ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమానికి బాటలు వేసిన తాబేలు వీడియోలో ఏముంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కార్లా రోచ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ముక్కులో గుచ్చుకుని ఇరుక్కుపోయిన ప్లాస్టిక్ స్ట్రాను బయటకు తీస్తున్నప్పుడు రక్తమోడుతూ, బాధను భరిస్తూ కనిపించిన ఓ తాబేలుకు సంబంధించిన వీడియో ప్రపంచాన్ని నిర్ఘాంతపరిచింది.
ప్లాస్టిక్ స్ట్రాలకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్త ఉద్యమానికి బాటలు వేసింది.
పీహెచ్‌డీ విద్యార్థి క్రిస్టీన్ ఫిగ్గెనర్ 2015లో కోస్టారికా తీరంలో ఆలివ్ రిడ్లే తాబేళ్లను పరిశీలించేందుకు ఒక చిన్న పడవలో వెళ్లారు. ఓ తాబేలు ముక్కులో ఇరుక్కుపోయిన వస్తువును ఆమె చూశారు.
దాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఆమె సహచరుల్లో ఒకరు ఆ దృశ్యాన్ని వీడియో తీయడం మొదలు పెట్టారు.
ఆ తాబేలు ముక్కులో నుంచి స్ట్రాను వారు నెమ్మదిగా బయటకు తీశారు. అందుకు ఎనిమిది నిమిషాలు పట్టింది.
ఆ సమయంలో తాబేలు ముక్కులోంచి రక్తం బలబలా కారింది. స్ట్రాను బయటకు లాగేటప్పుడు ఆ అమాయకపు తాబేలు నోరు పెద్దగా తెరిచి అరుస్తూ బాధ పడుతున్న దృశ్యాలు మనసును మెలిపెట్టేలా ఉన్నాయి.
మెరైన్ బయాలజిస్టుగా ఫిగ్గెనర్ పని తాబేళ్లను పరిశీలించడమే, ప్లాస్టిక్ గురించి ఆలోచించడం కాదు.
అయితే, ఆమె సముద్ర జలాల్లోకి, తీరాల్లోకి వెళ్లినప్పుడల్లా ప్లాస్టిక్ పెద్ద సమస్యగా కనిపిస్తోంది.
తాబేళ్లు, మరికొన్ని జీవులు కార్ల టైర్లు, చేపల వలలు, ప్లాస్టిక్ కవర్లలో ఇరుక్కుపోయి ఉండటాన్ని ఆమె చూశారు.
“నేను ఉద్యమకారిణి కాదు. అలాగని ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉండలేను. మేము పరిశీలించిన అంశాలను విస్తృత జన బాహుళ్యంలోకి తీసుకువెళ్లాలి. అందుకే వాటిని చిత్రీకరించడం, నమోదు చేయడం చేస్తుంటాం. ఇది కేవలం సముద్ర జీవుల గురించి అర్థం చేసుకోవడం మాత్రమే కాదు. వాటిని కాపాడేందుకు మనం ఏం చేయగలం అనేది ప్రజల్లోకి తీసుకు వెళ్లడం కూడా” అని ఫిగ్గెనర్ చెప్పారు.

ఫొటో సోర్స్, Christine Figgener
“సముద్ర జలాల్లో టన్నుల కొద్దీ ప్లాస్టిక్ కనిపించడం చాలా ఆవేదన కలిగిస్తోంది. దీనివల్ల ముఖ్యంగా జంతువులు ఎంతో బాధను అనుభవిస్తున్నాయి. ప్లాస్టిక్ గురించి గణాంకాలు శాస్త్రవేత్తలు కాని వారికి కూడా సందేశాన్ని అందిస్తున్నాయి’’ అని తెలిపారు.
ఫిగ్గెనర్ వీడియో వైరల్ అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ స్ట్రాలకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలైంది.
ఒకసారి వాడి విసిరి పారేసే ప్లాస్టిక్ స్ట్రాలు (సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్ట్రాలు) ఎంత ప్రమాదకరమో తెలుసుకోవడానికి ఈ దృశ్యం చూస్తే చాలు.
