భీమిలి: ఓటమి ఎరుగని ఆ ఇద్దరిలో ఒకరికి తొలి పరాజయాన్ని రుచి చూపించనున్న సీటు ఇదే...

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
పొలిటికల్ ఎంట్రీ నుంచి ఇప్పటి వరకూ ఓటమెరుగని ఇద్దరు నేతల్లో ఒకరికి తొలిసారి ఓటమి రుచి చూపించబోతోంది భీమిలి నియోజకవర్గం. రాష్ట్రంలోనే ఎక్కువ ఓటర్లున్న ఈ నియోజకవర్గానికి చారిత్రకంగా, వాణిజ్యపరంగా, పర్యాటకంగా కూడా ఎన్నో విశిష్టతలున్నాయి.
విశాఖ ఆర్కే బీచ్ నుంచి 32 కిలోమీటర్లు బీచ్ గాలిని ఆస్వాదిస్తూ భీమిలికి ప్రయాణం చేస్తోంటే ఎన్నో పార్కులు, బీచులు, బౌద్ధ క్షేత్రాలు, సినీ స్టూడియోలు, ఐటీ కంపెనీలు, మత్స్యకార పల్లెలు, విలాసవంతమైన ఇళ్లు.. మనల్ని కొత్త ప్రపంచానికి తీసుకెళ్తాయి.
భీమిలి చేరుకున్నాక, చరిత్రకు ఆనవాలుగా కనిపించే డచ్ సమాధులు, 150 ఏళ్ల నాటి లైట్ హౌస్, అందమైన సాగరతీరం, పురాణ ఘట్టాలతో విగ్రహాలు దర్శనమిస్తాయి.
భీమిలి పట్టణం మధ్యలో కనిపించే గడియారపు స్థంభం.. మనకి భీమిలి చరిత్రను పరిచయం చేస్తుంది. దేశంలోనే రెండో మునిసిపాలిటీ కావడం మరో ప్రత్యేకత. 150 ఏళ్ల కిందట విశాఖ కంటే, భీమిలి బాగా ఫేమస్.
మరికొద్దిరోజుల్లో ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలతో ఇక్కడ కూడా రాజకీయ వాతావరణం వేడెక్కింది. మరి ఈసారి భీమిలి నియోజకవర్గ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం.

ఒకరికి ఓటమి తప్పదు..
రాష్ట్రంలోనే ఎక్కువ ఓటర్లున్న అసెంబ్లీ నియోజకవర్గం భీమిలిపట్నం. ఎలక్షన్ కమిషన్ లెక్కల ప్రకారం, నియోజకవర్గంలో 3,57,696 (ఏప్రిల్ మొదటివారానికి) మంది ఓటర్లు ఉన్నారు. దీంతో విశాఖ పార్లమెంట్ స్థానాన్ని కూడా దాదాపుగా నిర్ణయించేది ఇక్కడి ఓటర్లేనని రాజకీయ విశ్లేషకుల అంచనా.
భీమిలి నియోజకవర్గ పరిధిలో విశాఖపట్నం రూరల్, ఆనందపురం, పద్మనాభం, భీమిలి మండలాలున్నాయి. ఆనందపురం పూల మార్కెట్‌కి పేరు పొందితే, పద్మనాభం, భీమిలి మండలాలు కూరగాయలకు కేరాఫ్ అడ్రస్. కొత్తగా ఏర్పాటైన విశాఖ జిల్లాలో గ్రామీణ వాతావరణం ఉన్న నియోజకవర్గం భీమిలే.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి భీమిలి నుంచి గురుశిష్యులుగా పేరొందిన నేతలు ప్రధాన పార్టీల నుంచి బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాసరావు), టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు ఎన్నికల్లో తలపడబోతున్నారు.
వీరిద్దరికీ పేర్లతో సహా రాజకీయంగా చాలా సారూప్యతలు ఉన్నాయి. ఒకప్పుడు వీరిద్దరూ మంచి మిత్రులు. ఇద్దరూ 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. భీమిలి నుంచి అవంతి శ్రీనివాసరావు, అనకాపల్లి నుంచి గంటా శ్రీనివాసరావు విజయం సాధించారు.
ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనమైన తర్వాత.. ఇద్దరు నేతలూ 2014లో టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో గంటా భీమిలి నుంచి ఎమ్మెల్యేగా, అవంతి అనకాపల్లి ఎంపీగా విజయం సాధించారు.
2019లో అవంతి వైసీపీలో చేరారు. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అవంతి భీమిలిలో పోటీ చేసి గెలవగా, గంటా శ్రీనివాసరావు విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు.
రాజకీయ రంగప్రవేశం చేసిన నాటి నుంచి ఇద్దరూ గెలుస్తూ వస్తున్నారు. ఎమ్మెల్యేలుగా, రాష్ట్ర మంత్రులుగా కూడా పని చేశారు. గత మూడు ఎన్నికల నుంచి వరుసగా విజయం సాధిస్తున్నారు. కానీ, ఇప్పుడు పరస్పరం తలపడుతుందడడంతో ఇద్దరిలో ఒకరు ఓడిపోక తప్పదు.

