ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య జోర్డాన్ ఎందుకు జోక్యం చేసుకుంది?

జోర్డాన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మొహమ్మద్ సొహైబ్
    • హోదా, బీబీసీ ఉర్దూ

ఏప్రిల్ 13 - 14 తేదీల మధ్య రాత్రి మిడిల్ ఈస్ట్ వాసులకు కంటిమీద కునుకులేకుండా పోయింది.

ఆ రోజు రాత్రి డ్రోన్లు, మిస్సైల్స్‌తో ఇజ్రాయెల్‌పై ఇరాన్ విరుచుకుపడడంతో అందరి దృష్టి అరబ్బు దేశాల ఆకాశం మీదే ఉంది.

ఇటీవల సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్ కాన్సులేట్‌పై దాడి జరిగింది. అయితే ఈ దాడికి ఇజ్రాయెల్ బాధ్యత వహించలేదు. ఈ దాడి వెనుక ఇజ్రాయెల్ హస్తముందని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడుతోంది.

గత ఆరు నెలలుగా ఇజ్రాయెల్ - హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా యావత్ ప్రపంచం ద‌ృష్టి అరబ్ ప్రాంతంపైనే ఉంది. అందువల్ల, ఇరాన్ దాడిని ప్రపంచం జాగ్రత్తగా వీక్షించింది.

రాత్రివేళ వేర్వేరు సమయాల్లో ఈ దాడులు జరిగాయి. అయితే, ఈ దాడి నుంచి మిత్రదేశాల సాయంతో ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకోగలిగింది.

ఇజ్రాయెల్ విడుదల చేసిన ప్రకటనలో, కొన్ని డ్రోన్లు, మిస్సైల్స్‌ను తమ అత్యాధునిక భద్రతా వ్యవస్థ సాయంతో గగనతంలోనే ప్రతిదాడి చేసి కూల్చివేసినట్లు పేర్కొంది. మరికొన్నింటిని అమెరికా సహా ఇతర మిత్రదేశాల సాయంతో ఇజ్రాయెల్ బోర్డర్‌కు చేరుకోకముందే కూల్చివేసినట్లు తెలిపింది.

ఇజ్రాయెల్‌కు సహకరించిన మిత్రదేశాల్లో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జోర్డాన్ ఉన్నాయి.

వీటిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ మూడూ పాశ్చాత్య దేశాలు. కానీ ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, మిస్సైల్‌ను మిడిల్ ఈస్ట్‌లోని ఒక ముస్లిం దేశం అయిన జోర్డాన్ కూల్చివేయడంపై పాకిస్తాన్‌తో పాటు ప్రపంచంలోని అనేక ముస్లిం దేశాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. చాలామంది ఆశ్చర్యపోతున్నారు.

కొందరు జోర్డాన్‌పై విమర్శలు కూడా చేస్తున్నారు.

జోర్డాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టెహ్రాన్‌లో నిరసన

జోర్డాన్ చర్యపై పాకిస్తాన్‌లో ఆందోళన

పాకిస్తాన్‌లో, సోషల్ మీడియా ప్లాట్‌ఫాం 'ఎక్స్'(ట్విటర్)‌లో టాప్ ట్రెండింగ్ విషయాల్లో జోర్డాన్‌ కూడా ఉంది.

జోర్డాన్ జోక్యంపై పాకిస్తాన్ పార్లమెంట్ ఎగువ సభ (సెనేట్) మాజీ సభ్యుడు, జమాత్ - ఎ - ఇస్లామీ నాయకుడు ముష్తాక్ అహ్మద్, జోర్డాన్ రాజు అబ్దుల్లా 2 ఫోటోను షేర్ చేస్తూ విమర్శలు చేశారు.

ముష్తాక్ చేసిన పోస్టుపై 26 లక్షల మందికి పైగా ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఆజాదీ డిజిటల్ అనే ఖాతా నుంచి ఆయన ఇలా రాశారు, ''ఇజ్రాయెల్ డ్రోన్లు, మిస్సైల్స్‌ను ఆపాలనే ఆలోచన జోర్డాన్ రాజుకు ఎప్పుడూ లేదు. కానీ ఇరాన్ ఇజ్రాయెల్‌పై మిస్సైల్స్‌, డ్రోన్లతో దాడి చేసినప్పుడు మాత్రం ఆయన విఫలమయ్యారు. దానివల్ల నేను చాలా బాధపడ్డా.''

జోర్డాన్ చర్యపై పాకిస్తాన్‌లోనే కాకుండా సొంతదేశంలోనూ విమర్శలు వస్తున్నాయి. కొద్దివారాల కిందటి వరకూ కూడా, అమెరికన్ ఎంబసీ ఎదుట ఇజ్రాయెల్ వ్యతిరేక ప్రదర్శనలు జరిగాయి.

