పర్యాటక స్వర్గధామంగా పేరుగాంచిన దేశం మాఫియాకు అడ్డాగా ఎలా మారింది?

- రచయిత, అనా మరియా రోరా, డానియెల్ విటెన్‌బర్గ్, బ్లాంకా మోంకడా
- హోదా, బీబీసీ ముండో, వరల్డ్ సర్వీస్
ముప్పై ఏళ్ల పాల్ చాలా బలహీనంగా కనిపిస్తున్నారు. "ప్రస్తుతం పరిస్థితేం బాలేదు. మృత్యువు ఎటునుంచైనా రావొచ్చు'' అన్నారాయన. తాను మరొక గ్యాంగ్ హిట్‌లిస్టులో ఉన్నానని, తన తల్లి ఆశీర్వాదం వల్లే ఇంకా బతికున్నానని పాల్ భావిస్తున్నారు.
''దేవుడికి నన్ను పిలవడం ఇష్టం లేనట్లుంది, సైతానుకు కూడా నన్ను ముట్టుకోవడం ఇష్టం లేదనుకుంటా'' అన్నారు.
ఈయన అసలు పేరు పాల్ కాదు. వివరాలు గోప్యంగా ఉంచేందుకు పేరు మార్చాం. గ్యాంగ్‌లో చేరినప్పుడు పాల్ వయసు 15 ఏళ్లు, ఇప్పుడు 30. గ్యాంగ్‌లో చేరితే జీవితం సాఫీగా సాగిపోతుందని అనుకున్నారు.
ఈక్వెడార్‌లో అతిపెద్ద నగరమైన గుయాక్విల్‌లో మేం పాల్‌తో మాట్లాడుతున్నాం. ఈ నగరంలో 20 వరకూ గ్యాంగులు చురుగ్గా ఉన్నాయి. నగరంలో ఆధిపత్యం కోసం నిత్యం తుపాకీ కాల్పులు జరుగుతూనే ఉంటాయి.
ఒకచోట ఆగి మాట్లాడితే తన శత్రువులు తనపై దాడి చేసే అవకాశం ఉంటుందని పాల్ భావిస్తున్నారు. కాబట్టి, ఆయన చెప్పిన దాని ప్రకారం, పాల్‌ను ఇంటర్వ్యూ చేస్తూ నగరంలో తిరుగుతున్నాం. ''నాకు గౌరవం కావాలనుకున్నా'' అన్నారు పాల్.
కానీ, ఈక్వెడార్‌లో పెరిగిపోతున్న హింసలో పాల్, ఆయన గ్యాంగ్‌ది కీలకపాత్ర.
ఒకప్పుడు లాటిన్ అమెరికాలో అత్యంత సురక్షితమైన దేశం ఇది. దట్టమైన అడవులు, గాలాపాగోస్ వంటి అందమైన దీవులతో మనోహరంగా ఉండేది. కానీ, గత ఐదేళ్లలో పరిస్థితి అధ్వానంగా మారిపోయింది.
2023లో ఈక్వెడార్‌లో దాదాపు 8 వేల హత్యలు జరిగి ఉండొచ్చు. 2018తో పోలిస్తే ఈ సంఖ్య ఎనిమిది రెట్లు ఎక్కువ. మెక్సికో, కొలంబియా కంటే ఈక్వెడార్‌లోనే ఎక్కువ మర్డర్లు జరిగాయి.
టీవీలో లైవ్ షో నడుస్తున్న సమయంలో తుపాకులతో కొందరు టీవీ స్టేషన్‌లోకి చొరబడ్డారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఈ ఘటనతో ఈక్వెడార్ ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది.
అదే సమయంలోని దేశంలోని వివిధ ప్రాంతాల్లోని జైళ్లలో పేలుళ్లు, అల్లర్లు జరిగినట్లు కూడా కథనాలు వచ్చాయి. కిడ్నాప్ ఘటనలు కూడా రిపోర్ట్ అయ్యాయి.
రెండు నెలల కిందటే దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నోబోవా దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. డ్రగ్స్ స్మగ్లర్లే వారి లక్ష్యం.
''ఈ మత్తుమందుల టెర్రరిస్టులు మనల్ని భయపెట్టాలనుకుంటున్నారు. భయపడి వారి డిమాండ్లను ఒప్పుకుంటామని వారు అనుకుంటున్నారు'' అని నోబోవా ఎమర్జెన్సీ ప్రకటన సందర్భంగా అన్నారు.
