చత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్: చోటేబేటియా గుట్టల్లో ఏం జరిగింది, 29 మంది మావోయిస్టులు ఎలా చనిపోయారు?

ఫొటో సోర్స్, CHHATTISGARH POLICE
- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
చత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లా చోటేబేటియా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎదురు కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందారని పోలీసులు చెబుతున్నారు.
రాష్ట్ర పోలీసులు (డీఆర్జీ), కేంద్ర భద్రతా బలగాల జాయింట్ ఆపరేషన్ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందారని చత్తీస్‌గఢ్ పోలీసులు ప్రకటించారు.
బీఎస్ఎఫ్‌కు చెందిన ఒక ఇన్‌స్పెక్టర్ ర్యాంక్ అధికారితో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయని తెలిపారు.
మరణించిన మావోయిస్టులలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు టాప్ కమాండర్లు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఎన్నికల నేపథ్యంలో...
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దండకారణ్యం ప్రాంతంలో ఆయా రాష్ట్రాల పోలీసులు, కేంద్ర పారామిలటరీ బృందాల సెర్చ్ ఆపరేషన్లు విస్తృతంగా కొనసాగుతున్నాయి.
ఏప్రిల్ 19న మొదటి విడత ఎన్నికల్లో భాగంగా 102 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఇందులో దండకారణ్య ప్రాంతంలోని బస్తర్, మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి స్థానాలు కూడా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో మావోయిస్దు దళాల కదలికలపై తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులు పలుమార్లు గడ్చిరోలీలో సమావేశమయ్యారు.
ఎన్‌కౌంటర్ జరిగిన కాంకేర్ పార్లమెంట్ స్థానానికి రెండో విడతలో ఏప్రిల్ 26 న పోలింగ్ జరగనుంది.

ఫొటో సోర్స్, UGC
అసలు ఏం జరిగింది?
ఎదురుకాల్పుల్లో మరణించిన వారిలో మావోయిస్ట్ టాప్ కమాండర్లు శంకర్‌రావు, లలిత, రాజు, మాధవి ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఎన్‌కౌంటర్‌పై కాంకేర్ జిల్లాకు చెందిన ఐపీఎస్ అధికారి కళ్యాణ్ ఎలిమెల మీడియాతో మాట్లాడారు.
“చోటేబేటియాకు దక్షిణ దిక్కులో ఉన్న గుట్టల్లో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు అక్కడికి వెళ్లినప్పుడు ఎదురుకాల్పులు జరిగాయి. ఆ సమయంలో సీనియర్ మావోయిస్టులు శంకర్, లలిత, మాధవి అక్కడే ఉన్నారన్న సమాచారం మాకు ఉంది. వీరంతా డివిజినల్ కమిటీ మెంబర్ స్థాయి వారు. వీరిపై 25 లక్షల రివార్డ్ ఉంది.
కాల్పుల్లో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. వారిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ఎంఐ-17 హెలికాప్టర్‌ను పంపాం. అయితే మొదట్లో వాతావరణం సహకరించకపోవడంతో కొంత ఆలస్యం జరిగింది. గాయపడ్డ వారికి ప్రథమ చికిత్స అందింది. ఈ ఎన్‌కౌంటర్‌లో మూడు దళాలకు చెందిన సుమారు 50 మంది మావోయిస్టులు పాల్గొన్నారు” అని ఐపీఎస్ అధికారి కళ్యాణ్ తెలిపారు.
ఎన్‌కౌంటర్‌లో మరణించినట్టుగా పోలీసులు భావిస్తున్న టాప్ కమాండర్ శంకర్‌రావు అలియాస్ సిరిపల్లె సుధాకర్‌ది తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా చల్లగరిగే గ్రామం.

ఫొటో సోర్స్, ANI
'డెడ్‌బాడీలు వచ్చాకే తెలుస్తుంది...'
కాంకేర్ ఎన్‌కౌంటర్ వివరాలను బస్తర్ ఐజీ పి.సుందర్ రాజ్ మీడియాకు వెల్లడించారు.
“క్షేత్రస్థాయి నుంచి అందుతున్న సమాచారం మేరకు మొత్తం 29 మంది మావోయిస్టులు మరణించారు. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. డెడ్‌బాడీలు వచ్చాకే చనిపోయిన మావోయిస్టులు ఎవరనే వివరాలు తెలుస్తాయి.
కొంతకాలంగా బస్తర్ ప్రాంతంలో స్థానిక పోలీసులు, కేంద్ర బలగాల సెర్చ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కూంబింగ్ జరుగుతోంది. గడిచిన నాలుగు నెలల కాలంలో 50 మంది మావోయిస్టుల డెడ్‌బాడీలు దొరికాయి’’ అని తెలిపారు.
చత్తీస్‌గఢ్ పోలీసులు విడుదల చేసిన పత్రికాప్రకటన ప్రకారం.. ఘటనా స్థలంలో ఇన్సాస్ రైఫిల్స్ , ఏకే-47, కార్బన్ గన్‌లతో పాటు పెద్ద మొత్తంలో మందుగుండు సామాగ్రి లభించింది.
“డెడ్‌బాడీలను తీసుకువచ్చారంటే ఇక సెర్చ్ ఆపరేషన్ ముగిసినట్టే. మరణించిన వారి సంఖ్య కొద్దిగా పెరగవచ్చు’ అని చత్తీస్‌గఢ్‌కు చెందిన స్వతంత్ర జర్నలిస్ట్ ముకేష్ చంద్రాకర్ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
అమిత్ షా ఏం చెప్పారు?
‘దేశ ప్రగతికి, యువత ఉజ్వల భవితకు నక్సలిజం ఆటంకంగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో నక్సలిజం నుంచి దేశాన్ని కాపాడేందుకు మేం కట్టుబడి ఉన్నాం’’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు.
‘‘ప్రభుత్వ కఠిన చర్యలు, భద్రతా బలగాల ప్రయత్నాల కారణంగా దేశంలో నక్సలిజం కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. త్వరలోనే దేశం మొత్తం మీద నక్సలిజాన్ని తుడిచిపెట్టేస్తాం’’ అని అమిత్ షా చెప్పారు.
‘ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేసిన పోలీసు అధికారుల సాహసాన్ని అభినందిస్తున్నాను. ఈ ఘటనలో గాయపడిన పోలీసులు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’ అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ది రియల్ కేరళ స్టోరీ: రియాద్‌లో మరణశిక్ష పడిన రహీమ్ ప్రాణాలు కాపాడేందుకు హిందూ, ముస్లింలు ఏకమై రూ. 34 కోట్ల 'బ్లడ్ మనీ'ని ఎలా సేకరించారంటే..
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: వైసీపీకి చిక్కవు, టీడీపీకి దొరకవు
- రోజుకు ఎన్ని నీళ్లు తాగాలి? అతిగా తాగితే ఏమవుతుంది?
- ఇరాన్ ఎందుకు ఇజ్రాయెల్‌పై దాడులు చేసింది? ఆరు ప్రశ్నలు, సమాధానాలు..
- రెండు లక్షల 25 వేలు పలికిన ఆరు రూపాయల సాధారణ కోడి గుడ్డు, ఎందుకు?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














