మ్యాగ్నటిక్ ఫిషింగ్: ఇక్కడ గాలం వేస్తే బాంబులు, తుపాకులు, కత్తులు పడుతుంటాయి...ఏమిటా కథ?

మ్యాగ్నెటిక్ ఫిషింగ్

ఫొటో సోర్స్, Mark McGeachin

    • రచయిత, కేటీ స్కాట్
    • హోదా, బీబీసీ న్యూస్

ఐదేళ్ల కిందట స్కాట్లాండ్‌లోని నదులు, కాలువలు, చెరువుల్లో ఓ వ్యక్తి, ఆయన కొడుకు కలిసి మ్యాగ్నటిక్ ఫిషింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇక్కడ బాంబుల నుంచి కత్తుల వరకు రకరకాల ఆయుధాలు బయటపడుతూనే ఉన్నాయి.

42 ఏళ్ల మార్క్ మెక్‌జియాచిన్, ఆయన తొమ్మిదేళ్ల కొడుకు జేమ్స్ ప్రతివారం స్కాట్లాండ్‌లోని కాలువలను జల్లెడ పడుతుంటారు.

తాడుకు ఒక పెద్ద మ్యాగ్నట్‌(అయస్కాంతం)ను కట్టి నీటిలోకి దింపి దానికి అతుక్కునే లోహాలతో తయారు చేసిన వస్తువుల కోసం వీరు గాలిస్తున్నారు.

2019లో గ్లాస్గోకు చెందిన మార్క్.. గ్లాస్గో మ్యాగ్నెట్ ఫిషింగ్‌ గ్రూపును ఏర్పాటుచేశారు. ఈ గ్రూపులో వందలమంది చేరారు.

తమకు దొరికిన ప్రతి తుపాకీ, కత్తి లేదా బాంబును స్కాట్లాండ్ పోలీసులకు రిపోర్టు చేస్తామని ఆయన తెలిపారు.

మ్యాగ్నెటిక్ ఫిషింగ్

ఫొటో సోర్స్, Mark McGeachin

‘అమెరికన్ మ్యాగ్నెట్ ఫిషర్స్ ట్రాలింగ్ ఫర్ గన్స్’ను అనే గ్రూప్ గురించి యూట్యూబ్‌లో చూసిన అనంతరం స్కాట్లాండ్‌లోనూ అలాంటి ఒక గ్రూపు ఏర్పాటుచేయాలని భావించినట్లు మార్క్ చెప్పారు.

ఆయన మొదట కొన్న అయస్కాంతం ధర 13.99 పౌండ్లు (రూ.1,442). ఆర్డరు చేసిన మరుసటిరోజే ఇది ఆయన ఇంటికి వచ్చింది.

‘‘మొదటిరోజు నేను ఆ మాగ్నట్‌ను తీసుకొని కిర్కింటిలోచ్‌కు వెళ్లాను. అక్కడ ఏడు కత్తులు, ఒక గొడ్డలి దొరికాయి’’ అని ఆయన చెప్పారు.

లాక్‌డౌన్ సమయంలో బయటకు వెళ్లడానికి ఆంక్షలు విధించినప్పుడు, ఈ ఫేస్‌బుక్ గ్రూపులో సభ్యుల సంఖ్య విపరీతంగా పెరిగింది.

మ్యాగ్నెటిక్ ఫిషింగ్

ఫొటో సోర్స్, Mark McGeachin

‘‘ఆ సమయంలో అన్నీ మూసేసి ఉండేవి. అయితే, సామాజిక దూరాన్ని పాటిస్తూనే బయట పని చేసుకునే విధానాన్ని నేను ఎంచుకున్నాను’’ అని ఆయన చెప్పారు.

‘‘ఆ తర్వాత గ్లాస్గోలోని మిగతావారు కూడా మ్యాగ్నట్‌లు కొనుక్కొని నా వెంట రావడం మొదలుపెట్టారు. ఒక్కోసారి మేం 50 నుంచి 60 మంది వరకూ అయ్యేవాళ్లం’’ అని ఆయన అన్నారు.

‘‘ఇలా వందల మంది కొత్తవారిని నేను కలిసేవాడిని. గ్రూపులోని వారిమంతా స్కాట్లాండ్‌లో ప్రతి శనివారం మీటింగ్‌లు ఏర్పాటుచేసుకునే వాళ్లం’’ అని ఆయన తెలిపారు.

‘‘నేను ఈ పని మొదలుపెట్టిన తర్వాత.. కత్తులు, తుపాకులు దొరకడంతో నాకు మరింత ఆసక్తి పెరిగింది’’ అని ఆయన అన్నారు.

‘‘నేను హింసాప్రవృత్తి కలిగిన వ్యక్తిని కాదు. కానీ, నీటిలో దొరికేవి చూస్తుంటే మన ఆసక్తి పెరుగుతుంటుంది’’ అని ఆయన చెప్పారు.

