లా నినా: తెలుగు రాష్ట్రాల్లో ఈసారి ఎక్కువ వర్షాలు కురుస్తాయా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శారద.వి
- హోదా, బీబీసీ ప్రతినిధి
'లా నినా' కారణంగా ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో దేశంలో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగే నైరుతి రుతుపవనాల సమయంలో భారత్‌లో సగటున 87 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది.
ఈ సంవత్సరం సగటు కంటే 6 శాతం ఎక్కువగా వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ‘లా నినా’ దీనికి కారణంగా చెప్పవచ్చు.

‘లా నినా’ అంటే ఏమిటి?
పసిఫిక్ మహాసముద్రాన్ని ఒక భారీ నీటి ట్యాంకు అనుకోండి. సాధారణంగా, ఈ వాటర్ ట్యాంక్‌లోని నీరు భూమధ్యరేఖకు సమీపంలో ఉన్న కొన్నిప్రాంతాల్లో వెచ్చగానూ, మరికొన్ని ప్రాంతాల్లో చల్లగానూ ఉంటుంది.
ఇది ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో సమతుల్యతకు కారణమవుతుంది. ఈ సమతుల్యతలో వచ్చే వాతావరణ మార్పులే ఎల్ నినో, లా నినా.
భూమధ్యరేఖకు సమీపంలో సముద్ర ఉష్ణోగ్రతలు సాధారణం కంటే వేడెక్కితే అది ఎల్ నినో. కనీసం 0.5 డిగ్రీల ఉష్గోగ్రత పెరుగుదలను ఎల్ నినోగా చెబుతారు.
లా నినా అందుకు వ్యతిరేకం. లా నినా సముద్ర ఉష్ణోగ్రతలను చల్లబరుస్తుంది. సాధారణం కంటే కనీసం 0.5 డిగ్రీలు పడిపోతే, లా నినా ఎఫెక్ట్‌గా చెబుతారు. పసిఫిక్ మహాసముద్రంలోని పెరూ తీరం వెంబడి ఈ మార్పులు చోటుచేసుకుంటాయి.

లా నినా ప్రభావం భారత్‌పై ఎలా?
నిరుడు రుతుపవనాల సమయంలో ఎల్ నినో కారణంగా భారత్‌లో వర్షపాతం 6 శాతం తగ్గింది. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం ఇంకా పూర్తిగా ముగియలేదు.
అయితే, ఎల్ నినో ముగిసిపోయి జూన్ నాటికి లా నినా ప్రారంభమవుతుందని ప్రపంచవ్యాప్తంగా వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
రుతుపవనాల రాక గురించి భారత వాతావరణ విభాగం విడుదల చేసిన సూచనల్లో, ''ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం మధ్యస్తంగా ఉంది, నైరుతి రుతుపవనాల రాకతో అది మరింత బలహీనపడుతుంది. ఇది ఆగస్టు, సెప్టెంబర్ మాసాల మధ్య అధిక వర్షపాతానికి కారణమవుతుంది'' అని పేర్కొంది.
రుతుపవనాల రాకను అంచనా వేయడానికి భారత వాతావరణ శాఖ అనేక విధానాలను ఉపయోగిస్తోంది. సముద్ర ఉష్ణోగ్రతలు, యూరప్‌లో మంచు ప్రభావం వంటి అనేక అంశాలకు సంబంధించిన 150 ఏళ్ల చారిత్రక డేటాను అనుసంధానించి రుతుపవనాల రాకను అంచనా వేయడం వాటిలో ఒకటి.
ఒక నిర్దిష్టమైన రోజున ప్రపంచ వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయనే అంచనాలను పరిగణలోకి తీసుకుని, అధునాతన కంప్యూటర్లను ఉపయోగించి ఆ రోజు వాతావరణాన్ని అంచనా వేయడం మరో మార్గం.
ఈ ఏడాది రుతుపవనాలకు సంబంధించి ఈ రెండు విధానాలూ ఒకే విధమైన అంచనాలు ఇచ్చాయని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కార్యదర్శి ఎం.రవిచంద్రన్ చెప్పారు.
లా నినా ప్రభావం గురించి భారత వాతావరణ శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ శివానంద పాయి బీబీసీతో మాట్లాడారు.
