షూస్, బూట్లు, స్నీకర్స్ పాతవి కొనుక్కోవడం మేలా, అవి ఎక్కువ రోజులు మన్నేలా చేసుకోవడం ఎలా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆనా శాంటి
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రిన్సెస్ కేట్ మిడిల్‌టన్ గుర్రపు స్వారీ సమయంలో వేసుకునే రైడింగ్ బూట్ల నుంచి ప్రపంచ ప్రముఖ స్ప్రింట్ రన్నర్లు వేసుకునే స్నీకర్స్ వరకు, షూలను ఎలా ఎంపిక చేసుకోవాలి. వాటిని ఎక్కువ కాలం వాడుకునేందుకు మనం ఏం చేయెవచ్చు?
ఒక జత బూట్లు ఎంత కాలం ఉంటాయి? ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ విషయంలో ఈ సమయం 20 ఏళ్లకు పైనే అని చెప్పవచ్చు.
పెనిలోప్ షివర్స్ కంపెనీ తయారు చేసిన తోలు దారాలు వేలాడే రైడింగ్ బూట్లు ఆమెకు చాలా ఇష్టం. నెట్‌ఫ్లిక్స్‌లో ఇటీవల ప్రసారమైన ది క్రౌన్ అనే సిరీస్‌లో కేట్ ( ఈ పాత్రను మెగ్ బెల్లామీ పోషించారు) యూనివర్సిటీలో స్టూడెంట్‌గా ఉన్న సమయంలో ధరించినట్లు చూపించారు.
2004లో కేట్ మిడిల్‌టన్ తొలిసారి వీటిని ధరించడాన్ని ప్రపంచం చూసింది. అలాగే మారుమూల ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే సమయంలో ఆమె వీటిని ధరిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
తయారీలో నాణ్యతతో పాటు నిర్వహణలోనూ కొన్ని ప్రమాణాలు పాటిస్తే షూస్ చాలా కాలం పాటు మన్నుతాయి. అలాగే వాటి కోసం చెల్లించిన సొమ్ముకి న్యాయం జరుగుతుంది.
వస్సీమా గమాల్ తన పెళ్లి రోజున సిండ్రల్లా షూస్ ధరించాలని కలలు కన్నారు. సన్నటి తోలుతో చేసిన చెప్పు మీద గ్లాస్ కవర్ దానిపైన ముత్యాలతో రూపొందించిన కంఠి లాంటి ఆకారం, వెనుక వైపున సన్నటి గ్లాస్‌తో తయారు చేసిన స్లింగ్, ఎత్తు మడమలున్న షూస్‌ను తయారు చేశారు డిజైనర్ అమినా మౌద్ది. వీటి ధర 1,080 డాలర్లు.
తన పెళ్లి రోజున అలాంటి షూస్ వేసుకోవాలని భావించిన గమాల్.. వాటి ధర చూసి ఆశ్చర్యపోయారు. వాటికి ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా అని వెతికారు.
ఆమె తనకు కావల్సిన వెనుక వైపు స్లింగ్ ఉండి తన సైజు షూష్‌ను అద్దెకు ఇచ్చే సర్వీస్‌ను కనుక్కున్నారు.
“ నేను షూస్ రెంట్‌కు తీసుకోవడం ఇదే తొలిసారి. అది ఇంత తేలిగ్గా ఉంటుందని అస్సలు ఊహించలేదు. నేను వాళ్లకు రిక్వెస్ట్ పంపి, సమాధానం కోసం ఊపిరి బిగబట్టి చూశాను. వాళ్లు నా రిక్వెస్ట్‌ను అంగీకరించారు. నాకు పట్టలేనంత ఆనందం కలిగింది.” అని ఆమె చెప్పారు.
అవి ఎప్పుడు వస్తాయా అని ఆమె ఉత్కంఠతో ఎదురు చూశారు. “అనుకున్న సమయం కంటే రెండు రోజుల ముందే అవి వచ్చాయి.” అని ఆమె అన్నారు.
తాను అద్దెకు తీసుకున్న సిండ్రెల్లా షూస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నట్లు గమాల్ చెప్పారు. ఎందుకంటే అవి పాడైతే, మూడు రోజుల అద్దెకు చెల్లించాల్సిన 133 డాలర్లతో టు మరి కొంత అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఫ్యాషన్ ఐటమ్స్‌ను అందరికీ చేరువ చేసేందుకు వాటిని అద్దెకు ఇవ్వడం ఒక మార్గం. దీని వల్ల కొత్త వాటిని ఉత్పత్తి చెయ్యడాన్ని తగ్గించవచ్చు. వినియోగదారులు ఖర్చు తగ్గించుకోవచ్చు.
ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఫుట్‌వేర్‌ది ఐదింట ఒక వంతు వాటా. వాటి తయారీ వల్ల 1.4 శాతం కర్బన ఉద్గారాలు వాతావరణంలో కలుస్తున్నాయని సస్టెయినబులిటీ కన్సల్టింగ్ గ్రూప్ క్వాంటిస్ చెబుతోంది.
ఫుట్‌వేర్ తయారీకి అవసరమైన ముడి పదార్ధాల వెలికితీత వల్ల కాలుష్యం పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 23 బిలియన్ జతల షూస్ తయారు చేస్తున్నారు.
అమెరికాలో ఒక్కో వ్యక్తికి సగటున 6.98 జతలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న ఫుట్‌వేర్‌లో 90 శాతం షూస్ మట్టిలో కలుస్తున్నాయి.
“ఫుట్‌వేర్, లైఫ్ స్టైల్ విషయంలో నా ఆలోచన సాధారణంగానే ఉంటుంది. ఫ్యాషన్ కంటే వాటి ఉపయోగానికే ప్రాధాన్యమిస్తాను” అని సర్ఫింగ్ క్రీడాకారుడు జాక్ సెయ్‌మౌర్ చెప్పారు. ఆయన బ్రిటన్‌లోని నార్తంబర్‌ల్యాండ్‌లో ఉంటున్నారు.

ఫొటో సోర్స్, Jack Seymour
“నేను నా సర్ఫ్ బోర్డులను రిపేర్ చెయ్యడానికే ఇష్టపడతాను. నా షూస్ మాదిరిగానే అది నాకు చాలా ఆనందాన్నిస్తుంది. మంచి బ్రాండ్లలో సరసమైన ధరకు లభించే వాటిని కొనడాన్ని ఇష్టపడతాను. అవి పాడైతే పడేయడం కన్నా వాటిని రిపేర్ చేయించడానికి ప్రాధాన్యత ఇస్తాను. ఫ్యాషన్ ఎంత వేగంగా మారిపోతోంది అంటే మీరు వేసుకున్న షూస్‌కి మట్టి అంటుకునే లోపే కొత్త వెరైటీ మార్కెట్‌లోకి వస్తోంది”. అని సెయ్‌మార్ చెప్పారు.
సెయ్‌మోర్ తాను ధరించే షూస్‌ని ఏటా రెండుసార్లు పూర్తిగా క్లీన్ చేస్తారు. వాటిని ఉతికి బాగా ఎండబెడతారు. తర్వాత వాటిలో న్యూస్ పేపర్ నింపుతారు.
అవసరమైతే లోపల కొత్త సోల్ వేస్తారు. లేసులు మారుస్తారు. అలా చెయ్యడం ద్వారా ఆయన షూస్ తాజాగా, కొత్తగా కనిపిస్తాయి. ఫార్మల్ షూస్‌ను దగ్గర్లో ఉండే చెప్పులు కుట్టే వ్యక్తి దగ్గరకు తీసుకెళ్లి బాగు చేయిస్తారు.

రిపేర్, రీ సైక్లింగ్
ఫ్రెంచ్ షూస్ కంపెనీ వెజా 2020 జూన్‌లో బోర్డెక్స్ పట్టణంలో రిపేర్ అండ్ రీసైక్లింగ్ ప్రాజెక్ట్ స్టోర్ తెరిచింది. ఇందులో చిన్న చిన్న లోపాలున్న రన్నింగ్ షూస్‌ని తక్కువ ధరకు అమ్మేవారు.
స్టోర్‌లోనే ఓ చెప్పులు కుట్టే వ్యక్తిని ఉండేవారు. వెజాస్‌తో పాటు ఇతర బ్రాండ్ల బూట్లకు కూడా ఇక్కడ రిపేర్ చేసేవారు. రిపేర్ చేయడానికి వీల్లేని షూలను రీసైక్లింగ్ బాక్స్‌లో వేసేవారు.