ఫొటో సోర్స్, FB/AVANTHISRINIVASARAO
కాపులు, బీసీల ప్రభావం
రాష్ట్రంలో కాపు కులస్తుల ఓట్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో భీమిలి ఒకటి. వారితో పాటు యాదవులు, మత్య్సకార, క్షత్రియ ఓటర్లు గెలుపోటములను ప్రభావితం చేసే సంఖ్యలో ఉన్నారు. దీంతో అభ్యర్థి గెలుపులో ఈ కులాల ఓట్లు కీలకంగా మారనున్నాయి.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత భీమిలిలో ఆ పార్టీయే ఎక్కువ సార్లు విజయం సాధించింది. మొత్తం ఆరుసార్లు ఇక్కడ టీడీపీ గెలుపొందింది.
టీడీపీ తరఫున 1983లో ఆనంద గజపతిరాజు విజయం సాధించారు. ఆ తర్వాత 1985, 1989, 1994, 1999లో రాజా సాగిదేవి ప్రసన్న అప్పల నరసింహ రాజు వరుస విజయాలను నమోదు చేశారు.
2004లో 300 వందల ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి కర్రి సీతారాం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై గెలుపొందారు.
2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున అవంతి శ్రీనివాస్ 6 వేల ఓట్ల మోజార్టీతో విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో మళ్లీ టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ చేసి, దాదాపు 37 వేల ఓట్ల మెజార్టీ సాధించారు.
2019లో మళ్లీ అవంతి శ్రీనివాస్ వైఎస్సార్సీపీ అభ్యర్ధిగా పోటీ చేసి 9 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
''భీమిలి నియోజకవర్గంలో ప్రధాన కులాలైన కాపు, యాదవుల ఓట్లే గెలుపును నిర్ణయిస్తాయని చెప్పవచ్చు. ఈ రెండు కులాల వారికి రాజకీయ ప్రాధాన్యం లభిస్తుంటుంది. ఇక్కడ కాపు కులస్తుల ఓట్లు దాదాపు లక్ష వరకూ ఉంటే, యాదవులు 40 వేలు, మత్స్యకారులు 20 వేలు, క్షత్రియుల ఓట్లు 10 వేల వరకూ ఉన్నాయి. కాపులు, బీసీలను కలిపితే నియోజకవర్గంలో సగానికి పైగా ఓట్లు వారివే. దీంతో ఈ వర్గాలు ఎవరి వైపు మొగ్గు చూపితే వారికే విజయావకాశాలు ఎక్కువని అభ్యర్థులు లెక్కలేసుకుంటూ ఉంటారు.'' అని సీనియర్ జర్నలిస్ట్ యుగంధర్ రెడ్డి బీబీసీతో అన్నారు.
2009లో ప్రజారాజ్యం పార్టీ విజయం సాధించిన ఉమ్మడి రాష్ట్రంలోని 18 నియోజకవర్గాల్లో భీమిలి ఒకటి.

