పబ్‌జీ ప్రేమ కథలో మలుపు, భారత్‌లో కేసు వేసిన సీమా హైదర్ మొదటి భర్త

- రచయిత, విభురాజ్
- హోదా, బీబీసీ కరస్పాండెంట్
సీమా హైదర్ గుర్తున్నారా? తను ప్రేమించిన సచిన్ మీనా కోసం గతేడాది పాకిస్తాన్ నుంచి ఇండియాకి సరైన పత్రాలు లేకుండానే వచ్చారు.
ఆమె మొదటి భర్త, పాకిస్తాన్‌కు చెందిన గులామ్ హైదర్ విడాకులు కోరుతూ నోయిడా కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
గులామ్ హైదర్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. మే 27న కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా సీమా హైదర్‌కు సమన్లు జారీ చేసింది.
సీమా హైదర్ మొదటి భర్త గులామ్ హైదర్ ఓ భారతీయ న్యాయవాది సహాయంతో తన పిల్లలను వెనక్కి తెచ్చుకునేందుకు ప్రయత్నించినట్టు ఫిబ్రవరి మొదటివారంలో మీడియా కథనాలు వచ్చాయి.
గులామ్ హైదర్ తన పిల్లలను వెనక్కు తెచ్చుకోవడానికి భారతీయ న్యాయవాది అలి మోమిన్‌ను సంప్రదించారని, నిర్ణీత న్యాయ ప్రక్రియను పూర్తిచేయడానికి వీలుగా ఆయనకు పవరాఫ్ అటార్నీ ఇచ్చారని పాకిస్తాన్ న్యాయవాది, మానవ హక్కుల కార్యకర్త అన్సార్ బర్నే భారతీయ వార్తా సంస్థ పీటీఐకు తెలిపారు.

కోర్టు సమన్లు
గులామ్ హైదర్ వర్సెస్ సీమ హైదర్ విడాకుల కేసు 537 /2024గా నమోదైంది. ఈ మేరకు నోయిడా ఫ్యామిలీ కోర్టు ప్రిన్సిపల్ జడ్జి గౌతమ్ బుద్ధ సాగర్ సీమా హైదర్‌కు ఏప్రిల్ 12న సమన్లు జారీ చేశారు.
గులామ్ హైదర్ దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌పై సీమా హైదర్ వ్యక్తిగతంగా గానీ, లేదా తన న్యాయవాది ద్వారాగానీ మే 27వ తేదీ ఉదయం 11గంటలకు తగిన సాక్ష్యాధారాలతో హాజరు కావాలని సమన్లలో పేర్కొన్నారు.
‘‘సీమా ఇప్పుడు సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు. ఆమె భారత్‌లో జీవిస్తున్నారు. ఆమె కన్నీరు కార్చేటప్పుడు వాటిని తుడవడానికి ఎవరూ లేరు. ఇప్పుడామె సంతోషంగా ఉన్నప్పుడు ఇలాంటి ఎత్తుగడలతో ఆమెను మరోసారి ఏడిపించాలని చూస్తున్నారు. ఇది ఆమెను ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా హింసించడమే’’ అని సీమా హైదర్ తరపు న్యాయవాది ఏపీ సింగ్ బీబీసీకి చెప్పారు.

చట్టం ఏం చెబుతోంది?
సీమా హైదర్ పాకిస్తాన్ పౌరురాలనే విషయం చాలామందికి తెలిసిందే. ఆమె ఇండియాకు రాకముందు పాకిస్తాన్‌లో గులామ్ హైదర్‌ను పెళ్లి చేసుకున్నారు. తరువాత తగిన పత్రాలు లేకుండా ఆమె నేపాల్ ద్వారా ఇండియాకు వచ్చి సచిన్ మీనాను వివాహమాడారు.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పౌరుడు తన పాకిస్తానీ భార్య కోసం భారత న్యాయస్థానంలో కేసు దాఖలు చేయవచ్చా అనే అనుమానం రావడం సహజం.
భారత న్యాయస్థానం పరిధి ఎంతవరకనే విషయం చట్టం చెబుతుంది. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణకు నిలబడతుందా లేదా అనే ప్రశ్నకు సమాధానాలను అర్థం చేసుకునేందుకు మేం కొంతమంది న్యాయ నిపుణులను సంప్రదించాం.