ఆ తర్వాత ఈక్వెడార్‌లో 16 వేల మందిని అరెస్టు చేశారు.
ఏప్రిల్ 8న ఈ ఎమర్జెన్సీ ముగిసింది. కానీ, దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని సైన్యానికి ప్రత్యేక అధికారాలు ఇచ్చినట్లు అధ్యక్షుడు చెప్పారు.
నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా చట్టాలు తీసుకురావాలని నోబోవా భావిస్తున్నారు. ఆయుధ చట్టాల్లోనూ మార్పులు చేయాలని భావిస్తున్నారు.
ఈ ప్రతిపాదనలన్నీ ఏప్రిల్ 21న జరగనున్న ప్రజాభిప్రాయ సేకరణలో భాగమే.

ఫొటో సోర్స్, GETTY IMAGES
రోడ్డుమీదకి వెళ్లాలన్నా భయం
దేశంలో ఈ గ్యాంగ్స్ వార్ కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు. ఇక్కడ కిడ్నాప్, డబ్బు వసూళ్లు సర్వసాధారణం.
మేం చాలా మందితో మాట్లాడాం. వారు ఇళ్ల నుంచి బయటికి వచ్చేందుకు భయపడుతున్నారు, మరీముఖ్యంగా రాత్రిళ్లు. క్విటో, గుయాక్విల్‌తో సహా అనేక నగరాల్లో ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ విధించింది.
దేశ రాజధాని క్విటోలో గాబ్రియెల్లా అల్మెయిడా అనే వైద్యురాలు మాతో మాట్లాడుతూ, ''విపరీతమైన మానసిక ఒత్తిడికి గురైన రోగులను రోజూ చూస్తుంటా'' అన్నారు.
లోపలికి ఎవరూ రాకుండా పెద్ద గేటు అమర్చిన కాలనీలో అల్మెయిడా నివాసముంటున్నారు. ఆమె రోజూ క్లినిక్‌కు వెళ్లడం కూడా మానుకున్నారు, రాత్రిపూట బయటికి వెళ్లడం అనే మాటే లేదు.
ఇంటి నుంచి బయటకు వచ్చినా ట్యాక్సీ డ్రైవర్ వచ్చే వరకూ ఆమె రోడ్డుపైకి వెళ్లరు. ట్యాక్సీ ఎక్కిన తర్వాత, వెంటనే తన లొకేషన్ కుటుంబ సభ్యులకు పంపిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
డ్రగ్స్ వ్యాపార కేంద్రంగా ఈక్వెడార్
"కొద్దిరోజుల కిందట ఇక్కడ కిడ్నాప్ జరిగింది. ఇదిగో ఇక్కడే. చిన్నప్పుడు కొలంబియాలో ఎందుకింత హింస అనుకునేదాన్ని. కానీ, ఏదో ఒక రోజు మన దేశంలో కూడా అలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. బస్సుల్లో మీ పర్సు కొట్టేయొచ్చు. నేను చావుకి భయపడను. కానీ, ఒక భయంకర పరిస్థితిలో బతుకుతున్నాం'' అని అల్మెయిడా అన్నారు.
ఒక బిడ్డకు తల్లి అయిన అల్మెయిడా స్పెయిన్‌లో స్థిరపడాలని అనుకుంటున్నారు. ''హింస, కిడ్నాప్‌ల భయం లేకుండా స్వేచ్ఛగా తిరగగలిగే చోటుకి నేను నా కొడుకుని తీసుకెళ్లాలని అనుకుంటున్నా'' అని ఆమె చెప్పారు.
ఈక్వెడార్ అధ్యక్షుడు చెప్పినట్లు, డ్రగ్స్ వ్యాపారమే ఈ సమస్యకు మూలకారణం.
పాల్ ఉదంతం నుంచి కూడా అదే విషయం అర్థమవుతోంది. గ్యాంగ్‌లో చేరినప్పుడు తన ఏరియాలో గంజాయి, కొకైన్ అమ్మేవాడినని పాల్ చెప్పారు.