జోర్డాన్‌లోని ప్రతి ఐదుగురిలో ఒకరు పాలస్తీనా భూభాగం నుంచి వచ్చి స్థిరపడిన పూర్వీకులే. జోర్డాన్ రాజు అబ్దుల్లా 2 రాణి అయిన రానియా కూడా పాలస్తీనాకు చెందినవారే.

గాజాలో తీవ్రమవుతున్న మానవతా సంక్షోభం గురించి ఇటీవల ఆమె తన స్వరం పెంచారు.

జోర్డాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జోర్డాన్ రాజు అబ్దుల్లా 2

జోర్డాన్, ఇరాన్ వైఖరేంటి?

బహిరంగంగా విమర్శలు వెల్లువెత్తడంతో జోర్డాన్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. జోర్డాన్ పౌరుల భద్రత కోసమే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.

''కొన్ని వస్తువులు(మిస్సైల్స్, డ్రోన్లు) మా గగనతలంలోకి వచ్చాయి. అవి స్థానికులకు, జనావాసాలకు ముప్పు కలిగించేలా ఉండడంతో వాటిని అడ్డుకున్నాం. ఆ వస్తువుల శిథిలాలు జోర్డాన్‌లోని వివిధ ప్రాంతాల్లో పడ్డాయి. కానీ, ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు'' అని పేర్కొంది.

''జోర్డాన్‌ రక్షణలో భాగంగా భవిష్యత్తులో ఏ దేశం దాడి చేసినా సైన్యం అడ్డుకుంటుంది. జోర్డాన్ పౌరులను, దేశాన్ని, గగనతలాన్ని, భూభాగాన్ని కాపాడుకుంటాం'' అని ప్రకటనలో తెలిపింది.

ఇజ్రాయెల్‌పై దాడి సమయంలో జోర్డాన్ చర్యలను పరిశీలిస్తున్నట్లు ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్ చెప్పినట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తెలిపింది. ఒకవేళ జోర్డాన్ తన జోక్యాన్ని కొనసాగిస్తే అది తదుపరి లక్ష్యం అయ్యే అవకాశం ఉంది.

అయితే, ఇరాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి నాసర్ కనానీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ''ఈ దాడిని అడ్డుకోవడంలో జోర్డాన్ పాత్ర గురించి మాట్లాడే పరిస్థితిలో నేను లేను. అది సైన్యానికి సంబంధించిన విషయం'' అన్నారు.

''జోర్డాన్‌తో స్నేహసంబంధాలున్నాయి. కొన్ని నెలలుగా ఇరుదేశాల అధికారుల మధ్య తరచూ సమావేశాలు జరుగుతున్నాయి.''

ఇటీవల జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరం 'టవర్ 22'పై ఇరాన్ మద్దతు కలిగిన ఇరాకీ మిలీషియా గ్రూప్ అల్ - మక్మూతా ఇస్లామియా దాడి చేసిన విషయం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ దాడిలో ముగ్గురు అమెరికా సైనికులు మరణించగా, 34 మంది గాయాలపాలయ్యారు.

జోర్డాన్ చారిత్రాత్మకంగా అమెరికాకు సన్నిహిత మిత్రదేశాల్లో ఒకటిగా ఉంది. అమెరికా మధ్యవర్తిత్వంతో 1990లలో కుదిరిన ఒప్పందం తర్వాత ఇజ్రాయెల్‌తో జోర్డాన్ సంబంధాలు మెరుగయ్యాయి.

జోర్డాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జోర్డాన్‌లోని అమ్మన్‌లో పడిపోయిన ఇరాన్ మిస్సైల్ శిథిలాలను స్థానికులు చూస్తున్నారు

జోర్డార్ ఎక్కడుంది, అరబ్‌లో దాని ప్రాముఖ్యతేంటి?

భౌగోళికంగా జోర్డాన్ దేశం మిడిల్‌ ఈస్ట్‌లో చాలా సున్నితమైన ప్రదేశంలో ఉంది. సౌదీ అరేబియా, ఇరాక్, సిరియాతో పాటు ఇజ్రాయెల్, వెస్ట్‌బ్యాంక్‌తో సరిహద్దులు పంచుకుంటోంది. పాలస్తీనా, సిరియా నుంచి పెద్ద సంఖ్యలో శరణార్థులు జోర్డాన్‌లో ఆశ్రయం పొందుతున్నారు.

జోర్డాన్‌లో రాచరిక వ్యవస్థ ఉంది. 1946లో బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత హషెమైట్ రాజవంశం (అల్ హషిమూన్) దేశాన్ని పాలిస్తోంది. జోర్డాన్ ప్రస్తుత రాజు అబ్దుల్లా 2.

