దుబయ్‌ వరదలు: ఏడాదిలో కురవాల్సిన వాన ఒక్కరోజులో ఎందుకు పడింది?

దుబయ్‌లో వానలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దుబయ్‌లో వరద నీటిలో సగం మునిగిన కారు
    • రచయిత, మార్క్ పోయింటింగ్, మార్కో సిల్వా
    • హోదా, బీబీసీ న్యూస్

దుబయ్‌ను వరదలు అతలాకుతలం చేశాయి.

నీళ్లలో మునిగిన వాహనాలు, గాలులకు నేలకూలిన చెట్లు, వరద బీభత్సాన్ని దుబయ్‌ వరదల ఫోటోల్లో చూడొచ్చు.

ప్రపంచంలోనే ప్రయాణీకుల పరంగా రెండో అత్యంత రద్దీ విమానాశ్రయమైన దుబయ్ ఎయిర్‌పోర్ట్‌ను భారీ వరద ముంచెత్తింది. వందలాది విమానాలు రద్దు అయ్యాయి.

దక్షిణ దుబయ్‌కు 150 కి.మీ దూరంలో ఉన్న ఖాతమ్ అల్ షిక్లా ఏరియాలో 24 గంటల్లో 254.8 మి.మీ వర్షపాతం నమోదైంది.

సాధారణంగా యూఏఈ అంతటా ఒక ఏడాదిలో కురిసే వర్షపాతానికి ఇది సమానం.

గత 75 ఏళ్లలో ఇదే గరిష్ట వర్షపాతమని నేషనల్ మెటలర్జికల్ సెంటర్ ఆఫ్ యూఏఈ చెప్పింది.

దేశ చరిత్రలో ఇదొక అసాధారణ ఘటన అని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

పొరుగునే ఉన్న ఒమన్‌లో భారీ వర్షాల కారణంగా 19 మందికి పైగా చనిపోయారు. సౌదీ అరేబియా, బహ్రెయిన్‌లను కూడా వర్షం వదల్లేదు.

పర్షియన్ గల్ఫ్ రీజియన్‌లో ఆదివారం మొదలైన తుపాను సోమ, మంగళవారాల్లో రికార్డు స్థాయి వర్షపాతాన్ని నమోదు చేసింది.

యూఏఈలో స్వల్ప సమయంలోనే మునుపెన్నడూ లేని విధంగా ఇంత వాన ఎందుకు కురిసింది? ఈ అసాధారణ వర్షపాతం, కుంభవృష్టి వెనుక ఉన్న కారణాలేంటి?

దుబయ్ వానలు

ఫొటో సోర్స్, Getty Images

ఎడారి దేశంలో ఎందుకీ వరదలు..

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తీరంలో ఉండే దుబయ్ వాతావరణం సాధారణంగా చాలా పొడిగా ఉంటుంది. దుబయ్‌లో ఏడాదికి సగటున 100 మి.మీ (3.9 ఇంచులు) కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది.

కానీ, అప్పుడప్పుడు ఇక్కడ విపరీతమైన వర్షం కురుస్తుంది. సాధారణంగా ఇక్కడ ఏప్రిల్ సగటు వర్షపాతం కేవలం 8 మి.మీ.

దుబయ్‌కు 100 కి.మీ దూరంలో ఉన్న అల్-అయిన్ నగరంలో తాజాగా కేవలం 24 గంటల్లోనే దాదాపు 256 మి.మీ వర్షపాతం కురిసింది.

అల్పపీడన వాతావరణం, తేమ వంటివి ఈ వర్షాలకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.

‘‘ఈ భూభాగంలో దీర్ఘకాలం పాటు అనావృష్టి, ఆ తర్వాత ఓ పద్ధతి లేకుండా, భారీ వర్షాలు కురుస్తాయనే సంగతి ప్రపంచానికి తెలుసు. అయినప్పటికీ తాజా వానల్ని మాత్రం కచ్చితంగా అరుదైనవిగానే చెప్పాలి’’ అని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్‌లోని వాతావరణ శాస్త్రవేత్త, గల్ఫ్ రీజియన్‌లో వర్షపాత నమూనాలపై అధ్యయనం చేసిన ప్రొఫెసర్ మార్టెన్ అంబామ్ వివరించారు.

అరేబియన్ ద్వీపకల్పంలో ఏర్పడిన అల్పపీడనం, సముద్రంలోని తేమను పెద్ద మొత్తంలో పీల్చుకుంది. సాధారణం కంటే అధిక తేమ, గాలి ఉష్ణోగ్రతలు ఈ రీజియన్‌లో భారీ తుపానును సృష్టించాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సముద్ర ఉపరితలాల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి కాలంలో ఇలాంటి తుపానులు తరచుగా వస్తున్నాయని వారు హెచ్చరిస్తున్నారు.

దుబయ్ వానలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యూఏఈ లో గత 75 ఏళ్లలో ఇంత వాన ఎప్పుడూ పడలేదు.

వాతావరణ మార్పు పాత్ర ఏంటి?

దుబయ్‌లో కురిసిన అసాధారణ వానలకు వాతావరణ మార్పు ఎంత వరకు కారణమో కచ్చితంగా లెక్కించడం సాధ్యం కాదు. దీని కోసం వాతావరణ మార్పులకు కారణమయ్యే సహజ, మానవ కారకాలపై పూర్తిస్థాయి శాస్త్రీయ విశ్లేషణ అవసరం. ఈ విశ్లేషణకు చాలా కాలం పట్టొచ్చు.