''మన శరీర ఉష్ణోగ్రత కొన్నిసార్లు పెరిగి, కొన్నిసార్లు ఎలా తగ్గుతుందో, అలానే సముద్ర ఉష్ణోగ్రతలు కూడా మారతాయి. అది కొద్దికాలం పాటు హెచ్చుతగ్గులకు లోనవుతుంది. ఆ తర్వాత సమతుల్య స్థితికి చేరుతుంది. ఇది సహజంగా జరిగే పరిణామం'' అన్నారు.
ఎల్ నినో, లా నినా కారణంగా ఉష్ణమండల ప్రాంతాల్లో మార్పులు చోటుచేసుకుంటాయని ఆయన చెప్పారు. ప్రతి ఏటా పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు ఎలా మారుతున్నాయి, ఎంత మారుతున్నాయనే అంశాలపై ఎల్ నినో, లా నినా ప్రభావం ఆధారపడి ఉంటుంది.
''1980లలో వీటి పర్యవసనాల గురించి ప్రపంచానికి తెలిసింది. ప్రపంచంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా వీటి ప్రభావం ఉంటుంది. ఇవి భారత్‌లో ఉష్ణోగ్రతలు, వర్షపాతాన్ని ప్రభావితం చేస్తాయి. నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే 4 శాతం తక్కువగా నమోదవుతాయని నిరుడు భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ, ఎల్ నినో ప్రభావం కారణంగా 6 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది'' అని శివానంద పాయి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
లా నినాకు గ్లోబల్ వార్మింగ్‌కి సంబంధం ఉందా?
గ్లోబల్ వార్మింగ్ వల్ల అన్ని వాతావరణ పరిస్థితులు మారుతున్నట్లే ఎల్ నినో, లా నినా ప్రభావాలు కూడా మారతాయని శివానంద పాయి వివరించారు.
"అవి ఎప్పుడెప్పుడు జరుగుతాయి, ఎంత స్థాయిలో జరుగుతాయనేది గ్లోబల్ వార్మింగ్ కారణంగా మారొచ్చు" అని ఆయన అన్నారు.
పసిఫిక్‌లో ఏం జరుగుతోంది?
ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలను గరిష్ట స్థాయికి తీసుకెళ్లిన ఎల్ నినో ఎఫెక్ట్ ముగిసినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గత వారం రోజులుగా పసిఫిక్ మహాసముద్రం ''గణనీయంగా చల్లబడింది'' అని ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ మెటరాలజీ పేర్కొంది.
గత ఏడాది జూన్‌లో ప్రారంభమైన ఈ ఎల్ నినో ఎఫెక్ట్ పసిఫిక్ ఉపరితల ఉష్ణోగ్రతలు పెంచింది. వాతావరణాన్ని వేడిగా మార్చింది. ఎల్ నినో జూన్‌లో ప్రారంభమై డిసెంబర్‌లో గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. దాని ఫలితంగా పసిఫిక్ ఉపరితల ఉష్ణోగ్రతలు, ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలను గరిష్ట స్థాయికి తీసుకెళ్లాయి. అయితే, ఊహించిన దానికంటే ముందుగానే ఎల్ నినో ముగుస్తోందని విశ్లేషకులు అంటున్నారు.
జూన్, ఆగస్టు మధ్య లా నినా ఏర్పడే అవకాశం 60 శాతంగా ఉందని అమెరికన్ పరిశోధకులు చెబుతున్నారు. అయితే, జూలై తర్వాత లా నినా ఎఫెక్ట్ పెరిగే అవకాశం ఉందని ఆస్ట్రేలియా సైంటిస్టులు అంటున్నారు.
తుపానులు, భారీ తుపానులను లా నినా ఎఫెక్ట్ ప్రభావితం చేస్తుంది. లా నినా ఏర్పడితే అట్లాంటిక్‌లో భారీ తుపానులకు కారణమయ్యే అవకాశం ఉందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. లా నినా చల్లని ప్రభావం గ్లోబల్ వార్మింగ్ రేటును కొంతవరకూ తగ్గించవచ్చని చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
దక్షిణ భారతదేశంపై ప్రభావం..
పసిఫిక్ మహాసముద్రం తరహాలోనే హిందూ మహాసముద్రంలోనూ ఉష్ణోగ్రతల మార్పులు ఉంటాయి. దీనిని హిందూ మహాసముద్రం డైపోల్(ద్విధ్రువం)గా వ్యవహరిస్తారు. ఈ మార్పుల వల్ల పశ్చిమ హిందూ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. తూర్పు హిందూ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.
