అన్నామలై: తెలుగు నేతలు ప్రచారం చేసిన కోయంబత్తూరులో కుల సమీకరణలు పనిచేస్తాయా?

ఫొటో సోర్స్, annamalai_kuppusamy
- రచయిత, మురళీధరన్ కాశీవిశ్వనాథన్
- హోదా, బీబీసీ తమిళ్
పార్లమెంట్ ఎన్నికల వేళ ఎక్కువ మందిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో తమిళనాడులోని కోయంబత్తూర్ ఒకటి. ఈసారి కోయంబత్తూర్ సహా చుట్టుపక్కల జిల్లాల్లో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని చాలాకాలంగా చెబుతున్నారు.
బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండడంతో, ఇక్కడ వచ్చే ఫలితం అనేక అంశాలను కూడా ప్రభావితం చేయనుంది.
కోయంబత్తూర్ లోక్‌సభ నియోజకవర్గంలో కోయంబత్తూర్ నార్త్, కోయంబత్తూర్ సౌత్, సింగనల్లూర్, పల్లడం, గౌండపాళయం, సూలూర్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ ఆరు నియోజకవర్గాల్లో ఐదు అసెంబ్లీ స్థానాల్లో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తుండగా, కోయంబత్తూరు సౌత్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు.
కోయంబత్తూరులో ఈసారి డీఎంకే, ఏడీఎంకే, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.
రాజకీయ పార్టీల ప్రచారాలను పక్కనబెడితే, ఈ లోక్‌సభ నియోజకవర్గంలో ప్రభావితం చూపే అంశాలేమిటి?

ఏడుసార్లు గెలిచిన వామపక్షాలు
కోయంబత్తూర్ నియోజకవర్గంలో కమ్యూనిస్టు పార్టీలు ఏడుసార్లు, కాంగ్రెస్ పార్టీ ఆరుసార్లు విజయం సాధించాయి. డీఎంకే, బీజేపీలు రెండేసి సార్లు అన్నాడీఎంకేపై గెలుపొందాయి. మరోసారి గెలుపు కోసం పోరాడుతున్నాయి.
వామపక్షాలకు బలమైన పట్టున్న నియోజకవర్గంగా ఈ స్థానాన్ని పరిగణిస్తున్నప్పటికీ, గత పాతికేళ్లుగా బీజేపీ ప్రభావం కూడా పెరుగుతూ వచ్చింది.
తమిళనాడులో పారిశ్రామిక ప్రాంతమైన కోయంబత్తూర్ కేంద్రంగా టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలు, స్పిన్నింగ్ మిల్లులు, పవర్ లూమ్స్, కాంపోనెంట్ ఫ్యాక్టరీలు, పంపు ఫ్యాక్టరీలు, వాహనాల విడిభాగాల తయారీ సంస్థలు ఉన్నాయి. విద్యాసంస్థలకు, ఆస్పత్రులకు కూడా కొదువలేదు.
అయితే, గత కొన్నేళ్లుగా ఇక్కడి పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా జీఎస్టీ అమలు, నోట్ల రద్దు ప్రభావం పరిశ్రమలపై తీవ్రంగా పడింది.
అలాగే, నగరంలో ట్రాఫిక్ రద్దీ, తాగునీటి సమస్యలు వంటి స్థానిక అంశాలు కూడా ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి.

90లలో కోయంబత్తూర్ అల్లర్లు
పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, స్థానిక సమస్యలతో పాటు సామాజిక, రాజకీయ అంశాలు కూడా ఎన్నికల ఫలితాలను నిర్ణయించే స్థితిలో ఉన్నాయి. 1990వ దశకం చివర్లో కోయంబత్తూరులో జరిగిన మతఘర్షణలు, ఆ తర్వాత జరిగిన బాంబు పేలుళ్లు అల్లకల్లోలం సృష్టించాయి. ఇప్పటి యువతపై నాటి అల్లర్ల ప్రభావం లేకపోయినప్పటికీ, వాటిని గుర్తుచేసే ప్రయత్నం జరుగుతోందని కొందరు భావిస్తున్నారు.
‘‘కోయంబత్తూరు అల్లర్లు జరిగి 25 ఏళ్లు అవుతోంది. ఇప్పుడు వాటి ప్రభావం అంతగా లేదు. కానీ, వాటిని గుర్తు చేసేందుకు కొన్ని సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే హోరాహోరీ పోరాడుతున్నప్పటికీ, వాటి గురించి మాట్లాడడం లేదు. కానీ, అప్పట్లో జరిగిన ఘటనలను మళ్లీ మళ్లీ గుర్తు చేయడం ద్వారా చెప్పుకోదగ్గ ఓట్లు రాబట్టొచ్చని బీజేపీ భావిస్తున్నప్పటికీ, అలా జరిగే అవకాశం లేదు. ఆ అల్లర్లు, వాటి ప్రభావం గురించి ఇప్పటి యువతకు తెలిసే అవకాశం లేదు'' అని కోయంబత్తూరుకి చెందిన న్యాయవాది, రచయిత ఎ.కరీం బీబీసీతో చెప్పారు.