అయితే, ఈ రికార్డు స్థాయి వర్షపాతం వాతావరణం మార్పులను ప్రతిబింబిస్తోంది.

సులభంగా చెప్పాలంటే, వేడి గాలిలో మరింత ఎక్కువ తేమ ఉంటుంది. ఒక్కో డిగ్రీ సెల్సియస్‌కు అదనంగా దాదాపు 7 శాతం తేమను కలిగి ఉంటుంది. ఈ తేమ, వర్షం తీవ్రతను పెంచుతుంది.

‘‘వర్షం తీవ్రత రికార్డు బ్రేకింగ్ స్థాయిలో ఉంది. ఇది వేడెక్కుతున్న వాతావరణ పరిస్థితులను ప్రతిబింబిస్తోంది. గాలిలోని అధిక తేమ తుపానులను సృష్టిస్తుంది. కుంభవృష్టి కురవడం, ఫలితంగా భారీ వరదలు వస్తాయి’’ అని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్‌లోని క్లైమేట్ సైన్స్ ప్రొఫెసర్ రిచర్డ్ అలాన్ వివరించారు.

భూగోళం వేడెక్కుతుండటంతో, ఈ దశాబ్దం చివరి నాటికి దాదాపు యూఏఈ అంతటా వార్షిక వర్షపాతం దాదాపు 30 శాతం పెరగొచ్చని ఇటీవల ఒక అధ్యయనం సూచించింది.

‘‘మానవులు చమురు, గ్యాస్, బొగ్గును కాల్చడం కొనసాగిస్తే వాతావరణం వేడెక్కుతూనే ఉంటుంది. వర్షాలు మరింత తీవ్రరూపం దాల్చుతాయి. వరదలతో ప్రాణనష్టం జరుగుతూనే ఉంటుంది’’ అని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్‌కు చెందిన క్లైమేట్ సైన్స్ సీనియర్ లెక్చరర్, డాక్టర్ ఫ్రెడెరికె ఓట్టో చెప్పారు.

దుబయ్ వానలు

ఫొటో సోర్స్, MATT WEIR

ఫొటో క్యాప్షన్, అల్పపీడనం వల్ల సముద్రంలోని తేమను మేఘాలు పీల్చుకున్నాయి
దుబయ్‌లో వానలు

ఫొటో సోర్స్, Getty Images

క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటి? దాని పాత్ర ఏంటి?

క్లౌడ్ (మేఘం), సీడింగ్ (విత్తనాలను నాటడం) అనే రెండు పదాల కలయికతో క్లౌడ్ సీడింగ్ అనే పదం ఏర్పడింది.

ఇది వింతగా అనిపించవచ్చు కానీ, సాధారణ భాషలో చెప్పాలంటే మేఘాలలో వర్షపు విత్తనాలను (ఉత్ప్రేరకాలు) నాటే ప్రక్రియను క్లౌడ్ సీడింగ్ అంటారు.

విత్తనాలుగా అంటే ఉత్ప్రేరకాలుగా సిల్వర్ అయోడైడ్, పొటాషియం క్లోరైడ్, సోడియం క్లోరైడ్ వంటి పదార్థాలను వాడతారు.

విమానాల సహాయంతో ఈ పదార్థాలను మేఘాలలో వెదజల్లుతారు.

ఈ పదార్థాలు మేఘంలో ఉండే నీటి బిందువులను ఘనీభవించేలా చేస్తాయి. తర్వాత ఈ మంచు ముక్కలు ఇతర ముక్కలకు అతుక్కుపోయి మంచురేకులు(స్నోఫ్లేక్‌)గా ఏర్పడతాయి. ఈ మంచు రేకులు తర్వాత వర్షంలా నేలను చేరతాయి.

కృత్రిమ వర్షాల కోసం దశాబ్దాలుగా ఈ పద్ధతిని వాడుతున్నారు. నీటి కొరతను అధిగమించడానికి ఇటీవలి ఏళ్లలో యూఏఈ కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించింది.

వరదలు వచ్చిన కొన్ని గంటల్లోనే కొందరు సోషల్ మీడియా వేదికగా, దేశంలో ఇటీవల చేపట్టిన క్లౌడ్ సీడింగ్ వల్లే ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయని ఆరోపించడం మొదలుపెట్టారు.

ఈ వరదలను క్లౌడ్ సీడింగ్‌కు ముడిపెట్టడం తప్పని నిపుణులు అంటున్నారు.

క్లౌడ్ సీడింగ్ వల్ల ఈ అసాధారణ వర్షపాతం సంభవించిందనే వాదనలను స్థానిక అధికారులు కొట్టిపారేశారు.

గల్ఫ్ రీజియన్ అంతటా భారీ వరదలు రావొచ్చని గత వారమే వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది.

ఈ వరదల రాకను ముందే అంచనా వేశామని బీబీసీ వెదర్ మెటరాలజిస్ట్ మ్యాట్ టేలర్ చెప్పారు. ఒక సంవత్సరంలో కురిసే వర్షపాతం అంతా 24 గంటల్లోనే పడొచ్చని ముందే కంప్యూటర్ మోడళ్ల ద్వారా తెలిసిందని ఆయన వెల్లడించారు.

దుబయ్ వానలు

ఫొటో సోర్స్, Getty Images

దుబయ్ వానలు

ఫొటో సోర్స్, REUTERS

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)