'ఇంట్లో చొరబడి చంపేస్తాం' అన్న మోదీ వ్యాఖ్యలపై అమెరికా ఏమందంటే...

ఫొటో సోర్స్, ANI
'ఇవాళ భారత్‌లో బలమైన మోదీ ప్రభుత్వం ఉంది, అందుకే టెర్రరిస్టులను వారి ఇళ్లకి వెళ్లి మట్టుబెడుతున్నారు.'
ఉత్తరాఖండ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలివి.
మోదీ వ్యాఖ్యల నేపథ్యంలో భారత్‌పై ఆంక్షలు ఉంటాయా అని అడిగితే అమెరికా ఇలా సమాధానమిచ్చింది.
ప్రధాని మోదీ వ్యాఖ్యల గురించి అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ను జర్నలిస్టులు పలు ప్రశ్నలు అడిగారు.
''టెర్రరిస్టులను మట్టబెట్టేందుకు సరిహద్దులు దాటేందుకు కూడా నవ భారత్ సంకోచించదని ప్రధాని మోదీ, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ తమ ఎన్నికల ప్రచారంలో అన్నారు. ఒక విధంగా, కెనడాలో నిజ్జర్ హత్యకు, అమెరికాలో గురుపట్వంత్ సింగ్ పన్ను హత్యకు కుట్ర చేయడాన్ని అంగీకరిస్తున్నారు. ఇది బైడెన్ ప్రభుత్వానికి ఆందోళన కలిగించే అంశం కాదా?'' అని మాథ్యూ మిల్లర్‌ను జర్నలిస్ట్ అడిగారు.
''మేం ముందే చెప్పినట్లు ఈ విషయంలో మేం తలదూర్చబోం. అయితే భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునే దిశగా ఇరుదేశాలను ప్రోత్సహిస్తాం'' అని మాథ్యూ మిల్లర్ సమాధానమిచ్చారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
'ఏమీ చేయలేరని అనుకోవద్దు..' - జైశంకర్
''గతంలో అమెరికా గడ్డపై హత్యలు చేసిన కొన్ని దేశాలపై ఆంక్షలు విధించడం చూశాం. కానీ భారత్ విషయంలో అలా లేదు. ఈ మినహాయింపు ఇవ్వడానికి కారణమేంటి?'' అని అదే మీడియా సమావేశంలో మిల్లర్‌ను ప్రశ్నించారు.
''ఆంక్షలకు సంబంధించి నేను ఏం మాట్లాడబోవడం లేదు. దానర్థం ఆంక్షలు విధించబోతున్నామని కాదు. ఆ పరిమితులు ఎందుకని మీరు అడిగితే, అది బహిరంగంగా చర్చించే విషయం కాదు'' అని మిల్లర్ సమాధానమిచ్చారు.
ఇటీవల కెనడా, అమెరికా, పాకిస్తాన్ నుంచి భారత్ హత్యారోపణలు ఎదుర్కొంటోంది. అయితే, ఈ ఆరోపణలను భారత్ అధికారికంగా ఖండిస్తోంది.
ప్రస్తుతం భారత్‌లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. టెర్రరిస్టులను సరిహద్దులు దాటివెళ్లి మరీ చంపేస్తామంటూ అధికార బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు.
''సరిహద్దుకు అవతలి వైపున ఉంటే మమ్మల్ని ఎవరూ ఏమీచేయలేరని టెర్రరిస్టులు అనుకోవద్దు. టెర్రరిస్టులు నిబంధనల ప్రకారం నడుచుకోకపోతే, వారికి బదులు చెప్పే విషయంలో కూడా ఎలాంటి నిబంధనలు ఉండవు'' అని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఇటీవల అన్నారు.
''టెర్రరిస్టులు ఎవరైనా పక్కదేశంలో ఉంటూ భారత్‌ను ఇబ్బంది పెట్టాలని చూసినా, లేదా దేశంలో ఏదైనా టెర్రరిస్టు కార్యకలాపాలకు పాల్పడినా తగిన సమాధానం ఉంటుంది'' అని ఏప్రిల్ 6న రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఒకవేళ అతను పాకిస్తాన్ పారిపోతే, అక్కడికెళ్లి మట్టుబెడతామని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, FB/VIRSA SINGH VALTOHA
నిజ్జర్, గురుపట్వంత్ సింగ్ పన్ను
సిక్కు వేర్పాటువాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ నిరుడు జూన్‌లో కెనడాలో హత్యకు గురయ్యారు. ఈ హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ 2023 సెప్టెంబర్‌లో కెనడా ఆరోపణలు చేసింది.
ఆరోపణలను తోసిపుచ్చిన భారత్.. ఆధారాలు ఉంటే ఇవ్వాలని కెనడాను కోరింది.
నిజ్జర్ కేసులో వివాదం ముదరడంతో కెనడా, భారత్ మధ్య సంబంధాల్లో దూరం పెరిగింది. జీ-20 సదస్సులో పాల్గొనేందుకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో దిల్లీ వచ్చినప్పుడు కూడా ఈ దూరం కనిపించింది.
ఆ తర్వాత, 2023 నవంబర్‌లో ఖలిస్తానీ నాయకుడు గురుపట్వంత్ సింగ్ పన్ను హత్యకు కుట్ర కేసులో భారత్ పేరు వినిపించింది.