ఫొటో సోర్స్, FACEBOOK/GANTASRINIVASARAO
విద్యాశాఖ మంత్రుల నియోజకవర్గం...
విశాఖపట్నంలో ఉన్న అనేక విద్యాసంస్థలు భీమిలి నియోజకవర్గంలోనే ఉన్నాయి. విశాఖ నగరం దాటి భీమిలి వైపు వెళ్తున్నకొద్దీ దారి పొడవునా విద్యాసంస్థలు కనిపిస్తాయి.
వచ్చీపోయే కాలేజీ, స్కూల్ బస్సులు, హోర్డింగులు కనిపిస్తాయి. నగరానికి దగ్గరగా ఉండడం, ప్రశాంతమైన వాతావరణం కారణంగా విద్యాసంస్థలన్నీ ఇక్కడే కేంద్రీకృతమయ్యాయి.
భీమిలి నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా పనిచేసిన ఐదుగురిని మంత్రి పదవులు వరించాయి. వారిలో ముగ్గురు విద్యాశాఖ మంత్రులుగా చేశారు.
1962 ఎన్నికల్లో విజయనగరానికి చెందిన సంస్థానాధీశుడు పీవీజీ రాజు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.
1983లో పూసపాటి ఆనంద గజపతిరాజు భీమిలి నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి దాట్ల జగన్నాథరాజుపై గెలుపొందారు. ఎన్టీఆర్ తొలి కేబినెట్లో ఆనంద గజపతిరాజును విద్యా శాఖ వరించింది.
2014లో భీమిలి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గంటా శ్రీనివాసరావు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.
భీమిలి నియోజకవర్గం నుంచి మరో ఇద్దరు మంత్రులుగా పనిచేశారు. వారిలో అప్పల నర్సింహరాజు (ఎక్సైజ్ శాఖ), అవంతి శ్రీనివాసరావు (పర్యాటక శాఖ) మంత్రులుగా చేశారు.

భీమిలి చరిత్ర ఏంటి, ఆ పేరు ఎలా వచ్చింది?
భీమిలి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ చూసినా బౌద్ధ చిహ్నాలు దొరుకుతాయని, ఈ ప్రాంతంలో బౌద్ధం అంతలా వెల్లివిరిసిందని చరిత్రకారులు చెప్తున్నారు. తొట్లకొండ, బావికొండ, పావురాల కొండ వంటి బౌద్ధరామాలు భీమిలి పరిసరాల్లోనే ఉన్నాయి.
ఈ ప్రాంతం బౌద్ధుల మజిలీ ప్రాంతం కావడంతో బౌద్ధుల మజిలీ కాలక్రమేణా భీమిలిగా మారిందనే వాదన ఉంది. దీనివెనుక ఒక పురాణగాథ కూడా ఉందని మాజీ ప్రొఫెసర్ కొల్లూరి సూర్యనారాయణ చెప్పారు.
"ఈ ప్రాంతంలో బకాసురుడు జనాల్ని చంపేసి తినేస్తుంటే, భీముడు ఆ రాక్షసుడిని చంపేశాడని చెప్తారని, అయితే ఆ భీముడు పురాణాల్లో చెప్పుకునే భీముడు కాదని, ఆ భీముడు చాళుక్య భీముడు లేదా భీమరాజుల్లో ఒక భీముడు కూడా అయి ఉండవచ్చు. భీమిలి పేరు వెనుక ఎలాంటి చారిత్రక ఆధారాలు ప్రస్తుతానికి లభ్యం కాలేదు" అని ఆయన అన్నారు.

