వాతావరణం వేడిక్కితే చాక్లెట్ ధరలు పెరుగుతాయా, రెండింటికీ లింకేంటి?

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఇష్టంగా తినే పదార్థం చాక్లెట్. కానీ, ఈ చాక్లెట్ ధరలు 2024 ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో పెరిగాయి.
చాక్లెట్‌లో వాడే కోకో ఒక్కో టన్ను ధర రెండింతలు పెరిగి అమెరికా మార్కెట్‌లో 5874 డాలర్ల (సుమారు రూ.5 లక్షలు)కు ఎగిసింది. అప్పటి నుంచి ఈ ధరలు పెరుగుతూనే వస్తున్నాయి.
ఈ ధరలు పెరిగేందుకు ప్రధాన కారణం కోకో ఉత్పత్తి తగ్గడమే.
ప్రపంచానికి సరఫరా అయ్యే చాలా వరకు కోకో రెండు పశ్చిమ దేశాలలో ఉత్పత్తి అవుతుంది. ఆ దేశాల్లో పర్యావరణ మార్పు ప్రభావంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
వాతావరణంలో వచ్చిన మార్పు కోకో ఉత్పత్తిపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. అంతేకాక, కోకో పండించే రైతులు ఇతర సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.
చాక్లెట్ ఉత్పత్తిపై పర్యావరణ మార్పు ఎలాంటి ప్రభావం చూపిందో ఇప్పుడు తెలుసుకుందాం....

ఫొటో సోర్స్, Getty Images
చాక్లెట్ చరిత్ర
ఇంగ్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్‌లో ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ కేటీ సాంపెక్ చాక్లెట్ చరిత్రపై పరిశోధన చేపట్టారు.
4 వేల సంవత్సరాల క్రితం ఈక్వెడార్, వెనిజులా ప్రాంతాల్లోని ఉత్తర అమెజాన్ అడవుల్లో కోకో చెట్లను గుర్తించినట్లు ఆమె చెప్పారు.
ఆ తర్వాత ఈ చెట్లు మెక్సికో, సెంట్రల్ అమెరికాలో పెరిగినట్లు తెలిపారు. కోకో కొత్త రకం చెట్లు కూడా పెరిగి పెద్దయ్యాయి.
‘‘తొలుత కోకో పండు నుంచి తీసిన జ్యూస్‌ను పులియబెట్టి, ఆహారం, డ్రింక్‌లలో వాడేవారు. పురావస్తు శాస్త్రవేత్తలు కోకో రసాయనిక జాడలున్న పలు పురాతన సీసాలను గుర్తించారు. ఆ తర్వాత ఈ పండు విత్తనాలను వాడుతూ ఆహార పదార్థాలను తయారు చేయడం ప్రారంభించారు’’
‘‘దేవాలయాలు, ఇతర ప్రార్థనా ప్రదేశాల్లో దీన్ని ఇవ్వడం మొదలు పెట్టారు. మాయా నాగరికతకు చెందిన కొన్ని శాసనాల్లో కోకో ప్రయోజనాలను ప్రస్తావించినట్లు ఉంది. సంతానోత్పత్తికి కోకోకు సంబంధం ఉన్నట్లు తెలిసింది. 4వ శతాబ్దానికి చెందిన కొన్ని ఆధారాల్లో, కోకోకు చెందిన విత్తనాలను వ్యాపార లావాదేవీలలో కరెన్సీగా వాడేవారని తెలిసింది. ఆ తర్వాత ఎల్ సాల్వడార్‌లో కూడా కోకో ఉత్పత్తి పెరిగింది’’ అని కేటీ సాంపెక్ తన పరిశోధనల్లో గుర్తించారు.
కోకో ఉత్పత్తిని పెంచేందుకు ఈ ప్రాంతాలలోని రైతులు సరికొత్త మార్గాలను కనుగొన్నట్లు తెలిపారు.
ఆ తర్వాత ఎల్ సాల్వెడార్ కోకో ఉత్పత్తిలో అతిపెద్దదిగా అవతరించింది. కోకో ఉత్పత్తికి అనువైన వాతావరణం లేని ప్రదేశాలకు దీన్ని ఎగుమతి చేసే వారు.
16వ శతాబ్దంలో స్పానిష్ బోట్లు అక్కడకు చేరుకున్నాయి. ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాయి. స్పానిష్ సంస్థానాధీశులు కోకో విత్తనాలను కరెన్సీగా ఉపయోగించారు.