గురుపట్వంత్ సింగ్‌ను న్యూయార్క్‌లో హతమార్చేందుకు భారత్‌కు చెందిన నిఖిల్ గుప్తా ఒక వ్యక్తిని నియమించారని, అందుకోసం అతనికి దాదాపు రూ.83 లక్షలు ఇచ్చినట్లు అమెరికా పేర్కొంది.
ఈ ఆరోపణలను భారత్ సీరియస్‌గా తీసుకుంటోందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.
వృత్తిరిత్యా న్యాయవాది అయిన పన్ను కుటుంబం మొదట పంజాబ్‌లోని నాథూ చక్ గ్రామంలో నివాసం ఉండేది. ఆ తర్వాత అమృత్‌సర్ సమీపంలోని ఖాన్‌కోట్ వెళ్లి స్థిరపడింది. పన్నూ తండ్రి మహీందర్ సింగ్ పంజాబ్ మార్కెటింగ్ బోర్డులో కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
1991-92 సంవత్సరంలో అమెరికా వెళ్లిన గురుపట్వంత్ సింగ్ పన్ను కనెక్టికట్ యూనివర్సిటీలో చేరారు. ఫైనాన్స్‌లో ఎంబీఏ పూర్తి చేసి, న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.
2007లో గురుపట్వంత్ సింగ్ పన్ను 'సిక్కు ఫర్ జస్టిస్' సంస్థను స్థాపించారు.
2020 జూలైలో భారత్ 9 మందిని టెర్రరిస్టులుగా ప్రకటించింది. అందులో గురుపట్వంత్ సింగ్ పేరు కూడా ఉంది.

ఫొటో సోర్స్, ANI
విదేశీ గడ్డపై హత్యలు, భారత్‌పై ఆరోపణలు
నిజ్జర్, పన్ను కేసులతో పాటు, విదేశాల్లో భారత్ కుట్రలు చేస్తోందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది.
2013లో లాహోర్ జైల్లో భారత పౌరుడు శరబ్‌జీత్ సింగ్‌ను హత్య చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అమీర్ సర్ఫరాజ్ అలియాస్ తంబపై ఇటీవల పాకిస్తాన్‌లో దాడి జరిగింది.
అమీర్ సర్ఫరాజ్‌పై జరిగిన దాడి కేసులో లభ్యమైన సాక్ష్యాలు భారత్ ప్రమేయాన్ని సూచిస్తున్నాయని పాకిస్తాన్ హోం మంత్రి మొహ్సీన్ నఖ్వీ సోమవారం విలేఖరుల సమావేశంలో చెప్పారు.
''గతంలో కొన్ని హత్య కేసుల్లో భారత్‌కు ప్రత్యక్ష ప్రమేయం ఉంది. ఈ దాడిలో భారత్ హస్తం ఉందని అనుమానిస్తున్నాం'' అని మొహ్సీన్ నఖ్వీ చెప్పారు.
ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని, ఇప్పటి వరకు లభ్యమైన ఆధారాలు ఆ దిశలోనే ఉన్నాయని, దర్యాప్తు నివేదిక వచ్చేంత వరకు ఇంతకు మించి వివరాలు చెప్పలేనని ఆయన అన్నారు.
గతంలోనూ ఇలాంటి విదేశీ హత్యలపై వచ్చిన ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది.
అయితే, ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలు మరోవిధమైన సంకేతాలిచ్చేలా కనిపిస్తున్నాయి.
''విదేశీ గడ్డపై నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న దేశవిద్రోహక శక్తులను అంతం చేసేందుకు భారత్ సమగ్ర వ్యూహాన్ని అనుసరిస్తోందని'' బ్రిటిష్ వార్తాపత్రిక ది గార్డియన్ ఇటీవల రిపోర్ట్ చేసింది.
'ది గార్డియన్' ప్రకారం, భారత్ ఈ విషయంలో 2020 నుంచి పాకిస్తాన్ భూభాగంలో కార్యకలాపాలు నిర్వహించింది.
ది గార్డియన్ రిపోర్ట్ చేసిన కథనాల గురించి ఒక ఇంటర్వ్యూలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను అడిగినప్పుడు, ఆయన దానిని ధృవీకరించలేదు, తిరస్కరించలేదు కూడా.
ఇవి కూడా చదవండి:
- ది రియల్ కేరళ స్టోరీ: రియాద్‌లో మరణశిక్ష పడిన రహీమ్ ప్రాణాలు కాపాడేందుకు హిందూ, ముస్లింలు ఏకమై రూ. 34 కోట్ల 'బ్లడ్ మనీ'ని ఎలా సేకరించారంటే
- అరబ్- ఇజ్రాయెల్ యుద్ధం 1967: అరబ్ నేలను నాశనం చేసిన ఆ ఆరు రోజుల్లో ఏం జరిగింది?
- బంగారం: ఈ విలువైన లోహం భూమి మీదకు ఎలా వచ్చింది, శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
- పాకిస్తాన్ క్రికెట్లో కొత్త డ్రామా, అమీర్ రీఎంట్రీకి కారణాలేంటి?
- కచ్చతీవుకు బదులుగా భారత్ తీసుకున్న 'వాడ్జ్ బ్యాంక్' ప్రాంతం అంత విలువైనదా?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