మాగ్నటిక్ ఫిషింగ్

ఫొటో సోర్స్, BrianWelburn

‘‘ఎప్పుడైతే ఆసక్తి తగ్గిపోతుందో.. అప్పుడు నేను దీన్ని ఆపేస్తాను’’ అని మార్క్ చెప్పారు.

తన తండ్రితో కలిసి తుపాకులు, కత్తులను నీటి నుంచి బయటకు తీశామని మార్క్ కుమారుడు జేమ్స్ చెప్పాడు.

‘‘నేను నా స్నేహితులతో కలిసి వెళ్తుంటాను. అందుకే దీన్ని చాలా ఆస్వాదిస్తుంటాను’’ అని జేమ్స్ వివరించారు. ‘‘మేం బయటకుతీసిన వాటిలో బాంబులు ముఖ్యమైనవి. వాటిలో కొన్ని పేలే అవకాశం ఉన్నవి కూడా ఉన్నాయి’’ అని తెలిపాడు.

మాగ్నటిక్ ఫిషింగ్

ఫొటో సోర్స్, DaveJordan

తాము బయటకు తీసిన కొన్ని ఆయుధాలు పేలే అవకాశం ఉన్నవి కూడా ఉన్నాయని, వాటిని నిర్వీర్యం చేసేందుకు బాంబ్ స్క్వాడ్‌లను పిలుస్తుంటామని మార్క్ చెప్పారు.

ఆయుధాల ఫ్యాక్టరీకి పొరుగునున్న డాల్మార్నోక్ బ్రిడ్జి దగ్గర వల వేసిన ప్రతిసారీ పోలీసులకు ఫోన్ చేయాల్సి వచ్చేదని బీబీసీ స్కాట్లండ్‌తో మార్క్ చెప్పారు.

‘‘పోలీసులు నన్ను గౌరవిస్తారు, ద్వేషిస్తారు కూడా’’ అని ఆయన అన్నారు.

‘‘బ్రిడ్జికి దూరంగా ఉండాలని నాకు వారు చెబుతుంటారు. ఎందుకంటే నాకు ఆయుధాలు దొరికిన ప్రతిసారీ వారికి చాలా డబ్బు ఖర్చు అవుతోంది. అక్కడ ప్రజల భద్రతపై కూడా మరింత దృష్టి పెట్టాల్సి వస్తోంది’’ అని ఆయన చెప్పారు.

‘‘ఇది నాకు అలవాటుగా మారింది. అయితే, నాకు నేర చరిత్ర లేదు. కొత్తగా దాన్ని తెచ్చుకోవాలనీ లేదు’’ అని ఆయన అన్నారు.

మేరీహిల్ కాలువల్లో ఫోర్డ్ ఫోకస్ కారు సహా చాలా కార్లు, మోటార్ బైక్‌లను ఈ గ్రూపు బయటకు తీసింది.

అయితే, ఐదేళ్లపాటు లెక్కలేనన్ని ఆయుధాలను బయటకు తీసిన తర్వాత తనకు కొంచెం విసుగు అనిపించిందని మార్క్ అన్నారు. ఇప్పుడు 1700ల నాటి ఓ ప్రైవేటు నౌక శిథిలాల నుంచి చారిత్రక కళాఖండాలు అన్వేషించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు.

‘‘నా స్నేహితుల్లో చాలా మంది ఆంగ్లో-శాక్సన్ కాలంనాటి వస్తువులు గుర్తించారు.’’ అని ఆయన తెలిపారు.

‘‘వారిలో ఒకరు వైకింగ్ కాలంనాటి కత్తి కనుక్కొన్నారు. ప్రస్తుతం అది మ్యూజియంలో ఉంది. అలాంటిదాన్ని కనుక్కోవాలని నాకూ ఉంది’’ అని ఆయన అన్నారు.

‘‘ఈ ఏడాది స్కాట్లాండ్‌లో మేం చాలా ప్లాన్‌లు వేసుకున్నాం.గ్రూపుకు ఇదొక మంచి సంవత్సరంగా మారుతుంది’’ అని ఆయన చెప్పారు.

మ్యాగ్నటిక్ ఫిషింగ్‌పై స్కాట్లాండ్‌ పోలీసుల అధికార ప్రతినిధి బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘ఇదేమీ చట్టవ్యతిరేకం కాదు. అయితే, కొన్నిసార్లు ప్రజా భద్రత ప్రమాదంలో పడేలా చేసేవారిపైనా, నిర్లక్ష్యం ప్రదర్శించేవారిపైనా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’’ అని చెప్పారు.

‘‘మ్యాగ్నటిక్ ఫిషింగ్‌ను బాధ్యతాయుతంగా చేసేలా ప్రోత్సహించేందుకు, ప్రజల భద్రతకు ఎలాంటి ముప్పూ కలగకుండా ఉండేలా చూసేందుకు పోలీసులు కూడా వారితో కలిసి పని చేస్తారు.’’అని తెలిపారు.

వీడియో క్యాప్షన్, రోజూ స్కూలుకు వెళ్లే ఓ హంస ప్రేమకథ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)