ఎల్ సాల్వెడార్‌లో కోకో నుంచి జ్యూస్ లేదా డ్రింక్‌ను ఉత్పత్తి చేశారని, దీన్ని చాక్లెట్‌గా పిలిచినట్లు డాక్టర్ కేటీ సాంపెక్ చెప్పారు.
16వ శతాబ్దంలో స్పెయిన్‌లో, ఇతర చాలా ప్రాంతాల్లో చాక్లెట్ డ్రింకులు తాగడం చాలా సాధారణంగా ఉండేది.
పొద్దునే లేచి ప్రజలు చాక్లెట్ డ్రింక్‌తోనే రోజును ప్రారంభించేవారు. టీ వినియోగం 16వ శతాబ్దం మధ్య నుంచే ప్రారంభమైంది. 17వ శతాబ్దం మధ్య నుంచి కాఫీ వినియోగం పాపులర్ అయింది.
అంతకుముందు వరకు బ్రేక్‌ఫాస్ట్‌లో చాలా మంది చాక్లెట్ డ్రింకునే తాగేవారు.
ఆ సమయంలో యూరప్‌లో చాక్లెట్, కోకో వినియోగం చాలా కామన్‌గా ఉండేది.
యూరప్‌లో పెరిగిన చాక్లెట్ వినియోగం చాలా మార్పులను తీసుకొచ్చింది. తొలి వందేళ్ల వరకు, చాక్లెట్ ఉత్పత్తి నిర్ణయాలు స్థానిక వ్యక్తుల చేతుల్లోనే ఉండేవి.
కానీ ఎప్పుడైతే స్పానిష్ సంస్థానాధీశులు కోకో ఉత్పత్తిని తమ ఆధీనంలోకి తీసుకున్నారో, అప్పుడు ఉత్పత్తి గణనీయంగా తగ్గింది.
ఎందుకంటే, కోకో చాలా సున్నితమైన చెట్టు. దీనికి సరైన తేమ, వేడి వాతావరణం అవసరం. వీటిని ఎలా సంరక్షించాలో స్థానిక వ్యక్తులకు మాత్రమే తెలుసు. స్పానిష్ సంస్థానాధీశులకు ఈ విషయం పెద్దగా తెలియదు. దీంతో, దీని ఉత్పత్తి తగ్గింది.
తొలుత కోకో ఉత్పత్తిలో పెద్దగా జోక్యం చేసుకోని స్పానిష్ ప్రజలు, దీని డిమాండ్ పెరుగుతుందని తెలుసుకున్న తర్వాత, పెద్ద మొత్తంలో కోకో చెట్లను నాటడం ప్రారంభించారని డాక్టర్ కేటీ చెప్పారు. దీని ఉత్పత్తిలో స్థానికులను పెట్టుకుని పని చేయించుకునే వారు.
ఆ తర్వాత 1890ల్లో బ్రెజిల్ కాలనీ తన చేతుల్లో నుంచి చేజారిపోతుందని ఆందోళన చెందిన పోర్చుగల్ రాజు, బ్రెజిల్, ఆఫ్రికాలో కోకో పండించడం ప్రారంభించారు. ప్రస్తుతం కోకోను పలు దేశాల్లో పండిస్తున్నారు.
లాటిన్ అమెరికాలో ప్రధాన కోకో దేశాలుగా బ్రెజిల్, ఈక్వెడార్, వెనిజులా ఉన్నట్లు డాక్టర్ కేటీ తెలిపారు. ప్రస్తుతం ఆసియాలో కూడా థాయ్‌లాండ్, మలేసియా, భారత్‌లో కోకో ఉత్పత్తి పెరుగుతోంది. ఏదీ ఏమైనప్పటికీ ఇప్పటికీ కోకో ఉత్పత్తిలో పశ్చిమ ఆఫ్రికా ఆధిపత్య స్థానంలో ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
కోకో పండించడం కష్టం
ఐవరీ కోస్ట్ తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద కోకో ఉత్పత్తి దేశంగా ఘనా ఉన్నట్లు క్వామే ఎన్‌క్రుమా యూనివర్సిటీ ఆఫ్ ఘనా ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ ఫిలిప్ అంట్వి అఘ్యేయా చెప్పారు.