''అల్లర్ల వల్ల ప్రభావితమైన వర్గాలు కూడా తమకు ప్రశాంతమైన కోయంబత్తూర్ కావాలని కోరుకుంటున్నాయి. కాబట్టి, ఆ పాత జ్ఞాపకాలను రెచ్చగొట్టడం వల్ల రాజకీయ లబ్ధి పొందే అవకాశం చాలా తక్కువ" అని ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే కోయంబత్తూర్ రాజకీయాలు భిన్నంగా ఉంటాయని తమిళనాడులోని ఇతర ప్రాంతాల ప్రజలు భావిస్తుంటారు, కానీ అది నిజం కాదని రచయిత మురుగవేల్ అన్నారు.
''ఇతర ప్రాంతాల కంటే ఇక్కడ బీజేపీ ఒకటి, రెండు శాతం మెరుగ్గా ఉండొచ్చు. అంతకుమించి పెద్ద తేడా ఏమీ కనిపించడం లేదు. ఇక్కడ కూడా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల మాదిరిగానే ఉంది. డీఎంకే, ఏడీఎంకేకి సమానంగా, లేదా ఆ రెండు పార్టీల కంటే గొప్పగా బీజేపీ ప్రభావం చూపే అవకాశం కనిపించడం లేదు'' అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, K.ANNAMALAI/X
కుల సమీకరణలు
కోయంబత్తూరులో కుల సమీకరణల ప్రభావం ఉండొచ్చనే అభిప్రాయం చాలా మందిలో ఉన్నప్పటికీ, అది కూడా నిజం కాదని అంటున్నారు ఇక్కడి ప్రజలు.
''నాకు తెలిసినంత వరకూ కోయంబత్తూరులో కుల సమీకరణలు ఎప్పుడూ విజయవంతం కాలేదు. అయితే, అలా చేయడానికి మాత్రం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్నికల వేళ కొన్ని కులసంఘాలు సమావేశాలు ఏర్పాటు చేసి తమ మద్దతు ఫలానా అభ్యర్థికేనని చెబుతున్నాయి. అయితే, కేవలం ఒక కుల సంఘం సమావేశం ఏర్పాటు చేసి, ఫలానా అభ్యర్థికే సంఘం మద్దతు ఇస్తున్నట్లు చెప్పినంత మాత్రాన ఆ కులానికి చెందిన వారంతా ఆ అభ్యర్థి వెంట నడిచే పరిస్థితి ఉండదు'' అని సామాజిక కార్యకర్త గణేశ్ అన్నారు.
''ఇటీవల 'బ్రాహ్మిణ్స్ ఫర్ అన్నామలై' అనే సంస్థ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి, మద్దతు కూడగట్టే ప్రయత్నం చేసింది. కానీ, నేను ఆ సంఘంలోని వ్యక్తులతో మాట్లాడినప్పుడు, ప్రతిసారీ ఇలా జరుగుతూనే ఉంటాయి. కానీ, మేం వాళ్లు చెప్పిన వాళ్లకు ఓటు వేయం. మేం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నామని వాళ్లు చెప్పారు. ఇక్కడ కులాల ప్రాతిపదికన ఏ ఒక్కరికీ ఓట్లు వచ్చే అవకాశం లేదు'' అన్నారు గణేశ్.
కరీం నుంచి కూడా అదే తరహా స్పందన వచ్చింది. ''నామక్కల్, ఈరోడ్ వంటి చోట్ల చేసినట్లుగా కులప్రాతిపదికన ఓటర్లను సమీకరించడం, ఓట్లు పొందడం కోయంబత్తూర్‌లో సాధ్యం కాదు. కొన్నిచోట్ల కుల సమీకరణలు జరిగే అవకాశం ఉంది, కానీ అవి ఓట్లుగా మారే అవకాశం చాలా తక్కువ'' అని కరీం చెప్పారు.
పోయినసారి ఎన్నికలకు, ఈసారి ఎన్నికలకు చాలా తేడాలున్నాయి.
''కోయంబత్తూరులో ఇవి ప్రత్యేకమైన ఎన్నికలు. గత ఎన్నికల్లో డీఎంకే, ఏడీఎంకేలు పోటీపడి డబ్బులు ఖర్చు పెట్టేవి. అయితే, 1977 తర్వాత, మొదటిసారి మరో పార్టీ ఈ రెండు పార్టీల కంటే ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తోంది'' అని గణేశ్ అంటున్నారు.