న్యాయస్థానంలో కేసు దాఖలు చేసే విషయంలో ఎటువంటి సమస్యా లేదని సుప్రీంకోర్టు న్యాయవాది అజయ్ విక్రమ్ సింగ్ చెప్పారు.
‘‘భార్య ఇండియాలో నివసిస్తున్నప్పుడు, భర్త ఇండియన్ కోర్టులోనే కేసు దాఖలు చేయాలి. విదేశాలలో నివసించే భారతీయ భార్యాభర్తలు కూడా దాంపత్య వివాదాలకు సంబంధించిన కేసులను అక్కడి న్యాయస్థానాలలో దాఖలు చేయవచ్చు. చట్టప్రకారం ఇందులో ఎటువంటి సమస్యా లేదు’’ అని అజయ్ విక్రమ్ సింగ్ చెప్పారు.
పాకిస్తాన్ కోర్టుల్లో గులామ్ హైదర్ ఎందుకుకేసు దాఖలు చేయలేదనే ప్రశ్నకు సమాధానమిస్తూ ‘‘ ఓ సివిల్ కేసులో పాకిస్తాన్ ఇచ్చిన సమన్లు ఇండియాలో అమలు కాలేదు. ఈ కేసులో పిల్లల సంరక్షణకు సంబంధించిన సమస్య కూడా ఉంది. దీన్ని బట్టి కూడా కేసు ఎక్కడ దాఖలు చేయాలనే విషయాన్ని నిర్ణయించవచ్చు. పిల్లలు సీమా హైదర్‌తో కలిసి ఇండియాలో జీవిస్తున్నారు కాబట్టి గులామ్ హైదర్ ఇండియాలో కేసు దాఖలు చేయడానికి కారణమై ఉండొచ్చు’’ అని ఆయన వివరించారు.
అయితే గులామ్ హైదర్ తన విడాకుల పిటిషన్‌లో పిల్లల సంరక్షణను కోరారా లేదా అనేది స్పష్టంగా తెలియడం లేదు.
న్యాయవాది సోనాలి కర్వాసారా మరో న్యాయపరమైన అంశాన్ని కూడా లేవనెత్తారు.
‘‘భారతదేశంలోని ఫ్యామిలీ కోర్టులు వివాహ చట్టం, కొన్ని పర్సనల్ లా ఆధారంగా నడుస్తుంటాయి. ముస్లిం పర్సనల్ లా ఇండియాలో నివసించే ముస్లింలకు వర్తిస్తుంది. ఈ కేసులో భారతదేశంలో సీమా హైదర్ చట్టపరమైన స్థితి ఏమిటనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది.
గులామ్ హైదర్ పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా ఇండియా కోర్టులో కేసు దాఖలు చేశారు. కానీ ఆయన సాక్ష్యం ఎలా ఇస్తారు అని సోనాలి ప్రశ్నించారు.
పవర్ ఆఫ్ అటార్నీ పొందినవారు తన వ్యక్తిగత పరిజ్ఞానంతో సంబంధం లేని విషయాలలో సాక్ష్యం ఇవ్వడానికి వీల్లేదని ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును సోనాలి గుర్తు చేశారు.
‘‘సమన్లు జారీ చేసినంతమాత్రానా ఈ కేసు కొనసాగుతుందని, తదుపరి విచారణ ఉంటుందని చెప్పలేం’’ అన్నారు సోనాలి.

ఫొటో సోర్స్, SHAHNAWAZAHMAD/BBC
ఇదీ సీమా హైదర్ కథ
పాకిస్తాన్‌కు చెందిన సీమా హైదర్, గ్రేటర్ నోయిడాలోని రబుపురా నివాసి సచిన్ మీనా ప్రేమలో పడ్డారు. వీరిద్దరికి ఆన్‌లైన్ గేమ్ పబ్‌జీ ద్వారా 2019లో పరిచయం ఏర్పడింది.
