ఇస్రో: గగన్‌యాన్ మిషన్‌లో పాల్గొనే మహిళా వ్యోమగామి వ్యోమిత్ర ఎవరు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దిగవల్లి పవన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
గగన్‌యాన్ మిషన్‌లో వ్యోమగాములకన్నా ముందు మరొకరు అంతరిక్షంలోకి వెళ్లబోతున్నారు. అది మరెవరో కాదు.. వ్యోమిత్ర.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తయారు చేసిన హ్యూమనాయిడ్ మహిళా ఆస్ట్రోనాటే వ్యోమిత్ర.
2025లో నలుగురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించాలనే లక్ష్యంతో ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గగన్‌యాన్. ఈ మెయిన్ మిషన్‌కి ముందు మొదటి దశ పరీక్షలో స్పేస్ క్యాప్సూల్‌ని అంతరిక్షంలోకి పంపి వెనక్కు తీసుకొస్తారు.
రెండో దశలో రోబోతో కూడిన క్యాప్సూల్‌ని అంతరిక్షంలోకి పంపి వెనక్కు తీసుకురావాలనేది ఇస్రో ఆలోచన.

ఫొటో సోర్స్, Getty Images
వ్యోమిత్ర ప్రత్యేకతలేంటి?
వ్యోమిత్రలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, సెన్సార్స్ ఇలా అన్నిటినీ ఇంటిగ్రేట్ చేసిన అత్యాధునిక వ్యవస్థ ఉంటుందని, వ్యోమిత్ర మనిషిని పోలిన రోబో అని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ – షార్ మాజీ డిప్యూటీ డైరక్టర్, రిటైర్డ్ సైంటిస్ట్ బీవీ సుబ్బారావు బీబీసీతో చెప్పారు.
గగన్‌యాన్ మిషన్‌లో నలుగురు వ్యోమగాములు మూడు రోజులు అంతరిక్షంలో గడిపి వెనక్కు వస్తారు. కాబట్టి హ్యూమనాయిడ్ రోబో వ్యోమిత్రను కూడా మూడు రోజుల కన్నా ఎక్కువే అంతరిక్షంలో ఉంచుతారని ఆయన అన్నారు.

అంతరిక్షంలో వ్యోమిత్ర ఏం చేస్తుంది?
వ్యోమిత్రకు పరిమిత స్థాయిలో ఇంటెలిజెన్స్ ఉంటుంది. సొంతంగా రాకెట్‌లోని కంట్రోల్ ప్యానెల్స్‌ను చదివి వాటిని ఆపరేట్ చేసి భూమిపైన శాస్త్రవేత్తలతో నేరుగా దాని వాయిస్‌తో కమ్యూనికేట్ చేయగలిగేలా వ్యోమిత్రను తయారు చేశారని ‘ద హిందూ’ కథనం పేర్కొంది.
షార్ మాజీ డెప్యూటీ డైరెక్టర్ బీవీ సుబ్బారావు చెప్పిన వివరాల ప్రకారం అంతరిక్షంలోని పరిస్థితులకు వ్యోమగాములు ఎలా స్పందిస్తారు, బ్రీథింగ్, ఇతర బయోలాజికల్ అంశాలు, డే అండ్ నైట్ ఉండే పరిస్థితులు, అనుకోని సంఘటనలు ఎదురైనపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలను వ్యోమిత్ర ద్వారా శాస్త్రవేత్తలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.
అలానే క్రయో సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ వంటి వాటికి వ్యోమిత్ర ఎలా స్పందిస్తుందో గమనిస్తారు. దీనిబట్టి గగన్‌యాన్ మిషన్‌లో అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాముల స్పందన ఎలా ఉంటుందో అంచనా వేస్తారు.
రాకెట్ ప్రయాణంలో ఏరోడైనమిక్ ఫోర్సెస్ కారణంగా ఎదురయ్యే కుదుపులు, వైబ్రేషన్స్‌ను తట్టుకునేలా వ్యోమిత్రను తయారుచేశారు.

ఫొటో సోర్స్, Getty Images
వ్యోమిత్ర ప్రయోగం విజయవంతమైతే...
వ్యోమిత్ర ప్రయోగం విజయవంతమైతే 2025లో గగన్‌యాన్ మిషన్‌లో నలుగురు వ్యోమగాములను ఇస్రో అంతరిక్షంలోకి పంపిస్తుంది. వాళ్లు భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉండే దిగువ భూ కక్ష్యలోకి వెళ్తారు. అక్కడ మూడు రోజులు ఉండి వెనక్కు వస్తారు.
గగన్‌యాన్ ప్రాజెక్టు కోసం భారత్ రూ. 9023 కోట్లు ఖర్చు చేస్తోంది. చంద్రయాన్ విజయవంతమైన తర్వాత భారత్ ఆదిత్య ఎల్-1ను ప్రయోగించింది.
ఇప్పుడు గగన్‌యాన్ ప్రాజెక్టుతో మరో మైలురాయికి ఇస్రో సిద్ధమైంది. 2035 నాటికి అంతరిక్షంలో భారత స్పేస్ స్టేషన్ నిర్మాణం, 2040 నాటికి చంద్రునిపైకి వ్యోమగామిని పంపాలనే లక్ష్యంతో ఇస్రో పని చేస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
గతంలో అంతరిక్ష రోబోలను ప్రయోగించిన దేశాలు
2011లో మొదటిసారిగా హ్యూమనాయిడ్ రోబోను అంతరిక్షంలోకి పంపింది నాసా. దాని పేరు రోబోనాట్ 2. తర్వాత 2013లో జపాన్ కూడా చిన్నసైజు హ్యూమనాయిడ్ కిరోబోను అంతరిక్షంలోకి పంపింది.
తర్వాత రష్యా 2019లో హ్యూమనాయిడ్ ఫెదోర్‌ను అంతరిక్షంలోకి పంపింది. ఇప్పుడు ఈ ప్రయోగం సక్సెస్ అయితే, అంతరిక్షంలోకి హ్యూమనాయిడ్ రోబోను పంపిన నాల్గవ దేశంగా భారత్ నిలుస్తుంది.
ఇవి కూడా చదవండి:
- ఉత్తరాఖండ్ యూసీసీ: 'లివ్-ఇన్ రిలేషన్షిప్'లో ఉన్నవారు రిజిస్ట్రార్‌కు సమాచారం ఇవ్వాలి, లేకుంటే శిక్ష తప్పదంటున్నకొత్త చట్టం
- తమిళనాడు అభివృద్ధి మంత్రమేంటి? ఈ రాష్ట్రాన్ని ‘న్యూయార్క్ టైమ్స్’ ఎందుకు పొగిడింది?
- ప్రధాని మోదీ పుట్టుకతో ఓబీసీ కాదని రాహుల్ గాంధీ ఎందుకు అన్నారు... బీజేపీ రియాక్షన్ ఏంటి?
- మోదీ ప్రభుత్వం పన్నుల ఆదాయం పంపిణీలో దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష చూపిస్తోందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