ఇలాంటి స్టోర్ తెరవాలనే ఆలోచన నాలుగేళ్లుగా ఉంది. “వెజా రీసైక్లింగ్ ప్రోగ్రామ్ మీద మేము నాలుగేళ్లుగా పని చేస్తున్నాం. బూట్లు కొనుక్కున్న వారిలో చాలా మంది అవి పూర్తిగా పాడవకుండానే పారేయడాన్ని మేము గమనించాం.” అని వెజా సహ వ్యవస్థాపకుడు సెబాస్టియన్ కోప్ చెప్పారు.
“మేము స్టోర్ తెరిచిన తర్వాత కొంతమంది కష్టమర్లు తమ పాత బూట్లను తీసుకొచ్చి రీసైక్లింగ్ చెయ్యాలని చెప్పారు. అయితే మేము వాటిని శుభ్రపరిస్తే సరిపోతుందని వారికి చెప్పడం జరిగింది” అని ఆయన అన్నారు. బూట్లను రీసైక్లింగ్ చెయ్యడానికి ముందు రిపేర్ అనే ప్రక్రియ ఉందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
అమెరికాలో ఏటా పారవేసే బూట్లు, బట్టల్లో కేవలం 13.6 శాతం మాత్రమే రీసైక్లింగ్ చేస్తున్నారు. అందులో ఫుట్‌వేర్ శాతం చాలా తక్కువ.
“ ఈ విషయం తెలిసిన తర్వాత షూస్ జీవితకాలాన్ని పెంచడానికి మనమేం చెయ్యాలి. అని మమ్మల్ని మేమే ప్రశ్నించుకున్నాం”. అని కోప్ చెప్పారు. “మేము తయారు చేస్తున్న బూట్లన్నింటినీ మేమే బాగు చేయాలని అప్పుడే నిర్ణయిచుకున్నాం” అని ఆయన చెప్పారు.
ఫ్రాన్స్‌కి చెందిన షూస్ తయారీ సంస్థ వెజాతో అమెరికన్ ఫ్యాషన్ బ్రాండ్ రిఫర్మేషన్ జత కలిసింది.
ఈ రెండు సంస్థలు కలిసి 2019లో బూట్లు ఉత్పత్తి చెయ్యడం ప్రారంభించి తమ బ్రాండ్ ఉన్నత ప్రమాణాలు అందుకున్నదని గ్రహించిన తర్వాత 2021లో ప్రొడక్షన్‌ను తాత్కాలికంగా ఆపేశాయి.
“ఈ ప్రక్రియలో భాగంగా మేము మా ఫుట్‌వేర్‌లో కొత్త ప్లాస్టిక్ వాడటాన్ని తగ్గించాం. మా బూట్ల తయారీలో 75 శాతం జీవ ఆధారిత ప్రత్యామ్నాయాలను ఉపయోగించాం. తర్వాత మా సరఫరా వ్యవస్థను చాలా కింది స్థాయికి తీసుకు వెళ్లాము” అని చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ అలిసన్ మెల్‌విల్లే చెప్పారు.

ఫొటో సోర్స్, Veja
వెజాతో జట్టు కట్టిన రిఫర్మేషన్ సంస్థ ఫుట్‌వేర్ కలెక్టివ్ అనే లాభాపేక్ష రహిత గ్రూపులో భాగం, పోర్ట్‌లాండ్‌లో ఈ సంస్థ రీసైక్లింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
వంద శాతం షూస్‌ని రీ సైకిల్ చేస్తారు. “సాధారణంగా బూట్లలో రీసైకిల్ చేయదగినవి చాలా తక్కువ ఉంటాయి.” అని మెల్‌విల్లే చెప్పారు. “ రీ సైక్లింగ్ కోసం తీసుకురావడానికి ముందు మీ షూస్‌ను వీలైనంత ఎక్కువ కాలం ఉపయోగించండని మేము కస్టమర్లకు చెబుతాం” అని ఆయన అన్నారు.
లండన్‌కు చెందిన రచయిత ఎమ్మా ఫిర్త్ తన వస్తువుల్ని భద్రపరుచుకుంటారు. పురాతన వస్తువుల్ని వింటెడ్ అనే ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌లో అమ్ముతారు.
“నేను నా వస్తువుల్ని అమ్ముతూ ఉంటాను. అదే ఫ్లాట్‌ఫామ్ నుంచి వస్తువుల్ని కొంటాను. ఇందులో కూడా నాణ్యమైన వాటినే కొంటాను. అని ఆమె చెప్పారు.
