ఇవన్ కంటు-మరణ శిక్ష : ‘నేను హత్యలు చేయలేదు’ అని కడదాకా వాదించినా ఆయనకు విషపు ఇంజెక్షన్ ఎందుకు ఇచ్చారు, అసలు ఈ కేసు ఏంటి ?

ఫొటో సోర్స్, COURTESY OF MATT DUFF
“నేను అమాయకుడిని, నాకేం తెలియదు” టెక్సస్‌లోని ఓ హత్య కేసులో 22 ఏళ్లుగా ఆయన ఈ మాట పదే పదే చెబుతూనే ఉన్నారు.
మెక్సికన్ అయిన ఇవన్ కంటుని హంట్స్ విల్లే జైలులో విష రసాయనాలున్న ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా బుధవారం నాడు మరణశిక్ష అమలు చేశారు.
అమెరికాలో న్యాయం, మరణశిక్షపై తీవ్రమైన చర్చకు దారి తీసిన కేసు ఇది. డాలస్‌లో 24 ఏళ్ల క్రితం కంటుపై జంట హత్యలకు సంబంధించి అభియోగాలు నమోదయ్యాయి.
కంటు తనకు వరసకు సోదరుడు అయ్యే జేమ్స్ మాస్కెడా, అతని గర్ల్ ఫ్రెండ్ అమీ కిచెన్‌లను హత్య చేసిన కేసులో కోర్టు దోషిగా కోర్టు తేల్చింది.
మరణశిక్ష అమలు చేయడానికి ముందు నమోదు చేసిన చివరి వాంగ్మూలంలో కూడా తాను వాళ్లిద్దర్నీహత్య చేయలేదని కంటు చెప్పారు. తనకు మరణశిక్ష విధించడం వల్ల చనిపోయిన వారి కుటుంబాలు ప్రశాంతంగా ఉండలేవని అన్నారు.
హత్యకు గురైన ఇద్దరి కుటుంబ సభ్యులతో కంటు మాట్లాడారని టెక్సస్ న్యాయ విభాగం అధికార ప్రతినిధి అమండా హెర్నాండెజ్ చెప్పారు.
“ జేమ్స్ మాస్కెడా, అమీ కిిచెన్‌లను నేను చంపలేదు. నాకు మరణశిక్ష విధించడం వల్ల మీకు న్యాయం జరిగిందని, మనశ్శాంతి లభిస్తుందని అనుకుంటే పొరపాటేనని అందరితోనూ చెప్పండి” అని కంటు వారితో చెప్పారు.
“ఇదంతా ఎవరు చేశారో నాకు తెలిస్తే, నావద్ద మొదట ఉన్న ఏ సమాచారం అయినా వాళ్లు తెలుసుకుని ఉండేవాళ్లు” అని అన్నారు.
ఈ కేసులో న్యాయ ప్రక్రియ సరిగ్గా జరగలేదని మానవహక్కుల సంఘాలు మండి పడ్డాయి. కంటుని దోషిగా తేల్చడాన్ని తప్పుబడుతూ, ఈ శిక్షను రద్దు చేసి మొత్తం కేసుని మళ్లీ విచారించాలని డిమాండ్ చేస్తున్నాయి.
“ఆధారాలను మార్చేశారు” అని ఇవన్ కంటు తల్లి సిల్వియా ఆరోపించారు. తన కొడుక్కి న్యాయం చేయాలని ఆమె ఆందోళనకు దిగారు.
“నా కొడుక్కి మరణశిక్షను ఆపండి” అని ఆమె కోర్టులో ప్రాధేయపడ్డారు. మరణశిక్ష విధించడానికి కంటుని తీసుకెళ్లే సమయంలో కూడా “ ఇది న్యాయం కాదు. ఆ విషయం మీకు కూడా తెలుసు” అని ప్రకటించారు.
కేసు విచారణ సమయంలో తప్పుడు సాక్షుల వాంగ్మూలాలను రికార్డు చేశారని, నిందితుడిని వాదనను వినిపించడంలో కోర్టు నియమించిన న్యాయవాదులు సరిగ్గా పని చేయలేదని చెబుతూ అప్పీలు కోర్టులో కంట్ తరపు న్యాయవాదులు సాక్ష్యాలను ప్రవేశ పెట్టారు.