ఐక్యరాజ్యసమితి వివరాల ప్రకారం, కొకైన్ ఉత్పత్తి, వినియోగం రికార్డు స్థాయికి చేరుకుంది. 2020-21 మధ్య కొకైన్ ఉత్పత్తి దాదాపు మూడు రెట్లు పెరిగింది.

మెక్సికో, కొలంబియా, అల్బేనియాకు చెందిన డ్రగ్స్ ముఠాలు తమ డ్రగ్స్ వ్యాపారం కోసం కొత్త ప్రాంతాలను వెతుకుతున్నాయి.
ప్రపంచంలో కొకైన్ భారీగా ఉత్పత్తి చేస్తున్న రెండు దేశాలతో సరిహద్దు పంచుకుంటూ ఉండడంతో ఈక్వెడార్ వారికి అనువైన ప్రదేశంగా మారింది. ఆ రెండు దేశాలే కొలంబియా, పెరూ.
దాని ఫలితంగా, ఈక్వెడార్ ప్రపంచ డ్రగ్స్ డిస్ట్రిబ్యూషన్ హబ్‌గా మారింది. మాదక ద్రవ్యాలను నిల్వ చేసేందుకు, రవాణాకు కేంద్రంగా తయారైంది. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు షిప్పింగ్ కంటైనర్ల ద్వారా డ్రగ్స్ రవాణా చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియలో గ్యాంగులది కీలకపాత్ర.
ఇంతకుముందు తక్కువ మొత్తంలో డ్రగ్స్ వ్యాపారం చేసేవాడినని, ఆ తర్వాత కిలోల లెక్కన కొకైన్ స్మగ్లింగ్ చేయడం ప్రారంభించినట్లు పాల్ బీబీసీతో చెప్పారు.
ప్రస్తుతం ఆయన డ్రగ్స్‌ను రహస్యంగా దాచిపెట్టి, కంటెనర్లలో భద్రంగా ఉంచే విధులు చూస్తున్నట్లు చెప్పారు.
ఈక్వెడార్‌లోని గుయాక్విల్ పోర్టు ద్వారానే మూడొంతుల కంటే ఎక్కువ ఎగుమతులు జరుగుతాయి. పసిఫిక్ మహాసముద్ర తీరంలో ఉండే ఈ పోర్టు నుంచి అరటి, రొయ్యలు ప్రధానంగా ఎగుమతి అవుతాయి.
అయితే, ఈక్వెడార్ కోస్టు గార్డ్ అందులోని మరో కోణం గురించి మాకు వివరించారు. ఈక్వెడార్ నుంచి జరుగుతున్న డ్రగ్స్ స్మగ్లింగ్‌లో 90 శాతం ఈ పోర్టులోని కంటెనర్ల ద్వారానే జరుగుతుందని చెప్పారు.
దేశంలో అంతర్గత సాయుధ పోరాటం ప్రకటించినప్పటి నుంచి, ఈక్వెడార్‌లో కోస్టు గార్డ్ గస్తీ పెంచింది.

కోస్టు గార్డ్ బృందం పోర్టు చుట్టుపక్కల ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేసే సమయంలో మేము కూడా వారి టీంలో భాగస్వాములయ్యాం.
ఆ కోస్టు గార్డ్ కమాండర్ ఒకరు మాతో ఇలా చెప్పారు, ''గతంలో సాధారణ నేరస్తులను చూసేవాళ్లం. కానీ, ఇప్పుడు మనం వెతుకుతున్న నేరస్తుల దగ్గర భారీ ఆయుధాలు ఉండొచ్చు.''
గ్యాంగుల నుంచి ప్రమాదం పొంచి ఉందన్న భయంతో తన వివరాలు బహిర్గతం చేసేందుకు ఆయన అయిష్టత చూపారు. ముఖాన్ని దాచుకునేందుకు నల్లటి ముసుగు వేసుకున్నారు.
వారి బృందం రోజుకి నాలుగుసార్లు గస్తీ తిరుగుతుంది. స్పీడు బోట్లలో తిరుగుతూ నేరస్తులు, పెద్ద ఓడల్లోని కంటైనర్ల ద్వారా డ్రగ్స్ రవాణాకు ప్రయత్నించే గ్యాంగుల కోసం వెతుకుతారు.
కానీ, అవినీతి కారణంగా వారి పని కష్టతరమవుతోంది.