ముక్కులో ప్లాస్టిక్ స్ట్రా ఇరుక్కుని ఈ తాబేలు పడుతున్న బాధ, ప్రపంచంలో అనేక మంది ప్రజల ఆలోచనను మార్చింది.
ఈ వీడియో బయటకు రావడానికి కొన్నేళ్ల ముందు- జాకీ నునేజ్ సముద్ర తీరాల్లో ఈ తాబేలు ముక్కులో నుంచి బయటకు తీసిన స్ట్రాలను సేకరించేవారు.
ఆమె కాలిఫోర్నియా తీరంలోని శాంతక్రుజ్‌లో తరచూ సముద్ర తీర ప్రాంతాలలో చెత్తను సేకరించే కార్యక్రమాలు చేపట్టేవారు.
ఆమె చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల సముద్రాల్లో ఏ స్థాయిలో ప్లాస్టిక్ చెత్త ఉందో తెలుసుకోగలిగారు.
అక్కడకు కొద్ది దూరంలోనే జీవ వైవిధ్యాన్ని సంరక్షించేందుకు మోనిటెరీ బే ఆఫ్ నేషనల్ మెరైన్ శాంక్చురీని ఏర్పాటు చేశారు.
ఈ శాంక్చురీ ప్లాస్టిక్ నుంచి సముద్ర జీవులను కాపాడేందుకు అనేక రకాల ఆంక్షలను అమలులోకి తెచ్చింది.
అందులో ఒకటి “సముద్ర జీవులు, తాబేళ్లు, పక్షులను గాయపరచడం లేదా వాటిని ఆటంకపరచడం లాంటి వాటిపై నిషేధం విధించడం”.
జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు ఇంత పటిష్టమైన ఆంక్షలు అమల్లో ఉన్నా, ఇక్కడ సముద్రం, తీర ప్రాంతాల్లో ప్లాస్టిక్ చెత్త తగ్గడం లేదు.
ప్లాస్టిక్ జీవ ప్రపంచాన్ని అనేక రకాలుగా గాయపరుస్తోంది. అనేక జీవులు ప్లాస్టిక్ వ్యర్థాలను ఆహారంగా భావించి వాటిని తిని, అందులో చిక్కుకుపోయి చనిపోతున్నాయి.
మద్యధరా సముద్ర తీరంలో చనిపోయిన అనేక తాబేళ్లను పరిశీలించినప్పుడు వాటి శరీరంలో ప్లాస్టిక్ వస్తువులను కనుక్కున్నారు.
మరణించిన తాబేళ్లలోని 40 శాతం తాబేళ్లలో 5 మిల్లీమీటర్ల మందం ఉన్న ప్లాస్టిక్ వస్తువులు ఉన్నాయి.
అందులో కొన్నింటిలో ప్లాస్టిక్ మూతలు, ప్లాస్టిక్ బొమ్మల అవశేషాలు ఉన్నాయి. సముద్రాల్లోని ప్రతీ రెండు తాబేళ్లలో ఒకటి ప్లాస్టిక్ చెత్తకు బాధితురాలు.
ప్లాస్టిక్ తినడం వల్ల వాటి పొట్ట నిండిపోవడంతో అవి ఆహారం తీసుకోలేక పస్తులతో చనిపోతున్నాయని వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ చెబుతోంది.
సముద్రాల్లోకి ప్రతీ ఏటా 8 బిలియన్ కేజీలు ( 7,874 టన్నులు) ప్లాస్టిక్ చేరుతోందని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం చెబుతోంది.

ఫొటో సోర్స్, The Last Plastic Straw
2011లో ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ స్ట్రాలకు ముగింపు పలికేందుకు లాస్ట్ ప్లాస్టిక్ స్ట్రా కార్యక్రమాన్ని ప్రారంభించారు జాకీ నునేజ్.