''ఈసారి రాజకీయాల గురించి బాగా చర్చ జరుగుతోంది. డీఎంకే ఎందుకు కావాలి, ఏడీఎంకే ఎందుకు కావాలి, బీజేపీ ఎందుకు కావాలి అని మాట్లాడుకుంటున్నారు. ఇంతకుముందు ఇలాంటి పరిస్థితి లేదు.''
''ఈసారి త్రిముఖ పోటీ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇది హఠాత్తుగా ఏమీ జరగలేదు. 1998, 99 నుంచి ఇదే పరిస్థితి. బీజేపీ విషయానికొస్తే, గతంలో ఇతర పార్టీలతో పొత్తుతో పోటీ చేసినప్పటికీ కోయంబత్తూరులో తాను సొంతంగా బలం పెంచుకుంది. దానికితోడు ప్రస్తుతం ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నారు. కాబట్టి, ఈసారి బీజేపీ నుంచి కూడా గట్టి పోటీ తప్పదు'' అని గణేశ్ వివరించారు.

ఫొటో సోర్స్, KAMAL HAASAN/X
కోయంబత్తూర్ ప్రజలు ఏమనుకుంటున్నారు?
ఎన్నికల బరిలో నిలిచిన మూడు ప్రధాన పార్టీలకూ ఈ నియోజకవర్గంలో అనుకూల, ప్రతికూల అంశాలు ఉన్నాయని మురుగవేల్ చెబుతున్నారు.
''అధికార పార్టీ కావడం డీఎంకేకు సానుకూలాంశం. డీఎంకే ప్రభుత్వం ఇస్తున్న రూ.1000 ఫ్రాంచైజీ ఫీజు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటివి డీఎంకేకు సానుకూల అంశాలుగా ఉన్నాయి. ఇంటి పన్నులు పెరగడం, నీటి సమస్య తీవ్రతరం కావడంపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి ఏడీఎంకేకు అనుకూలంగా మారొచ్చు. లోక్‌సభ నియోజకవర్గంలోని అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య కూడా ఎక్కువ.''
"అలాగే, ఎంజీఆర్, జయలలిత వంటి జనాకర్షణ ఉన్న నేతలు లేరు. కాబట్టి పార్టీ తమ సొంత బలంతో పోరాడాలి. ఇక అన్నామలై. కష్టపడడం వల్ల పోటీలో ఉన్నారు. తాము శక్తివంతులమని ఇప్పటికే వారు మీడియాలో ఓ ఇమేజ్ సృష్టించారు" అని మురుగవేల్ అన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో కోయంబత్తూర్ ప్రజలు ఎవరికి ఓటు వేస్తారు?
శాంతియుత వాతావరణానికి కోయంబత్తూర్ ప్రజలు ఓటు వేస్తారని గణేశ్ అంటున్నారు. ''ఇది పరిశ్రమల నగరం. ప్రశాంతంగా ఉంటేనే ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది'' అన్నారు.
''మతఘర్షణలు జరిగినప్పుడు ముందుగా నష్టపోయింది పరిశ్రమలే. ఇప్పుడు వాటన్నింటి నుంచి కోయంబత్తూర్ కోలుకుంది. కాబట్టి శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదని అన్ని పార్టీలు కోరుకుంటున్నాయి'' అని ఆయన చెప్పారు.
కోయంబత్తూరులో డీఎంకే నుంచి గణపతి రాజ్‌కుమార్, ఏడీఎంకే నుంచి సింగై రామచంద్రన్, బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై పోటీ చేస్తున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఇక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ఫలితాలు రాజకీయ పార్టీలపైనే కాకుండా నగరంపై కూడా తీవ్ర ప్రభావం చూపించవచ్చు.

పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలు
కోయంబత్తూర్‌కి చెందిన అనేక మంది పారిశ్రామికవేత్తలు జాతీయవాదానికి సానుకూలంగా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ బలమైన జాతీయ పార్టీగా ఉంది. ప్రచారం రోజురోజుకీ ముమ్మరం అవుతున్నకొద్దీ చాలామంది దృష్టి ఆ పార్టీ వైపు మళ్లింది. అయితే, జీఎస్టీ అమలు కారణంగా అనేక చిన్నతరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయని ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి.
''జీఎస్టీ అమల్లో చాలా ఇబ్బందులున్నాయి. మన బిల్లుల్లో చిన్న పొరపాటు జరిగినా ఇబ్బంది పెడుతున్నారు. దానిని ఆపాలి. కొత్త పరిశ్రమలు పెట్టాలని పిలుపునిస్తున్నారు, కానీ ఇప్పటికే ఉన్న పరిశ్రమలు సరిగ్గా నడవడం లేదు. చిన్నతరహా పరిశ్రమల రంగంలో ఉత్తర భారతదేశం నుంచి తీవ్రపోటీ ఉంది.''