పోర్టులో పనిచేసే ఒక వ్యక్తికి పెద్దమొత్తంలో డబ్బులు ఇస్తే, అతను సెక్యూరిటీ కెమెరాలకు చిక్కకుండా చూసుకుంటారని, అలా వారి కంటపడకుండా స్మగ్లింగ్ కార్యకలాపాలు చేసుకోవచ్చని పాల్ చెప్పారు.
''ఈ వ్యవస్థలో చాలామంది అవినీతిపరులు ఉన్నారు. పోర్టు లోపల చెక్ పాయింట్‌ల వద్ద కొన్నిసార్లు కంటైనర్లు తారుమారవడం కూడా చూశా. కానీ, నిజం ఏంటంటే చాలా మంది లంచాల మత్తులో జోగుతున్నారు'' అని కోస్టు గార్డ్ అన్నారు.

'ప్రతి ఒక్కరికీ ఒక ఏరియా కావాలి'
పాల్ దృష్టిలో ఎక్కువ స్మగ్లింగ్ చేయడమంటే ''ఎక్కువ డబ్బు సంపాదించడం, ఆధునిక ఆయుధాలు''. 2020 తర్వాత ఈక్వెడార్ పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు 58 శాతం పెరిగాయి.
ఆయుధాలు పెద్ద మొత్తంలో సీజ్ చేస్తున్నామంటే, అంత ఎక్కువ సంఖ్యలో చెలామణీలో ఉన్నాయని అర్థమని ఈక్వెడార్ పోలీసులు చెబుతున్నారు. వీధుల్లో క్రిమినల్ గ్యాంగుల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో, జైళ్లలోనూ హింసాత్మక ఘటనలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి.
''ప్రతి ఒక్కరూ తమకంటూ ఒక ఏరియా కావాలని కోరుకుంటారు. డ్రగ్స్ వ్యాపారానికి, అక్రమ రవాణాకి, డోపిడీలు, కిడ్నాప్‌లు చేసుకునేందుకు తమ ఏరియా తమకు కావాలనుకుంటారు'' అని పాల్ వివరించారు.
మీరు మీ గ్యాంగ్‌ను వదిలేయొచ్చు కదా అని పాల్‌ను మేం అడిగాం. అందుకు ఆయన సమాధానమిస్తూ, తాను అజ్ఞాతంలో ఉన్నప్పటి నుంచి నేర కార్యక్రమాలకు దాదాపు దూరమైనట్లు చెప్పారు.
కానీ, తన కోసం వెతికే వ్యక్తులు కూడా ప్రతిచోటా ఉన్నారని పాల్ చెప్పారు.
గ్యాంగ్ సభ్యులతో ఇంకా టచ్‌లోనే ఉన్నానని, ఎప్పుడైనా అవసరమైతే వారి సాయం అడగొచ్చని పాల్ అన్నారు. పోలీసుల ముందు లొంగిపోవచ్చు, కాకపోతే జైళ్లలో కూడా గ్యాంగ్ సభ్యులు యాక్టివ్‌గానే ఉంటారు కాబట్టి దేశం విడిచి వెళ్లిపోవడమే మార్గమని ఆయన అన్నారు.
నేరాల్లో మీ ప్రమేయమేంటని పాల్‌ని మేం గట్టిగా అడిగాం. అందుకు ఆయన సంకోచిస్తూ, తాను కొంతమందిని చంపినట్లు అంగీకరించారు. కుటుంబాలను నాశనం చేసినందుకు చింతిస్తున్నానని అన్నారు.
''హత్యలు చేసినందుకు చింతిస్తున్నా. నిజంగా చెబుతున్నా, నా వల్ల నష్టం జరిగినందుకు నేను బాధపడుతున్నా.''

న్యాయం కోసం పోరాటం
మేము ఈ విషయాన్నింటినీ ప్రభుత్వ వర్గాల వద్ద లేవనెత్తినప్పుడు, గతంతో పోలిస్తే హింస వల్ల చోటుచేసుకుంటున్న మరణాలు గణనీయంగా తగ్గాయని, జైళ్లలోనూ గ్యాంగులను కట్టడి చేసినట్లు చెప్పారు. అవినీతి కేసులపై దర్యాప్తు చేసినట్లు చెప్పారు.
