నిత్యానంద ‘కైలాస్‘ లేనే లేదు.. మేం అమ్మలేదు: ఈక్వెడార్ - ప్రెస్‌రివ్యూ

మతగురువు నిత్యానంద

ఫొటో సోర్స్, NITHYANANDA / TWITTER

వివాదాస్పద మతగురువు నిత్యానంద తనకంటూ ప్రత్యేక దేశం, ప్రభుత్వం, జెండాను ఏర్పాటు చేసుకున్నారన్న వార్తలు విని, అంతా 'ఔరా' అన్నారు. 'కైలాస్‌' అనే పేరుపెట్టిన ఈ దేశానికి గుర్తింపు కోసం ఐక్యరాజ్య సమితిలో ప్రయత్నాలూ సాగుతున్నాయన్న కథనాలు చదివి విస్తుపోయారు. అయితే, ఈ కథనాలేవీ వాస్తవం కాదని ఈక్వెడార్‌ స్పష్టం చేసిందని ఆంధ్రజ్యోతి వెల్లడించింది.

'కైలాస్'ను తమ నుంచి కొనుగోలు చేసిన భూభాగంలో నిత్యానంద ఏర్పాటు చేశారన్న వార్తలను కొట్టేసింది. అత్యాచారం కేసులో ఆయన అభియోగాలను ఎదుర్కొంటున్నారు.

అరెస్టు భయంతో దేశం దాటిపోయిన నిత్యానందకు తమ దేశం ఆశ్రయం ఇచ్చిందనేది వాస్తవం కాదని ఈక్వెడార్‌ పేర్కొంది. ''నిత్యానంద మమ్మల్ని ఆశ్రయం కోరినమాట నిజమే. శరణార్థిలా మా దేశంలో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన దరఖాస్తు చేసుకొన్నారు. దాన్ని మేం తిరస్కరించాం’’ అని తెలిపింది.

దీంతో ఆయన కరేబియన్‌ దీవుల్లో ఒకటైన హైతీకి తరలిపోయినట్టు తెలుస్తోందని భారత్‌లోని ఈక్వెడార్‌ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో వివరించింది. ఉత్తర అమెరికాలో భాగమైన ఈక్వెడార్‌ నుంచి ఒక ద్వీపాన్ని నిత్యానంద కొని, అక్కడ హిందూదేశం నిర్మించుకొన్నట్టు తొలుత వార్తలొచ్చాయి.

అధికార మతంగా సనాతన హైందవాన్ని ప్రకటించుకొన్న ఈ దేశంలో పాస్‌పోర్టు నుంచి పౌరసత్వం దాకా ప్రతీది ప్రత్యేకమేనని కథనాలు వెలువడ్డాయి. అయితే, డిజిటల్‌ మీడియా, కొన్ని పత్రికల్లో కనిపించిన ఈ కథనాలన్నింటికీ నిత్యానంద సొంత వెబ్‌సైట్‌ 'కైలాస.ఆర్గ్‌' వండివార్చిన సమాచారమే ఆధారమని ఈక్వెడార్‌ పేర్కొంది.

కాగా, నిత్యానంద పాస్‌పోర్టును రద్దుచేసినట్టు కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటించింది. పిల్లల అక్రమ నిర్బంధం, ఇద్దరు మహిళల అదృశ్యం, అపహరణ కేసుల్లో నిత్యానంద కోసం గాలిస్తున్న గుజరాత్‌ పోలీసులు తాజా కథనాలతో అప్రమత్తం అయ్యారు.

ఆయనపై బ్లూ కార్నర్‌ నోటీసు జారీచేసేలా ఇంటర్‌పోల్‌ను సంప్రదించేందుకు సహకరించాలని సీఐడీకి శుక్రవారం లేఖ రాశారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

ఫొటో సోర్స్, Getty Images

చిన్నారులపై అత్యాచారాలు చేస్తే.. క్షమాభిక్ష ఎందుకు?

చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడేవారికి క్షమాభిక్ష పిటిషన్‌ పెట్టుకొనే హక్కు లేకుండా చేయాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అభిప్రాయపడ్డారని ఈనాడు తెలిపింది.

'పోక్సో' చట్టం కింద విధించే శిక్షలకు క్షమాభిక్ష ఉండకూడదని, ఈ దిశగా తగిన రాజ్యాంగ సవరణలు చేసేలా పార్లమెంటు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని రాష్ట్రపతి అన్నారు. మౌంట్‌ అబూలో ప్రజాపిత బ్రహ్మకుమారీస్‌ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో 'సమాజంలో మార్పు కోసం మహిళల సాధికారిత' అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించనున్న సదస్సును శుక్రవారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ మహిళలపై ఇటీవల కాలంలో జరుగుతున్న అత్యాచారాలను ప్రస్తావించారు.

''ఆడపడుచులపై జరుగుతున్న పైశాచిక దాడులు దేశ అంతరాత్మను కుదిపేశాయి. మహిళల పట్ల గౌరవంతో మెలగాలన్న భావన అబ్బాయిల్లో బలపడేటట్టు చేయాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులది.. పౌరులదీ.. మీది..నాది. ఈ సందర్భంగా చాలా ఆలోచనలు మెదులుతున్నాయి.