“ఈ సమస్య పట్ల నేను చాలా ఎక్కువగా స్పందించడానికి అందులో పాయింట్ ఉంది” అని నునేజ్ తెలిపారు.
తమ బృందం సముద్ర తీర ప్రాంతాల్లో చెత్తను శుభ్రం చేసేటప్పుడు తమకు ఎక్కువగా వాడి పారేసిన ప్లాస్టిక్ స్ట్రాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆమె చెప్పారు.
ఈ ప్లాస్టిక్ స్ట్రాల సైజు, మందం కారణంగా వాటిని రీసైకిల్ చేయడం అంత తేలిక కాదు. వీటిని నివారించడానికి ఉత్తమ మార్గం వాడకాన్ని తగ్గించడమేనని నునేజ్ గుర్తించారు.
ఇందుకోసం ఆమె ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించి, ప్లాస్టిక్ వినియోగం వల్ల అనర్ధాల గురించి అవగాహన కల్పించేందుకు స్థానిక స్కూళ్లతో కలిసి పని చేస్తున్నారు.
కస్టమర్లు అడిగితే తప్ప స్థానిక రెస్టారెంట్లు ప్లాస్టిక్ స్ట్రాలను ఇవ్వడం ఆపేయాలని కోరారు.
2011 తర్వాత ఆమె ఈ ప్రచారాన్ని అంతర్జాతీయ స్థాయికి చేర్చారు.
“మా ప్రచారం కాస్త నెమ్మదిగా మొదలైంది. ఎందుకంటే అప్పట్లో ఎక్కువ మంది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్ట్రాలను ఎక్కువగా ఉపయోగించడం లేదు” అని ఆమె చెప్పారు.
2015లో ఫిగ్గెనర్ వీడియో సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.
తన ప్రచారానికి ఈ వీడియోను వాడుకునేందుకు అనుమతివ్వాలని ఫిగ్గెనర్‌ను ఆశ్రయించారు నునేజ్.
ఫిగ్గెనర్ వీడియో వైరల్‌గా మారింది. యూట్యూబ్‌పై 11 కోట్లకు పైగా వ్యూస్ రాగా, షార్ట్నర్ వెర్షన్‌కు 1.5 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యూస్ అవుట్‌లెట్లు ఫిగ్గెనర్‌ను ఇంటర్వ్యూ చేశాయి.
2018లో డాక్యుమెంటరీ ఫిల్మ్ ‘స్ట్రాస్(STRAWS)’లో కూడా కనిపించారు. ఈ ఫిల్మ్‌ను ఫిగ్గెనర్, ఆమె వీడియోతో రూపొందించారు.
అమెరికా, మలేసియా, గ్రీస్, ఫ్రాన్స్, ఇటలీ, హాంకాంగ్, ఇజ్రాయెల్, కరేబియన్‌లో పలు దేశాల్లో దీన్ని ప్రదర్శించారు.
పలు విమానయాన సంస్థలు ఇన్-ఫ్లయిట్‌లో కూడా ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని ప్రదర్శించాయి. 2018లో క్యాంపస్‌లో ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించిన తర్వాత, అప్పలాచియన్ స్టేట్ యూనివర్సిటీ ప్లాస్టిక్ స్ట్రాలను వాడటం మానేసింది.
దీంతో, ఒక విద్యా సంవత్సరంలో చెత్త వేసే ప్రాంతాల్లో 4,44,000 ప్లాస్టిక్ స్ట్రాలను నిరోధించినట్లు యూనివర్సిటీ అంచనావేసింది.
ప్లాస్టిక్ సంక్షోభానికి తాబేలు అనేది ఒక చిహ్నంగా మారింది. ప్రపంచ ఉద్యమానికి ఈ వీడియో సహకరించిందని, కేవలం ఒక్క ప్లాస్టిక్ స్ట్రా ప్రభావం కూడా ఏ మేర ఉంటుందో ప్రజలకు తెలియజేసేందుకు సాయపడిందని నునేజ్ చెప్పారు.