ఒకవైపు ప్రభుత్వం ఈ గ్యాంగులను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తుంటే, మరోవైపు ఆ నేరగాళ్లకు శిక్ష పడేలా చూస్తున్న వ్యక్తులు ఇప్పుడు వారికి టార్గెట్‌గా మారుతున్నారు.
గత రెండేళ్లలో ఆరుగురు ప్రభుత్వ న్యాయవాదులు హత్యకు గురయ్యారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
వారిలో సీజర్ సువరెజ్ ఒకరు. టీవీ స్టేషన్‌పై దాడి కేసుతో పాటు అతిపెద్ద అవినీతి కేసు 'మెస్టాస్టాసిస్ కేసు' విచారణ ఆయన నేతృత్వంలోనే సాగింది. ఈ జనవరిలో గుయాక్విల్‌లో ఆయన్ను కాల్చి చంపేశారు.
''ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. చాలా మంచి వ్యక్తి. తన పనిని ప్రేమించేవాడు'' అని ఆయన సహోద్యోగి, ప్రభుత్వ న్యాయవాది మిషెల్ లూనా చెప్పారు.
ఆరేళ్ల వయసులో తన తండ్రి మోసపోయారని లూనా చెప్పారు. ''అన్యాయానికి అసలు అర్థం ఏమిటో అప్పటి నుంచే నాకు అర్థమైంది'' అని ఆమె అన్నారు.
''పెద్దయ్యాక అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడతానని శపథం చేశా.''
అయితే, ఇప్పుడామె తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం తన కెరీర్ మార్చుకునేందుకు కూడా సిద్ధమయ్యారు.
''మా రక్షణకు ఎలాంటి హామీ లేకపోతే, నేను రాజీనామా చేస్తా'' అని ఆమె చెప్పారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ల వివరాలను గోప్యంగా ఉంచాలని, వారు వాదిస్తున్న కేసులను వర్చువల్‌గా విచారణ జరపాలని లూనా, ఇంకా ఆమె సహచరులు కోరుతున్నారు. తద్వారా అదే కోర్టులకు తాము నేరస్తులుగా హాజరయ్యే ప్రమాదం తలెత్తకుండా ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.
అటార్నీ జనరల్ డయానా సలాజర్ కూడా 'మెస్టాస్టెసిస్ కేసు'లో స్మగ్లర్లు, ప్రభుత్వ యంత్రాంగం మధ్య సంబంధాలపై విచారణ కొనసాగిస్తున్నారు. ఆమెకు కూడా బెదిరింపులు వస్తున్నాయి. దీంతో ఆమె పోలీసులు, ఆర్మీ సాయం కోరారు.
అయితే, వనరుల కొరత కూడా మరో సమస్య. ''ఐదు వేల కేసులను డీల్ చేసే ఒక ప్రభుత్వ న్యాయవాదికి కేవలం ఇద్దరు సిబ్బందిని మాత్రమే కేటాయిస్తే ఎలా సాధ్యం?'' అని లూనా ప్రశ్నిస్తున్నారు.
లూనాకు వ్యక్తిగతంగా ఎలాంటి బెదిరింపులూ రాకపోయినప్పటికీ, ఎప్పుడైనా ఇలాంటివి జరగవచ్చని ఆమె ఆందోళన చెందుతున్నారు. ఈక్వెడార్‌లోని హింసాత్మక గ్యాంగుల కేసుల విచారణకు హాజరయ్యే వారు ఆ గ్యాంగులకు టార్గెట్‌గా మారతారని ఆమె భయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- కల్వకుంట్ల కవితను అరెస్టు చేసిన సీబీఐ, దిల్లీ మద్యం పాలసీ కేసు ఎలా మొదలైంది?
- గజల్ అలఘ్: ప్రెగ్నెన్సీపై ఈమె చేసిన పోస్ట్ పెద్ద చర్చకు దారితీసింది, విషయం ఏంటంటే..
- కచ్చతీవుకు బదులుగా భారత్ తీసుకున్న 'వాడ్జ్ బ్యాంక్' ప్రాంతం అంత విలువైనదా?
- నితీష్ కుమార్ రెడ్డి: ఈ తెలుగు ‘హిట్‌మ్యాన్’కు టీమీండియాలో ఛాన్స్ వస్తుందా?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