ఇండియా రావడానికి వీసా లభించకపోవడంతో నేపాల్‌కు వీసా తీసుకున్నానని, అక్కడి నుంచి 2023 మార్చి 10న షార్జా మీదుగా నేపాల్ చేరుకున్నట్టు గతంలో ఆమె పోలీసులకు చెప్పారు. సచిన్ మీనా కఠ్మాండుకు చేరుకోవడంతో వీరిద్దరూ కఠ్మాండులోని న్యూ బస్ పార్కు ఏరియాలో ఉన్న న్యూ వినాయక హోటల్లో ఓ గది తీసుకుని వారం రోజులు బస చేశారు.
తరువాత సీమా హైదర్ పాకిస్తాన్‌కు తిరిగి వెళ్ళిపోయారు. సరిగ్గా రెండు నెలల తరువాత ఓ టూరిస్టు వీసాతో సీమా హైదర్ మరోసారి నేపాల్‌కు వచ్చారు. ఈసారి ఆమె తన నలుగురు పిల్లలను కూడా తీసుకువచ్చారు. కానీ సచిన్ ఇండియాలోనే ఉండిపోయారు.
జులై 13న సీమా తన నలుగురు పిల్లలతో యమునా ఎక్స్‌ప్రెస్‌లో ఫలైదాకట్ వద్ద దిగారు. అప్పటికే అక్కడ ఆమె కోసంసచిన్ మీనా ఎదురుచూస్తున్నారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. అక్కడి నుంచి సీమాను, ఆమె పిల్లలను సచిన్ మీనా గ్రేటర్ నోయిడాలోని రబుపురాలో ఉన్న తన ఇంటికి తీసుకువెళ్ళారు.
అప్పటి నుంచి సీమా హైదర్ ఇండియాలోనే సచిన్ మీనాతో కలిసి జీవిస్తున్నారు.
సీమా పాకిస్థాన్‌లోని రింద్ సింధ్‌లోని ఖైర్‌పూర్ జిల్లాకు చెందినవారు. ఈ ప్రాంతం ఖర్జూర సాగుకు ప్రసిద్ధి. ఇది పాకిస్తాన్‌లో చేరిన చివరి స్వతంత్ర రాజ్యం.
సీమా భర్త గులాం హైదర్ జకోబాబాద్ నివాసి. సీమా, గులాం హైదర్ ఇద్దరూ బలోచ్ వర్గానికి చెందినవారే. ఓ మిస్ట్ కాల్‌కు సమాధానమిచ్చే ప్రయత్నంలో వీరిద్దరికి పరిచయం ఏర్పడి, ఆ పరిచయం ప్రేమగా మారింది.
తరువాత ఇంటి నుంచి వెళ్ళిపోయిన సీమా హైదర్ గులాం హైదర్‌ను వివాహం చేసుకున్నారు. ఈ విషయం పంచాయతీ వరకు వెళ్ళడంతో గులాం హైదర్ కుటుంబ సభ్యులు జరిమానా చెల్లించాల్సి వచ్చింది.
అయితే భార్య బలవంతంపై గులాం హైదర్ కరాచీకి వెళ్ళారు. అక్కడ ఆయన బతుకుదెరువు కోసం రిక్షా తొక్కుతూ కూలిగానూ పనిచేసేవారు. 2019లో ఆయన ఉపాధి కోసం సౌదీకి వెళ్ళారు.
ఇవి కూడా చదవండి:
- ది రియల్ కేరళ స్టోరీ: రియాద్‌లో మరణశిక్ష పడిన రహీమ్ ప్రాణాలు కాపాడేందుకు హిందూ, ముస్లింలు ఏకమై రూ. 34 కోట్ల 'బ్లడ్ మనీ'ని ఎలా సేకరించారంటే..
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: వైసీపీకి చిక్కవు, టీడీపీకి దొరకవు
- రోజుకు ఎన్ని నీళ్లు తాగాలి? అతిగా తాగితే ఏమవుతుంది?
- ఇరాన్ ఎందుకు ఇజ్రాయెల్‌పై దాడులు చేసింది? ఆరు ప్రశ్నలు, సమాధానాలు..
- రెండు లక్షల 25 వేలు పలికిన ఆరు రూపాయల సాధారణ కోడి గుడ్డు, ఎందుకు?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