ప్రస్తుతం ఉష్ణోగ్రతలు తటస్థంగా ఉన్నప్పటికీ, లా నినా కారణంగా ఆగస్టు నాటికి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని భావిస్తున్నారు. దీని ప్రభావం దక్షిణాసియా, ఆస్ట్రేలియా సహా ఇతర ప్రాంతాల్లోనూ కనిపించనుంది.
పసిఫిక్‌లో జరిగే ఒక పరిణామం ప్రపంచాన్ని ఎందుకు ప్రభావితం చేస్తుంది?
ఎల్ నినో, లా నినా పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేస్తాయి.
ఎల్ నినో సమయంలో నీటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. సాధారణంగా తూర్పు నుంచి పశ్చిమానికి వీచే గాలులు బలహీనపడటం లేదా తమ దిశను మార్చుకోవడం వల్ల ఇలా జరుగుతుంది. దాని ఫలితంగా, పశ్చిమ పసిఫిక్ వైపు వచ్చే వెచ్చని నీరు తూర్పు దిశగా అమెరికా వైపు కదులుతుంది. సముద్రం వేడెక్కుతుంది.
అదే లా నినా సమయంలో నీటి ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. తూర్పు నుంచి పశ్చిమానికి వీచే గాలి సాధారణం కంటే బలంగా ఉండటం వల్ల ఇది జరుగుతుంది. అవి వెచ్చని నీటిని పశ్చిమ పసిఫిక్ వైపుకి నెడతాయి. ఈ పరిణామం చల్లని నీటిని తూర్పు పసిఫిక్ వైపున ఉంచుతుంది.
సముద్రంలో జరిగే ఈ మార్పులు ప్రపంచానికి ఎందుకు కీలకం?
సముద్రం, వాతావరణం స్నేహితుల్లాంటివి. ఎప్పుడూ సన్నిహితంగా ఉంటాయి. సముద్ర ఉష్ణోగ్రతల్లో మార్పులు వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా గాలి వీచే దిశను మారుస్తాయి. అది వివిధ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేస్తుంది.
ఈ ఏడాది తూర్పు, ఈశాన్య, వాయువ్య భారతదేశం మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో "సాధారణం కంటే ఎక్కువ" వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రస్తుత అంచనాలు సూచిస్తున్నాయి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఏపీ, తెలంగాణపై ప్రభావం?
2023 నైరుతి రుతుపవనాల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో 13శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. 2023లో సాధారణ వర్షపాతం 521.6 మిల్లీమీటర్లుగా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 454.4 మిల్లీమీటర్లు కురిసింది.
ఈసారి దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే ఈ సారి 106 శాతం ఎక్కువగా వానలు పడొచ్చని ఐఎండీ తెలిపింది.
తెలంగాణలోనూ సాధారణం కంటే అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే 104 శాతం అధిక వర్షపాతం నమోదు కావొచ్చని అంచనా వేసింది.
‘‘ఐఎండీ వాళ్లు అంచనా వేస్తున్నట్లు వానాకాలం దగ్గరకు వచ్చేకొద్దీ ఎల్ నినో ప్రభావం క్రమంగా తగ్గుతూ పోతుంది. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో వానలు బాగా పడొచ్చు’’ అని ఆంధ్ర యూనివర్సిటీ వాతావరణ విభాగం చైర్మన్ పీవీ నాయుడు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ది రియల్ కేరళ స్టోరీ: రియాద్‌లో మరణశిక్ష పడిన రహీమ్ ప్రాణాలు కాపాడేందుకు హిందూ, ముస్లింలు ఏకమై రూ. 34 కోట్ల 'బ్లడ్ మనీ'ని ఎలా సేకరించారంటే
- అరబ్- ఇజ్రాయెల్ యుద్ధం 1967: అరబ్ నేలను నాశనం చేసిన ఆ ఆరు రోజుల్లో ఏం జరిగింది?
- బంగారం: ఈ విలువైన లోహం భూమి మీదకు ఎలా వచ్చింది, శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
- పాకిస్తాన్ క్రికెట్లో కొత్త డ్రామా, అమీర్ రీఎంట్రీకి కారణాలేంటి?
- కచ్చతీవుకు బదులుగా భారత్ తీసుకున్న 'వాడ్జ్ బ్యాంక్' ప్రాంతం అంత విలువైనదా?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