‘‘ఒకసారి దీన్ని చూస్తే, మళ్లీ చూడలేకుండా ఉండలేవు. ఇది అత్యంత శక్తిమంతమైంది’’ అని తెలిపారు.
ఫిగ్గెనర్ వీడియో ప్రజల ప్రవర్తనలో పెను మార్పును తీసుకొచ్చేందుకు సాయపడిందని నునేజ్ భావిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించేందుకు విధానాల రూపకల్పనలకు సహకరించిందన్నారు.
30కి పైగా దేశాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పదార్థాల వాడకాన్ని నిషేధిస్తూ చట్టాలు తీసుకొచ్చాయి. వాటిలో చాలా వరకు 2015 తర్వాతనే అమల్లోకి వచ్చాయి.
ప్రతి సంవత్సరం అంతర్జాతీయ తీర ప్రాంతాల్లో చేపట్టే చెత్త ఏరివేత కార్యక్రమాల్లో అంతకుముందు ప్లాస్టిక్ స్ట్రాలే ఎక్కువగా కనిపించేవి.
అవే టాప్‌లో ఉండేవని లాభాపేక్ష లేని ఓషియన్ కన్జర్వెన్సీ నివేదిక చెప్పింది. కానీ, తాజాగా విడుదలైన డేటాలో బీచ్‌ల శుభ్రతలో ప్లాస్టిక్ స్ట్రాలు తక్కువగా కనిపిస్తున్నట్లు తెలిసింది.

ఫొటో సోర్స్, Jackie Nuñez
2019లో బీచ్‌ల్లో చెత్త ఏరివేతలో సాధారణంగా కనిపించే మూడవ వస్తువుగా ప్లాస్టిక్ స్ట్రాలు ఉండేవి. 2023 నాటికి ఇవి తగ్గిపోయి 10వ వస్తువుగా కనిపిస్తున్నాయి.
తాబేలు వీడియో వైరల్ అయినప్పటి నుంచి పర్యావరణానికి అత్యంత ప్రథమ శత్రువుగా ప్లాస్టిక్ స్ట్రాలు మారినట్లు ఈ రిపోర్టు తెలిపింది.
‘‘2018లో స్టెఫనీ మట్టిల్లో స్టార్‌బక్స్‌లో పనిచేసేవారు. ఆమె ఈ వీడియోను చూసిన తర్వాత, తాబేలు ఫోటోతో ఆన్‌లైన్ పిటిషన్‌ను ప్రారంభించారు. ఈ కంపెనీ ప్లాస్టిక్ స్ట్రాలను తీసేయాలని తన పిటిషన్‌లో కోరారు. కేవలం కొన్ని నెలల్లోనే 1,47,000కు పైగా సంతకాలను సేకరించారు. నేను ఈ పిటిషన్ వేసినప్పుడు, ఈ వీడియో నాపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. దీని గురించి మాట్లాడాల్సినవసరం ఉందని నేను భావించాను’’ అని చెప్పారు.
ఆమె ఈ ఆన్‌లైన్ ఉద్యమం తర్వాత 2018 జూలైలో స్టార్‌బక్స్ ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ స్ట్రాలను తొలగిస్తున్నట్లు పత్రికా ప్రకటన విడుదల చేసింది.
వాటి స్థానంలో తిరిగి వాడుకోగలిగే స్ట్రాలెస్ లిడ్‌ను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రత్యామ్నాయ మెటీరియల్స్‌ను వాడనున్నట్లు తెలిపింది.
అదే ఏడాది అలస్కా ఎయిర్‌లైన్స్, డిస్నీ, మెక్‌డొనాల్డ్స్, ఐకియా వంటి పలు సంస్థలు ప్లాస్టిక్ స్ట్రాలను తీసివేసే ప్రణాళికలను ప్రకటించాయి.
ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో స్ట్రాలనేవి ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి మరెన్నో ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్య సంక్షోభం ప్రమాదకర స్థాయికి చేరుకున్నట్లు ఆధారాలున్నాయి.