ఇలాంటి కేసుల్లో శిక్ష పడ్డవారు క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకునే హక్కు రాజ్యాంగమే కల్పించింది. ఈ హక్కుపై పునఃపరిశీలన జరగాలని భావిస్తున్నా. ముఖ్యంగా లైంగిక దాడుల నుంచి బాలలను రక్షించే చట్టం (ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రం సెక్సువల్‌ అఫెన్సెస్‌-పోక్సో) కింద శిక్ష పడ్డవారికి క్షమాభిక్ష పిటిషన్‌ పెట్టుకొనే హక్కును లేకుండా చేయాలి. ఆ హక్కు పొందడానికి వారు అర్హులు కారు'' అని అభిప్రాయపడ్డారు.

''మన ఆలోచనలన్నీ ఈ దిశగానే ఉన్నాయి. అయితే దీనిపై పార్లమెంటు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది'' అని పేర్కొన్నారు. మహిళల భద్రత ముఖ్యమైన అంశమని, దీనిపై ఎన్నో చర్యలు తీసుకుంటున్నా, చేయాల్సింది ఎంతో ఉందని చెప్పారని ఈనాడు తెలిపింది.

తెలంగాణ ఆర్టీసీ

ఫొటో సోర్స్, TELANGNA I&PR/TSRTC

మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులతో ఈ నెల 1వ తేదీన సీఎం కేసీఆర్‌ నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం దిశగా టీఎస్‌ఆర్టీసీ అధికారులు ప్రాధాన్యతాక్రమంలో నిర్ణయాలు తీసుకుంటున్నారని సాక్షి వెల్లడించింది.

ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ ఆదేశాల మేరకు సమ్మె కాలంలో మరణించిన 33 మంది ఉద్యోగుల పిల్లలకు విద్యార్హతలను బట్టి ఆర్టీసీలో ఉద్యోగాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మరణించిన 38 మంది ఉద్యోగులకు సంబంధించి 22 కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఆయా జిల్లాల కలెక్టర్లు ఎక్స్‌గ్రేషియా చెల్లించగా, మరో 16 కుటుంబాలకు శనివారం పరిహారం అందజేయనున్నారు.

రాత్రి 8 గంటల్లోగా మహిళా ఉద్యోగుల డ్యూటీ ముగిసేలా త్వరితగతిన షెడ్యూలు సర్దుబాటు చేయాలని సునీల్‌శర్మ డిపో మేనేజర్లను ఆదేశించారు. మహిళా ఉద్యోగుల కోసం ఈ నెల 15 లోగా హైదరాబాద్‌ నగరంలో విశ్రాంతి గదులతో పాటు, డిపోలు, హైదరాబాద్‌ సిటీ చేంజ్‌ఓవర్‌ పాయింట్ల వద్ద మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని చీఫ్‌ సివిల్‌ ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లను ఆదేశించారని సాక్షి తెలిపింది.

ఆర్‌బీఐ

ఫొటో సోర్స్, Getty Images

ఇకపై రోజంతా నెఫ్ట్ లావాదేవీలు

డిజిటల్‌ లావాదేవీలను మరింతగా ప్రోత్సహించేందుకు వీలుగా నెఫ్ట్‌ (నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌) లావాదేవీల్ని 24 గంటలూ కొనసాగించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిర్ణయం తీసుకుందని ఈనాడు వెల్లడించింది.

ఈ నెల 16 నుంచి ఖాతాదారులు ఈ సేవల్ని రోజంతా వినియోగించుకోవచ్చని తెలిపింది. ఒకవేళ బ్యాంకులకు సెలవులున్నా, ఈ సేవను వాడుకోవచ్చని పేర్కొంది.

ఇప్పటివరకు నెఫ్ట్‌ లావాదేవీలను గంటకోసారి (అవర్లీ బ్యాచెస్‌) సెటిల్‌ చేస్తున్నారు. మామూలు రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు, మొదటి, మూడో శనివారాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విడతల వారీగా నెఫ్ట్‌ లావాదేవీలను సెటిల్‌ చేస్తున్నారు. డిసెంబరు 16 నుంచి ఈ సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయని రిజర్వ్‌ బ్యాంక్‌ తెలిపింది.

మొదటి సెటిల్‌మెంట్‌ డిసెంబరు 16వ తేదీ 00:30 గంటల తర్వాత (డిసెంబరు 15 రాత్రి) ప్రారంభమవుతుంది. నెఫ్ట్‌ సెటిల్‌మెంట్లు సజావుగా సాగడానికి బ్యాంకులన్నీ తమ కరెంట్‌ ఖాతాల్లో అవసరమైన నిధుల్ని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది.

బ్యాంకుల పని వేళలు ముగిసిన తర్వాత, ఎస్‌టీపీ (స్ట్రైట్‌ త్రూ ప్రాసెసింగ్‌) పద్ధతిలో ఆటోమేటెడ్‌ లావాదేవీలు జరుగుతాయని పేర్కొంది. నెఫ్ట్‌ విధానంలో ఖాతాదారులు రూ.2 లక్షల వరకు నగదు బదిలీ చేసుకొనే వెసులుబాటు ఉందని ఈనాడు తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)