ప్రపంచానికి సరఫరా అయ్యే కోకోలో 20 శాతం ఘనా నుంచి వెళ్తుంది. ఘనాలో కోకో ఉత్పత్తిపై పర్యావరణ మార్పు తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. పర్యావరణ మార్పు వల్ల, కోకో పంటలు పెరిగే సీజన్ కూడా తగ్గింది.
50 ఏళ్ల కిందట ఫిబ్రవరిలోనే కోకో చెట్లు నాటేవాళ్లమని, కానీ ఇప్పుడు మే నెల వరకు వేచిచూడాల్సి వస్తుందని దేశంలోని ఉత్తర ప్రాంతాల్లో చాలా మంది రైతులు చెప్పినట్లు ఆయన తెలిపారు.
‘‘ఘనాలో వ్యవసాయం రంగం చాలా భిన్నంగా ఉంటుంది. కోకో పండే ఉత్తర ప్రాంతంలో, ఏడాదిలో కేవలం ఒకే ఒక్క పంట సీజన్ ఉంటుంది. రైతులు పంటలు పండించే కాలం తగ్గడంతో, వారు పని సరిగ్గా చేయలేకపోతున్నారు.’’ అని అఘ్యేయా చెప్పారు.
గత కొన్ని దశాబ్దాలుగా, ఘనా వరదలు, కరువులు వంటి పలు ప్రకృతి వైపరీత్యాలను చవిచూసింది. అంతేకాక, దేశంలో కీటకాలు కూడా పెరిగాయి. వీటితో, కోకో తోటకు, చెట్లకు ఇబ్బంది కలుగుతుంది.
రాబోయే ఏళ్లలో కరువు మరింత తీవ్రంగా ఉంటుందని అంచనాలున్నాయి. ఇది ఆ దేశంలో లక్షల కొద్దీ రైతుల జీవనోపాధిపై ప్రభావం చూపనుంది. ఘనాలో కోకో తోటల పెంపకం ప్రభుత్వ చేతుల్లో లేదు. ఈ ఉత్పత్తి చాలా వరకు చిన్న రైతు కుటుంబాలే చేపడుతున్నాయి.
ఘనాలో 8,65,000 రైతులు కోకో పంటలను పండిస్తున్నట్లు అంచనాలున్నాయి. సీజన్ ముగిసేంత వరకు కోకో రైతులు డబ్బులు కోసం వేచిచూడాల్సి వస్తుందని అఘ్యేయా చెప్పారు.
పంటను అమ్మిన తర్వాతనే, పూర్తి ఏడాదికి అయిన ఖర్చులను వారు తీర్చుకోగలుగుతున్నారు. కోకో పండించే ప్రాంతాల్లో పేదరికం తీవ్రంగా ఉంది. ఈ సమస్యను ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణించింది. ఎందుకంటే, ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధానమైనది కోకో ఉత్పత్తే.
కోకో చెట్లను, ఎరువులను కోకో కంట్రోల్ బోర్డు రైతులకు ఉచితంగా అందిస్తుంది. రైతులు తాము పండించిన పంటను ఈ బోర్డుకు అమ్మాల్సి ఉంటుంది. బోర్డునే పంట ధరను నిర్ణయిస్తుంది. ఇలా దోపిడీ నుంచి వారిని కాపాడవచ్చని ప్రభుత్వం చూస్తోంది.
పర్యావరణ మార్పు వల్ల సంభవించే పర్యవసానాల నుంచి పంటను రక్షించుకునేందుకు రైతులు కూడా పలు చర్యలు తీసుకుంటున్నారు. కోకో ఉత్పత్తిపై ఆధారపడటాన్ని అక్కడి రైతులు తగ్గించేసుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
చాక్లెట్ ఆర్థిక వ్యవస్థ
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కోకో పరిశ్రమ ప్రముఖ పాత్రను పోషిస్తుందని కెనడా ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ పాలసీ అడ్వయిజర్ స్టెఫానీ బెర్ముడెజ్ అన్నారు.
ఈ రంగం 5 కోట్ల మందికి ఉపాధిని కల్పిస్తుంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇది ఉపాధి అవకాశాలను అందిస్తుంది.
చాలా దేశాల్లో పర్యావరణ మార్పు వల్ల కోకో ఉత్పత్తి బాగా దెబ్బతింటుంది. పెరుగుతున్న వేడి, కరువు పరిస్థితులతో కోకో ఉత్పత్తి కష్టంగా మారుతుంది.