దేశంలోనే రెండో మున్సిపాలిటీ..
భీమిలిగా ప్రసిద్ధి చెందిన భీమునిపట్నం దేశంలోనే రెండో మున్సిపాలిటీ. 1861, ఫిబ్రవరి 8న మున్సిపాలిటీగా ఏర్పడిన భీమిలి అప్పట్లో విశాఖ కంటే పెద్ద పట్టణం. అప్పటికి భీమిలి జనాభా 5,200 ఉంటే, విశాఖ జనాభా 4,600 మాత్రమే. దేశంలో తొలి మున్సిపాలిటీ సూరత్. 1861లో ఆంధ్రదేశంలో ఏర్పడిన మొదటి మునిసిపాలిటీ భీమునిపట్నం.
ప్రస్తుతం భీమిలి గ్రేటర్ విశాఖ మున్సిపాల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)లో భాగం. 2014 జూలై 30న భీమిలి మున్సిపాలిటీ జీవీఎంసీలో విలీనమైంది. ఇది విశాఖపట్నానికి 32 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
“2014 వరకు మునిసిపాలిటీగా ఉన్న భీమిలిని జీవీఎంసీలో కలిపేందుకు ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు వ్యతిరేకత వచ్చింది. జీవీఎంసీ పరిధిని పెంచి.. ఆదాయం పెంచుకోవడం కోసం అప్పటివరకూ 72 వార్డులుగా ఉన్న జీవీఎంసీని భీమిలి, అనకాపల్లి నియోజకవర్గాల్లోని కొంత భాగాలను కలిపి 98 వార్డులకు పెంచారు. దీంతో భీమిలి తన అస్తిత్వాన్ని కోల్పోయి జీవీఎంసీలో భాగంగా మారింది” అని సీనియర్ జర్నలిస్ట్ ఎం.యుగంధర్ రెడ్డి బీబీసీతో అన్నారు.

అప్పట్లో వైజాగ్ కంటే భీమిలి ఫేమస్..
1860ల ప్రాంతంలో బ్రిటిష్ వారు వివిధ అవసరాల కోసం భీమిలి నుంచి నర్సీపట్నానికి రోడ్డు వేశారు. ఆ రోడ్డు ఇప్పటికీ ఉంది. దీనినే భీమిలి - నర్సీపట్నం రోడ్డు అనేవారు. ప్రస్తుతం దీనిని భీమిలి - విశాఖ రోడ్డుగా పిలుస్తున్నారు. అప్పట్లో భీమిలికి ఉన్న ప్రాధాన్యం విశాఖకి లేదనేందుకు ఈ రోడ్డు ఉదాహరణగా చెప్పుకోవచ్చని మాజీ ప్రొఫెసర్ కొల్లూరి సూర్యనారాయణ చెప్పారు.
ఉత్తరాంధ్రలో అతిపెద్ద పూల మార్కెట్‌గా పేరుపొందిన ఆనందపురం పూల మార్కెట్ కూడా భీమిలి నియోజకవర్గంలోనే ఉంది. ఆనందపురం, పద్మనాభం, భీమిలి, విశాఖ రూరల్‌లోని కొంతప్రాంతం భీమిలి నియోజకవర్గంలోనే ఉండటంతో ఈ ప్రాంతంలో గ్రామీణ వాతావరణం కనిపిస్తుంది.
భీమిలి తీర ప్రాంతం కావడంతో మత్స్యకార పల్లెలు ఉంటాయి. ఇక విశాఖలో ఉన్న మధురవాడ ఐటీ సెజ్ కూడా ఈ నియోజకవర్గంలోనే ఉంది.
ఇవి కూడా చదవండి:
- ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్: ఇజ్రాయెల్‌పై డ్రోన్స్, మిసైల్స్‌తో దాడి చేసిన ఈ ఇరాన్ దళం పవర్ ఏంటి?
- ది రియల్ కేరళ స్టోరీ: రియాద్‌లో మరణశిక్ష పడిన రహీమ్ ప్రాణాలు కాపాడేందుకు హిందూ, ముస్లింలు ఏకమై రూ. 34 కోట్ల 'బ్లడ్ మనీ'ని ఎలా సేకరించారంటే...
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: వైసీపీకి చిక్కవు, టీడీపీకి దొరకవు
- అరబ్- ఇజ్రాయెల్ యుద్ధం 1967: అరబ్ నేలను నాశనం చేసిన ఆ ఆరు రోజుల్లో ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














