాయపడ్డారు.

మా ప్రాంతంలో ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తే ఈ కాలుష్యం ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుందని ఆమె అన్నారు. వ్యర్థాల నియంత్రణను పూర్తిగా గాలికొదిలేశారని ఆవేదన చెందారు.

విజయవాడ

బొగ్గు బూడిదలో ఉండే సీసం, ఆర్సెనిక్, పాదరసం, కాడ్మియం, జింక్ వంటి వాటిని 'ప్రమాదకరమైన పారిశ్రామిక వ్యర్థాలు'గా పరిగణిస్తారు. ఇప్పుడు అవి మోతాదుకి మించి కొండపల్లి ప్రాంత ప్రజల మీద ప్రభావం చూపుతున్నాయి. పలువురు అనారోగ్యాల బారిన పడుతున్నారు.

"మేమంతా బూడిద తిని, బూడిద తాగి బతుకుతున్నాం. అత్యంత కష్టంగా ఉంది. బైక్ మీద వంద మీటర్లు వెళ్లాలంటే భయం. కళ్లల్లో పడి కళ్లకు ఏమవుతుందోననే టెన్షన్. రోడ్డు వెంబడి బూడిద రజను కళ్లల్లోకి వచ్చేస్తుంది. ముక్కు ద్వారా శరీరంలో ప్రవేశిస్తోంది. అనేక మంది మంచాన పడుతున్నారు. యాష్ పాండ్ వ్యర్థాలను ఇతర అవసరాలకు వినియోగం పేరుతో లారీలతో తరలిస్తూ కొందరు లాభాలు పొందుతున్నారు. కానీ, ప్రజలు మాత్రం ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తోంది" అని ఆర్టీఐ కార్యకర్త షేక్ ఆలీషా అన్నారు.

సమస్యను ప్లాంట్ అధికారులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికులు కదిలి, నిరసనలు తెలిపినా కదలిక లేదని, ఈ వ్యవహారంపై తాము హైకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు బీబీసీతో చెప్పారు.

విజయవాడ

కృష్ణా జలాల్లో సైతం..

కేవలం గాలి, నేల మాత్రమే కాకుండా నీటి కాలుష్యం కూడా తీవ్రంగా కనిపిస్తోంది. ప్రమాదకర స్థాయిలో సాగుతోంది. ప్లాంట్ నుంచి నేరుగా కొంత వ్యర్థాలను కృష్ణా నదిలో కలిపేస్తున్నారు. బూడిద కూడా అందులో పెద్దమొత్తంలో కనిపిస్తోంది.

ప్లాంట్‌కి దిగువన ఉన్న విజయవాడ నగర వాసులకు కృష్ణా నుంచే నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. దీంతో పంప్ హౌస్‌కి ఎగువన ఎన్‌టీటీపీఎస్ నుంచి వ్యర్థాలు నదిలో కలిపేస్తుండడాన్ని అత్యంత ప్రమాదకరంగా ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు.

కాగా, ఈ కథనం ప్రచురించిన తర్వాత ఏపీ జెన్‌కో వివరణ ఇచ్చింది.

త్వరలో మరమ్మతులు: ఏపీ జెన్‌కో

ఎన్టీటీపీఎస్ కాలుష్య నియంత్రణ కోసం ఇటీవలే రూ.28 కోట్లు నిధులు విడుదలయినట్లు ఏపీ జెన్కో ప్రకటించింది.

బీబీసీ కథనంపై చీఫ్ ఇంజినీర్ మూర్తి వివరణ ఇచ్చారు.

"టెక్నికల్ కన్సల్టెన్సి నివేదిక ఇచ్చింది. దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. త్వరలో విడి భాగాలు కొనుగోలు చేసి బూడిద గాలిలోకి రాకుండా పూర్తి చర్యలు తీసుకుంటాం. స్థానికుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఈనెల 28 నుంచి వారానికి ఓ సారి వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తాం. కాలుష్య నియంత్రణ సామాజిక బాధ్యతగా భావిస్తున్నాం. ప్రతీ రోజూ చిమ్నీల నుంచి వెలువడే నమూనాలు సేకరించి, విశ్లేషిస్తున్నాం'' అని చీఫ్ ఇంజనీర్ తెలిపారు.

రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ పరిధిలో కూడా కాలుష్య నియంత్రణ కోసం నిధులు విడుదలయినట్లు ఆయన తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)