గత 30 ఏళ్లలో ప్లాస్టిక్ వినియోగం నాలిగింతలు పెరిగింది. అంతేకాక, ఈ ప్లాస్టిక్‌లో చాలా వరకు రీసైక్లిల్ చేయలేనివే.
2019లో ప్రపంచవ్యాప్తంగా వాడిన ప్లాస్టిక్ వ్యర్థాల్లో కేవలం 9 శాతం మాత్రమే రీసైకిల్ చేయగలిగేవని ఓఈసీడీ గుర్తించింది.
ప్లాస్టిక్‌ను అరికట్టేందుకు ప్రపంచం మరింత ముందుకు వెళ్లాల్సి ఉందని ఫిగ్గెనర్ గుర్తించారు.
‘‘వాస్తవ చర్యల దిశగా మనం నడుచుకోవాలి. పనిచేయని గ్రీన్‌వాషింగ్ లేదా వేగవంతమైన పరిష్కారాలు వంటి వాటితో పక్కదోవ పట్టకూడదు. చట్టాలు, ఐక్యరాజ్యసమితి ఒడంబడికలు, విధానాలు మాత్రమే వాస్తవ మార్పును తీసుకురానున్నాయని నేను భావిస్తాను’’ అని ఫిగ్గెనర్ చెప్పారు.
ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు పలికేందుకు ఒక చారిత్రాత్మక తీర్మానాన్ని ఐరాస సభ్య దేశాలు 2022లో ఐక్యరాజ్యసమితి ఎన్విరాన్‌మెంట్ అసెంబ్లీ(యూఎన్‌ఈఏ-5)లో అంగీకరించాయి.
ప్లాస్టిక్ కాలుష్యానికి సంబంధించిన ఈ ఒప్పందంపై అంగీకారం కుదిరేందుకు ప్రపంచ నాయకులకు 2024 వరకు సమయం ఉంటుంది. ఈ ఒప్పందంలోనే ఎలాంటి అంశాలకు చట్టబద్ధంగా కట్టుబడి ఉండాలి? ఒప్పంద నిర్వహణకు ఎలా ఆర్థిక సహాయం చేస్తారో నిర్ణయిస్తారు.
‘‘కేవలం ప్లాస్టిక్ స్ట్రాలను తీసివేయడం ద్వారా ప్రపంచాన్ని మేం ఉన్నతంగా మార్చాలనుకోవడం లేదు. ఇది మా ఉద్దేశ్యం కాదు. మేం చిన్న లక్ష్యాలను పెట్టుకోం. ఇది నీళ్లలో రాయి వేసినట్లు. నీళ్లలో అలజడి సృష్టించి, ఒక పెద్ద అలకు ఇది కారణమైంది. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచి, ఏదైనా గొప్ప పని చేయాలనే ఆలోచనలకు కారణమైంది’’ అని ఫిగ్గెనర్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ది రియల్ కేరళ స్టోరీ: రియాద్‌లో మరణశిక్ష పడిన రహీమ్ ప్రాణాలు కాపాడేందుకు హిందూ, ముస్లింలు ఏకమై రూ. 34 కోట్ల 'బ్లడ్ మనీ'ని ఎలా సేకరించారంటే..
- ఇరాన్ ఎలా క్షిపణులను వదిలింది, ఇజ్రాయెల్ ఎలా అడ్డుకుంది, మున్ముందు ఏం జరగబోతోంది?
- ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తత: యుద్ధభయం ఉన్నా ఇజ్రాయెల్ వెళ్లడానికి ఈ యూపీ యువకులు ఎందుకు సిద్ధమవుతున్నారు?
- బంగారం: ఈ విలువైన లోహం భూమి మీదకు ఎలా వచ్చింది, శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
- పాకిస్తాన్ క్రికెట్లో కొత్త డ్రామా, అమీర్ రీఎంట్రీకి కారణాలేంటి?
- కచ్చతీవుకు బదులుగా భారత్ తీసుకున్న 'వాడ్జ్ బ్యాంక్' ప్రాంతం అంత విలువైనదా?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