"మాకు ముడి సరుకులు అక్కడి నుంచే రావాలి. అవి ఇక్కడకు రావాలంటే నిధులు వెచ్చించాలి. ఆ తర్వాత తయారైన వస్తువులను మార్కెట్‌లోకి తీసుకురావడానికి మరికొంత వెచ్చించాలి. కానీ, వారికి అలాంటి ఇబ్బంది లేదు."
"అందువల్ల వారు తక్కువ ఖర్చుతోనే ఆ పని చేయగలుగుతున్నారు. ఈ సమస్యకు తక్షణ పరిష్కారం అవసరం. లేకుంటే వ్యాపారం చేయలేం" అని కోసిమా (కోయంబత్తూర్ ఎస్‌ఐడీసీవో ఇండస్ట్రియల్ ఎస్టేట్ మాన్యుఫ్యాక్చరర్స్ వెల్ఫేర్ అసోసియేషన్) మాజీ అధ్యక్షుడు లోకనాథన్ బీబీసీతో చెప్పారు.
ఉత్పత్తి రంగంలో ఉన్నవారిపై జీఎస్టీ ప్రభావం ఉండదు, చిన్నతరహా పరిశ్రమలకు కేంద్రం అనేక పథకాలు ప్రకటించినప్పటికీ నిబంధనల కారణంగా వాటిని వినియోగించుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. రాబోయే పార్లమెంట్ సభ్యుడైనా సాయం చేస్తే బాగుంటుందని లోకనాథన్ అంటున్నారు.
భారతదేశ జీడీపీలో ఎంఎస్‌ఎంఈ వాటా దాదాపు 30 శాతం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదని పారిశ్రామికవేత్త రవీంద్రన్ చెప్పారు.
కోయంబత్తూరు మోటారు పంపుల తయారీకి ప్రసిద్ధి చెందిన నగరం అయినప్పటికీ, గత కొన్ని సంవత్సరాలుగా కోయంబత్తూర్ మార్కెట్ వాటా బాగా తగ్గిందని ఆయన అభిప్రాయపడ్డారు.
జీఎస్టీ విధానంలోని గందరగోళ పరిస్థితులు, ఆచరణాత్మక సమస్యలను పరిష్కరించేందుకు ఒక కమిటీని నియమించాలని ఆయన అన్నారు.
కోయంబత్తూరు, తిరుపూర్ జిల్లాల్లో రెండున్నర లక్షల మగ్గాలు ఉండేవి. దాదాపు 25,000-30,000 మరమగ్గాలు పాత ఇనుముగా మారాయి. వ్యవసాయం నుంచి పవర్ లూమ్‌లకు మారాం.. కానీ, ఇప్పుడు ఇది కూడా లాభదాయకంగా లేదు. పెద్దపెద్ద ఆధునిక మగ్గాలతో పోటీపడలేక నష్టపోతున్నాం. కేంద్రం నుంచి రాయితీలు వచ్చేలా చూడాలి. ఈసారి వచ్చే ఎంపీ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మా సమస్యలు పరిష్కరించాలని కోయంబత్తూరు - తిరుపూర్ జిల్లా వీవింగ్ పవర్ లూమ్ ఓనర్స్ అసోసియేషన్ కోశాధికారి భూపతి కోరుతున్నారు.
తెలుగువారు గణనీయంగా ఉన్న ఈ ప్రాంతంలో ఎన్డీయే తరఫున తెలుగుదేశం నేత లోకేశ్ ఇటీవల అన్నామలైకి మద్ధతుగా ఇక్కడ ప్రచారం చేశారు.
ఇవి కూడా చదవండి:
- ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్: ఇజ్రాయెల్‌పై డ్రోన్స్, మిసైల్స్‌తో దాడి చేసిన ఈ ఇరాన్ దళం పవర్ ఏంటి?
- ది రియల్ కేరళ స్టోరీ: రియాద్‌లో మరణశిక్ష పడిన రహీమ్ ప్రాణాలు కాపాడేందుకు హిందూ, ముస్లింలు ఏకమై రూ. 34 కోట్ల 'బ్లడ్ మనీ'ని ఎలా సేకరించారంటే...
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: వైసీపీకి చిక్కవు, టీడీపీకి దొరకవు
- అరబ్- ఇజ్రాయెల్ యుద్ధం 1967: అరబ్ నేలను నాశనం చేసిన ఆ ఆరు రోజుల్లో ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