హష్మీ కుటుంబ చరిత్ర, వంశవృక్షం గురించి రాజు అబ్దుల్లా 2 అధికారిక వెబ్‌సైట్‌లో వివరంగా పొందుపరిచారు. ఈ వెబ్‌‌‌సైట్ ప్రకారం, ఇస్లాం ప్రవక్త హజ్రత్ మొహమ్మద్ నుంచి అతని ముత్తాత హషీమ్ వరకూ జోర్డాన్ రాజవంశ మూలాలున్నాయి.

20వ శతాబ్దానికి ముందు ఈ ప్రాంతాన్ని ఒస్మానియా సుల్తానేట్ (ఒట్టొమాన్ సామ్రాజ్యం) 400 ఏళ్లు పాలించింది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో దాని మిత్రదేశాలకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయంతో అప్పటి మక్కా ఆమిర్(స్థానిక పాలకుడు) షరీఫ్ హుస్సేన్ బిన్ అలీకి ఒట్టోమాన్ సామ్రాజ్యం నుంచి స్వాతంత్ర్యం పొందే అవకాశం వచ్చింది.

బ్రిటన్‌తో సహా ఇతర సంకీర్ణ శక్తుల సాయంతో, 1916లో అరబ్ తిరుగుబాటు తర్వాత మక్కా ఒట్టొమాన్ సామ్రాజ్యం నుంచి వేరుపడింది.

1917లో ఆంగ్లో - అరబ్ సైన్యం పాలస్తీనాతో కలిసివున్న ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. 1921లో పాలస్తీనాను ఆ ప్రాంతం నుంచి వేరుచేసి 'ట్రాన్స్ జోర్డాన్‌'కు పునాది వేశారు. ఆ తర్వాత పాలనాధికారాలు అబ్దుల్లాకు అప్పగించారు, అలా ఆయన జోర్డాన్‌‌కు మొదటి రాజు అయ్యారు.

మక్కా ఆమిర్ షరీఫ్ హుస్సేన్ బిన్ అలీని వివాదాస్పద బాల్ఫోర్ డిక్లరేషన్‌పై సంతకం చేయాలని, అందుకు బదులుగా భారీ పారితోషికం చెల్లిస్తామని బ్రిటన్ చాలాసార్లు ప్రయత్నించినప్పటికీ, అందుకు ఆయన అంగీకరించలేదు.

దాని తర్వాత, సంకీర్ణ దేశాల తరఫున సౌదీ కుటుంబంతో ఒప్పందం కుదిరింది.

జోర్డాన్

నిజానికి, బాల్ఫోర్ డిక్లరేషన్ అనేది పాలస్తీనాలో యూదుల శాశ్వత నివాసానికి ప్రత్యేక దేశ ఏర్పాటు కోసం బ్రిటన్ చేసిన వివాదాస్పద ప్రణాళిక.

1946 వరకూ ఈ ప్రాంతం బ్రిటన్ పర్యవేక్షణలో ఉంది. కానీ 1946లో జోర్డాన్‌లోని హషెమైట్ సామ్రాజ్యం పేరుతో స్వతంత్ర దేశంగా మారింది.

1948 నుంచి 1973 మధ్య జోర్డాన్ ఇజ్రాయెల్‌తో నాలుగు యుద్ధాలు చేసింది. 1948లో జరిగిన మొదటి అరబ్ - ఇజ్రాయెల్ యుద్ధం, 1967 యుద్ధం, 1967 నుంచి 1970 మధ్య జరిగిన యుద్ధం, 1973 యుద్ధం.

1994లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ హయాంలో జోర్డాన్, ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత ఎప్పుడూ ఉద్రిక్తతలు పెరగలేదు.

జోర్డాన్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, జోర్డాన్ జాతీయ జెండా కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒట్టొమాన్ సామ్రాజ్యంపై అరబ్ తిరుగుబాటు జెండా నుంచి ఈ జెండా ఆవిర్భవించింది.

మూడు రంగులు, ఎరుపు రంగు త్రిభుజంతో పాటు ఏడు కోణాలు కలిగివున్న నక్షత్రం కూడా ఉంటుంది.

ఈ నక్షత్రంలోని ఏడు కోణాలు, ముస్లింల పవిత్రగ్రంథమైన ఖురాన్‌లోని మొదటి సూరా అయిన 'అల్-ఫాతిహా'లోని ఏడు ఫంక్తులను సూచిస్తుంది. పాలస్తీనా జెండాకు, ఈ జెండాకు తేడా ఈ నక్షత్రం.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)