“పబ్‌కు వెళ్లేందుకు నేను నల్లటి యాంకెల్ బూట్లు, అవి కూడా వింటేజ్ మెన్స్ సూట్ లేదా మినీ డ్రెస్‌కు సరిపోయేలా ఉండేవి కావాలనుకున్నాను. అలాంటి వాటిని ఆ సైట్‌లో 110 పౌండ్లకు అమ్మకం పెట్టడాన్ని చూశాను. వాటి వాస్తవ ధర 375 పౌండ్లు. నేను 70 పౌండ్లకు కొంటానని ఆమెకు మెసేజ్ చేశాను. మేము కలిసిన తర్వాత ఆమె వాటిని 90 పౌండ్లకు ఇచ్చారు. గట్టిగా ప్రయత్నిస్తే మనకు కావల్సిన డిజైనర్ వస్తువులు లభిస్తాయి” అని రచయిత ఎమ్మా ఫిర్త్ చెప్పారు.

ఫొటో సోర్స్, Wasima Gamal
సెకండ్ హ్యాండ్‌వి కొనడం, ప్రత్యేక సందర్భాల కోసం హై క్వాలిటీ ఫుట్‌వేర్‌ను రెంట్‌కు తీసుకోవడం చాలా మంది చేస్తుంటారు.
సెకండ్ హ్యాండ్ ఫుట్‌వేర్ పట్ల ఎక్కువగా ఆసక్తి చూపించే లుసిండా దేవిన్ష్ ఉపయోగించే లెదర్ వాకింగ్ బూట్లను ఆమె 20 ఏళ్ల క్రితం కొన్నారు.
“కొత్తవి కొనడం ఎందుకో నాకు అంత మంచిగా అనిపించదు. ఫ్యాషన్ పరిశ్రమ వల్ల వెలువడుతున్న కర్బన ఉద్గారాలను దృష్టిలో ఉంచుకుని నేను నిర్ణయం తీసుకుంటాను”. అని ఆమె చెప్పారు.
“దీని వల్ల మీకు డబ్బు కూడా ఆదా అవుతుంది. ఆక్స్‌ఫర్డ్‌లోని ఓ చారిటీ షాప్‌లో వాకింగ్ బూట్లను ఆరున్నర డాలర్లకు కొన్నాను. ఇవి కొత్తవి కొనాలంటే 254 డాలర్లు ఖర్చవుతుంది. వాటిని మరో పదేళ్ల పాటు వాడుకోవచ్చు”. అని ఆమె చెప్పారు.
బూట్లను ఎక్కువ కాలం వాడుకోవడం అనే విధానం కొత్తదేమీ కాదు. షూస్ ఎలా వాడాలో తన తండ్రిని చూసి తాను నేర్చుకున్నట్లు ఎమిలీ కార్టర్ చెప్పారు.
“ఆయన సైన్యంలో పని చేశారు. సైన్యంలో బూట్లను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. వాళ్లకు ఇచ్చే శిక్షణలో అదొక భాగం” అని ఆమె తండ్రి గురించి గుర్తు చేసుకున్నారు.
“ ఆయన సైన్యంలో చేరిన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన లెదర్ బూట్లు దశాబ్ధాల పాటు చెక్కు చెదరకుండా చూసుకున్నారు. నేను కూడా నా షూస్ వాడకంలో అదే విలువలు పాటిస్తూ జాగ్రత్తగా చూసుకున్నాను”
ఇవి కూడా చదవండి:
- అమెజాన్ అడవుల్లో బయటపడ్డ పురాతన నగరం.. అత్యాధునిక రహదారి వ్యవస్థ, కాల్వల నిర్మాణంతో వేలమంది నివసించిన ఆనవాళ్లు
- ప్రాచీన కాలం నాటి సామూహిక నిద్ర అలవాటు ఎలా కనుమరుగైంది?
- అలెగ్జాండర్ జయించిన ప్రాంతంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు
- సుభాష్‌చంద్రబోస్: ‘మై డార్లింగ్, నువ్వు నా హృదయరాణివి’ అంటూ బోస్ ఎవరికి ప్రేమలేఖలు రాశారు?
- నువ్వుల లడ్డూ: 'తీయని మాటలు పలికేలా చేసే తీపి వంటకం'