ఫొటో సోర్స్, TEXAS DEPARTMENT OF CRIMINAL JUSTICE
సాక్ష్యాలపై సందేహాలు
ఇవన్ తల్లిదండ్రులు మెక్సికో నుంచి వచ్చారు. అతను 1973లో టెక్సస్‌లో పుట్టినట్లు టెక్సస్ న్యాయ విభాగం రికార్డులలో ఉంది.
జంట హత్యల కేసులో ఆయనపై ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన వయసు 27 ఏళ్లు. కేసులో ఆరోపణలు వచ్చిన ఏడాదికే ఆయన జైలు పాలయ్యారు.
ఆ సమయంలో అతని ప్రియురాలు అమి బోయ్‌చెర్ ఆయనకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చారు.
కంటుకు వరసకు సోదరుడైన జేమ్స్ అతని ఇంటికి సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉండేవారు.
కంటు గర్ల్‌ఫ్రెండ్ అమీ బోయెచ్చర్ ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున ప్రధాన సాక్షి. ఆమె 2021లో చనిపోయారు. తాను ఓ నేరం చేయబోతున్నానని, నేరం చేసిన తర్వాత ఆ ప్రాంతానికి తనను తీసుకెళతానని కంటు తనతో చెప్పినట్లు కోర్టులో సాక్ష్యం చెప్పారు.
2000 నవంబర్ 4న జేమ్స్ మాస్కెడా, అతని గర్ల్‌ఫ్రెండ్ అమీ కిచెన్ వారి బెడ్‌రూమ్‌లోనే హత్యకు గురయ్యారు. వారి శరీరంలోకి అనేక తుపాకీ తూటాలు దూసుకుపోయాయి.
విచారణ సమయంలో కంటు ప్రియురాలు అమీ బోయెచ్చర్ చెప్పిన సాక్ష్యంలో చట్టపరంగా నిలబడేే అంశాలు ఏవీ కనిపించలేదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది. అలాగే ఆమె సాక్ష్యాన్ని బలపరిచే భౌతిక ఆధారాలపై సందేహాలున్నాయని ప్రకటించింది.
“అమీ బోయెచ్చర్ ఇచ్చిన సాక్ష్యం మీద ప్రాసిక్యూషన్ ఎక్కువగా ఆధారపడింది” అని అమెరికాకు చెందిన డెత్ పెనాల్టీ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనే ఎన్జీవో సంస్థ ఆరోపించింది.
కంటు తరపున కోర్టులో వాదించిన అటార్నీ కూడా డీఎన్ఏ, బాలిస్టిక్ పరీక్షల్ని కోరలేదని, సాక్షులను పిలవలేదని కంటు న్యాయవాది జెనాబెన్ చెప్పారు.
విచారణ చివరి వాదనల సందర్భంలో కంటు తరపున వాదించిన న్యాయవాదుల్లో ఒకరు తన క్లయింట్ తప్పు చేశారని అంగీకరించారు.
మాదక ద్రవ్యాల వ్యవహారంలో మోసం చేసినందుకు జేమ్స్ మాస్కెడాను చంపినట్లు కంటు దాదాపుగా అంగీకరించాడు. ఈ హత్య చేసే సమయంలో అమీ కిచెన్ అక్కడే ఉండటం వల్ల ఆమెను కూడా కాల్చి వేసినట్లు పోలీసులు ఆరోపించారు.
అయితే ఈ ఆరోపణలను కంటు తిరస్కరించారు. ఈ వాదనను వ్యతిరేకించాలని, తన తరపున వాదించాలని ఆయన ప్రభుత్వ న్యాయవాదులను కోరారు. అయితే కోర్టు ఆయన అభ్యర్థనను తిరస్కరించింది.

ఫొటో సోర్స్, Getty Images
'నేను డ్రగ్స్ దొంగిలించేందుకు ప్రయత్నించాను'
డ్రగ్స్ రవాణా చేస్తాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న జేమ్స్ మాస్కెడా, అతని స్నేహితురాలు అమీ కిచెన్‌ల ఇంటి నుంచి కొకైన్, గంజాయి, డబ్బుని దొంగతనం చేయడానికి ప్రయత్నించిన సందర్భంలో కంటు వారిని కాల్చి చంపారని ప్రాసిక్యూటర్లు వాదించారు.