‘‘పశ్చిమ ఆఫ్రికాలో 2018 నుంచి 2019 మధ్య కాలంలో కోకో ఉత్పత్తి 5 శాతం తగ్గింది. మరికొన్ని దేశాలలో కోకో పండించడం కష్టతరమవుతుంది. వాతావరణంలో మార్పుల వల్ల చాలా దేశాల్లో కోకో పండించడం అసాధ్యమవుతుంది.
ఈ సమస్య పశ్చిమ ఆఫ్రికా, బ్రెజిల్, పెరూలో మొదలైంది. అక్కడ పెరుగుతున్న వేడి వల్ల, కోకో తోటలు చనిపోవడం లేదా సరిగ్గా ఫలాలను ఇవ్వలేకపోవడం జరుగుతుంది. కోకో నాణ్యత కూడా తగ్గుతుంది. దీంతో, దీని ధరలపై ప్రభావం పడుతుంది’’ అని స్టెఫానీ బెర్ముడెజ్ చెప్పారు.
నెదర్లాండ్స్, జర్మనీ, అమెరికాలు కోకోకు అతిపెద్ద కొనుగోలు దేశాలు.
మొత్తం కోకో ఉత్పత్తిలో ఐదు శాతం చాక్లెట్ పరిశ్రమలో వాడతారు. చాక్లెట్ పరిశ్రమ మార్కెట్ వాల్యూ 100 బిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో రూ.8,36,113 కోట్లు).
2026 నాటికి ఇది 189 బిలియన్ డాలర్లకు(రూ.15,80,254 కోట్లకు) పెరుగుతుందని అంచనాలున్నాయి.
‘‘కోకో ఉత్పత్తి తగ్గుతుండటం వల్ల, ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి’’ అని స్టెఫానీ బెర్ముడెజ్ చెప్పారు. ప్రస్తుతం ఒక్కో టన్ను ధర 7 వేల డాలర్ల( సుమారు రూ. 5.8 లక్షలు) కు చేరుకుంది. అంటే కోకో ధర గత ఏడాది కాలంలో 163 శాతం పెరిగింది. కోకో ఉత్పత్తిలో 70 శాతం లాభాలు చాక్లెట్ తయారీ కంపెనీల జేబుల్లోకి వెళ్తున్నట్లు స్టెఫానీ చెప్పారు.
మరోవైపు ఎరువుల ధరలు పెరుగుతుండటం, ఆర్థిక సహకారం లేకపోవడం, వాతావరణ మార్పుల వల్ల రైతుల సమస్యలు పెరుగుతున్నాయి. ఇవి కోకో ఉత్పత్తిపై ప్రభావం చూపుతున్నాయి.
అయితే, భవిష్యత్‌లో చాక్లెట్ డిమాండ్‌ను అందుకోవడం కోసం సరిపడా కోకో సరఫరా లేదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
‘‘అవును అలా జరుగుతుండొచ్చు. అంతకుముందు అమెరికా, పశ్చిమ యూరోపియన్ దేశాలు మాత్రమే చాక్లెట్‌కు ప్రధాన వినియోగదారులుగా ఉండేవి. కానీ, ఇప్పుడు చైనా, మెక్సికో, తుర్కియే, ఇండోనేషియా, చాలా ఆసియా దేశాల్లో చాక్లెట్ డిమాండ్ పెరుగుతోంది. చాక్లెట్ ఉత్పత్తులకు ఆసియా త్వరలోనే రెండో అతిపెద్ద మార్కెట్‌గా మారనుందనే అంచనాలున్నాయి’’ అని స్టెఫానీ బెర్ముడెజ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- బంగారం: ఈ విలువైన లోహం భూమి మీదకు ఎలా వచ్చింది, శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
- పాకిస్తాన్ క్రికెట్లో కొత్త డ్రామా, అమీర్ రీఎంట్రీకి కారణాలేంటి?
- కచ్చతీవుకు బదులుగా భారత్ తీసుకున్న 'వాడ్జ్ బ్యాంక్' ప్రాంతం అంత విలువైనదా?
- భారత్ ఉల్లిగడ్డలతో దౌత్యం నెరుపుతోందా?
- వారణాసిలో మోదీ మీద పోటీ చేస్తున్న అజయ్ రాయ్ ఎవరు... ఆర్ఎస్ఎస్-బీజేపీ చరిత్ర ఉన్న ఈ నాయకుడినే కాంగ్రెస్ ఎందుకు ఎంపిక చేసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