అయితే, డ్రగ్ డీలర్లే అతన్ని చంపారని కంటు వాదించారు.
2001లో ఆయనకు మరణశిక్ష విధించింది కోర్టు. తన బంధువును ఓ డ్రగ్ ట్రాఫికర్ డబ్బు కోసం కాల్చి చంపారని కంటు మొదటి నుంచి చెబుతున్నారు.
కంటు మరణశిక్ష అమలును ఆలస్యం చేయడానికి స్థానిక రాజకీయ నాయకులు, మత ప్రముఖులు మద్దతు ఇచ్చారు. కిమ్ కర్దాషియన్, మార్టిన్ షీన్ లాంటి కొంతమంది సెలబ్రిటీలు అండగా నిలిచారు.
కంటు తరపున వాదించిన జూనియర్లలో ముగ్గురు ఈ కేసు విచారణపై సందేహాలు ఉన్నాయని మరణశిక్షను వాయిదా వేయాలని కోరారు.
మరణశిక్షపై స్టే ఇవ్వాలన కోరుతూ టెక్సస్ గవర్నర్ గ్రెగ్ అబ్బాట్‌కు విజ్ఞప్తి చేసేందుకు మూవ్ ఆన్ డాట్ ఆర్గ్ అనే సంస్థ విజ్ఞప్తిపై లక్షన్నర మంది సంతకాలు చేశారు.
అయితే ఈ విజ్ఞప్తులన్నీ నిరర్ధకంగా మారాయి.
విచారణలో ప్రవేశ పెట్టిన సాక్ష్యాలన్నీ కంటుకు వ్యతిరేకంగా ఉన్నాయని, అతనికి మరణశిక్ష విధించిన కొల్లిన్ కౌంటీ అటార్నీ గ్రెగ్ విల్లిస్ చెప్పారు.
“2000 సంవత్సరంలో ఇవన్ కంటు ఇద్దరు వ్యక్తుల్ని దారుణంగా హత్య చేసినట్లు నేను పూర్తిగా నమ్మున్నాను” అని విల్లిస్ ఒక ప్రకటనలో చెప్పారు.
కంటు మరణశిక్షను తగ్గించడానికి వ్యతిరేకంగా టెక్సస్ బోర్డ్ ఆఫ్ పార్డన్స్ అండ్ పెరోల్స్ 7-0 తేడాతో ఓటు వేసింది.
మరణశిక్ష అమలులో నాలుగు నెలల సమయం ఇవ్వడానికి కూడా బోర్డు సభ్యులు అంగీకరించలేదు. 2012లో అమలు చేయాల్సిన మరణశిక్ష ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని బోర్డు అభిప్రాయపడింది.
అమెరికాలోని 23 రాష్ట్రాలలో మరణశిక్షను రద్దు చేశారు. అరిజోనా, కాలిఫోర్నియా, ఒహాయో, ఒరేగావ్, పెన్సిల్వేనియా, టెన్నిసీ రాష్ట్రాలు మరణశిక్షను అమలు చేయడం లేదు.
ఇవి కూాడా చదవండి:
- ఉత్తరాఖండ్ యూసీసీ: 'లివ్-ఇన్ రిలేషన్షిప్'లో ఉన్నవారు రిజిస్ట్రార్‌కు సమాచారం ఇవ్వాలి, లేకుంటే శిక్ష తప్పదంటున్నకొత్త చట్టం
- తమిళనాడు అభివృద్ధి మంత్రమేంటి? ఈ రాష్ట్రాన్ని ‘న్యూయార్క్ టైమ్స్’ ఎందుకు పొగిడింది?
- ప్రధాని మోదీ పుట్టుకతో ఓబీసీ కాదని రాహుల్ గాంధీ ఎందుకు అన్నారు... బీజేపీ రియాక్షన్ ఏంటి?
- మోదీ ప్రభుత్వం పన్నుల ఆదాయం పంపిణీలో దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష చూపిస్తోందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














